Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

పడమటి కనుమల్లో పుట్టిన జీవనది కృష్ణవేణి. ఆ నది తరలి వెళ్ళిన దారిలోని గుట్టలూ, మిట్టలు అన్నీ ఆ నీటి లోనే మునిగిపోయాయి. నది లోని నీరు తగ్గినప్పుడల్లా అవి బయటపడి, నదిలో జలకాలాడుతున్న ఏనుగుల మూపుల్లా నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. నదీతీరంలోని పచ్చదనంతోపాటుగా కొండలూ గుట్టలూగా ఉన్న ఆ ప్రదేశపు నైసర్గిక స్వరూపం రమణీయంగా ఉంటుంది. యాజులుగారికి జబ్బు చేసినప్పుడు వైద్యులు ఆయనను సముద్రతీరానికి ఎడంగా వెళ్లి ఉండమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో ఆయన పెద్దకొడుకు ఉద్యోగరీత్యా ఈ ఊళ్ళో ఉండడంతో ఆయన ఈ ఊరికి రావడం జరిగింది. ఇక్కడకు వచ్చాక ఆయన ఆరోగ్యవంతుడు కావడంతో ఆయన ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకుని, ఇల్లుకట్టుకుని ఇక్కడ స్థిరపడిపోయారు. కొడుకు అమెరికా వెళ్ళిపోయాక కూడా ఆయన ఇక్కడే ఉండిపోయారు.

అంతకు చాలా ఏళ్లకు ముందుగానే తెలంగాణాన్ని నిజాం పాలిస్తున్నరోజులలో ఒక ముస్లిం జాగీర్దార్ కి కూడా ఈ ప్రదేశం నచ్చడంతో ఇక్కడొక భవంతి కట్టించుకుని, వీలు దొరికినప్పుడల్లా సపరివారంగా వచ్చి విడిదిచేసి, గానా బజానాలతో విలాసవంతమైన జీవితం గడిపి వెడుతూoడేవాడుట. కాలక్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. భారతదేశానికి స్వతంత్రo వచ్చింది. భరతఖండం ఇండియా, పాకిస్థాన్లుగా విభజించబడింది. నైజాం పాలన ముగిసింది. జాగీర్దారుకి వృద్ధాప్యం వచ్చింది. జాగీర్దారు పిల్లలు, ముసలివారైన తల్లితండ్రులకు ఒక నౌకరుని తోడిచ్చి, ఈ ఊరిలో తండ్రి స్వయంగా కట్టించుకున్న భవనంలో ఉంచి, తాము పాకిస్తాన్ కి వలస పోయారు.

ఆ ముసలి జాగీర్దార్ కి కొంతకాలం బాగానే గడిచిపోయింది. తరువాత మరీ వృద్దాప్యం రావడంవల్ల, బొత్తిగా కాలూ చెయ్యీ ఆడని పరిస్థితిలో మంచం పట్టారు ఆ జాగీర్దారు భార్యా కూడా. అలా కొన్నాళ్ళు నౌకరు సంరక్షణలో రోజులు ఓమాదిరిగా బాగానే గడిచాయి.

అకస్మాత్తుగా నౌకరు భార్య చనిపోవడంతో జాగీర్దారు దంపతుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. భార్య మరణంతో పక్కా తాగుబోతుగా మారిన సేవకుడు వాళ్ళను పట్టించుకోకపోవడంతో చివరకు ఆ జాగీర్దారు, అతని భార్య, తిండి తిప్పలు చూసేవాళ్ళు లేక ఆకలితో అలమటించిపోయారు. చివరకు నిరాశతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఆపై రెండు మూడు రోజులు గడిచి, పరిసరాలు దుర్వాసనతో నిండిపోయాక గాని నౌకరు వాళ్ళను గురించి పట్టించుకోలేదు. కుళ్లిపోయిన వాళ్ళ శవాలను చూసి అపరాధభావంతో తబ్బిబ్బైన అతనికి కళ్ళు మూసినా తెరిచినా శవాలుగా మారిన జాగీర్దారు దంపతులే కళ్ళకు కట్టడంతో ఆ నౌకరు బేజారై, ఆప్రాoతాన్ని విడిచి దూరంగా పారిపోయాడు.

