Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

మనిషిలోని ఆలోచనా సరళి చాలా వింతగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెబుతుంటారు. ‘ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొనిరాము. పోయేటప్పుడు ఏదీ పట్టుకుపోము.’ ఇది వాస్తవమే. ఈ భూమిమీద మన జీవనకాలం, విశ్వాంతరాళంలో గుర్తించలేని ఒక చిన్న పరమాణువులో అశాశ్వతమైన బుల్లి  రేణువు మాత్రమె. సామాజిక స్థితిగతులు, ఆస్తులు అంతస్థులు ఉన్నప్పుడే మనలను అందరూ గుర్తించి ఆదరిస్తారనే ఆలోచనతో నిత్యం పోటీ ప్రపంచంలో మనుగడ కొనసాగిస్తూ ఏదో చేసి, ఎంతో సంపాదించి, లేని రుగ్మతలను, మానసిక వత్తిడులను కూడా వంటబట్టించుకొని, ముదిమి వయసులో డబ్బుతో పాటు జమ చేసుకున్న జబ్బులను కూడా భరిస్తూ, ప్రశాంతంగా జీవనాన్ని సాగించాల్సిన సమయంలో భయంతో, అభద్రతతో బతుకుతూ, ఆందోళనకర జీవితాన్ని గడుపుతూ అందుకు సాటి సమాజ వ్యవస్థే కారణమని నిందిస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.

వయస్సుతో పాటు మనలో కలిగే ఆలోచనా ధోరణి చాలా చిత్రవిచిత్రంగా ఉంటుంది. అందరూ నన్ను గుర్తించాలనే తపన నుండి అందరిలో నేను మాత్రమె గొప్ప అనే అహంతో పయనిస్తూ చివరకు నేను మాత్రమె ఉన్నాను అనుకుంటూ ఆపై వేదాంత ధోరణి మొదలువుతుంది. ఆ స్థితిలో ఇహము, దేహము అనే మాటలు మరిచి, పరము, దైవత్వం, ఆత్మబంధం అనే అంకంతో ముగుస్తుంది మన జీవనప్రయాణం. ఆ చివరి అంకంలో ‘నేను’ నా దేహం అనే భావన నుండి మనిషి తన అనుభవపూర్వక జీవిత సారాన్ని జోడించి తన పుట్టుక పరమార్థాన్ని గ్రహించే స్థాయికి చేరుతాడు. అన్నిటికీ అతీతమైన ఆత్మస్వరూపాన్ని వీక్షించే స్థాయికి చేరుతారు. అప్పుడు తమ ఉనికిని కూడా ఇతరులకు తెలియవలసిన అవసరం ఉండదని గ్రహిస్తారు. అదే ఆత్మగంధం. ఈ ఆలోచనల ఆచరణల ప్రవాహానికి ఆడుకట్టలు, గాలి తరంగాలు, వేగనిరోధకాలు అంటే గుంటలు, మిట్టలు తదితర అంశాలు అన్నీ మనం నివసించే పరిసరాలను అనుసరించి ఉంటాయి. కారణం మన పరిసరాలు, మనతో నిత్యం సంచరించే వాళ్ళు, మన దైనందిక కార్యక్రమాలు, తీసుకునే ఆహారం తదితర అంశాలు ఎల్లప్పుడూ మనలో కలిగే ఆలోచనలకు మూల స్తంభాలు అవుతాయి. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు, స్నేహితులు, మనలను అతి గొప్పవారుగా, మేధావిగా చిత్రిస్తే అదే మనలను ప్రభావితం చేస్తూ మనలను నడిపిస్తాయి. ఆ నడిచే దారి సక్రమమైనదైతే మన గురించి మనకు ముందుగానే ఆత్మవరివర్తన కలిగి తద్వారా పరిపూర్ణమైన పరిజ్ఞానం ఏర్పడుతుంది. అదే మనతో చివరివరకూ ఉంటుంది. లేదంటే మనలో ఏర్పడిన అహం వలన మనకు పరివర్తన కలుగక పోగా మనమే గొప్పవాళ్ళం అనే భావన మెండుగా ఏర్పడి తదనుగుణంగా మన ప్రవర్తన ఉండటం జరుగుతుంది. దాని వలన మనకే కాదు మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in March 2022, ఆరోగ్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!