కలియుగ ప్రత్యక్ష దైవాలు
అణువణువునా మానవత్వం నిండిన
ప్రత్యక్ష దైవాలు మీరు..
సేవాభావం నింపుకుని,
మానవ సేవయే మాధవ సేవగా,
సమాజ సేవ చేస్తున్న వైద్యులు మీరు..
స్టెతస్కోప్ అనే నాగాభరణాన్ని
మెడలో ధరించిన అపర శంకరులు..
ధవళ వస్త్రధారణ చేసి,
శాంతి, సహనాలే భూషణాలుగా కలిగిన
సమాజ దేవుళ్ళు మీరు..
తూటాలు తగిలి గాయాలైననూ
పోరాడే సిపాయిల ప్రాణాలకు
ప్రాణం పోస్తున్న
కలియుగ దైవాలు మీరు..
గోడ గడియారంలో కాలం
పరుగులు పెడుతున్నా,
సమయ పాలన కాదు మీకు ప్రధానం..
రోగులకు వైద్యమే మీకు ముఖ్యం..
పది నెలలు మోసి కన్న తల్లులకు
పునర్జన్మ నిచ్చే పుణ్యమూర్తులు..
కరోనా అయినా, కాన్సర్ అయినా
సేవా ధర్మంలో మీరు కరుణామూర్తులు..
వైద్యో నారాయణో హరి
అన్నది మన భారత సంస్కృతి..
అందుకు నిలువెత్తు నిదర్శనం
మీ అలుపెరుగని సేవాతత్వం
అదే మానవకోటికి అందిన మహాభాగ్యం