Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

మరోవస్తువు ఏముంది అని ఆలోచించిన జీవన్ కి తన గోల్డు మెడల్ గుర్తొచ్చింది. గోల్డు మెడల్ అమ్మడమన్న ఆలోచన అతనికి దుఃఖాన్ని తెప్పించింది. తన చదువు తనకు బ్రతుకుతెరువు చూపకపోయినా తన చదువుని మెచ్చి ఇచ్చిన గోల్డు మెడల్ తనకొక దారి చూపిస్తుoదేమోనన్న ఆశ అతని దుఃఖాన్ని మరిపించింది. క్లిష్టపరిస్థితుల్లో మనిషి బ్రతకాలంటే అన్నీ సరిగా జరగాలని ఆశ పడకూడదు. తెగింపు తప్పదు – అని మనసు సరిపెట్టుకున్నాడు.

గోల్డు మెడల్ కోసం పెట్టిని వెతుకుతుండగా, పెట్లోదాచిన జగన్నాధం తాతయ్య ఉంగరం కూడా కనిపించింది. వెంటనే జీవన్ కి ఒక ఐడియా వచ్చింది...

బంగారం ధర చాలా పెరిగి ఉంది కనుక, ఆ గోల్డు మెడల్ తో పాటుగా ఈ ఉంగరాన్నికూడా అమ్మి, అమ్మగా వచ్చిన ఇంటి ఖర్చులకు పోగా మిగిలినదానితో ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందేమోనని ఆశపడ్డాడు జీవన్.

కొడుకు మాటలు మీనాక్షికి దుఃఖాన్ని తెప్పించాయి. గోల్డ్ మెడల్ తన కొడుకుకి చదువులో ఉన్న ప్రజ్ఞకి మెచ్చి ఇచ్చిన బహుమానం, ఇక ఉంగరం - జగన్నాధం తాతయ్యకు జీవన్ పైనున్న అపారప్రేమకు తీపి గుర్తు! రెండుకి రెండే అమూల్యమైనవి. వాటిని అమ్మక తప్పని పరిస్థితి వచ్చినందుకు ఏడ్చింది ఆమె.

“బాధపదకమ్మా! మనం వీటిని సరదాలు తీర్చుకోడానికి అమ్మటంలేదు. తిండికి ఇబ్బంది రావడం వల్ల, తప్పనిసరై అమ్ముకుంటున్నాము. నువ్వూ నాలా ఆలోచిస్తే నీ బాధ తగ్గుతుంది. ప్రయత్నించి చూడమ్మా! అప్పుడప్పుడూ నువ్వు అనేదానివి కదా - గుర్తుచేసుకో ... “ఒరేయ్ జీవా! అంత కష్టపడి చదివిన నీ చదువు ఎందుకు పనికివచ్చిoదిరా! కూటికా, గుడ్డకా” అని. గుర్తొచ్చిందా? ఇక విను. ఈ గోల్డు మెడల్ ఉంది చూడు - ఇది నా చదువుకి వచ్చిన అవార్డే కదా! అంటే ఇప్పుడు నా చదువే మనకు కూడు పెడుతోందన్నమాట! ఇకపోతే - తాతయ్య ఉంగరం అంటావా - అది తాతయ్య మన ఎడల చూపిన ఆత్మీయతకు గుర్తు. అంటే - తాతయ్య అప్పుడేకాదు, ఇప్పుడు కూడా మనల్ని కనిపెట్టి కాపాడుతున్నాడని అర్థం. ఏ విషయమైనా మనం ఆలోచించే పద్ధతిలోనే ఉంటుందమ్మా దాని అర్ధం, పరమార్ధం కూడా.”

అరనోరు తెరిచి ఆశ్చర్యంగా చూసింది మీనాక్షి కొడుకు వయిపు. ఆమె చెలవులపై చిరునవ్వు చోటుచేసుకుంది. “ఎంత ఎదిగిపోయాడు నా చిట్టితండ్రి” అనుకుంది ఆమె మనసులోనే.

తల్లి ఆమోదం దొరకగానే జీవన్ ఉంగరాన్ని, గోల్డు మెడల్నితీసుకుని బంగారు నగలు అమ్మే షాపుకి బయలుదేరాడు, వాటిని అమ్మి సొమ్ము తీసుకురావడానికని.

