వాణి కోపరేటివ్ సొసైటీలో చేరటం వలన ప్రణవి చాలా విషయాలు నేర్చుకుంది.
ఎంతో మంది పరిచయమయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన గాధలు. పైకి చెప్పుకోలేక మింగలేక కక్కలేక సతమతమయ్యే వారు కొందరైతే, ఏమి జరగకుండానే యాగి చేసేవారు మరికొందరు. కొందరు స్త్రీల మొగుళ్ళు భార్య కొంగుపుచ్చుకొని తిరుగుతూ... ఆమె ఆడింది ఆట పాడింది పాటగా వత్తాసు పలుకుతూ ఉంటే... మరికొందరి స్త్రీల మొగుళ్ళు ఎంత ఉన్నతమైన చదువులు చదివిన భార్య అయినా! ఎంత సంస్కారవంతురాలు అయినా! ఆ భార్యను అవమాన పరుస్తూ నలుగురిలో చులకన చేస్తూ భార్య అంటే చెప్పు కింద తేలు అని భావించే వాళ్ళు మరికొందరు.
ఏది ఏమైనా ఎక్కువ శాతం మహిళలు ఏదో రకమైన బాధలను అనుభవిస్తూ ఉన్నవాళ్ళే ప్రణవికి తారసపడ్డారు. ప్రతి స్త్రీలోనూ సరైన ప్రోత్సాహం లేక వెలుగు చూడని ఎన్నో రకాల కళలను... ప్రణవి వారిలో చూసింది.
'కళలకు సరైన ఆదరణ, ప్రోత్సాహము ఉంటే అవి రాణిస్తాయి' అనుకుంది.
వారు ఎంతో సంబరంగా ప్రణవికి వారిలో ఉన్న టాలెంట్లను చూపిస్తూ ఉంటే తాను గొప్పగా ఫీల్ అయ్యింది. ఒక మహిళా కోపరేటివ్ సొసైటీ ప్రతినిధిగా వచ్చినందుకో లేక అందరితో కలివిడిగా ఉంటూ అందర్నీ ప్రేమగా పలకరిస్తూ, వారి బాధలను తన బాధలుగా భావించే మనస్తత్వం అవ్వటం వలనో ఏమో! వారందరూ ప్రణవిని చాలా ప్రేమగా, తమ ఈతిబాధలు తీర్చడానికి దేముడు పంపించిన దేవ దూతలా భావించారు. కొత్తదనం లేకుండా పర్సనల్స్ అన్ని ప్రణవితో షేర్ చేసుకున్నారు.
వారు అలా తనను గౌరవిస్తూ... తనతో వారి పర్సనల్స్ షేర్ చేసుకుంటూ ఉంటే... ప్రణవి తనో ఏంజెల్ లా ఫీల్ అయ్యింది. ఆ అనుభూతి తనలో ఉన్న ఆత్మన్యూనతను తొలగించి, తనలో దాగిన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసింది. సహజంగా ఏదైనా నేర్చుకోవాలి, తనకు రాని విద్య అంటూ ఏదీ ఉండకూడదు! అన్నీ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రణవి వాళ్ళ దగ్గర నుంచి ఆ విద్యలను అడిగి తెలుసుకుంది.
చిన్న పురుగు నుంచి మహా పండితుడి వరకూ ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విషయం దాగి ఉంటుంది... వారినుంచి దానిని మనం గ్రహించాలి. విద్య నేర్చుకోవడంలో సిగ్గు మొహమాటం ఉండకూడదు... అని తలపోసేది ప్రణవి.
అందుకే కొత్త పాత లేకుండా వారిలోని ఆ టాలెంట్ చూడగానే నాకూ నేర్పండి అని అడిగింది. వాళ్లు కూడా అడగడమే తడవుగా ఫలాపేక్ష లేకుండా వాళ్ళకి తెలిసిన విద్యలను ప్రణవికి నేర్పించారు. ఆ విద్యల్లో వాళ్ళు రాణింపు పొందటానికి ఏం చేస్తే బాగుంటుంది? అనే విషయంలో ఆమె బ్రెయిన్ కి పదును పెట్టి ఓ మెచ్యుర్డ్ ఉమెన్ లా ఆలోచించి తగిన సూచనలు సలహాలు ఇచ్చింది.
