"ఈవేళ పని రేపటికి వాయిదా వేయకు" అనే సామెతను గుర్తు చేసుకుంటూ శిల-శిల్పి- శిల్పం చర్చను పోయిన నెల అంటే మార్చిలో ముగించవలసినది, కానీ అనివార్యంగా ఈ నెలకు పొడిగించక తప్పలేదు. రచ్చబండ చర్చల్లో కొన్ని తెగవు, మరుసటి రోజు తాపీగా అందరూ కూర్చొని ముందురోజు చర్చను కొనసాగించడం సర్వసాధారణం. కావున అయోధ్య బాల రామయ్య శిల-శిల్పి గూర్చి చర్చించాం కాబట్టి, ఈ సంచికలో అయోధ్య బాల రామయ్య శిల్పం గురించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చర్చిద్దాం!
శిల్పం:
ఈ సంచికలో "శిల్పం" గూర్చి.... ప్రాణ ప్రతిష్ఠకు ముందు మీడియా లో వచ్చిన బాల రాముడి విగ్రహంతో పోలిస్తే.. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్య బాలక్ రామ్ విగ్రహంలో జీవ కళ ఉట్టిపడుతుండటాన్ని మనం గమనించొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఆ విగ్రహ శిల్పి అరుణ్ యోగి రాజ్ మీడియాకు చెప్పాడు. నెలల తరబడి తాను చెక్కిన విగ్రహమే అయినా సరే.. ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడని ఆయన చెప్పారు. తాను చెక్కినప్పుడు విగ్రహం వేరు.. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత విగ్రహం వేరని ఆయన చెప్పారు. తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు అరుణ్ యోగిరాజ్ జనవరి 22, 2024 నాటి ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి హాజరయ్యారు. అంతకు మునుపు పది రోజులు అయోధ్యలో ఉండి, తాను చెక్కిన బాల రాముడి విగ్రహాన్ని గర్భాలయంలో ఉంచిన కార్యక్రమంలో ఆయనకూడా భాగస్వాముడైన నేపథ్యంలో, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తియైన తరువాత ఆయన.. గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. బాల రాముడి ముఖంలో చిరునవ్వుతోపాటు.. ముఖంలో హావభావాలు మారిపోయాయని ఆయన చెప్పారు.
శిల్పి అరుణ్ యోగి రాజ్ ఏడు నెలలకుపైగా కుటుంబానికి దూరంగా ఉండి మరీ బాల రాముడి విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చెక్కారు. ఆ విగ్రహాన్ని ఆయన కంటే దగ్గర, సునిశితంగా బహుశా మరొకరు గమనించి ఉండరు. అలాంటి వ్యక్తే రాముడు మారిపోయాడని చెబుతుండటం గమనార్హం. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అలంకరణతో కూడిన విగ్రహం మరింత కళగా కనిపిస్తోందని భక్తులు కూడా చెబుతున్నారు.
అయోధ్యలో కొలువుదీరనున్న రాముడి విగ్రహాన్ని ఎంపిక చేసేందుకు మొత్తం 3 విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తయారు చేయించింది. ప్రస్తుతం అయోధ్య గర్భగుడిలో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన నల్లరాతి విగ్రహాన్ని ఆలయ ట్రస్ట్ సభ్యులు ఎంపిక చేశారు. మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి కర్ణాటకకు చెందిన గణేష్ భట్.. నల్లరాతితో తయారు చేశారు. ఇక మరో విగ్రహాన్ని రాజస్థాన్‌కు చెందిన సత్య నారాయణ పాండే.. తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించారు. ఈ మూడు విగ్రహాలు కూడా 51 అంగుళాల ఎత్తులో ఉండేలా రూపొందించారు. మిగిలిన రెండు విగ్రహాలు ప్రస్తుతం అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు తయారు చేయించిన ఆ రెండు విగ్రహాలను ఇప్పుడు ఏం చేస్తారు అనే సందేహం అందరి మదిలోనూ మెదులుతోంది. అయితే దీనిపై ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పూర్తి స్పష్టతనిచ్చారు. మిగిలిన ఆ రెండు విగ్రహాలను కూడా అయోధ్య రామ మందిరంలోనే వేర్వేరు ప్రదేశాల్లో ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు.