 *      *      *

ఆ ఊళ్ళో మంచి పేరున్న నగలకొట్టు చగాన్ లాల్ ది. అతని షాపు నగలు కొనడానికి, బంగారం అమ్మడానికీ వచ్చే జనంతో కిట కిట లాడుతూ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అక్కడకే వెళ్ళాడు జీవన్ ఉంగరాన్ని, గోల్డుమెడల్ని తీసుకుని.

తన ముందు ఉంచబడిన వాటిని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు చగన్ లాల్. గోల్డుమెడల్ ఇంకా మెరుగైనా మాయలేదు. తూకం వేస్తే సరిగా ఐదు గ్రాములుంది. ఉంగరాన్ని చూసి అతడు మొహం చిట్లించాడు. పనివాడిని పిలిచి ఉంగరాన్నిఇచ్చి శుభ్రపరచి తెమ్మని చెప్పాడు.

శుభ్రమై వచ్చిన ఉంగరాన్ని ఆశ్చర్యంగా చూశాడు జీవన్. చాలారోజులనుండి దానిని అంటిపెట్టుకుని ఉన్న జిడ్డు, మడ్డి అంతా వదిలిపోవడంతో మెరిసిపోతోంది ఆ ఉంగరంలోని ఓవల్ షేప్ లో ఉన్న లేత గులాబి రంగు రాయి. దానిని చూడగానే చగన్ లాల్ కళ్ళు మెరిశాయి.

“రెండు లక్షలకు తగ్గదు దీని వెల” అనుకున్న చగన్ లాల్. వెంటనే దానిని తీసుకువచ్చిన జీవన్ వైపు ఎగా, దిగా చూశాడు. పాతగా కనిపించే జీన్సు పేంటు, ఇస్త్రీ లేని షర్టు, మాసిన జుట్టుతో నీరసంగా కనిపిస్తున్న జీవన్ని చూడగానే అతనికి ఇటువంటి అపురూప వస్తువును అమ్మదగిన వ్యక్తిగా కనిపించలేదు. సంశయంతో మరోసారి జీవన్ ని తేరి పారజూశాడు చగన్లాల్ ...

వెంటనే, “కాసేపు ఆగాలి. సరైన ధర కట్టాలంటే కొంచెం సమయం కావాలి” అన్నాడు.

అతడు ఉంగరాన్ని తీసుకుని షాపు లోపలకు వెళ్ళిపోయాడు. అతని రాకకోసం ఎదురుచూస్తూ కౌంటర్ ముందు నిలబడి ఉన్నాడు జీవన్.

చగన్లాల్ తిరిగి రావడానికి కొంత టైం పట్టింది. వచ్చాక కూడా అతడు ఆ ఉంగరాన్ని, అటుతిప్పి, ఇటుతిప్పి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడే తప్ప ఏదీ తేల్చి చెప్పడం లేదు. అది భోజనాల వేళ కావడంతో షాపులో ఎక్కువ జనం లేరు. జీవనుకి కూడా ఆకలిగానే ఉంది. కాని ఏమి అనుకోడానికీ వీలులేని పరిస్థితి! ఇదివరకు ఎప్పుడూ అతడు ఇటువంటి షాపులకు వచ్చివున్నవాడు కాకపోవడంతో, ఇలాంటి చోట్ల ఈ ఆలస్యం మామూలే కాబోలు - అనుకుని ఓపికగా ఎదురుచూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు గడిచాక ఇక ఉండబట్టలేక అన్నాడు, “శేఠ్ జీ! ఎంతసేపు? కొంచెం తొందరగా పని కానివ్వండి సార్! నేనింకా చెయ్యాల్సిన పనులున్నాయి, వెళ్ళాలి“ అన్నాడు జీవన్ మృదువుగా.

“ఆ! వస్తున్నా! దీనికి సరైన ధర కట్టాలంటే ఒకరు రావలసివుంది. వారి రాక కోసం ఎదురు చూస్తున్నా. సరేగాని బాబూ! ఇవి నీకు ఎక్కడ దొరికాయి?” కొంచెం పెడసరంగానే ఉంది చాగన్లాల్ కంఠ స్వరం.

