‘ధీరజ’ అమాయకురాలు! తల్లితండ్రుల నీడలో పాతకాలపు పెంపకం లో ఒద్దికగా పెరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉండగా తన ఫ్రెండ్ తో నెట్ సెంటర్ కి వెళ్లింది. ఆ అమ్మాయి ఫేస్ బుక్ లో ఒక అబ్బాయి తో చాట్ చేస్తూ...ఉన్నవీ, లేనివీ అవాకులూ, చెవాకులూ టైప్ చేస్తూ కిసుక్కు కిసుక్కునా నవ్వడం లోని హాయి చూసింది. ఆ పిల్ల ధీరజ ని కూడా ఫేస్ బుక్ లో జాయిన్ చేసి పారేసింది.
పుంఖాను పుంఖలుగా వస్తున్న ఫ్రెండ్ రిక్వెస్ట్ లు, స్పెషల్ ఫోటోలు. ప్రత్యేక స్టూడియోల్లో మేకప్ తో అదిరిపోయి... ఒరిజినాలిటీ కి ఆమడదూరం లో హీరో, హీరోయిన్లని తలదన్నేలా ఉన్న ఫొటోల్లో సుభాష్ ఫోటో దగ్గర ఆగిపోయింది. చాట్ ముదిరి పాకాన పడకముందే సుభాష్ తో తన ప్రేమని తేల్చుకోకముందే తండ్రి హఠాత్తుగా పెళ్లి చూపులు ఏర్పాటుచేయడం, పెళ్లి వారు వెంటనే అంగీకరించడం జరిగిపోయింది. అప్పుడు ధీరజ సెకండ్ ఇయర్ చివర్లో ఉంది. ఫైనల్ ఇయర్ కూడా పూర్తి చేస్తానని చెప్పి, ఈ లోగా సుభాష్ విషయం తేల్చుకుందామనుకుంది. పెళ్ళిచూపుల తతంగం పెద్దల సమక్షం లో జరుగుతోంది.
భర్త మధు నెమ్మదస్తుడు. మాయామర్మం తెలియని పసిబాలుడిలా పెరిగాడు. అన్ని విధాలా మంచి సంబంధం అని వారం రోజుల్లోనే పెళ్లిచేసేశాడు ధీరజ తండ్రి.
అప్పుడు కూడా ఇప్పటిలాగే కుమిలి కుమిలి ఏడ్చింది పాపం! ఈ లోగా కాలింగ్ బెల్ మోగింది. మధు ఆఫీస్ నుంచి వచ్చాడు. ఆమె మొహం ఏడుస్తున్నట్టు ఉండడం చూసి తండ్రికి ఫోన్ చేసి తల్లి తండ్రుల్ని కొన్నాళ్లు ధీరజ కి తోడుగా ఉండమని రిక్వెస్ట్ చేశాడు. అది విని ఇంకా ఏడ్చింది ధీరజ!
“రేపు ఈవినింగ్ కి అమ్మా,నాన్న ఇక్కడ ఉంటారు. ఇంకెప్పుడూ నిన్ను ఒక్కదాన్ని ఉంచను. సరేనా?” అనునయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అతని భుజం మీదే నిద్రపోయింది ధీరజ. ఆమెను నెమ్మదిగా పక్కమీదకు చేర్చి తలని తలగడ మీదకి చేర్చిన తరువాత ఆమె మొహం లోకి చూస్తే జాలేసింది మధుకి. దాదాపు ఇరవై సంవత్సరాలు తల్లితండ్రుల దగ్గర గారాబంగా ఉన్న పిల్ల ఒక్కసారిగా ఇలా ఒంటరిగా ఉండడం కష్టం కాదా?” అనుకున్నాడు ప్రేమగా!
******
ఎలాగోలా తెల్లారింది. తలారా స్నానం చేసి అందంగా ముస్తాబయింది. మధు సంతోషంగా చూశాడు. పదవగానే ఎప్పటిలాగే చున్నీని విసిరిపారేసి సిస్టమ్ ముందు కూర్చుంది.