అయోధ్యలోని 51 అంగుళాల విగ్రహం గురించి చెప్పుకుందాం - బాలక్‌రామ్ ఎత్తు 51 అంగుళాలు. దాదాపు 169 సెంటీమీటర్లు. 51 అంగుళాలే ఎందుకు? ఎందుకంటే ఏటా శ్రీరామనవమికి గర్భాలయంలోని బాలరామునికి సూర్యతిలకం అంటే నుదుటిపై సూర్యకిరణాలు పడాలంటే అదే ఎత్తు కావాలి. విగ్రహ నిర్మాణానికి చాలామంది సాఫ్ట్‌వేర్ నిపుణుల సాయం తీసుకోవాలని యోగిరాజ్ అనుకున్నా, అంతిమంగా మళ్లీ సంప్రదాయ పనిముట్లు - ఉలి, సుత్తి మాత్రమే ఆయనకు అక్కరకు వచ్చాయి.
రాతి కమలంపై నిలబడ్డ రాముడి చుట్టూ దశావతరాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 'రాయిలో భావం ఒలికించడం చాలా కష్టం, దీనికోసం చాలా సమయం వెచ్చించా, చిన్నపిల్లలు ఎలా ఉంటారో గమనించి అదే మాదిరి రాముడి విగ్రహం పసిదనం వచ్చేందుకు ప్రయత్నించా, కళ్లు బాగున్నాయా అని పదే పదే అడిగి తెలుసుకుని చెక్కా' అని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అరుణ్ తెలిపాడు.
విగ్రహ రూపకల్పన ఎలా జరిగిందో తెలుగుకుందాం. ఈ బాల రాముని విగ్రహం తామరపువ్వుపై నిలబడి ఉంది. ఇది చిన్ననాటి బాల రాముడు ఎలా ఉన్నాడో భక్తులకు తెలియజేస్తుంది. చిన్న పిల్లాడి రూపంలో ఉన్న రాముడు ఎడమ చేతిలో బంగారు విల్లు, కుడి చేతిలో బంగారు బాణం పట్టుకున్నాడు. బాణం పట్టుకున్న చేతికి ఆశీర్వాదముద్ర ఉంటుంది. ఈ విగ్రహం 51 అంగుళాల పొడవు, 3 అడుగుల వెడల్పు, 200 కిలోల బరువుతో, గిరజాల జుట్టు, నుదుటిపై సూర్యుని చిహ్నం వైష్ణవ తిలకంతో ఉంటుంది. విగ్రహ కిరీటం చుట్టూ ఓం, పద్మం, చక్రం, సూర్యుడు, గద, శంఖం, స్వస్తిక్ చిహ్నాలు ఉన్నాయి. అంతేకాదు ఈ విగ్రహం చుట్టూ విష్ణువు దశ అవతారాలు కూడా ఉన్నాయి. విగ్రహం పాదాల దగ్గర హనుమంతుడు, గరుత్మంతుని విగ్రహాలు చెక్కబడ్డాయి. దగ్గరా చూస్తే కానీ ఇవి కనపడవు. కోట్ల విలువైన బంగారు, వజ్రాలతో కూడిన ఆభరణాలు, వస్త్రాలతో బాల రాముడి విగ్రహాన్ని అలంకరించారు. వీటి గూర్చి తెలుసుకుందాం!
