Menu Close
Paranandi-Aravindarao
ఓ రచయిత్రి కథ! (కథ)
-- అరవిందారావు పారనంది --

ఆవిడ ఒక రచయిత్రి. బుద్ధికుశలత కలిగిన విద్యావతి. తెలుగు సంస్కృత భాషలలో సాహిత్య పరిజ్ఞానం ఉన్న కవయిత్రి. ఎన్నో కవితలు, శీర్షికలు, కథలు, నవలలు, వ్యాసాలు, సమీక్షలు వ్రాసి పత్రికలని, పాఠకులని ఉర్రూతలూగించి, అనేక పురస్కారాలు అందుకుని, ఎన్నో వేదికలపైన అనేక సాహిత్య సమస్యల మీద అనర్గళంగా ప్రసంగించిన ప్రముఖ ప్రమద.... డా. భారతీ రత్నాకరాంబ. ఇప్పటి రోజుల్లో కాదు…… అప్పటి రోజుల్లో! అప్పటి రోజుల్లో అంటే చాలా ఏళ్ళ క్రితం. ఎన్నో వర్షాల క్రితం. ఇప్పుడు భర్త గతించిన తర్వాత ఒంటరి జీవితమైపోయింది. సంతోషం కాని సంతాపం కాని పంచుకోడానికి సంతానమంటూ లేరు. ఇప్పటికీ మంచి వర్చస్సుతో గోల్డ్ రిమ్ కళ్ళద్దాలతో ఎంతో హుందాగా ఉంటుంది. రచనలు చేయడానికి ఆవిడకి ఇక శక్తి లేదు. చేతులు సన్నగా వణుకుతూ ఉంటాయి. ఆర్థ్రైటిస్ (arthritis) వల్ల వేళ్ళు కాస్త వంగి రోజంతా నొప్పులే! చూపు కూడా ఈ మధ్య సరిగా ఆనటల్లేదు. ఇది ఇప్పటి రత్నాకరాంబ పరిస్థితి.

xxxxxx

బయట వర్షం జోరుగా పడుతోంది. రత్నాకరాంబ కిటికీ దగ్గరనుంచుని వాన చినుకులు కిటికీ మీద పడి చేస్తున్న చప్పుళ్ళు అలా వింటోంది. అవి ....పాతరోజుల్లో వేదిక మీద తన నవలలకి పురస్కారాలు అందుకుంటున్నప్పుడు ప్రేక్షకుల కరతాళధ్వనుల్లా వినిపిస్తున్నాయి. ఈ వాన ఆగకుండా ఇలా కురుస్తూ ఉంటే ఎంతబాగుంటుంది అనుకుంది. ఆకాశంలో ఆ మెరుపుల్లాగే బహుమతులు అందుకుంటున్నప్పుడు తన కళ్ళు మెరిసేవి. తన ప్రతి నవల ముద్రణయి, అట్ట తెరిచి చూసుకున్నప్పుడు ఆ ఉరుముల్లాగే తన గుండె ధక్ ధక్ అని కొట్టుకునేది. ఆ రోజుల్లో తనకి కారున్నా తనకోసం ప్రత్యేకంగా కారు పంపించి హాలుకి తీసుకెళ్ళేవాళ్ళు. ఆ సభలన్నిటికీ తను చక్కటి కంజీవరం చీరెలు కట్టుకుని, బర్మా ముడిలో పువ్వులు ముడుచుకొని ఎంతో హుందాగా వెళ్ళేది. వెళ్ళేముందు భర్త సుందరాన్ని ఎలా ఉన్నాను అని అడిగేది. Mirror Mirror on the wall who is the prettiest of all! అనేవాడు. తను ఫక్కున నవ్వేది. అందరికీ  తనంటే ఎంతో గౌరవం, పేరు ప్రతిష్టలు ఉండేవి. పక్క గదిలో ఉన్న అల్మారా దగ్గరికి మెల్లగా వెళ్ళి తను ఎప్పుడో వ్రాసిన కథలు, వ్యాసాలు, పత్రికలు, ప్రభలు బయటికి తీసి చతికిలబడి తన చుట్టూ పరుచుకుంది. రోజూ తన రచనలని చదివిన వాటినే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటే పాత రోజులు జ్ఞప్తికి వస్తాయి. కొన్ని వ్రాత ప్రతులు కూడా ఉన్నాయి. రత్నాకరాంబ కళ్ళనుంచి కన్నీళ్ళు టపటప రాలి వాటి మీద పడ్డాయి. కంగారుగా వాటిని పక్కకి నెట్టేసింది. కళ్ళు తుడుచుకుంది. గడిచిన రోజులు రావు....ఆ ప్రశంసలు ఇక వినపడవు... అనుకుంటుంటే ఒక విషాదపూరితమైన నవ్వు ఆవిడ ముఖాన్ని అలుముకుంది.