వారిలో దాగినసృజనాత్మక శక్తిని వెలికి తీసింది. ఆ ఊరిలోనే అదే ఐడియాలజీ ఉన్న స్త్రీలతో జత కలిపి, జాయింట్ బిజినెస్ చేయమని సలహా ఇచ్చింది.
ఎక్స్రే ఫిలింస్, కాళీ సెలైన్ బాటిల్స్, పెన్సిల్ స్క్రాప్, స్ట్రాలు, ఐస్ క్రీమ్ స్పూన్స్, పాల కవర్లు, పిస్తా షెల్ ఇలా వేస్ట్ మెటీరియల్ తో... కాదేది కళలకు అనర్హం అన్నట్లుగా ఒకటి ఏమిటి? ఏది దొరికితే దానితో రకరకాల కళాఖండాలను సృష్టించే నేర్పరులైన మహిళలు ఎందరో ప్రణవికి పరిచయమయ్యారు.
ఆర్థిక పరమైన ఎదుగుదల తక్కువే అయినా, ఆమె మానసిక ఎదుగుదలకు వాణీ కోపరేటివ్ సొసైటీ సోపాన మయ్యింది. నిజానికి సొసైటీ వాళ్ళు కట్టించుకొనే 500 రూపాయలూ, కట్టిన సభ్యుల పేరున ఎకౌంటు ఓపెన్ చేసి ఆ ఎమౌంట్ అందులో వేస్తాము అని చెప్పమన్నారు, కానీ రేపొద్దున్న వీళ్ళు బోర్డు తిప్పెస్తే! ఆ సొసైటీ వ్యవస్థాపకులు ఎవరో? ఎక్కడి నుంచి వచ్చారో? వారు చెప్పే విషయాలలో నిజం ఎంతుందో? అబద్దం ఎంతుందో తెలియదు, బయట నుంచి వచ్చి ఒక సంస్థ నిర్వహించే వారి మీద కన్నా లోకల్ గా ఉంటూ అందరినీ కలుపుకుపోయే ఫీల్డ్ వర్కర్స్ నే నమ్ముతారు.
మొహమాటం తో డబ్బులు కట్టిన వాళ్ళంతా వీళ్ళనే అడుగుతారు, అన్న ఆలోచనతో ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు కొందరు ముందు చూపుతో "ఆ 500 మీకు విద్యను నేర్పినందుకు అని అనుకోండి వాళ్లు అన్న ప్రకారం ఎకౌంటు ఓపెన్ చేసి మీ పేర్లన వేస్తే ఇబ్బంది లేదు. ఒకవేళ వెయ్యకపోతే మమ్మల్ని ఏమీ అనొద్దు.” అని చెప్పటం విన్న ప్రణవి, తనుకూడా అందరికీ ఆ రకంగానే చెప్పడం మొదలు పెట్టింది.
యారాడ కొండల్లో మూలికలతో హెయిర్ ఆయిల్, గ్రైఫ్ వాటర్ తయారు చేస్తుంటే... అక్కడికి పోయి ఆ డాక్టర్ చేసేవన్నీ పరిశీలించింది. హెయిర్ ఆయిల్ సొంతంగా బిజినెస్ పెట్టుకుంటాము. మీ సపోర్ట్ కావాలి. మీకు ఒక బాటిల్ మీద ₹10 మార్జిన్ ఇస్తాము. మీరు అమ్మి పెట్టండి. లేదా ఎవరి చేతన్నా అమ్మించండి అని అడిగారు డాక్టర్ గారు. పరిచయస్థులు ఎక్కువ మంది ఉండటంతో సరే అంది ప్రణవి. డైరెక్ట్ గా కష్టమర్కి ఎమ్మార్పీ మీద రెండు రూపాయలు తగ్గించి, డోర్ టు డోర్ వ్యాపారం చేసే వాళ్లకు ప్రొడక్ట్ మీద ఐదు రూపాయలు తగ్గించి ఇవ్వడం మొదలు పెట్టింది.