జాగీర్దారు దంపతులు దుర్మరణం పొందడం వలన దయ్యాలై, అందుకు కారణమైన తనను వెంటాడుతున్నారని ఆ నౌకరు వాపోయేవాడుట. చివరకు అతడు ఆ భయంతోనే మరణించాడు. ఎంతో అందమైన ఆ భవనానికి దయ్యాలకొంప అనే పేరువచ్చింది. చీకటిపడితే చాలు, అటువైపుకి వెళ్ళడానికి భయపడేవారు జనం. చివరకు ఆ ఇంటిని గురించి పట్టించుకునే నాధుడు లేక పోడంతో కాలక్రమంలో అది నెమ్మదిగా పాడుపడడం మొదలెట్టింది. క్రమంగా అందులో గబ్బిలాలు స్థావరాలు ఏర్పరచుకోసాగాయి.

వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడల్లా ఆ భవనాన్ని చూసి, అంత అందమైన భవనం అలా నిష్ప్రయోజనంగా శిథిలమైపోవడం నచ్చక జీవన్ బాధపడేవాడు. ఒక సుప్రభాత సమయంలో జీవన్ కి అద్భుతమైన ఆలోచన ఒకటి వచ్చింది. అతనికి దయ్యాలమీద నమ్మకం లేకపోవడంతో ఆ భవనాన్ని తానే ఎందుకు వాసయోగ్యంగా చెయ్యకూడదు - అనుకున్నాడు. “లేడికి లేచిందే పరుగు” అన్నట్లు, ఆ ఆలోచన రాగానే వెంటనే ఆ పనిలో పడ్డాడు జీవన్.

ఊరిలో నలుగురినీ కనుక్కుని, జాగీర్దారుకి నౌకరుగా పనిచేసిన వాని కుమారుని అడ్రస్ సంపాదించాడు. తక్షణం అతనిని కలుసుకుని తన ఉద్దేశం చెప్పాడు.

అతడు చాలా సంతోషించాడు. ఆ ఇంటిని ఐనకాడికి అమ్మేయ్యాలనుకుంటున్నట్లు చెప్పాడు. ధర నచ్చితే నేనే కొంటానన్నాడు జీవన్. ఆ దయ్యాల కొంప వదిలిపోయిందల్లా మంచి మాటనుకున్న అతడు ఆ ఇంటిని జీవన్ కి అమ్మేయడానికి వెంటనే ఒప్పేసుకున్నాడు. శిథిలావస్థకు చేరుకున్న ఆ భవనాన్ని జీవన్ చాలా తక్కువ ధరకు కొన్నాడు. అప్పటి కప్పుడు రాతకోతలు ముగించి త్వరలోనే రిజిష్టర్ చేయించడానికి మాట పుచ్చుకుని మరీ జీవన్ తల్లి దగ్గరకు తిరిగి వచ్చాడు.

ఆ ఇంటి విషయం తల్లికి చెప్పినప్పుడు, వెంటనే ఆమె అభ్యంతరం చెప్పింది, “నీకేమీ భయభక్తులు లేవా ఏమిటిరా! అది దయ్యాల కొంపని ఊరంతా ఘోష పెడుతూంటే నీకేమీ చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదా ఏమిటి! నిమ్మకి నీరెత్తినట్లు నిశ్చింతగా కబుర్లు చెపుతున్నావు! అంత రొష్టు పడ్డ ఆ ఇల్లు మనకు ఎలా అచ్చొస్తుందనుకోమంటావురా?”