“ఏంటి అమ్మగారు! నిన్ననే అన్ని పుస్తకాలు ...పేపర్లు సరిగ్గా సర్ది పెట్టాను. మళ్ళా అన్నీ తీసి ఇటూ అటూ చిందర వందర చేసారు” అంది అప్పుడే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి మల్లి విసుక్కుంటూ.

రత్నాకరాంబ ఉలిక్కిపడి "నువ్వెప్పుడొచ్చావే" అంది.

“వీధి తలుపు తీసే ఉంచారు. మీరు ఒంటరిగా ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా" అంది మల్లి.

“ఎవడొస్తాడే? నా దగ్గరేమున్నాయని? ఇదిగో ఈ పుస్తకాలు పట్టుకెల్తాడనుకుంటున్నావా?…వాడమ్ముకున్నా దమ్మిడీ రాదు…. అయినా ఆ దొంగ బాగా చదువుకున్నవాడైతే వీటిలో కాస్త ఆసక్తి చూపిస్తాడేమో” అని నవ్వింది. మల్లి ఆవిడవంక జాలిగా చూసింది. అవన్నీ సర్ది పెట్టి లోపలికెళ్ళి కొబ్బరి నూనె తీసుకుని వచ్చి ఆవిడ వెండి పోగుల్లాంటి జుత్తుకి నూనె రాసి దువ్వి పైకి పెట్టి పిన్నులు పెట్టింది.

“నీళ్ళు తోడి పెట్టాను! స్నానం చేసిరండి. మీరొచ్చేలోపు గబగబా ఇంత ఉడకేస్తాను. కాస్త తిందురుగాని. మళ్ళా నే రేపొచ్చేవరకు ఏమీ తినరు. పదండమ్మా!” అంది మల్లి.

“వచ్చే జన్మలో నీ కడుపున పుడతానే” అంటూ నవ్వుతూ స్నానానికని వెళ్ళింది రత్నాకరాంబ.

xxxxxxxxx

సంపాదకుడు రామనాథం తన పత్రిక జరిపిన కథల పోటీలో గెలిచిన వారికి నగదు బహుమతులిచ్చే సభ ఏర్పాట్ల గురించి తన సంస్థలో పని చేసేవారితో మాట్లాడుతున్నాడు. చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులని, పేరుగొన్న ఆధునిక రచయిత/రచయిత్రిలని, కథలనేవి ఎలా రాయాలి అనే విషయం మీద అనర్గళంగా ప్రసంగించే ఉపన్యాసకులని పిలుస్తున్నారు. అయితే రామనాథానికి ఇంకా తృప్తిగా  లేదు.

తన కింద పనిచేసే జోగి శాస్త్రితో “కొన్నేళ్ళ క్రితం ఎవరో రచయితో, రచయిత్రినో ఒక అద్భుతమైన వ్యాసం వ్రాసారు జోగయ్య గారు!” అన్నాడు.

“దేని గురించండీ?”

“స్త్రీ/పురుషుల రచనల మీద పరిశోధన చేసి, పోల్చి, వారి స్వకీయ ఆలోచనాస్రవంతి ఒకేలా ఉంటుందా! లేదా! అనే దాని మీద మన పత్రికకే వ్రాసారని మా నాన్నగారు ఒకటి రెండు సార్లు నాతో అంటూ ఆ వ్యాసాన్ని పొగిడారయ్యా”!

“వ్రాసిన వారి పేరు గుర్తుందాండీ! “

“అదే జ్ఞప్తికి తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను జోగయ్యగారు”!

“ఫరవాలేదండీ! మన ఆర్ఖైవ్స్ లో(archives) ఉంటుందండీ. చూస్తాను! ఓ రెండు గంటలు సమయం ఇవ్వండి.!”

లంచ్ అవంగానే రామనాథం ఏవో ఫోన్ కాల్స్ లో బిజీ అయిపోయాడు. ఓ గంట తర్వాత తలుపు దగ్గర జోగిశాస్త్రి కనిపించగానే ఏమిటన్నట్లు చూసాడు.

“దొరికిందండీ” అన్నాడు ఉత్సాహంగా జోగిశాస్త్రి.

“ఏం దొరికిందయ్యా” అన్నాడు ఫోను పెట్టేస్తూ అర్థంకాక రామనాథం.