పది నిముషాల్లో స్కైప్ లో ఇద్దరూ. సుభాష్ ఆ రోజు ఒక కొత్త పిలుపు పిలిచాడు. “బుల్లెమ్మ’ అని. చిరునవ్వుతో.
“డార్లింగ్! ఐ లవ్ యు!” అన్నాడు.
“నీ డార్లింగ్ ని నేనేనా?” కింది పెదవిని సెక్సీ గా పెట్టింది.
“నా ప్రాణానివి. నా గుండెచప్పుడివి. నా కంటిపాపవి!” అన్నాడు.
పరవశమే వచ్చి వాలి తన్మయురాలిని చేసింది ధీరజని. ఆమె మనసు ఆమె వశం లో లేకుండా చేసి “బంగారం!” అన్నాడు తమకంగా. సిగ్గుపడింది ధీరూ!
“ఏయ్ దొంగా! నా దగ్గర సిగ్గా?” అన్నాడు.
“ఓయ్ చందమామ!” ఉలిక్కిపడింది ఆ పిలుపుకి. హాయి, హాయి, మాటల తేనెల హాయి.
“ఓ వెన్నెలమ్మా!” అన్నాడు. తాను వెన్నెల? అబ్బా! ఆ పిలుపే అదృష్టం. తాను అందమైనదని తెలుసు గానీ తన అందాని ద్విగుణీకృతం చేసే పొగడ్తలింత పవర్ఫుల్ గా ఉంచే సఖుడు తన ముందుంటాడని ఎన్నడైనా అనుకుందా’
“ఈ రోజు స్పెషల్ డే! నీకొకటి చెప్పాలి సింగారం!”
“తెలుసు. మనం కలుసుకున్నది ఈ రోజే. చెప్పు సుభా!” అంది.
“ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను బుజ్జమ్మ!”
“రియల్లీ?”
“నా బుజ్జి పప్పి! నా చిన్నారి రంగుల చేపపిల్లా! వయ్యారి నడకల మయూరీ! నిజంగా నిజం!” అన్నాడు.
“ఐ లవ్ యూ!” పెదాల మీద అందరికీ ఉండే ఈ మాట చెప్పి పారేసింది వీజీగా. తమాషాగా కళ్ళెగరేసి నవ్వాడు. సిగ్గు సిగ్గు ధీరూకి.
“మళ్ళీ సిగ్గా? నువ్వలా సిగ్గుపడుతుంటే బెదిరిపోతున్న జింక పిల్లలా ఉంటావ్ తెలుసా? పరుగెట్టుకు వచ్చి వాటేసుకోవాలని ఉంటుంది!” అన్నాడు.
తనని ఆకాశం పైకి తీసుకెళ్లి విహరింపజేసే ఎవ్వరితడు? తన అణువణువునా సంచరిస్తున్నాడు. ఎంత గొప్ప భావకుడు? అనుకుంది.
“ఏదో ఒకరోజు ఏం చేస్తానో తెలుసా?” కళ్ళు టపటప లాడించింది.
“ఎత్తుకుపోయి కొరికేస్తా!” అన్నాడు.
“నాకు తెలుసు. నువ్వు అన్నంత పనీ చేస్తావని. కానీ నాకేం భయం లేదు. హాయిగా వచ్చేస్తా” అంది. అలా కబుర్లు కొనసాగాక అత్తామామలు వస్తున్నారని చెప్పింది.
“ఓకే బంగారం! నేను నాలుగురోజులు కనపడను. అమ్మానాన్నలని మాఊరు నుంచి తీసుకురావాలి. నాకు ఉద్యోగం వచ్చి ఇన్నేళ్లయినా వాళ్ళతో గడపలేదు. నువ్వు కూడా అత్తమామల్ని జాగ్రత్తగా చూసుకో!” అంటూ బై చెప్పాడు.