“అమ్మా! ఇలాంటి విషయాల్లో మనిషిని పెడదారి పట్టించేది మనసేనమ్మా! మనసే మన ఆలోచనల్ని ప్రేరేపించి మన కళ్ళకు దయ్యాలను కనిపించేలా కూడా చెయ్యగలదు. ముందుగా మనం మన మనసుకి నచ్చజెప్పుకోగలిగితే చాలు, ఆ తరువాత ఇక ఏ భయాలు ఉండవు. నేను వాళ్లకు బాజానా ఇచ్చి అగ్రిమెంటు రాయించి తెచ్చాను. ఇక తక్కిన డబ్బు సమకూర్చుకుని, అది వాళ్లకు ఇచ్చి, ఇల్లు మనపేర రిజిష్టర్ చేయించుకోడమే మిగిలివుంది. ఇప్పుడు మనం కాదనడం బాగుండదమ్మా…”

అలా అన్నాడన్న మాటేగాని జీవన్ మనసులో ఆరాటం మొదలయ్యింది. “ఈవేళ అమ్మ లాగే రేపు తక్కిన వాళ్ళు కూడా ఆలోచిస్తే తమ బిజినెస్ ఏమికావాలి! అందుకే, ముందుగా నేనే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ సమస్యనుండి బయట పడడం చాలా అవసరం” అనుకున్నాడు.

తల్లితో మాటాడుతున్నాడన్న మాటేగాని, తన దారిన తానుగా అతని మస్తిష్కం వేగంగా పనిచెయ్యడం మొదలుపెట్టింది. “ఆ ఇల్లు అందరికీ సమ్మతం అయ్యేలా ఉండాలంటే తను ఏమి చెయ్యాలి” అని ఆలోచించ సాగాడు జీవన్. అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. గాలిలోని ప్రాణవాయువును గ్రహించి తనకి తానై మండే భాస్వరం గుర్తొచ్చిoది అతనికి.

మీనాక్షి చాలా ఆరాటపడుతోoది. ఎంత తక్కువలో వచ్చినా, కొడుకు ఆ ఇల్లు కొనడo ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు. “అవి మన దయ్యాలు కావు కదురా, వాటి మతం వేరు. నా బాధ నాదేగాని, నువ్వదేమీ నమ్మవు కదా! నువ్వు కాదూ, కూడదు అంటే “సరే” అనక తప్పదు కదా నాకు. తీరా ఆ ఇంట్లో ప్రవేశించాక ఏవేం అవాంతరాలు వస్తాయో - ఏమో...  ఆంజనేయ స్వామివారి కోవెలకు వెళ్ళి, పూజారిని అడిగి, ఆంజనేయ రక్షాకవచం చేయించి తెస్తా, సింహద్వారానికి పైభాగంలో తాపడం చేయిద్దాము. ఆ తరవాత ఇక ఏ దెయ్యాలూ గడపదాటి ఇంట్లోకి రాలేవు, కనీసం అదయినా ఒప్పుకో” అంది మీనాక్షి భయంతో ఒణుకుతూ.

జీవన్కి నవ్వొచ్చింది, కాని బలవంతంగా ఆ నవ్వుని ఆపుకున్నాడు, తల్లి బాధపడుతుందని. నెమ్మదిగా అన్నాడు, “దయ్యాలకు మతాలు ఉండవేమోనమ్మా.”

“ఏమోరా! దయ్యాలతో సహజీవనమంటే నా మనసు ఎంతమాత్రం ఒప్పుకోడం లేదు.”

“కంగారు పడకమ్మా! నేను అన్నీ ఆలోచించే ఉంచాను. అన్నీ నువ్వు కోరుకున్నట్లే చేద్దాం, సరా! నామాట విని సరిగా అర్థం చేసుకో ... గ్రహాలు ఉన్నాయి కదా! అవి ఈ దయ్యాలకంటే ఎక్కువ శక్తివంతమైనవని ఒప్పుకుoటావుకదా. అంత గొప్పవి కూడా గ్రహశాంతి చేయిస్తే మనలను పీడించకుండా ఉంటాయి, ఔను కదా! అలాగే ఈ దయ్యాలకి కూడా ఏదో ఒక పరిష్కారం ఉండకపోదు. నన్ను ఆలోచించుకోనియ్యి, ఇవి మన మతంవి కావు కనుక వాళ్ళ మతపు మంత్రగాడినే తీసుకువచ్చి శాంతి చేయిస్తే సరి, అంతా సద్దుకుపోతుంది. మనకింక ఏభయం ఉండదు. బజార్లో చెప్పుకుంటున్నారు - పక్కూరికి ఒక గొప్ప మహిమగల పకీరు వచ్చాడుట! ఆయన, ఆయన గడ్డంలో ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని దయ్యాలని పట్టి పలార్చాడు - అని అనుకుంటున్నారు జనం. ఆ పకీరును పిలిపించి ముందుగా ఆ దయ్యాలను వెళ్ళగొట్టిస్తా. ఆ తరవాతే మనం ఆ ఇంటికి వెడదాములే” అన్నాడు జీవన్.