“అదేనండీ! మీరడిగిన వ్యాసమూ.. అది వ్రాసిన రచయిత్రి పేరు” ...

“నిజంగా!” ఎగిరి గంతేసిన పనిచేసి “ఎవరు? ఎవరు?” అని అడిగాడు.

“రచయిత్రి పేరు ... భారతి రత్నాకరాంబ అండీ!”

“అద్గదీ! ఆవిడేనయ్యా! ఆవిడ గురించే మా నాన్నగారు చెప్పేవారు…మీరు వెంటనే ఆవిడ ఎక్కడుంటారో కనుక్కోండి!”

“అంటే… ఇంకా అసలు బతికి....” సందేహంగా జోగిశాస్త్రి .

“ఇదుగో! శుభం పలకరా పెళ్ళికొడకా! అంటే ఏదో అన్నాడట….. అలా అపశకునాలు పలక్కండి…... దయచేసి తొందరగా ఏ వూళ్ళో ఉన్నారో ఆవిడ ఎడ్రెస్ కనుక్కుని నాకు ఇవ్వండి!”

“అలాగేనండీ” అని నిష్క్రమించాడు జోగిశాస్త్రి.

xxxxxxxxxx

తలుపెవరో తట్టిన చప్పుడయింది. జుట్టు సవరించుకుని చుట్టూ పరిచున్న కాగితాలని పక్కకు నెట్టేసి రత్నాకరాంబ మెల్లగా లేచి నుంచుని వెళ్ళి తలుపు తీసింది.

“నమస్కారమమ్మా!” అన్న మాటలు విని కళ్ళజోడు సవరించుకుని

“ఎవరండీ?” అంది.

ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి “అమ్మా! నేను మీకు తెలియదు! కాని మీ గురించి మా తండ్రిగారు చెబుతుంటే విన్నాను. చాలా కష్టపడి మీరెక్కడుంటున్నారో కనుక్కుని వచ్చాను” .

ఆవిడ కంగారుగా దూరం జరిగి “మీ పేరేమిటండీ! కూర్చోండి!” అంది.

“నా పేరు రామనాథం అండీ. మునుపు మా నాన్నగారు, ఇప్పుడు నేను, నడుపుతున్న `సాహితీ వేదిక’ అనే పత్రికకి సంపాదకుడిని….. ఇటీవలే మేము ఓ కథల పొటీ నిర్వహించాము. మా కథల పోటీల ఫలితాలు ప్రకటించి నగదు బహుమతులిచ్చే సభలో మీరొచ్చి ప్రసంగించాలమ్మా!”

“నేనా! మీకు నే గుర్తున్నానంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది” అంది నీరు నిండిన కళ్ళతో.

“అయ్యో! గుర్తులేకపోవమేమిటండీ! అందుకే వెదుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను….. మీరు మా పత్రికకి ఏళ్ళక్రితం ఒక వ్యాసం అద్భుతంగా వ్రాసారు….. ఇదిగో! ఓ కాపీ మీకని తెచ్చానండీ! ఈ విషయం మీద మీరు, ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల స్త్రీ పురుష రచనలతో కూడా పోలుస్తూ, మా సభలో వచ్చే నెల, మాట్లాడాలని నా ప్రార్థన….! మీ లాంటి గొప్ప సాహితీవేత్తని తిరిగి అందరికీ పరిచయం చేయడం నాకెంతో గర్వకారణంగా ఉంటుందమ్మా! దయచేసి మీరు కాదనకండి!... సరే! అంటే ఆహ్వానపత్రికలో మీ పేరు వేసి మా ఉపసంపాదకుల చేత పంపిస్తాను.”

“రామనాథం గారు! నా ప్రసంగం కూర్చుని వ్రాయడానికి నా చేతుల్లో మునుపటి శక్తి లేదు. నాకు సహాయం చేసే మా శ్రీవారు ఇక లేరు. కంప్యూటర్లు వాడటం నాకు రాదు కాబట్టి కొద్దిగా కష్టమే!” అంది రత్నాకరాంబ శుష్కహాసంతో.

“అయ్యో! మీరు ఒప్పుకుంటే చాలు….మా సాంకేతిక వర్గం వారిని మీ వద్దకి పంపిస్తాను. అతను మీక్కావలిసినట్లు టైపు చేసి పెడతాడు. మీరు ఆ విషయం గురించి భయపడకండి. మీరు ఊ అంటే చాలు అదే మా మహాభాగ్యం” అన్నాడు రామనాథం ఆవిడవంక ఆశగా చూస్తూ.