బాల రాముడి ప్రతిమకు అలంకరించిన కిరీటాన్ని లఖ్‌నవూకు చెందిన హర్‌సహాయ్‌మల్ శ్యామ్‌లాల్ జ్యువెలర్స్ వారు తయారు చేశారు. 1.7 కిలోల బంగారంతో చేసిన ఆ కిరీటంలో 75 క్యారెట్ల వజ్రాలను, 135 క్యారెట్ల పచ్చలను, 262 క్యారెట్ల కెంపులను వాడారు. ఆ వజ్రాలు, పచ్చలు, కెంపులన్నీ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ధ్రువీకరించినవి. స్వచ్ఛమైనవి. కొంచం జాగ్రత్తగా గమనిస్తే.. బాల రాముడి కిరీటం మధ్యలో సూర్యుడి బొమ్మ కనిపిస్తుంది. రాముడు రవికుల తిలకుడని చెప్పడానికి అలా సూర్యుడిని నేర్పుగా పొందుపరచారు. ఇక.. రాముడికి పెట్టిన తిలకం కూడా స్వచ్ఛమైన బంగారందే. 16 గ్రాముల బంగారాన్ని, 3 క్యారెట్ల వజ్రాన్ని ఈ తిలకం తయారీలో వినియోగించారు. 3 క్యారెట్ల వజ్రం చుట్టూ.. 10 క్యారెట్ల చిన్నచిన్న వజ్రాలను, బర్మా కెంపులను పొందుపరచారు. ఇక బాలరాముడి కుడిచేతి బొటనవేలికి పెట్టిన ఉంగరం బరువు 65 గ్రాములు. మధ్యలో పొదిగిన పెద్ద పచ్చ.. జాంబియన్ ఎమరాల్డ్. ఎడమచేతికి పెట్టిన కెంపుల ఉంగరం బరువు 26 గ్రాములు. అందమైన కంఠసీమకు అలంకరించిన నెక్లెస్ బరువు దాదాపు అరకిలో. స్వామి ఛాతీకి అలంకరించిన పంచ్‌లడా బరువు 660 గ్రాములు. ఇంకా.. రెండు కిలోల బరువుండే విజయమాల.. ముప్పావు కిలో బరువుండే కడియం (70 క్యారట్ల వజ్రాలు, 850 క్యారట్ల కెంపులు, పచ్చలు).. 400 గ్రాముల బరువుండే వడ్డాణం.. 850 గ్రాముల బరువైన హస్తాభరణాలు (100 క్యారట్ల వజ్రాలు, 320 క్యారట్ల కెంపులు, పచ్చలతో తయారుచేసినవి).. 400 గ్రాముల బరువుండే పాద మంజీరాలు స్వామికి అలంకరించారు.
ప్రాణ ప్రతిష్ఠకు ముందు బాల రాముడి విగ్రహం ఉన్న వాతావరణం వేరు.. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత గర్భాలయంలోని వాతావరణం వేరు. సూర్య సమాన దీప కాంతుల నడుమ.. కిరీటంతో కూడిన స్వర్ణాభరణాలు, వజ్రాలతో కూడిన ఆభరణాలు, రంగు రంగుల పూల మాలలతో, ధవళ వస్త్రాలతో.. బాలరాముడి అందం అమాంతం పెరిగిపోయింది. అయోధ్యలో కొలువైన బాల రాముణ్ని దర్శించుకున్న అనంతరం తాము అలౌకిక అనుభూతికి లోనయ్యామని భక్తులు పెద్ద ఎత్తున చెబుతున్నారు. ప్రాణప్రతిష్ఠకు అంత శక్తి ఉంటుందా..? అయోధ్య బాలరాముడే దీనికి నిదర్శనమా, అవుననే చెప్పాలి.
దైవిక శక్తి అద్భుతం:
కర్నాటకకు చెందిన అరుణ్ యోగి రాజ్ రూపొందించిన ఈ రాముని విగ్రహం రామ మందిరంలో ప్రతిష్టించబడింది. తాను చెక్కిన ఈ విగ్రహం గర్భగుడి బయట ఉన్నప్పుడు భిన్నంగా కనిపిస్తే, గర్భగుడిలోకి ప్రవేశించగానే ఆ విగ్రహానికి దైవశక్తి వచ్చింది - ఇది నిజంగా దైవిక అద్భుతమని అరుణ్ యోగిరాజ్ అన్నారు. మరోవైపు, స్వామికి రోజుకు ఆరుసార్లు హారతిని ఇస్తామని ట్రస్ట్ కు చెందిన ఆచార్య మిథిలేశ్ నందిని తెలిపారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్యా, శయన హారతి ఇస్తామని చెప్పారు. పూరి, కూరతో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్, పాలతో చేసిన తీపిపదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు.
ప్రాణ ప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య ప్రజలను అనుమతించారు. దీంతో, ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలరాముడి దర్శనానికి రోజూ గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. దీంతో బాల రాముడికి విశ్రాంతి ఇచ్చేలా రోజూ మధ్యాహ్నం 12.30-1.30 వరకు ఒక గంట ఆలయ ద్వారాలు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. రామ్‌లల్లా ఐదు సంవత్సరాలు బాలుడు కావడం వల్ల ఇన్ని గంటల పాటు మెలకువగా ఉంటే తట్టుకోలేరు, కాబట్టి బాల రాముడికి కొంత విశ్రాంతి ఇచ్చేందుకు రోజూ మధ్యాన్నం గంట సేపు తలుపులు మూసివేయాలనేది ట్రస్ట్ నిర్ణయం. దీంతో "దేవతామూర్తికి కాసింత విశ్రాంతి దొరుకుతుంది” అని ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. స్వామి వారికి సుప్రభాత సేవా కార్యక్రమాలు తెల్లవారుజామున 4 గంటలకి, ఆ తర్వాత ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తజనాన్ని రాములోరి దర్శనం కోసం అనుమతిస్తున్నారు.