“శ్రీ ఆంజనేయ రక్షాకవచం కూడా వీధి గుమ్మానికి తగిలిద్దాము, మంచిదౌతుంది.”

“సరేనమ్మా! మనమిన్ని అంగరక్షలు పెట్టిస్తే ఇక ఆ దయ్యాలు మననేం చెయ్యగలవు, చెప్పు! అవి ఠారుకుని దౌడోదౌడుగా పారిపోవాల్సిందే! అవి మళ్ళీ ఇటువైపైనా చూడవు” అంటూ, ఇక నవ్వు ఆపుకోలేక కంగారుగా అక్కడనుండి వెళ్ళిపోయాడు.

* * *

ఇల్లు తల్లిపేరున రిజిస్టర్ అవ్వగానే ఆ ఇంటిని బాగు చేయించే పని మొదలుపెట్టాలనుకున్నాడు జీవన్. కాని ఆ ఇంట్లో పని అనగానే ఎవరూ అక్కడ పని చెయ్యడానికి ఒప్పుకోలేదు. అందుకే సాధ్యమైనంత త్వరగా పక్క ఊరిలో ఉన్న దర్గాలో ఉండే పకీరుని పిలిచి, అందరూ అనుకుంటున్నట్లు ఆ ఇంటిని ఆవహించివున్న తురకదయ్యాలని పారద్రోలాలని నిశ్చయించాడు జీవన్. వెంటనే దానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యడం మొదలుపెట్టాడు.

కొత్తగా కొన్న ఇంటికి మరమ్మత్తులు జరగాలన్నా, ఆ ప్రదేశంలో జనం నిశ్చింతగా మసలగలగాలి కదా! అందుకని పక్క ఊరిలోని పకీరును పిలిచాడు జీవన్. ఆ పకీరు రావడం చూసి కొందరు అతని వెంటవచ్చారు, ఏం జరుగుతుందో చూడాలన్న కుతూహలంతో. వస్తూనే పకీరు అరబిక్ భాషలో ఏవేవో మంత్రాల లాంటివి చదువుతూ, ప్రతి గదిలో మూలమూలలా దండిగా సాంబ్రాణి పొగ వేసి, తన వెంట తెచ్చిన నెమలి ఈకల కుంచతో గోడలపై కొట్టి, పెద్దపెద్ద కేకలుపెట్టీ ముందుగా పిల్లదయ్యాలను తరిమేశాడు.

ఆ తరవాత ఒక గాజుసీసాని తీసి అల్లాని ప్రార్ధించి, దానిలో సాంబ్రాణి, ఆపై తన వెంట తెచ్చిన భరిణలోని వస్తువుల్లో ఒకటి దానిలోవేసి, దయ్యాలుగా మారిన జాగీర్దారుని, అతని భార్యను గొంతెత్తి పిలుస్తూ, వాటితో ఉరుదూలో మాటాడుతూ, ఆ సీసాలోకి రమ్మని ఆహ్వానించసాగాడు. అక్కడ చూస్తు నిలబడివున్న వాళ్లకు సీసాలో చిన్నకదలిక కనిపించింది. ఆపై నెమ్మదిగా సీసా లోంచి పొగరావడం మొదలయ్యింది. వెంటనే ఆ పకీరు “యా అల్లా! పెద్దదయ్యాలు రెండూ ఈ సీసాలోకి వచ్చేశాయి” అంటూ గొంతెత్తి అల్లాని ప్రార్ధిస్తూ, ఖురాన్ చదువుతూ సీసాకి మూత గట్టిగా బిగించి, కంగారు పడుతూ ఆ సీసా తీసుకుని, వేగంగా కృష్ణా నది వైపుగా పరుగుపెట్టాడు. జనంకూడా అతని వెంట పరుగెత్తారు. నది ఒడ్డున నిలబడి ఆ పకీరు, తన భుజశక్తినంతటినీ ఉపయోగించి దూరంగా, ప్రవాహంలోకి వెళ్లి పడేలా ఆ సీసాని విసిరేసి చేతులు దులుపుకున్నాడు. ఆ సీసా నీటిలో తేలుతూ దూరంగా వెళ్ళిపోయి కనుమరుగయ్యింది.