కొద్దిగా సందేహిస్తూ అలాగే అన్నట్లు తలపంకించి లేచి నిలబడింది రత్నాకరాంబ.

“ధన్యవాదాలమ్మా” అని లేచి సంతోషంగా బయటికి నడిచాడు రామనాథం.

రత్నాకరాంబ మనసు పురి విప్పిన నెమలిలా నాట్యం చేసింది. రామనాథం రాక, తనని ప్రసంగించమని అడగటం కలయా నిజమా వైష్ణవమాయే! అన్నట్లు అనిపించింది. మల్లి రాంగానే జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది.

మల్లి నవ్వుతూ "ఇంత చల్లటి మాట చెప్పారు అమ్మగారు! ఇవాళ పాయసం వండుతా!” అంది సంతోషంగా. “నన్ను కూడా తీసుకెళ్ళండమ్మా ఆరోజు….. అర్థం కాకపోయినా వెనకాల ఓ కుర్చీలో కూర్చుని మీరు మాట్లాడిన తర్వాత అందరికంటే నేనే జోరుగా చప్పట్లు  కొడతానమ్మా!” అంది.

“తప్పకనే పిచ్చిపిల్లా!” అంది రత్నాకరాంబ ఆప్యాయంగా మల్లి వంక చూస్తూ.

xxxxxxxxx

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. రత్నాకరాంబకి రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దునంతా, టైపైన తన ప్రసంగం పదే పదే చూసుకుంది. సాయంత్రం 5 గంటలకల్లా స్నానం చేసి పట్టు చీర కట్టుకుని, నీటుగా మల్లి దువ్వి ముడి వేసిన తరువాత అద్దంలో చూసుకుంటూ “సుందరం ఎలా ఉన్నాను”! అంది కళ్ళ నీళ్ళతో!  Mirror Mirror on the wall… అని సుందరం అన్నట్లు అనిపించింది. ఆ కంటి నీరులో చిరు దరహాసం మెరిసింది. బరువుగా నిట్టూర్చింది.

ఆరు గంటలకల్లా రామనాథం పంపించిన కారులో రత్నాకరాంబ, మల్లి ఎక్కారు. సభ కిటకిటలాడుతోంది. రత్నాకరాంబ కారు దిగంగానే రామనాథం, జోగిశాస్త్రి స్వయంగా వచ్చి ఆహ్వానించి చేయి పట్టుకుని తీసుకెళ్ళి వేదిక మీద కూర్చోపెట్టారు. ఆవిడకి పాతరోజులు గుర్తుకొచ్చాయి. ఇలా వేదిక మీద కూర్చుని ఎన్ని సంవత్సరాలు అయిందో! చాలామంది తనకు తెలియని వారే. ఇక మంత్రులు తెలియని వారెవరుంటారు? ఆసక్తితో ఆవిడ చుట్టూ చూస్తోంది. తనకంటే బాగా చిన్న వాళ్ళు బోలెడుమంది ఉన్నారు. తనకి ఇంకా ఆధునిక సాహిత్యంలో ఆసక్తి ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడు వ్రాస్తున్న రచయితల/రచయిత్రిల పేర్లు, వారి రచనలు కొన్ని తెలుసు.

సభ వందనగీతంతో ప్రారంభమయింది. మంత్రిగారి నాలుగు (నాలుగు వందల) మాటల తర్వాత, ఒక్కొక్క విజేత కథ గురించి క్రమంలో ఒక్కొక్క పేరుగొన్న రచయిత/రచయిత్రిలు క్లుప్తంగా మాట్లాడారు. విజేతలు తమ కథలని పరిచయ చేసిన వారిని, పోటీలు నిర్వహించిన పత్రిక కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఇద్దరు ముఖ్య ఉపన్యాసకులు ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించేముందు రామనాథం లేచి నిలబడి మైకు ముందరి కొచ్చి గొంతు సవరించుకని "నేను ఇప్పుడు పరిచయం చేయబోయే వ్యక్తి గొప్ప రచయిత్రి. మా నాన్నగారి ఆధ్వైర్యంలో పత్రిక నడుస్తున్నప్పుడు వీరు తరుచూ మా పత్రికలోనే కాక ఇతర వాటిలోకూడా అనేక కథలు, సమీక్షలు, వ్యాసాలు, నవలలు వ్రాసి, సాహితీపరమైన ప్రక్రియలు చేసి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. మీలో కొంతమంది వీరిని తప్పక గుర్తుపడతారు...తతిమావారు వీరి గురించి విని ఉండవచ్చుకూడా…. వారెవరో కాదు... శ్రీమతి డాక్టర్ భారతి రత్నాకరాంబగారు! వారిలాంటి ప్రతిభాశాలులు ఈనాడు మన సభని అలరించడం మనందరికీ గర్వకారణం….. వీరు ఇప్పుడు మనలాంటి సాహిత్యోపాసకులకి ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రసంగిస్తారు. మీరందరూ వారిని సహృదయంతో రెండు చేతులు కలిపి ఆహ్వానించ ప్రార్థన!” అని ముగించాడు. సభంతా గౌరవ సూచకంగా కరతాళ ధ్వనులు చేస్తూ లేచి నిలబడ్డారు.

