మనసుకు జీవం ఇష్టం
మనసు పుట్టలో రహస్యం ఇష్టం.
ఎవ్వరు తవ్వినా రూపం కనపడదు.
ఎంత తొలిచినా తేమ దారి ఆరదు.
హృదయపొరల్లో చిటికెడు ప్రేమకే
అమృతమైన ఒక్కో క్షణం
వర్తమానానికి ఊపిరై,
చెక్కే ఊహను
చిక్కని నిజాల్లో శుభ్రపరచి
ఇష్టాల చెమికీ లద్దితే
కంటితీరాల్లో పదునెక్కిన కల
చురుకెక్కిన ఒక్కో ఇష్టమై
మనసు జీవం కాగా
ఏమారని ఆలోచనలు
ప్రవహించి నదిలా మనసు
సంద్రంలా మనిషి హోరెత్తి
కాలపు తెరల మాటున
జవాబు లేని ప్రశ్నలు
యుద్ధం ప్రకటించి
మౌనం కాలుదువ్వినా
తెలియని దారికి
గమ్యం భయపడినా
తెలిసిన లోతుకు
అడుగు తడబడినా
బతుకు చిత్రంలో
జీవితం పొడవునా
మనిషి ఇష్టమే
మనసుకు జీవం.