పకీరు తిరిగివచ్చి, ఇంటిలో అన్నివైపులా మంత్రించిన విభూతి జల్లి, ఇక ఈ ఇంటివైపు ఏ దెయ్యమూ కన్నెత్తి చూడలేదని హామీ ఇచ్చి, అక్కడకు వచ్చిన అందరినీ, నెమలి ఈకల కుంచ ఝళిపించి ఖురాన్ చదువుతూ ఆశీర్వదించి, తనకు రావలసిన డబ్బు తీసుకుని, వెంటనే తన ఊరు వెళ్ళిపోయాడు.

ఆ మరునాటినుండే పనివాళ్ళు యధేచ్చగా వచ్చి ఇల్లు బాగు చెయ్యడం మొదలు పెట్టారు. ఎక్కువమంది పనివాళ్ళను పిలిచి పని తొందరగా పూర్తయ్యేలా ఏర్పాటు చేశాడు జీవన్. చూస్తూండగా ఆ ఇంటికి పూర్వపు అందం వచ్చినట్లయ్యిoది. పనులన్నీ పూర్తయ్యి, ద్వారబంధాలకు, కిటికీలకు రంగులూ, గోడలకు వెల్ల కూడా వేయించాక పురోహితునిచేత పుణ్యః వచనం, ఉదకశాంతి కూడా చేయించిగాని మీనాక్షి తృప్తిపడలేదు. రామసోమయాజులుగారు గృహప్రవేశానికి ఒక మంచి ముహూర్తం పెట్టారు.

మామిడాకుల తోరణాలతో, ఆరీ వెలిగే చిన్నచిన్న కరెంట్ బల్బులతో, బంతిపూల దండలతో ఇంటిని చక్కగా అలంకరించి గృహప్రవేశ ముహూర్తం వేళకు ఇల్లు సిద్ధం అయ్యేలా ఏర్పాటుచేశాడు జీవన్. తల్లిని సంతృప్తిపరచడం కోసం బీజాక్షరాలతో, ఆంజనేయస్వామి బొమ్మతో ఉన్న “శ్రీ ఆంజనేయ రక్షాకవచం” అనబడే రక్షరేకును తెచ్చి, పూజించి సింహద్వారం పై కమ్మీకి స్వయంగా మేకుకొట్టి తగిలించి, తల్లి కోరిక తీర్చాడు జీవన్. ఇంటి ఆవరణకు చుట్టువారా ఉన్న ప్రహారీగోడలో, సింహద్వారానికి ఎదురుగా ఉన్న గేటుకి పక్కన ఉన్న గోడకు, “శ్రీ జననీ ఫుడ్ ప్రోడక్ట్సు” అని అందంగా పెయింట్ చేయబడిన సైన్ బోర్డుని తగిలించారు.

అంగరంగ వైభోగంగా గృహప్రవేశపు తంతు జరపించి, శ్రీ జననీ కుటుంబమంతా రామసోమయాజులుగారు పెట్టిన సుముహూర్తానికి ఆ ఇంటిలో ప్రవేశించారు. మీనాక్షి ఈశాన్యదిశలో దేవుని మందిరం ఉంచి, దైవాన్ని పూజించి, అక్కడే కుంపటి పెట్టి పాలు పొంగించి, ఆపై ఆ పాలతో పరమాన్నం వండి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టింది. ఆ తరవాత ఆ యింటి ఆవరణలో పేదలకు అన్నదానం చేశారు. పిలుపందుకుని వచ్చిన వారిని పండు, తాంబూలం, బహుమానం ఇచ్చి సత్కరించి సాగనంపారు. శ్రీ జననిలో పనిచేసే పనివారికి విందుచేసి; కొత్తబట్టలు, మిఠాయి ఇచ్చారు. వాళ్ళందరూ సంతోషంగా ఇళ్ళకు వెళ్లారు.

ఆ భవనం క్రింది భాగాన్ని “శ్రీ జననీ ఫుడ్సు” వారి వాడకానికి వదలి, మేడ భాగం తమ ఉపయోగానికి ఉంచుకున్నారు ఆ తల్లీ కొడుకులు. పెద్ద ఇంటిలోకి మారాక మళ్ళీ పనివాళ్ళను పెంచి కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా రకరకాల మసాలాలు తయారు చేసీ పనికూడా పెట్టుకుంది మీనాక్షి. వాటి తయారీని పర్యవేక్షిస్తూ మీనాక్షీ, జమా ఖర్చులు లాంటి వ్యాపార లావాదేవీలతో జీవన్ పూర్తిగా బిజీ అయిపోయారు.

అది మీనాక్షి చేసిన ప్రార్ధనల ఫలమో లేక ఆ ఇంటిలో ప్రవేశించిన వేళావిశేషమోగాని చూస్తూండగా వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వచ్చింది. రకరకాల ఎలట్రికల్ అప్లయన్సులు కొనడంతో పని మరింత సులువయ్యింది. చేతినిండా పని, జేబు నిండా డబ్బు! ఇన్నాళ్లకు తమ జీవితం గాడిలో పడిందని సంతోషించింది మీనాక్షి.

* * *

పురోగామియైన మనిషికి సంతృప్తి అన్నది ఉండదు! కొన్ని పర్వతాలు ఎక్కి అతడు “ఇక చా”లని అక్కడ చతికిలబడిపోడు. శిఖరాగ్రాన్ని చేరుకున్నాకే అతడు తిరిగి వెనక్కి చూసేది!

ఆ సాయంకాలం డాబామీద పిట్టగోడ పక్కన, గూళ్ళను చేరే పిట్టల కలరవాలు వింటూ, గలగలా ప్రవహిస్తున్న కృష్ణానదినీ, చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతి అందాలనీ చూస్తూ, నిలబడిన జీవన్ కి ఒక గొప్ప ఆలోచన వచ్చింది, ఆ ఊరిలో కొత్తగా తెరిచిన నైట్ కాలేజీలో చేరి పై చదువు చదువుకోవాలని! గుబురుగా పెరిగి డాబా మీదికంతా వ్యాపించి ఉన్న తంగేడు చెట్టు నీడలో కుర్చీ వేసుకు కూర్చుని, బంగారు రంగులో మెరిసే తంగేడుపూలు పూజగా పుస్తకం మీద రాలుతూ ఉంటే, ఏకాగ్రతతో తన్మయంగా చదువుకోవాలన్న కోరిక పుట్టింది అతనికి. ఆ కోరిక, ఏనాటినుండో అతని మనసులో ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోడంతో నిద్రాణమై ఉండిపోయింది. “పై చదువులు చదవాలి” అన్న అతని ఆశకు జీవం పోసింది ఎంతో మెరుగుపడిన ప్రస్తుత స్థితి. కాని ఇప్పుడు “శ్రీ జననీ”కి తానొక్కడే ఆఫీస్ బేరర్ కావడంతో తీరికలేని పని ఉంటోoది తనకి. పై చదువులు చదవాలంటే ఆఫీసు పని విషయంలో తనకు కొంత వెసులుబాటు ఉండాలి. దానికోసం తను ఏం చెయ్యాలా - అని ఆలోచించసాగాడు జీవన్.

****సశేషం****

Posted in April 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!