Menu Close
Galpika-pagetitle

వాసిలి లాక్డౌన్ లుక్ - సిరి వాణి - వాసిలి వసంతకుమార్

ప్రాక్పశ్చిమ సంధ్యా సమయ ధ్యానం ముగించుకుని మునివాకిట ఆశీనులైన విశ్వర్షి వాసిలి వారి మౌనాన్ని డిస్టర్బ్ చేస్తూ పక్కనే వున్న చరవాణి శబ్దించింది.

“మునివాకిటికి చేరావ్ ... ఇంకా ఆ బీర్ కాయల వెంట పడటం మానలేదా” అంటూ ఓ సుస్వరం పలకరించింది ... నిజానికి ఈ మునివాకిలి ఎర్రాప్రెగడ వారిది కదా ... మరి చరవాణిలోని ఈ చోరవాణి మహిళామణి ఎవరబ్బా అనుకుంటూ అర్థనిమీలిత నేత్రులై చూడగా మంగళగౌరి కళ్లముందుకొచ్చింది ఏదో ముంచుకొస్తోం దన్నట్టుగా ...

“బీర పొట్టు పచ్చడి మీ అమ్మగారికేనా, మా అమ్మగారికీ బాగా వచ్చు ... పైపెచ్చు బీరపెచ్చు తీయటం మనవరాలికి మాత్రమే నేర్పిన అమ్మల కన్న అమ్మ. అలా అత్తగార్ని కాక అమ్మను చూసుకున్న మరో అమ్మ మా ఆవిడ.” అంటూ భీమవరం బుల్లోడి మెసేజ్ ... అయినా రిటైరయ్యాక కూడా రిటైరయ్యానని రీటైల్ గా కాలరెగరేసుకుని చెప్పగలిగే సరస హృదయుడు ఈ బుల్లోడు రాములోరికి అటూఇటూగా రామచంద్రు లంతటి వోరే.

అంతలోనే మరో మెసేజ్ “బీరకాయని తరగటానికే మీకు నాలుగు రోజుల సరసమా ... నేను బీరకాయతో యాభై రకాల రసాలను చేసేసి మిమ్మల్నందర్నీ నీరస పరిచేసి లెప్ట్ హాండ్తో కవితలు రాసేస్తు లెఫ్టిస్ట్, రైట్ హాండ్తో కథలు రాస్తు రైటిస్ట్ అయిపోతా ... కాస్కోండి” అంటూ సిరికోన కథలరాణి విజయమ్మ బెదిరింపు.

ఈ బెదిరింపులు, స్పందనలతో చిర్రెత్తుకొచ్చిన విశ్వర్షివారు కలమోద్రిక్తులై - విశ్వావలోకనం చేస్తూ - సిరికోనీయులందరికీ వొక సంకల్ప సంకేతం పంపటంతో -

లక్ష్మీనారాయణ, సదాశివ, వెంకటేశ్వర, రామచంద్ర, రామకృష్ణ, అన్నపూర్ణ, గౌరి, సుభద్ర, సుశీల, విజయాది కలం యోధ శ్రీ/శ్రీమతులు చివరికి సిరికిన్ చెప్పక హుటాహుటిన అంతర్జాలా అంతర్యానులై చరవాణీ మార్గం పట్టి వాసిలి వారితో సమావేశం కాగా వోరకంట అందర్నీ పరికిస్తూ -

“ఏం గౌరమ్మా! చదువులమ్మ వయి యీ యీడులో ఆ యీడు చదువుల కబుర్లు ఏల తేవలె ... తెచ్చితివి పో బీర్ కాయల కబుర్లు ఏల ఏకరువు పెట్టవలె ... పెట్టితివి పో మళ్లీ యూనివర్సిటీ అంటూ మెరీనా వెంట ఏల తిప్పవలె ... బీరతో వంటింటి సరసాలలో మునిగిన నన్ను ఆ బీచ్ రోడ్ ల ఏల తిప్పవలె ... మధ్యలో ‘నాను’ నేను అంటూ మాటిమాటికీ వోరగా చూస్తూ ‘నేను’ అంటూ చీరకుచ్చెళ్లను సవరించుకునే అమ్మాయిల నుండి తప్పుకుని కనని కన్నడ ‘నాను’ చీరెల చెంతకు ఏల చేరవలె ... చేరితిని పో యిప్పుడేల చింతించవలె” అంటూ కన్నెర్ర చేస్తుంటే కంట్లో నలుసుపడి కిక్కెక్కించింది. అలా వొంటికన్నుతోనే అర్ధచూపుతో -

“వో భీములోడా! భానూని బానుతో సరిపుచ్చక, కవితల కెక్కించి, ఆ అరువు అక్షరాలతో నా బీరకాయల్నే అధిక్షేపిస్తావా ... ఆక్షేపించావే అనుకో మధ్యలో ఆ చాక్ ల చెక్ లేమిటి మహాప్రభో ... పోనీ ఏమిటా అని చెక్ చేద్దును కదా గొర్రెబెత్తెడు కవితలకు సవరమంత అభినందనలా ... అభినందించిరి పో నే నేల తిలకించవలె ... తిలకించితిని పో ఆ దినము ఏల ఎర్త్ కి బర్త్ డే కావలె”

