Menu Close
ఏడు వసంతాల సిరిమల్లె సాహితీ సౌరభ పూరిత సంతోషకర సంపాదకీయ సమాహారం

కాలగమనంలో మన జీవన పరిస్థితులు, పరిసరాల ప్రభావంతో, ప్రభవిస్తున్న ఎన్నో ఆలోచనా తరంగాలను ఆచరణలోకి తేవడం అనేది ప్రతి మనిషి చేయాలనుకునే ప్రథమ ప్రక్రియ. కొన్ని సార్లు అవకాశాలు అందినట్లే జేజారిపోయి ఆ ఆలోచనల దొంతరలు అలాగే మన మస్తిష్కంలో నిక్షిప్తమై మరల మరల తమ ఉనికిని తెలియజేస్తూనే ఉంటాయి. వాటిని గమనించి అందుకు తగిన వనరులను సమకూర్చుకొని మన ఆశయాలను ఆచరణలోకి తెచ్చినప్పుడు  సమాజంలో మంచిని పెంచే మంచు తెరల మాలలు ఏర్పడతాయంటే అందుకు తగిన కృషి చేయాలనే సంకల్పం మనలో ధృడంగా ఉండాలి. అలాగే ఆ కృషి ఫలితం కూడా సరైన దారిలో పయనించి మనం అనుకున్న సాధనా తీరాన్ని చేరాలి. అప్పుడే మనలో కలిగిన ఆలోచనలకు, ఆచరణలకు ఒక సార్థకత చేకూరుతుంది. తద్వారా మనం ఊహించుకున్న దిశానిర్దేశం సిద్ధిస్తుంది.

ఏడు సంవత్సరాల క్రితం మా ఆలోచనలలో ఒక రూపం ఏర్పరుచుకొని ఆ పిమ్మట అంకురార్పణ జరిగి, నిత్యం సరికొత్త హంగులతో, సాహితీ సౌరభాలతో విలసిల్లుతూ, సాహిత్య పోకడల భేదాలను అనుకరించి తరాల మధ్య అంతరాలను అధికమించి, పండిత పామర పాఠకులకు అనుగుణంగా, సంస్కృతాంధ్ర పదజాల మిళితమై మీ అందరి ఆశీస్సులను, ఆదరణ ను మెండుగా నింపుకొని విరాజిల్లుతున్న మా (మన) సిరిమల్లె పూదోటలో కాసింత సేదదీరి ఆ సాహితీ సుమాల గంధాలను ఆఘ్రాణిస్తూ అందరూ మాతృభాష మాధుర్యాన్ని మన సంస్కృతి ఆనవాయితీ విధానాలను సదా మనసులో నిలుపుకోవాలనే మా ఆశయాన్ని పరిపుష్టి చేయడంలో సంతృప్తి కలుగుతున్నది. దానితోపాటు మరింతగా ఏదో చేయాలనే సంకల్పం ధృడపడుతున్నది.

చం.
ఎద పులకించు సౌరభము నింపుగ బంచుచు స్వచ్ఛతాకృతిన్
ముదమును గూర్చు మల్లియలు; ముగ్ధమనోహరదృశ్యభావనల్
పదపదమందు హత్తుకొన బల్కును భాషయె; వీని చెల్మిచే
కద సిరులొల్కు బిడ్డయగు కానుకగా 'సిరిమల్లె' పుట్టెగా

అన్న అయ్యగారి సూర్యనారాయణ మూర్తి గారి పద్యపంక్తులను కృతజ్ఞతలతో ఉటంకిస్తూ,

ప్రాయోజిత ప్రాదేశిక ప్రమాణ పదజాల పరవళ్ళు తొక్కుతూ, అంతర్జాల మాధ్యమ కోనలలో నిరాఘాటంగా ప్రవహిస్తూ సాహిత్య సరళ తెలుగు వెలుగులను అందిస్తూ సాగుతున్న మన “సిరిమల్లె”, మా ఆశయాల, ఆలోచనల సరళ భాషా పదాలను పొందుపరిస్తూ సాగిన ఈ ఏడు సంవత్సరాలు ఎంతో ప్రోత్సాహాన్ని ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి.

మా ఈ సాహితీ సేవ ఇలాగే మరిన్ని మంచి వనరులతో కొనసాగుతూ, తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతను విశదీకరిస్తూ ఎన్నో మంచి రచనలను, గ్రంథాలను అందరికీ అర్థమయ్యే రీతిలో వివరణలతో అందించిన, అందిస్తున్న ఎంతో మంది పెద్దల ఆశీస్సులతో మన సిరిమల్లె నిరాఘాటంగా నిత్య నూతన సాహిత్య పోకడలతో నేటికీ కొనసాగుతున్నది.  అందుకు అందరికీ పేరు పేరునా మనఃపూర్వక కృతజ్ఞతలు. అలాగే పత్రిక వెలువడిన వెంటనే చదివి మీ అభిప్రాయాలను, సూచననలను, ప్రోత్సాహాన్ని అందిస్తున్న సిరిమల్లె పాఠకులందరికీ నమస్కృతులు.

తమ ఆలోచనా వెల్లువలకు అక్షర రూపం కల్పించి మంచి భావపూరిత రచనలను అందిస్తున్న రచయితులకు, రచయిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే క్రొత్తగా రచనలు పంపాలనుకునే వారికి ఒక చిన్న విన్నపము. మీ రచనలలో ఏదో ఒక సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకోండి. పదదోషాలు లేకుండా పది మందికి మీ అంతరంగ భావం అర్థమయ్యే రీతిలో మీ కలాన్ని కాలానుగుణంగా కదిలించండి. మాటలు, చేతలు మాత్రమే కాక మౌనం కూడా కొన్నిసార్లు మనలను చైతన్య వంతులుగా మార్చుతుందని నాకు ఈ సాహితీ స్వానుభవం తెలిపింది.

సంపాదకుడికి ముందు స్థిరత్వం ఉండాలి అప్పుడే రచయితలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది. సిరిమల్లె ఏడు వసంతాలను పూర్తి చేసుకుని ఎనిమిదో మెట్టును అధిరోహిస్తున్న ఈ శుభ సందర్భంగా అందరికీ సిరిమల్లె సప్తమ వార్షిక శుభాకాంక్షలు!!

నమస్కారములతో
-- మధు (మధుప్రియ)

Posted in August 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!