జీవన్ తెల్లబోయాడు, “దొరకడమేమిటి సార్! డిగ్రీలో నేను కష్టపడి చదువుకుని సాధించినది ఈ గోల్డు మెడల్. ఇక ఈ ఉంగరం మంటారా - మా తాతయ్య నాకు ప్రేమతో ఇచ్చిన వరం ఈ ఉంగరం!”

చగన్ లాల్ బుజాలు ఎగరేసి అన్నాడు, “భేష్! బలేగా చెప్పావు! నువ్వు గొప్ప కధకుడిలా ఉన్నావే!”

చగన్లాల్ ఒక ఉద్దేశంతో అంటే, జీవన్ మరోలా అర్థం చేసుకున్నాడు. “నేను కథలు చెప్పనండి, పత్రికలకు కథలు రాస్తా. అయినా ఆ సంగతి నే నెవరికీ చెప్పలేదే! మీ కెల్లా తెలిసింది సార్ ఈ సంగతి” అని అడిగాడు జీవన్.

చగన్లాల్ “హాహాహా” అంటూ పెద్దపెట్టున వికృతంగా నవ్వాడు. అంతలో ఒక జీప్ వచ్చి షాపు ముందు ఆగింది.

జీవన్ కి అకస్మాత్తుగా, “సమ్ ధింగ్ వెంట్ రాంగ్” అనిపించింది. అక్కడ నుండి వెళ్ళిపోదామన్నా వీలుకాని పరిస్థితి. గోల్డు మెడలు, ఉంగరం కూడా చగన్లాల్ చేతిలోనే ఉన్నాయి.

ఈ సారి చగన్ లాల్ గట్టిగానే అన్నాడు, “నువ్వు మంచి నటుడివి కూడా! నిజం చెప్పు, ఈ రెండూ నీకు ఎక్కడ దొరికాయి?”

జీవన్ కంగు తిన్నాడు, అతని ఆత్మాభిమానం దెబ్బతింది. “ఆపండి సార్! మీరు కొనకపోతే మరేం ఫరవాలేదు. కాని, నా మీద ఇలాంటి అభాండాలు మాత్రం వెయ్యకండి” అన్నాడు కోపంగా.

“నిన్ను చూస్తే పూటకు ఠికానా లేనివాడిలా కనిపిస్తున్నావు, అలాంటిది - ఇంత అపురూపమైన వజ్రం నీ దగ్గర చూసిన వాళ్ళు అది నీ స్వంతమని ఎలా అనుకుంటారు? దేనికైనా ఉజ్జీ కుదరాలికదా!”

“వజ్రమా!” ఆశ్చర్య పోయాడు జీవన్.

“ఇది వజ్రమన్న సంగతికూడా నీకు తెలియదు! అలాంటిది ఇది నీదేనని ఎలా చెప్ప గల్గుతున్నావు? ఇక నీ మాటను నన్నెలా నమ్మమంటావు?”

వజ్రాల వ్యాపారి కాకపోయినా చగన్ లాల్ కి వజ్రాల విషయం బాగా తెలుసు. ఈ ఉంగరంలో ఉన్నది చాలా అపురూపమైన వజ్రo. సాధారణంగా వజ్రమంటే గాజులా ఏ రంగూ ఉండదనీ, కాంతి విశ్లేషణం వల్ల మెరుస్తుoదనీ అనుకుంటారు. నిజమైన వజ్రాలు ప్రకృతి జన్యాలు. అప్పుడప్పుడు - ఏ ప్రకృతి వైపరీత్యం వల్లనో, చాలా అరుదుగా, వేరేవేరే రంగులతో కూడా వజ్రాలు పుడుతూ ఉంటాయి. అలాంటి అరుదైన వాటిలో ఇది ఒకటి. బటానీ గింజంత ఉరవతో ఉంది ఈ అపురూపమైన “లైట్ పింక్ జ్యూయల్"!

బూట్ల చప్పుడు విని వెనక్కితిరిగి చూసిన జీవన్ కి ఎదురుగా పరిచయస్తుడైన పోలీసు ఇనస్పెక్టర్ కనిపించేసరికి, "గుడ్మార్ణింగ్ సార్!"అంటూ ఆయనకు అభివాదం చేశాడు.