అప్పట్లో రోజుకు 2 వేల మంది... మొన్నటికిమొన్న 50 వేల మంది... రేపు లక్ష?
నిజానికి రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు 1949లో రామ జన్మభూమి ప్రాంతంలో బాలరాముడి విగ్రహం వెలిసిన రోజు లగాయతు సగటున 1500 నుంచి 2000 మంది వరకు భక్తులు రోజూ బాల రామయ్య దర్శనానికి వచ్చేవారు. 1949లో ప్రతిష్టింపబడిన 7 అంగుళాల బాల రాముడి కంచు విగ్రహాన్ని వారు దర్శించుకునేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ భక్తుల సంఖ్య ఒక్కసారిగా రోజుకు పది వేలకు పెరిగింది. ఇప్పుడు తాజాగా ప్రాణప్రతిష్ట కు ముందు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వచ్చారు. జనవరి 22 న ప్రాణ ప్రతిష్ట తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని ఒక దశలో అంచనా వేసారు, కానీ వారి అంచనాల మించి రోజుకు రెండు లక్షలమంది దాకా రోజూ అయోధ్య బాల రాముడిని దర్శించుకుంటున్నారని వార్తలు వచ్చాయి, అయితే తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులను, భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం తీర్థక్షేత్ర ట్రస్టుకు కాస్త ఇబ్బంది కరంగా మారింది.ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీని సమన్వయం చేయటం ఎలా అనే అంశంపై వారు టీటీడీ సాయం కోరారు. ట్రస్టు విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు అయోధ్యకు వెళ్లి... ట్రస్టు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ వ్యవహారాల నిర్వహణలో దశాబ్దాల అనుభవం కలిగిఉన్న టీటీడీ అధికారులు అయోధ్య బాల రామయ్య ఆలయ ట్రస్టు ప్రతినిధులకు ఈ విషయమై అవగాహన కల్పించారు. టీటీడీ విషయానికి వస్తే 1983 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భక్తుల కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను నిర్మించారు. అంతకు మునుపు దర్శనం నిమిత్తం పెద్ద రేకుల షెడ్ నిర్మాణాలలో వేచి ఉన్నట్లు నాకు గుర్తు. ఆ పాత రేకుల షెడ్లకు ఆసరాగా ఉండే పెద్ద ఇనుప గుంజలపై కోతుల విహారాన్నిచూసిన విషయాన్ని కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. ఒకసారి తిరుమల ఏడుకొండలవాడి దర్శనం సమయంలో తోపులాటలు జరిగి, నేను - నా భుజంపై నున్న ఏడాది వయసున్న కూతురు పక్కకు నెట్టివేయబడ్డాం. అది గమనించి ఒక మహిళా పోలీసు, ఇంతవరకు వచ్చి దర్శనం చేసుకోకపోతే ఎట్లా అని నాతొ చెబుతూ మళ్ళీ నన్ను ఆమె ఉన్న ప్రదేశంకు తీసుకువెళ్ళింది. అక్కడ నుండి కనులారా దేవుని దర్శనం చేసుకొని ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయలుదేరాను. ఇప్పటికీ తిరుమల గురుకుతెచ్చుకున్న ప్రతిసారి, ఆ దేవదేవుడితో పాటూ ఆ మహిళా పోలీసు నాకు చేసిన సాయం కళ్ళముందు మెదలుతుంది. జ్ఞాపకాలు అనుభూతుల ఉద్వేగం, మనసులో దాగిన జ్ఞాపకాలను పంచుకుంటే ఆ ఆనందమే వేరు. ఒక తీపి జ్ఞాపకం అనుక్షణం మనసుకి బలాన్ని ఇస్తుంటుంది. అదే ఒక చేదు జ్ఞాపకం ప్రతి క్షణం మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. కానీ చెడుని పదే పదే గుర్తుకుతెచ్చుకోవడం ఆరోగ్యదాయకం కాదు. కాబట్టి మిత్రులారా తెలిసి మసలుకోండి.