“అన్నట్టు విజయమ్మా! ఏమా సహృదయత ... బీరతో యాభై రకాల రసాలతో మమ్ములను నీరస పరచుటయా ... పరచవలెనని తలచితివి పో రసాలు దొరకని యీ కరోనా కాలాన యీ నవ నవ బీర రసాల వూరింపు లేమిటమ్మా ... వూరించితివి పో మేమేల బీర్ వంట నేర్పెదమని వుత్తర ప్రగల్భాలు పలకవలె ... పలికితిమి పో సిరికోనీయ నిర్మలాదులు యిద్దరికిన్ సాక్షీ సంతకాలు ఏల చేయవలె ... చేసితిరి పో అసలు సంతకం లేదన్న స్పృహ ఏల కోల్పోవలె ... హతవిధీ” అని అటూ ఇటూ చరవాణి పిక్కటిల్లేలా గోల చేస్తుండగా ... వున్నట్టుండి సెల్ మోగగా ... స్పీకర్ ఆన్ చేయగా ... రికార్డెడ్ మెసేజ్ “నేను కరోనాను .... యమలోకానికి కరవాణిని ... చీదినా చీదకున్నా ... దగ్గినా దగ్గకున్నా ... తాకినా తాకకున్నా ... కరచాలనం చేసినా చేయకున్నా ... నేను కరోనాను ... నీ వాకిలిలోనే వుంటాను ... గేటు తీస్తే గొళ్లెమైపోతాను ... నిన్ను లాక్డౌన్లోనే వుంచేస్తాను.”

(ఇది సిరి వాణి మాత్రమే...అసలు సిరి మింగిన బీర దర్శనం రేపటికి వాయిదా వేయటమైనది)

"జూం" -- రాజేశ్వరి దివాకర్ల

అమ్మమ్మా, ఇది చూసావా, తెలుగు సామెతల రూపంలో ప్రస్తుత పరిస్థితిని గురించి చక్కగా చెప్పారు, అన్నాడు ప్రహర్ష్. వాడిచేతిలో చరవాణి ఉంది. ఉద్యోగం పనిలో, మునిగి ఉన్నా, అప్పుడప్పుడు గదిలోంచి బయటకు వచ్చి, అమ్మమ్మను పలకరించి వెళ్తుంటాడు. వాడూ కొంచం రిలాక్స్ అవుతాడు. అవును దానిని తను కూడా చూసింది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో సృజనాత్మకత వర్తమానానికి అనుగుణంగా అనేక విధాలుగా పెరుగుతోంది. ఈ మధ్యనే చౌరాస్తా బేండ్ పాట "చేయి చేయి కలుపకురా" తనకు ఎంతో నచ్చింది.

ఇంకో గ్రూప్ లో చూసింది, భారతదేశం లో ప్రప్రథమంగా అయిదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు బృందావనంలో లాక్ డౌన్ ప్రకటించాడని, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టిన విశేషాన్ని, ఈనాటికి సమన్వయిస్తూ, ప్రసిద్ధులు వివరించారు. అది కూడా బాగుందనిపించింది. అలాగే తనకు ఇతరులు, పంపిస్తున్న సందేశాలవల్ల, ప్రస్తుత సంకట పరిస్థితులలో దేశ విదేశాలలోని, ప్రధాన సంఘటనలు, పేదల అవస్థలు, అనేకం తెలుస్తున్నాయి ....అమ్మమ్మా, ఏమిటి ఆలోచిస్తున్నావు, అంటూ ప్రశ్నించాడు ప్రహర్ష్ ..

ఏమీ లేదురా ఈ ముందుకు సాగే సందేశాల వల్ల, ఈ నిర్భంధ కాలంలో కూడా సమూహాలతో కలసి హాస్యాన్ని, అంతరంగాలను, ఆవేదనలనూ పంచుకుంటున్నానిపిస్తోంది..

అమ్మమ్మా, ఈ రోజు మీ స్నేహితురాలు, అంబిక షష్ఠి పూర్తి పండుగ అని, వాళ్ళ అబ్బాయి రాజ్ సందేశం పెట్టాడు కదా! ఈ పరిస్థితులలో విందు ఏర్పాటు చేయటం లేదు కనుక "జూం" పార్టీ ఏర్పాటు చేస్తానన్నాడు కదా. ఇక్కడి సమయం ప్రకారం అది 12 -30 గంటలకు,-రాత్రి నువ్వెలాగూ మేలుకునే ఉంటావుగా, నన్ను పిలు, నేను లింక్ కలుపుతాను అన్నాడు.

అవునుకదూ, సమయం కావస్తోంది. వీడియో లో కనబడాలి కదా, తలదువ్వుకుని వస్తాను అంటూ లేచింది. ఈ నాటి వైజ్ఞానిక అనుబంధాల వల్ల ఆటంకాల నన్నింటినీ మరచి మిత్రులతో కలసి ఆనందాన్ని పంచుకోగలిగిన సమయం కలిసి వచ్చింది అనుకుంటూ లోపలికి నడిచింది.

Posted in August 2022, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!