వెంటనే ఆయన కూడా"వెరీ గుడ్మార్ణింగ్ యంగ్ మాన్!" అంటూ ప్రత్యభివాదంచేసి, జీవన్ తో కరచాలనం కోసం చెయ్యి ముందుకు జాపి, "ఇక్కడున్నావేమిటి, ఇంట్లో ఏదైనా శుభకార్యమా" అని అడిగాడు ప్రేమగా బుజం తట్టి. .

అది చూడగానే, రెండడుగులు ముందుకువేసి, "రండి, రండి" అంటూ వాళ్ళని ఆహ్వానించాలని నోరు తెరిచిన చగన్ లాల్ కి నోట మాట రాలేదు.

జీవన్ చిన్నగా నిట్టూర్చి, "కొనడమెక్కడ సార్! అమ్మడానికి వచ్చా. అవసరం అలా వచ్చిoది" అన్నాడు.

ఇనస్పెక్టర్ చగన్లాల్ వైపుకి తిరిగి, అడిగాడు, "శేఠ్ జీ! మీరు మమ్మల్ని అర్జoటుగా బయలుదేరి రమ్మన్నారు, "తీఫ్" అన్నారు, "తెఫ్ట్" అన్నారు, ఇక్కడ అలాంటిదేమీ కనపడటం లేదే! అసలు ఏం జరిగింది?"

జీవన్ కి ఇనస్పెక్టర్ ఇస్తున్న గౌరవాన్ని చూసిన శేఠ్ చగన్లాల్ తెల్లబోయాడు. వెంటనే మాట మార్చడంకోసం, జీవన్ తో సహా - అందరికీ "మజా" తెమ్మని పనివాడికి పురమాయించాడు. నిజం చెప్పాలంటే, తప్పుడు ఆలోచన చేసినందుకు అతనికి పచ్చి వెలక్కాయ గొంతుకలో అడ్డం పడినట్లు ఉక్కిరి బిక్కిరిగా తయారయింది పరిస్థితి. కానీ ఇనస్పెక్టర్ వదలలేదు. అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. ఇక చెప్పక తప్పలేదు. తడబడుతూ, నత్తురు నత్తురుమంటూ మొత్తానికి చెప్పేశాడు చగన్లాల్…

"అది - అది మరేమీ కాదండి. ఈయన ఒక ఉంగరాన్ని అమ్మడానికి తెచ్చారు. అది ఈయనదౌనో కాదోనని అనుమానం వచ్చిoది. లా అండ్ ఆర్డర్ మా చేతుల్లోకి తీసుకోకూడదు కనుక, అదేదో మీరువచ్చి తేలిస్తే తరవాత బేరం ఫైసల్ చెయ్యాలని మిమ్మల్ని పిలిచాను. ఉంగరంలోని వజ్రం చాలా విలువైనది, అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు" అన్నాడు తెలివిగా, తనవల్ల తప్పేమీ లేదన్నట్లుగా.

"ఏదీ ఆ ఉంగరం నాకు చూపించండి?" అడిగాడు ఇనస్పెక్టర్.

చగన్లాల్ ఉంగరం ఇనస్పెక్టర్కి ఇచ్చాడు. దాన్ని ఆయన అటూ ఇటూ తిప్పిచూసి, "ఔను, అదే ఉంగరం. ఎటొచ్చి ఇదివరకులా మురికిగా లేదు. ఈ ఉంగరం ఈయనదే! తనను ప్రాణాలకు తెగించి యాక్సిడెంట్ నుండి కాపాడినందుకు ఇతనికి ఒక పెద్దాయన బహుమానంగా ఇచ్చారు. దానికి సాక్షిని నేనే! ఈయన నాకు బాగా తెలుసు. ఈయనని గురించి ఏ అనుమానాలూ పెట్టుకోవద్దు. ఇంతకీ దీని వెల ఎంత ఉంటుందంటారు?

"లక్షన్నర ఉండొచ్చు. దీనిని నేనే కొనుక్కోవాలనుకుంటున్నాను."