******
అత్త మామలు ముద్దుగా చూస్తున్నారు ధీరజని. ధీరజ కూడా వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేస్తోంది. పదిరోజులు అతి ఘోరంగా గడిచాయి ఆపిల్లకి. అత్తగారు కూడా ఉంటూ ఆ కబురు, ఈ కబురు చెప్తోంది. తల్లి తండ్రుల్ని ఊరంతా తిప్పాడు మధు. ధీరజ కి రాత్రి రాత్రంతా పీడకలలు. తన నుంచి ఎవ్వరో సుభాష్ ని వేరు చేస్తున్నట్టు ఒకటే దు:ఖంగా ఉంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని సుభాష్ మీద పిచ్చ కోపంగా ఉంది. మరో అయిదురోజుల తరువాత అత్తామామలు తిరుగు ప్రయాణం అయ్యారు. వాళ్ళు ఎంతో ఆదరంగా హాయిగా, సరదాగా గడపమని చెప్తూనే ఉన్నారు. భారంగా నిట్టూర్చింది ధీరజ.
మరో పదిరోజులు భారంగా గడిచాయి. పిట్టడు ఆన్లైన్ లోకి రావడం లేదు. కారణం తెలియక ధీరూ సిస్టమ్ చుట్టూ తిరుగుతూనే ఉంది. చివరికి ఒక రోజు ఆన్లైన్ లో పట్టుకుంది.
”సుభా! ఏమయిపోయావు?”
“ఇక్కడే ఉన్నాను ధీరూ! నాపరిస్థితి ఏమి బాగా లేదు.’
“ఏమయింది?”
“నా చదువుకోసం నాన్న చేసిన అప్పులు తీరిస్తే కానీ ఊర్నుంచి కదలనివ్వమన్నారు. నేను సేవ్ చేసినదంతా అప్పులు తీర్చడానికే సరిపోయింది. మేము మామూలు అవడానికి టైమ్ పడుతుంది. నీ దగ్గర డబ్బు ఉందా?”
ఆ కష్టాలకి కరిగిపోయింది.
“ఉంది పదివేలు. నీకో అయిదువేలు పంపిస్తాను నాన్న అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాడు!” అంది.
గతుక్కుమన్నాడు గురుడు.
‘అయిదువేలా?’ నీరసపడిపోయాడు.
“ఏం చెయ్యను సుభా? నా దగ్గర రెండు లక్షలున్నాయి. కానీ ఫిక్సెడ్ లో ఉన్నాయి!”
“సరే పంపిచ్చు బంగారం! ప్రస్తుతానికి సరిపోతుంది. అప్పుడప్పుడు నేను కోలుకునే వరకుసహాయపడతావా?” దీనంగా అడిగాడు.
“తప్పకుండా సుభా! ఇదంతా మన ఇంటికోసమే కదా?” అంది. గంట తరువాత బ్యాంకు కి వెళ్ళి డబ్బు పంపింది. అందుకని అనుకున్నాడు సుభాష్. ‘బంగారు బాతు రోజుకో గుడ్డే పెడుతుంది. ఇదిలా మైన్ టైన్ చేయడమే తనకి మంచిది. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగి పోయింది. గుడ్డిలో మెల్ల. సుభాష్ కి ఉత్తినే ఎంతో కొంత వస్తుంటే హుషారు వచ్చింది. స్కైప్ లోకొచ్చి అల్లరి చేస్తున్నాడు. ఒక్కోసారి ఇంగ్లీష్ పదాలు తెగ వాడేస్తున్నాడు. వినసొంపుగా ఉండే ఆ స్టయిలిష్ బాషకి ముగ్దురాలవుతోంది ధీరు.
“డార్లింగ్! ఒక్క కోరిక. కాదనకూడదు” గోముగా అడిగాడు
‘తనవాడు అతను. ఎలాకాదంటుంది!’ మనసులో అనుకుంది.
“ఒక్కసారి నిన్ను మొత్తం చూడాలి!”