ఇక టీటీడీ అధికారులతో జరిపిన సమావేశంతో భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే దానిపైనా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు కొంత అవగాహన వచ్చి వచ్చి ఉంటుంది. చేతల్లో వారు దాన్ని అమలుపరచాలి. అయితే ఈ విషయంలో టీటీడీ కి ఉన్న దశాబ్దాల అనుభవం, సమయం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కు లేదు. తిరుమల విషయానికి వస్తే, 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. ఆ తరువాత తిరుపతిలో ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగింది. 1891 లోనే తిరుపతికి రైలుమార్గం వచ్చినట్లు ఒక వార్తా కథనం ఉంది. ఒకవైపు తిరుమల ఏడుకొండలస్వామిని దర్శించే భక్తుల సంఖ్య ఒకేసారి కాకుండా పలు దశాబ్దాలుగా పెరగడం ద్వారా టీటీడీ వారికి సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు చేయడానికి చాలినంత సమయం లభించింది, మరో వైపు ఇప్పుడు భక్తులకు అయోధ్యకు చేరుకునే విధానం సులభతరంగా ఉండడంతో అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తదుపరి రాత్రికి రాత్రి సందర్శకుల సంఖ్య ఒకేసారి రెండు లక్షలకు పెరగడంతో ఇబ్బంది నెలకొంది అని తెలుస్తుంది. టీటీడీ స్వానుభవం, సహకారంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సమస్యను అధికమిస్తుంది అని ఆశిద్దాం!
బాల రాముడి విగ్రహ తయారీ కృష్ణ శిల కోసం భార్య తాళిని తాకట్టుపెట్టిన కాంట్రాక్టర్!!
ఇదిలా ఉండగా, అయోధ్య బాలరాముడి కృష్ణ శిలను రామదాసు అనే రైతు పొలం నుండి వెలికితీసిన కాంట్రాక్టర్ కు జరిమానా.. అని ఒక వార్త ఒకటి ఈ మధ్య పత్రికల్లో వచ్చింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టుడైన బాల రాముడి విగ్రహం కోసం ఉయోగించిన కృష్ణ శిల శ్రీనివాస్ నటరాజ్ అనే ఓ చిన్న కాంట్రాక్టరుకు అనుకోని కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ కృష్ణ శిలను కర్నాటక రాష్ట్రంలోని రామదాసు పొలం నుంచి వెలికి తీశారు. అయితే, ఈ శిలను వెలికితీయడం వల్ల తాను కష్టాలపాలయ్యానని సదరు కాంట్రాక్టర్ వాపోతున్నాడు. వెలికితీతకు సంబంధించి కొంత లాభం వచ్చినా.. అధికారులు తనకు భారీ మొత్తంలో అపరాధ రుసుం వేశారని తెలిపాడు.
ఇంకా కొద్దిగా వెనక్కి వెళితే.. ఇంతకు మునుపు రామజన్మభూమిలో రామమందిర నిర్మాణంపై చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి. మరోవైపు వీటితో సంబంధం లేకుండా.. మరోవైపు.. కర్ణాటకలో ఒక యాదృచ్ఛిక ఘట్టం చోటు చేసుకుంది. కర్ణాటకలో రామదాసు అనే రైతు పొలం నుంచి తీసిన ఈ భారీ కృష్ణ శిల బయటపడిన వ్యవహారం.. కర్ణాటక సర్కారుకు తెలిసింది. అప్పట్లో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. వెంటనే గనుల శాఖ అధికారులు వచ్చి.. ఎలాంటి అనుమతి లేకుండానే భారీ శిలను భూమి నుంచి సేకరించిన నేరంపై 80 వేలజరిమానా విధించారు. దీనిని కట్టకపోతే.. జైలు తప్పదని హెచ్చరించారు. దీంతో విధిలేక కాంట్రాక్టర్ శ్రీనివాస్.. తన భార్య మెడలో తాళిని తాకట్టుపెట్టి 50 వేలు.. తన దగ్గర ఉన్న 30 వేలు కలిపి జరిమానా చెల్లించారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో సదరు జరిమానా చెల్లించి ఆ కేసు నుంచి బయట పడిన శ్రీనివాస్.. తన కార్యాలయంకు.. ఆ కృష్ణ శిలను చేర్చారు. నెలలు గడిచిపోయి నా.. దానిని ఎవరూ కొనలేదు. ఆయన కార్యాలయంలోనే కృష్ణ శిల ఉండిపోయింది. ఇంతలో అయోధ్య రామ తీర్థ ట్రస్టు నుంచి వచ్చిన సభ్యులు ఆ శిలను పరిశీలించి.. అరుణ్ యోగిరాజ్ వద్దకు ఆ శిలను తీసుకువెళ్లారట. తరువాత కథ మీకు తెలిసిందే! ఆ శిలే.. ఇప్పుడు అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహంగా విరాజిల్లుతోంది. అయితే.. తాళిబొట్టు విషయానికి వస్తే.. ఇప్పటికీ అది తాకట్టులోనే ఉందని శ్రీనివాస్ చెప్పారు. తన నుంచి సేకరించిన కృష్ణ శిల.. రాముడిగా మారుతుందని ఊహించలేదని ఆయన అన్నారు. త్వరలోనే తాను తీర్థ ట్రస్టును కలిసి.. తన సమస్యను వెల్లడించి సాయం కోరతానని చెప్పడం గమనార్హం. ఈయన కష్టాలు వింటే భద్రాచల రామదాసు కష్టాలు గుర్తుకొస్తున్నాయి కదా!