'శేఠ్ జీ! మీకు నేనొక మాట చెప్పాలనుకుంటున్నా. ఎదుటి వ్యక్తిని గురించి మనకు రూఢిగా ఏమీ తెలియనప్పుడు తొందరపడి మాటలు మిగలకూడదు. వయసులో చిన్నగాని, ఈయన అరవై లక్షల విలువ చేసే ఆస్తిని ఆత్మగౌరవం నిలుపుకోడానికని గుడ్డిగవ్వలా వదిలేసిన వ్యక్తి! అటువంటి వ్యక్తి, రెండు లక్షలైనా చెయ్యని ఈ ఉంగరాన్ని దొంగిలిస్తాడనుకోడం పెద్ద తప్పు, తెలుసా!"

చగన్లాల్ పశ్చాత్తాపంతో వణికిపోయాడు. జీవన్ రెండు చేతులూ తన రెండు చేతుల్లోకి తీసుకుని, "చిన్నవాడివని నేను నీ కాళ్ళు పట్టుకోడం లేదు, ఇవి చేతులుకావు, కాళ్ళనుకో! నిన్ననుమానించి నేను చాలా పెద్ద తప్పుచేశా, నన్ను మన్నించు" అంటూ ప్రాధేయపడ్డాడు.

చేతుల్ని విడిపించుకుని అన్నాడు జీవన్, "మీరేమీ బాధపడకండి శేఠ్ జీ! ఎంతటి వారికైనా పొరపాట్లు సహజం. అయినా ఇప్పుడు నాకేమీ కాలేదు కదా! ఇక్కడితో అంతా మరిచిపోదాం."

ఇనస్పెక్టర్ ఉంగరాన్ని అటూ ఇటూ తిప్పిచూసి, "శేఠ్ జీ! దీని అందం చూస్తూoటే, దీని వెల మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటుందనిపిస్తోంది" అన్నాడు. చగన్లాల్ ఏమీ మాటాడలేదు.

"సరే! దీన్ని తీసుకెళ్లి "తనిష్క"లో కూడా చూపించి వెల కట్టిద్దాం. ఆ తరవాత మీరు కావాలంటే అది ఈయన మీకే ఇవ్వవచ్చు" అన్నాడు ఇనస్పెక్టర్.

"సార్! మీరు అక్కడ ధర కట్టించి స్లిప్ తీసుకురండి, దీన్ని నేనే కొనుక్కుoటా" అన్నాడు చగన్లాల్.

"జీవన్ బాబూ! నడు వెడదాం. నే నటే వెడుతున్నా, అక్కడి వ్యవహారం కూడా ఫైసల్ చేయించే వెడతా, పద" అంటూ జీప్ దగ్గరకు నడిచాడు ఇనస్పెక్టర్.

తనిష్కలో, ఆ ఉంగరంలోని రాయి చాలా అపురూపమైనదని చెప్పి ఆ చిన్న వజ్రానికి రెండు లక్షలు వెలకట్టారు అక్కడి వజ్రశోధకులు. ముచ్చటపడి ఆ ధరకే దాన్ని కొనుక్కున్నాడు భాగ్యవంతుడైన నగల వ్యాపారి చగన్లాల్. జీవన్ కి అక్కడితో ఇక గోల్డు మెడల్నిఅమ్మాల్సిన అవసరం కనిపించలేదు. లక్షరూపాయిలు అంటేనే జీవన్ దృష్టిలో చాలా పెద్ద మొత్తం. ఇప్పుడు తన చేతిలో ఉన్నది రెండు లక్షలు! ఆ డబ్బు తన అవసరాలకు సరిపోడమేకాదు, ఇంకా చాలా మిగులుతుంది.

ఆ ఉంగరానికి అంత వెల పలుకుతుందని అతడు ఊహామాత్రంగానైనా అనుకున్న పాపాన పోలేదు. "తాతయ్య తనను ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా కూడా కాపాడుతున్నాడు" అనుకునేసరికి తాతయ్య జ్ఞాపకాలతో అతని హృదయం బరువెక్కింది. కళ్ళు చెమర్చాయి. అంత డబ్బు చేతికి వచ్చినా కూడా అతనికి సంతోషంగా లేదు. ఉంగరాన్ని వదులుకోవలసి వచ్చినందుకు అతనికి మనసంతా దిగులుతో నిండిపోయింది.  ప్రస్తుత పరిస్థితిలో అంతకన్నా గత్యంతరం మరేముంది కనక - అని మనసును సముదాయించుకునే ప్రయత్నంలో పడ్డాడు జీవన్.