తను వెళ్ళి తేవడానికి తగిన చార్జీలు, తన లాభంతో కలిపి ఒక బాటిల్ కి ఐదు రూపాయలు చొప్పున తను తీసుకుంది. మోయగలిగినన్ని తయారు చేసే దగ్గరకు వెళ్ళి మోసుకొచ్చేది. ఆ ప్రోడక్ట్ అప్పుడప్పుడే తయారవుతోంది కాబట్టి అది మార్కెట్లోకి మౌత్ పబ్లిసిటీ వల్ల ప్రణవి లాంటి మరికొందరి సభ్యులతో డోర్ టు డోర్ డెలివరీ అయ్యేది. జనాలు ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ కి బాగా అలవాటు పడ్డారు.
ప్రణవి వాటితో పాటుగా సర్ఫ్ తయారు చేయటం, క్లీనింగ్ పౌడర్ తయారు చేయటం నేర్చుకుని ఆ మెటీరియల్ తెచ్చుకుని తన ఓన్ ఫార్ములా ప్రకారం వాటిని తయారు చేసేది. చిన్నచిన్నగా హెయిర్ ఆయిల్ తో పాటు వీటిని అమ్మకానికి పెట్టింది. ఓన్ ప్రోడక్ట్ కావడంతో మార్జిన్ ఎక్కువ ఇచ్చేది. వాటికి మంచి రెపిటేషన్ రావటంతో... ఆ నోట ఈ నోట ప్రణవి పేరు పాకింది.
మీరు ఇలా కొంచెం కొంచెం చేయడం కాదు. ఇలా చేయడం వల్ల లాభం పెద్దగా ఉండదు. బల్క్ గా తెచ్చుకుంటే తక్కువ రేటుకి వస్తాయి. ఎక్కువ మొత్తంలో చేస్తే మేము మార్కెటింగ్ చేసి పెడతాము. అంటూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ప్రణవి వెంట పడ్డారు.
ప్రణవికి పెట్టుబడి ప్రధాన సమస్య. 'అప్పో సొప్పో చేసి ఒకవేళ పెట్టినా లాస్ వస్తే మునిగేది తనే కదా! అసలే తలరాత బాలేదు! ఒకళ్ళిద్దరి మాటలు నమ్మి రిస్కు తీసుకోవడం మంచిది కాదు' అని అనుకున్న ప్రణవి... "ప్రస్తుతం ఆ ఆలోచన నాకు లేదు, అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాను” అని సున్నితంగా తిరస్కరించింది.
వాణి కోపరేటివ్ సొసైటీ వాళ్ళు బోర్డు తిప్పేశారు. తను డబ్బులు కట్టించిన వాళ్ళ మొహం చూడలేకపోయింది ప్రణవి. వాళ్లే ప్రణవికి ‘నువ్వు ముందే చెప్పావు కదా! దానికి సిద్ధపడే కదా, మేము డబ్బులు కట్టాము, ఇందులో నీ తప్పు ఏమీ లేదు.’ అని తేల్చి చెప్పినా ఏదో గిల్టీ ఫీలింగ్ ప్రణవిలో ఉండేది.
కొందరు 1500 రూపాయలు కట్టి వద్దు వద్దు నేను ఇలాంటివి చేయను అని ప్రణవి అంటున్నా వినకుండా, నీకు డబ్బులు వచ్చాకే మా బాకీ తీర్చు అంటూ, మొహమాట పెట్టి ... ర్వాంటంలో చేర్చారు.