సదరు కృష్ణ శిలను 2023లో బాల రాముడి విగ్రహం తయారీకి ఉపయోగించినందున ఆ జరిమానా మొత్తాన్ని శ్రీనివాస్‌కు ఇచ్చి, ఆయన భార్య తాళిని తాకట్టు నుండి విడిపించుకునేందుకు తాను మద్దతు ఇస్తానని స్థానిక మైసూరు లోక్‌సభ ఎంపీ ప్రతాప్ సింహ తెలిపారు. దాంతో 2023లో అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పరువుపోయింది, దాంతో వారు ఏం మాయ చేసారోకానీ, పొలంనుండి కృష్ణ శిలను తీసినందుకు గనుల శాఖ అధికారులు జరిమానా విధించలేదని శ్రీనివాస్ తాజాగా ఒక ప్రకటన చేశారు. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేనేమో! సామాన్యుడు అయిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ ను బెదిరించి మాట మార్చమని వత్తిడి చేసిన వారు, రేపు సదరు కాంట్రాక్టర్ 2022 జులైలో జరిమానా చెల్లించిన రసీదు లేదా తాళి తాకట్టు రసీదు బయటకు వచ్చినప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో! అయితే ఈ పాటికి స్థానిక మైసూరు లోక్‌సభ ఎంపీ ప్రతాప్ సింహ వద్ద ఈ రసీదుల కాపీ ఒకటి చేరే ఉండిఉంటుంది - సమయం వచ్చినప్పుడు ఆయనే బయటపెడతాడు. కావున వేచిఉండడం మన ధర్మం. కదా!
ఏతావాతా, ఈ సందర్భంగా “వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు" నానుడి ఒకటి జ్ఞాపకం వస్తుంది. భాగవతం లో ఎక్కడ వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్లు లేదు. అయితే ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం.. వసుదేవుడు బాల కృష్ణుణ్ణి యమున నది దాటించి గోకులం తీసుకొని వెళ్లే సమయములో ఒక గాడిద కూత పెట్టడం మొదలుపెట్టింది. కావలి వాళ్ళు నిద్ర లేచి వస్తారన్న భయంతో వసుదేవుడు సదరు గాడిదని ప్రార్థించి నోరు మూయించినట్లు ఈ కథ.