*       *       *

కిరణ్ తండ్రిచేత ముహూర్తం పెట్టిoచింది మీనాక్షి. సరిగా ఆ ముహూర్తసమయంలో, “శ్రీ జననీ ఫుడ్ ప్రోడక్ట్సు” కి ప్రారంభోత్సవం టూకీగా, నిరాడంబరంగా జరిగిపోయింది. ఎప్పుడో తెచ్చి ఇంటిలో ఉంచుకున్న జగన్నాధం గారి ఫోటోని ఎన్లార్జి చేయించి తెచ్చాడు జీవన్. పూజా వేదికమీద దేవుళ్ళ విగ్రహాలతోపాటుగా ఆ ఫోటో కూడా ఉంచి, దానికి పూల దండ వేసి, ఆ ఫోటోకి కూడా పూజచేసి, తాతయ్య ఎడల తలమునకలుగా ఉన్న తమ కృతజ్ఞతను చూపించుకున్నారు ఆ తల్లీ కొడుకులు.

తొలుత విఘ్నేశ్వర పూజ చేయించి, ఆ పైన దేవుళ్లకు, ఆ తరవాత అందమైన అక్షరాలతో, జీవన్ అట్టపైన రాసిన “శ్రీ జననీ ఫుడ్ ప్రోడక్ట్సు" అన్న బోర్డుకి కూడా లక్ష్మీ సహస్రనామాలతో పూజ చేయించి, పూజకు ఉద్వాసన చెప్పాడు కిరణ్ తండ్రియైన రామ సోమయాజులు. ఆ తరవాత తొలి విడతగా, తరిగిపెట్టుకున్న నిమ్మకాయముక్కల్ని ఉప్పు పసుపు కలిపి జాడీ లోపోసి మూతపెట్టింది మీనాక్షి. పూజచేయించిన రామసోమయాజులుగారికి కొత్తబట్టలు, పళ్ళు, దక్షిణతాంబూలాలతో సమర్పించి, తల్లీ కొడుకులు ఆయనకు నమస్కరించి వేదవిహితమైన ఆశీస్సులు అందుకున్నారు. ఆహూతులకు, అనాహూతులకు సమంగా, అక్కడకు వచ్చినవారందరికీ పండూ తాంబూలాలతోపాటుగా తీపిని కూడా పంచి వేడుక చేసుకున్నారు.

ఆవిధంగా మొదలయ్యింది మీనాక్షి ఆధ్వర్యంలో ఆ వ్యాపారం. తల్లికి బాగా అలవాటైన పనిలో, తల్లినే యజమానిగా నిర్ణయించి, తల్లి పేరుతోనే ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు జీవన్, తాను పక్కనుండి నడిపిస్తూ. అంతేకాదు, తామీ వ్యాపారం మొదలెట్టిన విషయం నలుగురికీ తెలియడం కోసం తెల్లకాగితంపై తన గుండ్రని చేతిరాతతో ఇండియన్ ఇంకు, బ్రష్షు వాడి “శుచికి, రుచికి, ఆరోగ్యానికి శ్రీ జననీ ఫుడ్ ప్రోడక్ట్సునే వాడండి, మమ్మల్ని ప్రోత్సహించండి” అని స్ఫుటమైన అక్షరాలతో రాసి, ఊరిలో నలుగురూ తిరిగే ముఖ్యమైన ప్రదేశాలలో ఆ కాగితాలు అతికించాడు. నోటిమాటగా కూడా ప్రచారం సాగింది. ఇదివరకే హెల్పులైన్ ద్వారా పరిచయమైన వాళ్లకు చిన్నచిన్న కరివేపాకుపొడి, ఇడ్లీకారం వగైరా పొట్లాలు పంచిపెట్టి, తన తల్లి వ్యాపారానికి సహకరించవలసినదిగా కోరాడు జీవన్. చూస్తూండగా అమ్మకాలు మొదలయ్యాయి. ఏయే ఋతువుల్లో ఏయే వస్తువులు విరివిగా దొరుకుతాయో, ఆయా వస్తువులతో ఆయా ఋతువుల్లో ఊరగాయలు తయారుచేసి, సంవత్సరం పొడుగునా అమ్మడం లాభసాటిగా ఉంటుంది - అనుకుంది మీనాక్షి. రకరకాల పదార్ధాలను తయారు చేసి, అడిగిన వారికి లేదనకుండా అందజేయడం మొదలుపెట్టింది. క్రమంగా రకరకాల ఊరగాయలు, కందిపొడి, సాంబారుపొడి, ఇడ్లీ కారంపొడి, కరివేపాకు పొడి లాంటివీ, వెరైటీగా అప్పడాలు, వడియాలు,  చల్లమిరపకాయలు – ఇలా భోజనాన్ని రుచికరంగా చేసే విధవిధాలైన పదార్ధాలు, అద్భుతమైన రుచి ఉండేలా శుచిగా తయారుచేసి; డబ్బాల్లో, సీసాల్లో దాచి జీవన్ నిర్ణయించిన సరసమైన ధరలకు అమ్మడం మొదలుపెట్టింది.