“చూడు“ అంది తేలిగ్గా.
“ఇలాకాదు. పుట్టినప్పుడు నువ్వెలా ఉన్నావో అచ్చం అలా”!
“గాడ్” అరిచింది ధీరజ.
“ఉష్!” నోటిమీద వేలు వేసుకున్నాడు.
“చూడు. నేను నీ వాణ్ణేనా? నువ్వు ఎన్నటికీ నా దానివే! కొద్దిరోజులు ఓపిక పడితే నువ్వూ, నేనూ కలిసి ఉందాం. అప్పటిదాకా ఇలా దూరంగా కాకుండా నీ అందాల్ని చూసే అదృష్టం కూడా నాకు ఉండకూడదా?” డ్రెమేటిక్ గా దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు.
కరిగినీరయి... బాగా ఆలోచించి నా ధీరజ కి నిజమే అనిపించింది. ఎలాగూ సుభాష్ తనవాడే. అతని దగ్గర సిగ్గెందుకు? అంతే!!!
అందాలన్నీ ఆరబోసింది. సుభాష్ పెట్రెగి పోతున్నాడు.
‘మనకే పెళ్ళయి ఉంటే ఇలా, ఇంత దూరంగా ఉండే వాళ్ళమా? నా ప్రియా!’ లాంటి పదాలతో రోజూ ఎంజాయ్ చేస్తున్నాడు. ధీరజ ఇప్పుడు అతడి చదరంగం లో పావు!!!
******
ఆరోజు మధు కి కొద్దిగా జ్వరం వచ్చింది. ఎప్పటిలా మామూలుగానే ఆఫీస్ కి రోజూలా బయలుదేరాడు. కానీ గుమ్మం దాటబొతూ గోడ పట్టుకుని నిలబడిపోయాడు. ధీరజ గాభరాగ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి సోఫా లో కూర్చోబెట్టింది. ఒళ్ళు కాలిపోతోందతడికి.
“అదేంటి? చెప్పలేదేంటి?” అంది ఆశ్చర్యంగా. నవ్వి ఉరుకున్నాడు. రెండురోజులపాటు మూసిన కన్ను తెరవలేదు. అతడి కొలిగ్స్ వచ్చి అండగా నిలబడ్డారు. జ్వర తీవ్రతలో ఒకటి రెండు సార్లు ‘ధీరజా! నువ్వంటే నాకిష్టం’ అని కలవరించాడు. అది కలవరింతైనా ఆ మాట ధీరజని కలవర పెట్టింది. చాలా బాధగా అనిపించి కన్నీళ్ళువచ్చాయి.
తను చాలా పెద్ద తప్పు చేస్తోంది. ఒక్కసారి కూడా తనని తాకని, బాధపెట్టని అతడిని చూస్తుంటే దిగులొచ్చేస్తోంది. అతడిని తాను అంగీకరించలేనప్పుడు చెప్పేయ్యాలి గానీ అక్కడే... ఆ ఇంట్లోనే ఉంటూ, భార్యగా మసలుతూ అతన్ని ఇంత బాధకి గురిచేయడం భావ్యం కాదు. ఎన్నో ఆలోచనలతో చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది.
పదిరోజుల తర్వాత మధు మళ్ళీ మామూలు అయి ఆఫీస్ కి వెళ్ళాక సుభాష్ తో స్కైప్ లో జరిగినదంతా వివరించింది. విని ఉరుకున్నాడు సుభాష్.
“అయినా సరే ఇన్ని రోజులకు సరిపడా నువ్వు నాకు విందు చేయాల్సిందే!” అని తమాషాగా కబుర్లు చెప్పి నవ్విస్తూ ఆమె చేత సగం బట్టల్తో డాన్సులు చేయించాడు. అప్పుడు శాంతించాడు.