తను ఇంకో ఇద్దరిని చేర్పిస్తే... తన డబ్బులు తనకొస్తాయి. కట్టిన 1500 లలో వెయ్యి రూపాయలకి వాళ్ళ ప్రొడక్ట్స్ ఇస్తారు. వారి ప్రొడక్ట్స్ అమ్మిన వాటి మీద కూడా కమిషన్ వస్తుంది. ఆ ఇద్దరూ ఇంకో ఇద్దరు ఇద్దరు చొప్పున చేర్పించుకుంటూ వెళ్తే వాళ్ల మీద కమిషన్ వస్తూ ఉంటుంది... ఇలాంటి దాంట్లో చేరిన ప్రణవి జనాలను చేర్చుకోవడానికి కంపెనీ వాళ్ళు నిర్వహించే పిడి క్లాసెస్ కి ఏటెండ్ అయ్యింది. వాళ్ళు చెప్పే క్లాస్ వింటే కళ్ళముందు అంకెలు నిచ్చెన లెక్కుతూ కనపడేవి.
క్షణం తీరుబడి లేదు దమిడీ ఆదాయం లేదన్న చందాన్న ప్రణవి కి అసలు ఖాళీ ఉండేది కాదు. వీటితో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేది. ఫ్రీగా కోచింగ్ ఇచ్చే సెంటర్లలో ట్రైనింగ్ తీసుకునేది. కొంత టైం ను స్నేహితులతో కంబైన్ స్టడీ చేయడానికి కేటాయించింది.
దైవభక్తి మెండుగా ఉండటంతో ప్రణవి తెల్లవారుఝామునే లేచి తూర్పు రేఖలు ఆరకముందే గుళ్ళూ, గోపురాలు చుట్ట బెట్టుకు వచ్చేది. సత్య సాయి బాబా సేవా దళ్ లో చేరింది. రోజుకు ఒక్కొక్క ప్లేస్ లో భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. తెల్లవారుజామున 4:45 కి ఓంకారంతో స్టార్ట్ చేసి ఒక అరగంట మెడిటేషన్ చేసి తర్వాత భజన నిర్వహించేవారు. భజన పూర్తవ్వగానే టిఫిన్, టీలు వాళ్లే అరేంజ్ చేసేవారు.
కొన్ని కొన్నింటికి పిల్లల్ని తీసుకెళ్లడం కుదిరేది కాదు. అందువల్ల పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళవలసి వచ్చేది. ఎప్పుడు పిల్లల్ని చూసుకోవటం ఇంట్లో వాళ్లకి ఇబ్బంది కలిగించింది. మొదట్లో దాని బాధలు ఈ రకంగా వెళుతూ ఉంటే మర్చిపోతుంది. అని ప్రణవి పుట్టింటి వారు వదిలేసినా...రాను రాను బయటికి పంపించడానికి అబ్జక్ట్ చేయడం మొదలుపెట్టారు.
ఒకరోజున "నీకు, నీ పిల్లలకి గుప్పెడు అన్నం మేం పెట్టలేమా? నిన్ను మేము ఏమన్నా సంపాదించి పెట్టమని అడిగామా? ఎందుకలా బజార్లమ్మట తిరుగుతావు? మా పరువు తీస్తూ నీ పరువు తీసుకుంటున్నావు?" అంది ప్రణవి అమ్మ కోపంగా.
ఆ మాటలకు ఉరుము మీద పడ్డట్టు ఒక్కసారి ఉలిక్కిపడింది ప్రణవి. గిరిజ నోట వెంబడి అలాంటి మాటలు వస్తాయని ఏనాడు ఊహించలేదు ప్రణవి. ప్రణవిని ప్రోత్సహించి ముందుకు పంపించింది ఆవిడే. ఈరోజు ఇలా అనేసరికి ఏం మాట్లాడాలో ప్రణవికి అర్థం కాలేదు.
"మీరు పెట్టరని కాదు, పెట్టలేనని ఏనాడు అనలేదు... నేను నా పిల్లలు మీకు భారం కాకూడదని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని మాత్రమే ఈ పని చేస్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. చేయబోను కూడా. నేను మీ కూతుర్ని." అంది ఏడుపు గొంతుతో.