రోజురోజుకీ వచ్చి కొనుక్కు వెళ్ళేవాళ్ళ సంఖ్య పెరగసాగింది. ఇన్నాళ్ళూ ఒక్క యాజులుగారి కుటుంబం మాత్రమే ఇష్టంగా మీనాక్షి చేతి వంటను తిన్నారు. ఇప్పుడు ఊళ్ళోని వాళ్లకు కూడా క్రమక్రమంగా తెలుస్తోంది ఆమె హస్తవాసి ఏమిటో! అనతికాలంలోనే మీనాక్షి తయారుచేసిన వాటికి మంచిపేరు రావడంతో చూస్తూండగా ఆమె వ్యాపారం దినదిన ప్రవర్ధమానమై ఊపందుకుంది.

ప్రతిపదార్ధానికి, దాన్ని తయారు చెయ్యడానికి అయ్యిన ఖర్చు, పడ్డ శ్రమకు తగిన ప్రతిఫలం సమన్వయపరచి, ఆపై తగినంత లాభాన్ని జతచేసి దానికి ధర నిర్ణయించేవాడు జీవన్. పది రూపాయలకు ఎంత వస్తుందో లెక్క కట్టి దానిపై పేకెట్టుకి రెండు రూపాయిలు లాభం వేసుకుని, చిన్నచిన్న ప్లాస్టిక్ కవర్లలో పాక్ చేసి అమ్మడం మొదలు పెట్టారు. అవి అందరికీ అందుబాటులో ఉండడం వల్ల ఆ పేకెట్లు విపరీతంగా అమ్ముడయ్యేవి. దాంతో చూస్తూండగా ఖర్చులుపోను డబ్బు మిగలసాగింది. రోజురోజుకి కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతూoడంవల్ల ఎక్కువ సరుకు తయారు చెయ్యవలసిన అవసరం వచ్చింది. ఆ రద్దీని ఎదుర్కోవడం మీనాక్షి ఒక్కతెవల్ల అవ్వదని అర్ధమయ్యింది వాళ్లకి. దాంతో పనివాళ్ళను పెట్టుకోవలసివచ్చిoది.

దినదినాభివృద్ధిగా సాగుతోంది వాళ్ళ వ్యాపారం. పక్క ఊళ్లనుండి షాపులవాళ్ళు, కమీషన్ మీద మీ సరుకు అమ్మిపెడతామంటూ రాసాగారు. సరుకు ఇబ్బడి ముబ్బడిగా తయారు చెయ్యవలసిన అవసరం రావడంతో పనివాళ్ళ సంఖ్యను పెంచక తప్పలేదు. వెంటనే మరో ఇద్దరు పనివాళ్ళను తల్లి ఆధ్వర్యంలో పనిచేసేలా ఏర్పాటుచేశాడు జీవన్. సరుకు తయారీ పెరిగింది. అది మొదలు అడిగినవాళ్ళకు లేదనకుండా ఇవ్వగలిగారు వాళ్ళు. సరుకు తయారీ పెరిగినప్పటికీ పనివాళ్ళను పెట్టుకోడంవల్ల మీనాక్షికి పని ఒత్తిడి తగ్గిందేగాని పెరగలేదు. పనివాళ్ళకు ఏయే వస్తువు ఎలా చెయ్యాలో చెప్పి చేయిస్తూ, వాళ్ళు సరిగా చేస్తున్నారా - లేదా అని పర్యవేక్షణ చేస్తూ, అన్నిటా తానై అజమాయిషీ చేస్తూ వాళ్ళ మధ్య తిరుగుతూ పని చేయిస్తోంది ఆమె. శుచికి, రుచికి ఏ లోపం రాని విధంగా సరుకు తయారు చేయబడుతోంది ఆమె ఆధ్వర్యంలో.