రచ్చబండ చర్చలో ఒక్కోసారి చర్చ పక్క దారి పట్టినా పెద్దగా ఇబ్బంది లేదు - ఎందుకంటే చర్చలో పాల్గొన్నవారు కొత్త విషయాలు తెలియజేస్తారు, లేదా పాత విషయాన్ని గుర్తుకుచేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. కొద్దిగా లోతుగా విశ్లేషిస్తే..ఈ వసుదేవుడు - గాడిద కథలో కొంత తత్త్వం మనకు గోచరిస్తుంది. దేవకీ మాత నిద్రావస్థలో ఉంది, అదేవిధంగా ఆ కారాగారం బయట కాపలా ఉన్న భటులు కూడా నిద్రలో జారుకుని ఉన్నారు, ఆ సందర్భంలో, వసుదేవుడు కారాగారం నుండి బయట అడుగు పెట్టడం జరిగింది, ఇంతవరకు కథ బాగానే జరిగింది, మనలో ఎవ్వరికీ ఎటువంటి సందేహం కలగలేదు, ఎందుకు అంటే, అక్కడ ఉన్నది బాల శ్రీకృష్ణుడు, తన మాయ చేత, ఆ పరిస్థితులని ఆ విధంగా చేసారని అనుకున్నాం, అంత చేసిన ఆ స్వామి, ఆ గాడిదని నిద్రావస్థలోనికి ఉంచలేరా? లేదా వసుదేవుడిని ప్రేరేపించి సదరు గాడిదను చితకబాది తరిమివేయించాలి లేదా దాన్ని అక్కడికక్కడే అంతమొందించే ప్రయత్నం చెయ్యాలి కదా? అన్న ప్రశ్నలు మనకు, కలగాలి, కానీ, కలగలేదు, ఎందువలనా, లేదా ఆ స్వామి ఎందుకు ఆలా చేయలేదు అంటే, అక్కడే మన అందరికి, ఒక గొప్ప తత్వాన్ని, అందచేసే ప్రయత్నములోనే ఆ విధంగా జరిగింది, అయితే ఆ తత్త్వం ఏమిటంటే.. కార్య సాధన లో ముందుకు వెళుతున్నప్పుడు కొంత తక్కువ స్థాయి పని అని అయినా కూడా సిగ్గుపడకుండా ఆ పని చేయడానికి వెనుకంజ వేయకూడదు అనే సందేశం కోసం ఎవరో ఒక మహానుభావుడు దూరదృష్టి తో ఈ నానుడిని పుట్టించి ఉంటాడు. అంతేకాని, ఆ పరంధాముడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి, అసందర్భంగా కూసే ఆ గాడిదను, నిద్రావస్థలోనికి పంపటం చేతగాక కాదు, లేదా నిమిషంలో దాని ఖేల్ ఖతం చెయ్యడం చేతగాకకాదు, కదా! సమాజములో, ఎక్కడైనా ఇటువంటివి ఎక్కడైనా జరగవచ్చు, ఆయా చోట్ల, సమోయోచితముగా, ఆలోచన చేసి లేదా నడుచుకొని అవసరమైతే ఒక మెట్టు తగ్గి, జయుడవై, విజయుడవై తిరిగి రావాలి అనే పరమార్ధం లో పైన చెప్పినట్లు “వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు" అంటారు. ఈ నానుడిని అర్ధం చేసుకొనే, మన జీవన ప్రయాణములో, ఆయా సందర్భంలో అన్వయించుకొని, నడుచుకోవాలి. ద్వాపర యుగంలో ఇప్పటి ఆధునిక కుహానా లౌకిక వాద రాజకీయ నాయకులు లేరు, కానీ దైవ కార్యాలకు ఆటంకాలు కల్పించే గాడిదలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి నిజమైన గాడిదలు లేవు కానీ గాడిద సమానులైన రాజకీయ నాయకులు కొందరు మనకు కనిపిస్తుంటారు. “మేము సాక్షాత్తు గాడిదలమే, నీవు మాత్రం మాకు వసుదేవ సమానుడవు, మా టైమ్ బాగుండి నీ ఖర్మ కాలింది కావున, నీవు మా కాళ్ళు పట్టుకోవాలి" అని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కాంట్రాక్టర్ శ్రీనివాస్ కు హుకుం జారీచేశారు అని తెలుస్తుంది.
ఇంతకీ మన ఖర్మ ఏమిటంటే.. వీరిని ఎన్నుకుంటున్నప్పుడు దురదృష్టవశాత్తు మన ప్రజలకు వీరి అవలక్షణాలు గుర్తుకురావు. ఏవో ఉచితాలకు, తాయిలాలకు కక్కుర్తిపడి ప్రజలు వీరిని ఎన్నుకుంటారు. 5 ఏండ్ల తరువాత మళ్ళీ కొత్తగా ఎన్నికలు వచ్చినప్పుడు శిశుపాలుని తలపించిన వీరి 5 ఏండ్ల పాలనకు జవాబుగా తమ ఓటుతో ప్రజలు ఆగ్రహంతో సమాధి కడతారు. మరో 5 ఏండ్ల తరువాత మళ్ళీ సమాధిలో ఉన్నవారికి తమ ఓటుతో మళ్ళీ ప్రాణం పోస్తారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఒకందుకు ప్రజలకు ఓటుహక్కు ఇస్తే ప్రజలు మరో విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఏంచేస్తాం! కలికాలం!
ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు ఒక మిత్రుడు అంతా విని "దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు" సామెతను నాకు గుర్తుచేశాడు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ కు కృష్ణ శిలను వెలికితీసే అవకాశం రామయ్య ఇచ్చాడు, కానీ ప్రస్తుత స్థానిక ప్రభుత్వం మాత్రం ఆ కృష్ణ శిల వెలికితీసిన నిమిత్తం భార్య తాళి తాకట్టు పెట్టి అతడు అతను చెల్లించిన జరిమానాను “చెల్లించలేదని" దబాయిస్తుంది. హాజ్ యాత్రలకోసం విమాన యానానికి ఒక వర్గం ప్రజలకు ఉచితంగా కోట్లు పంచిపెట్టే అదే స్థానిక ప్రభుత్వం రామయ్య కృష్ణ శిలను వెలికితీసే పనిలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ కు విధించిన 80 వేల చిన్నమొత్తం జరిమానాను మాఫీ చెయ్యలేదా? రాజ్యానికి మతం లేదని బల్ల గుద్ది వాదించిన నెహ్రూ హయాన ఊపిరి పోసుకున్న ఈ కుహానా సెక్యులర్ రాజకీయాల ధోరణిని ఏ దృష్టితో చూడాలి? ఇంతకీ రాజ్యానికి మతం లేదంటే, అన్ని మతాలను సమ దృష్టితో చూడమనా? లేదా అన్ని మతాలకు దూరంగా ఉండమనా? అన్ని మతాలకు దూరంగా ఉండమని చెప్పడం - ఇదేనా నెహ్రూ ఆలోచనా? ఇది ఆయన విశృత సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ చేసి నిర్ణయించిన శాసనమా? లేదా తన తన వ్యక్తిగత కుహానా సెక్యులర్ అభిప్రాయలను దేశంపై రుద్దిన ప్రయత్నమా? ఏది ఏమైనా ఒకసారి దేశ వ్యాప్తంగా సర్వే చేస్తే పోలా? ప్రజల తాజా అభిప్రాయాలు తెలుస్తాయిగా!
కాగా.. విగ్రహాన్నిసేకరించిన భూమికి యజమాని అయిన 70 ఏళ్ల దళిత రైతు కృష్ణ శిల లభించిన పొలం యాజమాని రామదాసు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పొలంలో రాముడి ఆలయం నిర్మిస్తానని ప్రకటించాడు. శిల్పి అరుణ్ తో మాట్లాడి ఆలయం నిర్మాణం విషయంలో ముందుకెళతానని ప్రకటించాడు. రామదాసు కు ఆ ప్రాంతంలో 2.14 ఎకరాల భూమి ఉంది. ఆయన పొలం నుండి సేకరించిన కృష్ణ శిలలో ఒక భాగాన్ని బాలరాముడి విగ్రహ తయారీకి శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎంచుకున్నారు. అయితే అదే శిల నుంచి సేకరించిన మిగిలిన భాగాలను భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల విగ్రహాలను చెక్కడానికి తీసుకెళ్లారు. త్వరలోనే అవికూడా గొప్ప శిల్పాలుగా తయారుకాబడతాయని ఆశిద్దాం.
చివరిగా గొప్పగా శిల్పాలు చెక్కిన అమరశిల్పి జక్కన వంటి శిల్పుల శిల్పాలు, నేటికీ అద్భుతంగా ఉండి, అవి నిజమైన మూర్తులే అనే అనుభూతిని కల్గిస్తాయి. ఎడమచేత బంగారు విల్లు, కుడిచేత బాణం పట్టుకుని.. జీవం ఉట్టిపడే కమలదళాల వంటి కన్నులతో.. ముద్దులు మూటగట్టేలా ఉన్న ఆ చిన్నారి అయోధ్య రాముణ్ని చూడ్డానికి వచ్చిన భక్త బృందాలకు రెండు కళ్లూ సరిపోలేదంటే అతిశయోక్తి కాదు! బాలరాముడి శిల్పం ద్వారా మనకు అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించిన స్థపతి అరుణ్ యోగిరాజ్ ఆధునిక అమరశిల్పి జక్కన అనే చెప్పాలి. కాబట్టి ముందుగా శిలను సమకూర్చిన రైతు రామదాసుకు, ఆ శిలను వెలికితీసిన శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శిల్పి అరుణ్ యోగిరాజ్ ను, తరువాత పూర్తి అయిన బాల రామయ్య శిల్పంకు అయోధ్య రామమందిరంలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించిన అయోధ్య రామ మందిర ట్రస్ట్ ను అభినందిస్తూ, ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చకు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం