క్రోధి-సంహర్షణం
క్రోధి నామాబ్దము శబ్ద మాత్రేణ తీక్షణం
కానీ యధావిధి ఒసఁగు జన సంహర్షణం
నిన్నటి వెతల తెరలను విచ్ఛేదించి
రేపటి ఆశా ఝరులకు అభిమంత్రణ మని
ఉదయ భానుని కిరణ ప్రభలకు ఉద్దీపన గ
పులకిత ప్రకృతి వసంతశోభల వికసిత మవగా
తడఁబడు అడుగులు నిలకడ చేసి
అరుదెంచే క్రోధి నామ విహిత వత్సరం.
నిరుడు అ౦బోనిధి అగాధాలు సంశోధనం
నేఁడు అంబరానికి ఆవలి అంచుల అన్వేషణం
రేపటి కాలం విసిరిన సవాళ్ళకు ప్రత్యుత్తరమై
అనునిత్యం సరి క్రొత్త ఆవిష్కరణలు ఆవిర్భావం
క్రోధి వర్షమును సైతం హర్ష సహితం చేస్తూ
సంశమమై సాగాలి మన ఉగాది సంబరం
కావాలి జనజీవనం ఆనందానికి ఆలవాలం