“ఛా...ఛా... ఏడవక. నువ్వు తప్పు చేసావు అని మేము అనటం లేదు రా! మా బిడ్డ ఎలాంటిదో మాకు తెలుసు కదా! మొగుడు వదిలేసిన ఆడది తలుపు చాటు నుండి సమాధానం చెప్పినా అబాండాలు వేస్తుందీ సమాజం. మొగుడు చాటున పరాయి మగవాడికి కన్నుగిటినా అలాంటి ఆడది మహా పతివ్రతగా చలామణి అయిపోతుంది ఈ రోజుల్లో. జాగా ఎరిగి బయటో అన్నారు పెద్దలు. వయసులో ఉన్న దానివి. సున్నితమైన నీ మనసు నిందలు మోయలేదన్న ఉద్దేశంతో... ముందుచూపుతో వద్దని చెప్పాను." అంది గిరిజ నొచ్చుకుంటూ. .
"లేదమ్మా! ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మొరగడం సహజం. కుక్కలు మొరుగుతున్నాయని ఏనుగు వెనకడుగు వెయ్యదు కదా! రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రేపొద్దున్న తమ్ముళ్ళకు పెళ్ళిళ్ళు అయి మరదళ్ళు వస్తే...వాళ్లకు ఇబ్బంది కదా! వాళ్ళ చేత కూడా నేను, నా పిల్లలు మాటలు పడాల్సి వస్తుంది. చదువుకున్నాను కదమ్మా ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తాను? మా కుటుంబ పోషణకు ఆ డబ్బులు సరిపోకపోయినా! కనీసం నా ఖర్చులు కన్నా వస్తాయి కదా! నాకు కొంచెం మనఃశాంతిగా ఉంటుంది." అంది ప్రణవి.
"సరే నీ ఇష్టం" అంది గిరిజ.
ప్రణవి ఎప్పటిలాగానే తన వర్క్స్ లో బిజీ అయిపోయింది.
ఒక రోజు రాత్రి పది అవుతూ ఉంది. నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతున్న ప్రణవి ఫోన్ మోగింది. సాధారణంగా రాత్రిళ్ళు ఎవరి దగ్గర నుంచి ఫోను రాదు. ఒకవేళ వచ్చినా ఫోను ఎత్తదు ప్రణవి. ఏమైనా మాట్లాడవలసిన విషయాలు ఉంటే పగలు టైములోనే మాట్లాడమని ముందుగానే స్ట్రిక్ట్ గా పరిచయస్తులకి చెప్పి ఉంది. అందువల్ల ఏమన్నా విషయాలు ఉంటే పగల టైం లోనే మాట్లాడుతూ ఉంటారు.
ఇంత రాత్రి టైంలో ఎవరు ఫోన్ చేశారు? అని చూసింది.
ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి. ఫోన్ ఎత్తలేదు.
వరుసగా ఆ నెంబర్ నుంచి మెసేజ్లు రావడం మొదలుపెట్టాయి.
'ఎవరు ఈ టైంలో ఫోన్ చేసి ఇలా మెసేజ్లు పెడుతున్నారు?
ఏదన్నా ఇంపార్టెంటా? అయినా నేను వెలగబెట్టే ఇంతోటి పనులకి అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఏముంటాయి! ఇప్పుడు ఆ మెసేజ్లు ఓపెన్ చేసి చూస్తే... ఇబ్బందుల్లో ఇరుక్కున్నట్టే. నా జాగ్రత్తలో నేను ఉండాలి. ఇలాంటి విషయాల్లో స్ట్రిక్ట్గానే ఉండాలి. అని దృఢ నిశ్చయానికి వచ్చి, ఫోను స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది ప్రణవి.
----సశేషం----
రచయిత్రి పరిచయం ..పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లికరచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.) పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు. బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’. సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు. ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు. |