ఇంట్లో మసిలే జనం ఎక్కువ కాగానే ఇల్లు చాలని పరిస్థితి వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న ఆ ఇంటిని విడిచి వేరే పెద్ద ఇల్లు చూసుకుని వెళ్ళడం తప్పని సరి అయ్యింది. తమ అవసరాలకు తగిన ప్రదేశంకోసం వెతకసాగాడు జీవన్.

*              *             *

వేరే ఇంటికి మారాక వ్యాపారం బాగా అభివృద్దిలోకి వచ్చింది. ప్రొడక్షన్ పెరిగింది. క్రమంగా “శ్రీ జనని” అన్న పేరు ఇంటింటా వినిపించసాగింది. ఉద్యోగాలు చేసుకునే ఆడువారికీ, వండుకు తినే శక్తి తగ్గిన ముసలివారికీ, ఒళ్ళు కదలడానికి ఇష్టపడని బద్ధకస్తులకు సరసమైన ధరలకు దొరకే “శ్రీ జననీ ఫుడ్సు” వరమయ్యాయి.

తమ కృషి ఫలించినందుకు సంతోషించారు ఆ తల్లీకొడుకులు. తాతయ్య ఎదుట లేకపోయినా ఆయన తమను మరిచిపోలేదని తలుచుకుని కృతజ్ఞతతో ఆయనకు వినమ్రులయ్యారు వాళ్ళు. వాళ్ళకిప్పుడు ఏ లోటూ లేదు. ఏ ఇబ్బందీ లేకుండా వాళ్ళింత  తినగలగడమే కాకుండా నలుగురికి పని ఇచ్చి, వాళ్లకు భుక్తి కల్పిoచగలగడమన్నది కూడా వాళ్లకి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఒక్క సంవత్సర కాలం గడిచేసరికి ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి వాళ్ళ జీవితాల్లో!

వ్యాపారం లాభదాయకంగా ఉండి డబ్బు మిగులుతూoడడంతో, పని తేలికగా జరగడం కోసం కొన్నికొన్ని విద్యుత్పరికరాలు కొని వాడసాగారు. వ్యాపారం మరింత శీఘ్రంగా వృద్ధిపొందడం మొదలుపెట్టింది.

మీనాక్షి మనసులో పెళ్ళి బాజాల సందడి మొదలయ్యింది. పెళ్ళీడుకి వచ్చిన కొడుక్కి పెళ్ళిచెయ్యడం తన బాధ్యతగా భావించింది ఆమె. కొడుక్కి పెళ్ళిచేసి, కోడలికి సంసార బాధ్యతలు అప్పగించి, తాను ఈ సంసార జంజాటానికి దూరంగా, నిర్లిప్తంగా బ్రతకవచ్చునని ఆశపడింది.

“వీడికోసం ఒక అమ్మాయిని ఈసరికి దేవుడు ఎక్కడో పుట్టించే ఉంటాడు. కాని ఇద్దరికీ మధ్యనున్న తెర తొలగి, వాళ్ళిద్దరూ ఒకటయ్యేది ఎప్పుడో! అయినా నా ప్రయత్నం నేను చెయ్యాలిగా, ఆపై దైవ నిర్ణయం! దేనికైనా ఆ సమయం రావాలి” అనుకుంది. ఆ విషయం జీవన్ తో ప్రస్తావించింది.

కాని జీవన్ ఒప్పుకోలేదు. దానికింకా సమయం రాలేదు, వచ్చినప్పుడు నేనే నీకు చెపుతాలే“ అని మాట దాటవేశాడు.

****సశేషం****

Posted in March 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!