మైక్ ని రత్నాకరాంబ కూర్చున్న కుర్చీ వద్దకి తీసుకుని వచ్చి స్టేండ్ మీద పెట్టి కూర్చునే మాట్లాడమన్నారు. ఆవిడ సభనంతా ఒకసారి పరికించి, తన గత చరిత్ర క్లుప్తంగా చెప్పి, ఆయన కోరిన విషయం మీదే వ్రాసుకుని వచ్చిన కాగితాలని అప్పుడప్పుడు చూసుకుంటూ తడుముకోకుండా పాతరోజులు గుర్తుకొచ్చి ఒక రకమైన ఆవేశంతో ఊగిపోయి అనర్గళంగా ప్రసంగించి, సద్విమర్శలు చేసి, సహృదయంతో అర్హులైన వారిని ప్రశంసించి, విజేతలని అభినందించింది. ప్రసంగం ముగించే ముందు "మరుగున పడ్డ నాలాంటి దాన్ని ఎక్కడున్నానో కష్టపడి కనుక్కుని ఈ నాటి సభకి నన్ను ఆహ్వానించి ఇంతమంది సాహితీవేత్తలని నాకు పరిచయం చేసిన రామనాథంగారికి ఎన్నో కృతజ్ఞతలు. ఈ రోజు నా జీవితంలో మరువలేని రోజు!” అంది. ప్రసంగం ముగియగానే కరతాళధ్వనులు మిన్ను ముట్టాయి. మల్లి దూరం నుంచి గట్టిగా చేయి ఊపింది. ఆవిడ సన్నగా నవ్వుకుంది. ఆవిడని శాలువాతో పూలదండలతో మంత్రిగారు సత్కరించారు. ఎంతో మంది సభ ముగియగానే ఆవిడ ప్రసంగాన్ని చాలా మెచ్చుకున్నారు. మంత్రిగారు సభ ముగిసే ముందు మైకు తీసుకుని రత్నాకరాంబ రచనలు తిరిగి తాజాగా ముద్రించి ఔత్సాహిక రచయితులందరికి అందుబాటులో ఉండేటట్లు చేయాలని, ఆ ప్రణాళికకి ప్రభుత్వం చేయూతనివ్వగలదని కూడా అన్నారు. అందరూ సంతోషంతో తలలూపారు. రత్నాకరాంబ దేహం ఆనందంతో పులకరించింది. “సుందరం! నువ్విక్కడ ఉంటే బాగుండేదోయ్” అని అప్రయత్నంగా అంది.

xxxxxxxxx

సభ ముగిసిన తర్వాత చాలామంది ఔత్సాహికరచయిత/త్రి లు వచ్చి ఆవిడతో మాట్లాడారు. రామనాథం ఆవిడని, మల్లిని కారు దాకా సాగనంపి “మళ్ళీ కలుద్దామమ్మా! మీరు మళ్ళా వ్రాయడం మొదలెట్టాలి” అన్నాడు. సన్నగా నవ్వుతూ అలాగే అన్నట్లు తలూపింది ఆవిడ.

ఇంటికొచ్చి బట్టలు మార్చుకుంటుంటే మల్లి వేడిగా పాలు కాచి తీసుకొచ్చింది. పాలు తాగి చీర మార్చుకుని ఆవిడ మౌనంగా పక్క మీద నడుం వాల్చి కళ్ళు మూసుకుంది. మల్లి గిన్నెలు కడిగి, ఆవిడ చీరె మడత పెట్టి, దూరం నుంచే “హాయిగా నిద్రపోండమ్మా! రేపొస్తాను”! నేనోచ్చేసరికి మళ్ళీ పుస్తకాలన్నీ తీసి చిందర వందర చేయకండమ్మా!” అంది నవ్వుతూ.

ఆవిడ వద్దనుంచి జవాబు లేదు!

మల్లి వెనక తలుపు తీసుకుని బయటి తాళం పెట్టి వెళ్ళి పోయింది…….

********

Posted in April 2024, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!