“ఇరవై వేలు ఉన్నాయా ధీరూ... అర్జంట్!” అంటాడు. ధీరజ దగ్గరున్న యాభై వేలు ఇరవై వేలయ్యాయి. ఇంక తన దగ్గరున్నది ఇరవై లక్షల నగలే అని చెప్పింది. అదిరిపోయాడు. ‘ఇరవై లక్షలు విలువ చేసే నగలా!’ కళ్ళు తిరిగి పోయాయి సుభాష కి. మొహం లో ఈ రంగుల్ని త్వరత్వరగా సద్దుకున్నాడు.
“చ! ఆడదాని నగలు అడుగుతానా బంగారూ ఇది మరీ టూమచ్!” అన్నాడు నొచ్చుకుంటూ. కాలింగ్ బెల్ మోగింది.
“ఒక్క నిముషం సుభా!” అని తలుపు తీయడానికి వెళ్లింది.
వచ్చింది మధు! గాభరాగ సిస్టమ్ ని ఇష్టం వచ్చినట్లు ప్రెస్ చేసి ఆపి పడేసింది.
ఆరోజు మధు మనసు మనసులో లేదు చిరాగ్గా ఉన్నాడు. ధీరజ ని ‘కీన్’ గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు చాలా సార్లు. చిరాగ్గా ఉన్నాడు. ఏదో ఉంది. ఏమిటది? అందుకే రావాల్సిన టైమ్ కన్నా ముందే వచ్చాడు. ఆమె గాభరాపడడం, లోపలికెళ్లి సిస్టమ్ ని ఆఫ్ చేయడం, గమనించీ సైలెంట్ అయ్యాడు.
మధు తనని గమనించడం, తనవైపు అదోలా చూడడం, చాలా భయంగా అనిపించింది ధీరజకి. కళ్ళు మూసుకుంది. కళ్ళముందు సినిమా రీలులా కొన్ని సంఘటనలు కదుల్తున్నాయి. ఊహలు చక చకా సాగుతున్నాయి.
తల్లి తండ్రులు ఆఘమేఘాల మీద వచ్చేసినట్టు, తండ్రి తనని చూస్తూ నుదుటి మీద కొట్టుకోవడం, తల్లి కంటికీ, మంటికీ ఏకధారాగా ఏడవడం, అత్త మామలు తమని మోసం చేసారంటూ నిలదీయడం, మధు తనని అసహ్యంగా చూడడం, బంధువులంతా చెవులు కొరుక్కుంటూ ఊరంతా చాటడం…
దేవుడా! ఏమిటిదంతా? ప్రేమ గొప్పదా? పెళ్లి గొప్పదా? అనుకుంది.
నాలుగు రోజులుగా ఒకటే ఏడుస్తున్న ధీరజని చూస్తే జాలేసింది సుభాష్ కి. ఏదయితే అదయిందని ఓ సాహసం చేశాడు. తన జీవితం లోకి రమ్మని ఆహ్వానించేశాడు. రెండు రోజుల తర్వాత పెట్టే, బేడా సద్దుకుని నగలతో సహా ‘లక్ష్మీ నగర్ కాలనీ లో’ ‘బడ్డీ ఎన్ క్లేవ్’ నాలుగో అంతస్తులోని ఒక ఫ్లాట్ లోకి వచ్చేసింది. చేతులు చాచి ఆమె ను కౌగిలి లోకి తీసుకున్నాడు.
అప్పటికే స్నేహితుల పలుకుబడి ఉపయోగించి హైద్రాబాద్ నుంచి విశాఖ ట్రాన్సఫర్ చేయించుకున్న సుభాష్ తల్లి తండ్రుల్ని, చెల్లెలిని తమ ఊరు పంపించాడు. చాలా జాగ్రత్తగా స్కెచ్ గీసుకున్నాడతడు. ఇరవై లక్షల నగలు సంపాదించకుండ కొట్టేసేందుకు!
రచయిత్రి పరిచయం ..పేరు: బులుసు సరోజినిదేవిప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు. వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో, ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు |