Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

“ఎందుకు నవ్వుతున్నావు” అడిగింది.

“మీ ఆడపిల్లలు మిగతా విషయాల్లో ఎంత ధైర్యంగా, స్ట్రాంగ్ గా ఉంటారో ప్రేమ విషయంలో అంత వీక్ కదా... ఇంతకు ముందేగా ఏదో అన్నావు.”

స్మరణ తల ఊపుతూ టేబుల్ మీద ఉన్న గాజు గ్లాస్ లో ఉన్న నీళ్ళు కొంచెం సిప్ చేసి అంది.

“నిజమే.. నాకూ అలాగే అనిపిస్తోంది.. వేలమంది ఎంప్లాయిస్ ఉన్న పెద్ద కంపెనీ సి.ఇ.వో గా నాకు మధు అనిపించడం లేదు.. కేవలం నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, పదేళ్ళ నుంచి తపనతో ఎదురుచూసిన నా ప్రియుడు మాత్రమే కనిపిస్తున్నాడు అతనిలో. అసలు మేము మళ్ళీ కలుసుకుంటామా! లేదా అనే ఎమోషన్ తో గడిపిన కాలం మాత్రమే నాకు గుర్తుంది. కలిసాము.. ఎక్కడ కలుస్తామో, ఎలా కలుస్తామో అనుకున్నానే కానీ ఫలానా చోట కలుస్తాము అన్న ఆలోచన కానీ, కలిసాక ఏం చేయాలి అనే ఊహలు కానీ నాలో లేవు.. కలిసాము.. మా ఫస్ట్ మీటింగ్ చాలా మామూలుగా జరిగింది అనిపిస్తోంది.. మాట్లాడిన కాసేపు ఆత్మీయంగా, ప్రేమగా మాట్లాడాడు.. మాట్లాడి వెళ్ళిన తరవాత ఏదో అసంతృప్తి.. ఏదో ఫ్రస్ట్రేషన్ ... ఈవెనింగ్ మళ్ళీ కలుస్తామని, ఇన్నేళ్ళుగా గుండెల్లో దాచుకున్న బాధంతా అతనికి చెప్పుకుని ఏదో ఉపశమనం పొందాలని ఆశ పడ్డాను. నన్ను పట్టించుకోకుండా, కనీసం నా మెసేజ్ కూడా చూడకుండా అలా వెళ్ళిపోయేసరికి కోపం వచ్చింది.. ఇన్ ఫాక్ట్ అది కోపం కాదు.. ఎమోషన్.. కోపం వేరు.. ఎమోషన్ వేరు.. నా ఎమోషన్ ఫ్రస్ట్రేషన్ గా మారింది..”

“అందుకని నీ కోపం, లేదా ఎమోషన్ నా దగ్గర ఎక్స్ ప్రెస్ చేసావు.. ఇప్పుడు ఏమనిపిస్తోంది..”

స్మరణ నవ్వింది.. ఓ చంద్రకాంతి కిరణాలు తాకి సిగ్గుతో మబ్బుల చాటుకి తప్పుకున్న నక్షత్రకాంతి ఆమె చెంపల మీద ప్రతిఫలించింది. కనురెప్పలు వాల్చి గ్లాసులోకి చూస్తూ అంది “అక్షరాలకి అందని భావం... ఎలా చెప్పను?”

“ఇంతకీ ఏమన్నాడు?”

“రేపు ఉదయం వచ్చి నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్తాడట రెడీగా ఉండమన్నాడు.”

“ఓ నైస్... సో నీ అకామడేషన్ అక్కడేనా”

కంగారుగా అంది...”నో... కాకపోవచ్చు.. అలా ఎలా కుదురుతుంది? నా పోస్టింగ్ ఇక్కడే అయితే నేను వేరే ఫ్లాట్ తీసుకోవాలి కదా.. నాకేమి లగేజ్ తో రెడీగా ఉండమని చెప్పలేదే..”

“చెప్పకుండా సర్ప్రైజ్ థ్రిల్లింగ్ కావచ్చు కదా! ఎంత ప్రేమో చూడు..”

“నాకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నడంటావా!” నవ్వింది.

“లేదులే... నీ పోసేస్సివ్ నెస్ చెప్తుంది నీకున్న ప్రేమ ఎంతో“ నవ్వాడు మీనన్.

స్మరణ వెంటనే సమాధానం చెప్పకుండా కొన్ని క్షణాలాగి అంది...

“ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవాలంటే మీ మగాళ్ళంతా కనీసం ఒక వారం రోజులు ఆడపిల్లగా మారాలి..అలా మార్చగలిగే టెక్నాలజీ ఎప్పుడు వస్తుందో!”

“ఇదేదో మంచి టాపిక్ లా ఉంది... ఎవరన్నా రీసెర్చ్ చేసేవాళ్ళున్నారేమో చూద్దాం...”

నవ్వి అంది స్మరణ...”ఈ ప్రపంచంలో స్ట్రాంగ్ లేడీ ఎవరో తెలుసా!”

“ఎందుకు? ఇండియాలో నిర్మలా సీతారామన్... ఇటీవల వినిపిస్తున్న పేరు కమల హారిస్, ఆంజెలా మెర్కెల్... మెలిండా గేట్స్..ఇంకా చాలా మంది ఉన్నారు? ఏంటి ఏదన్నా ఐ క్యు టెస్టా ..”

“వాళ్ళు కూడా వాళ్ళ ప్రియుడు లేదా భర్త ఎవరైనా సరే వాళ్ళ విషయంలో నాలాగే ఆలోచిస్తారు.. అలా ఆలోచించకుండా వస్తే వచ్చాడు... వెళ్తే వెళ్ళాడు అనుకుంటే అది ప్రేమ కాదు...”

బేరర్ రావడంతో మెనూ ఆమె ముందుకు నెట్టాడు..

సరిగ్గా గంట తరవాత డిన్నర్ పూర్తి చేసి, గుడ్ నైట్ చెప్పి తన గదికి వచ్చేసింది.

నైట్ డ్రెస్ వేసుకుని లైట్ ఆఫ్ చేసి పడుకుని టైం చూసింది పదింబావు. తాతయ్య పడుకుని ఉంటారా.. వీళ్ళు ఎవరూ మిస్సుడు కాల్ చూసుకోలేదేంటి.. చూసి ఉంటే కాల్ బ్యాక్ చేయాలి కదా! అనుకుంటూ ఆంజనేయులు నెంబర్ డయల్ చేసింది. చాలా రింగ్స్ వచ్చినా ఆయన లిఫ్ట్ చేయలేదు. ఈలోగా నిద్ర ముంచుకు రావడంతో కొద్ది క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంది.

స్మరణకి మధు కనిపించిన ఆనందంలో లోకమంతా పచ్చని తోరణాల ద్వారాలు కనిపిస్తున్నాయి. ఒక్కో ద్వారం నుంచి ఒక్కో తీయని ఊహ వయ్యారంగా నడిచి వస్తూ ఆమె ఎద మీద నాట్యం చేస్తున్నట్టు ఉంది.. ఆ పరవశంలో ఆమెకి తను అన్ని సార్లు అమ్మకి, నాన్నకి, తాతయ్యకి ఫోన్ చేసినా ఎందుకు వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు అన్న ఆలోచన రాలేదు.. ఒకవేళ వచ్చి ఉంటె కథ ఎలా ఉండేదో!

మధు చెప్పినట్టే సరిగ్గా ఏడింటికి రూమ్ కి వచ్చి బెల్ నొక్కాడు. అప్పటికే వేక్ అప్ కాల్ తో నిద్ర లేచి రెడీ అయిన అతని కోసం ఎదురుచూస్తున్న స్మరణ డోర్ తీసింది.

“గుడ్ మార్నింగ్ డార్లింగ్” అంటూ ఓ వాయు తరంగంలా గదిలోకి వచ్చిన మధు ఇప్పుడు చాలా దగ్గరగా నిలబడడంతో తత్తరపడింది. సీతాకోక చిలుకలా రెక్కలు చాచి ఎగురుతున్న ఫీలింగ్.. నోట్లో నుంచి ఎంత ప్రయత్నించినా శబ్దం రాలేదు. బలవంతంగా పెదాలు కదిపి “కూర్చో” అంది.

రెండు చేతులూ కట్టుకుని ఆమె మొహంలోకి తదేకంగా చూస్తూ “ఏంటి చాటర్ బాక్స్ రిపేర్ కి వచ్చిందా” అన్నాడు అల్లరిగా నవ్వుతూ.

స్మరణ మాట్లాడలేదు.. అతని వెచ్చని ఊపిరి చెంపలకి తగులుతోంది.. పాదాల్లో చిన్న ప్రకంపన మొదలై తలదాకా పాకింది. ఇంకొక్క క్షణం ఉంటే నిలబడిన చోట పడిపోయేది.. అప్పుడు అనూహ్యంగా అతను ఆమెని రెండు చేతులతో ఎత్తుకున్నాడు. అనుకోని సంఘటనతో కల్లుతిరిగినట్టు అయి అప్రయత్నంగా ఎడమ చేయి అతని మెడ చుట్టూ వేసింది పడిపోకుండా.. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు “ఈ పని నిన్ననే చేయాలి అనిపించింది స్మరణా! కానీ టైం, ఎన్విరాన్మెంట్. పరిసరాలు, నా పరిధి, పరిమితులు నా చుట్టూ ఒక గిరి గీసాయి.. నేనిలా చేయలేదని నీకు కోపం వచ్చింది కదూ..” కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. స్మరణ గబుక్కున అతని ఛాతీ లో మొహం దాచేసుకుంది..

చిన్న శబ్దం చేస్తూ ఆహ్లాదంగా నవ్వాడు. “ఇప్పుడు అసలు, సిసలైన అమ్మాయిలా అనిపిస్తున్నావు” అంటూ అలాగే ఎత్తుకుని మంచం అంచుకి కూర్చుని ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకుని, చెదిరిన ముంగురులు సవరిస్తూ “నిజంగా నాకిది కలలా ఉంది స్మరణా.. నువ్వు నువ్వేనా..”

స్మరణ సమాధానం చెప్పకుండా అతని భుజం మీద తలవాల్చి నెమ్మదిగా అంది “నాకూ అలానే ఉంది.. నువ్వు నా మధేనా”

ఆమె నుదుటి మీద సున్నితంగా చుంబించి “ఇప్పుడు చెప్పు నీ మధునేనా” అన్నాడు.

పరవశంగా అతని భుజం మీదకి ఒరిగిపోతూ తలూపింది.

“ఇప్పుడు చెప్పు ఏంటి నీ కంప్లైంట్స్ నా మీద” అన్నాడు.

స్మరణ సరిగా కూర్చుని “నాకేం కంప్లైంట్స్” అంది బుంగమూతి పెట్టి.

ఆమె అలా అలగడం అతనికి ముచ్చటగా అనిపించింది.

“కంప్లైంట్స్ లేకపోతే ఎందుకలా మీటింగ్ మధ్యలో నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయావు.. ఎందుకు నన్ను ఎడాపెడా దులిపావు.”

అతని స్పర్శతో ఉప్పొంగిన ఆనందంతో మూగబోయిన ఆమె హృదయం సమాధానం కోసం వెతుక్కుంది. వెంటనే కినుకగా అంది “నేను నీకోసం ఎంతగా వెతికానో తెలుసా... కనీసం నీకు చీమ కుట్టినట్టు అయినా ఉందా!”

“ఏం ఉండాలి?”

“బాధ...”

“అదేంటి నువ్వు నాకోసం వెతుకుతున్నావని తెలిస్తే ఆనందం కలగాలి కానీ బాధెందుకు?” ఆశ్చర్యం నటించాడు.

“చాల్లే.. నీ స్మార్ట్నెస్ నా దగ్గర చూపించకు..నువ్వసలు ఒక రోబో” అంది అతని గుండెల మీద కుడిచేయి గుప్పిటతో కొట్టి..

మాధవన్ ఆమె అభియోగానికి మధురంగా నవ్వాడు. అందం, కించిత్ అమాయకత్వం, స్త్రీత్వంలోని ముగ్ధత్వం, పొగరు, ముక్కుమీద కోపం, సున్నితమైన మనసు, చురుగ్గా మెరిసే కళ్ళు..ఇంతకన్నా ఏం కావాలి నా భార్య అవడానికి అనుకున్నాడు.

ఈమెని కలిసిన క్షణం ఎలాంటిదో కానీ, మొదటి సారి మాట్లాడినప్పటి నుంచీ ఆమె అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఆత్మీయత ఏర్పడింది. ఇద్దరూ కలిసి గడిపింది ఏడాదిన్నర అయినా జన్మ, జన్మల నుంచీ ఇద్దరి మధ్యా తెలియని అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుండేది. ఏదో చెప్పాలని అనిపిస్తుండేది.. ఎలా చెప్పలో తెలియని వయసు.. “నీకు నేనంటే ఎందుకిష్టం? అని ఆమె అమాయకంగా అడిగితె ఏం చెప్పాలో తెలియని తనం..

గతం తలచుకుంటూ స్వప్నంలో లా అన్నాడు.. “నీకే కాదు స్మరణా...నాకూ చాలాసార్లు మీ ఇంటికి రావాలని అనిపించేది.. వస్తే, ఎందుకు వచ్చావు? నీకేం పని ఇక్కడ అని ఎవరైనా అడిగితె ఏం చెప్పాలి అనే సందేహం. బహుశా నీ మీద కేవలం స్నేహభావమే ఉంటె నాకేభయాలు, అనుమానాలు ఉండేవి కాదేమో... కానీ అంతకన్నా అతీతమైన ఆకర్షణ, అది ప్రేమ కావచ్చు... ఇంకా ఏదన్నా కావచ్చు.. ఆ భావం జనించాక ఎన్నో భయాలు.. సందేహాలు.. నాకే సమాధానం తెలియని ప్రశ్నలు..

ఎవరికైనా అంతే ప్రేమ జనించిందాక ఎలాంటి జంకు ఉండదు.. ప్రేమ బీజాలు పడగానే ఎక్కడా లేని సందేహాలు, భయాలు, మొహమాటాలు కలుగుతాయి. స్నేహంగా ఉన్నప్పుడు ఎంతో చనువుగా ఉంటాము.. ఆ స్నేహం ప్రేమగా మారాక ఆ చనువు, స్వతంత్రం ఎక్కడికి పోతాయో తెలియదు. దానికి తోడు మా ఇంటి వాతావరణం, మా ఆర్ధిక స్థితి నన్ను ఎప్పుడూ వెనక్కే లాగేవి.. నా మనసు నీ వైపు పరిగెత్తుతుంటే ఆ మనసుని కళ్ళెం వేసి లాక్కోవడానికి నాలో ఉన్న శక్తి సరిపోయేది కాదు..”

అతను ఉన్నట్టుండి భావోద్వేగంతో మాట్లాడుతుంటే స్మరణ విస్మయంగా అతన్నే చూస్తూ వినసాగింది.

“చిన్నప్పుడే మా నాన్నగారు పోడంతో ఆయన ఉద్యోగం అమ్మకి వచ్చింది. ముందు క్లర్క్ గా జాయిన్ అయిన అమ్మ ఉద్యోగం చేస్తూ గ్రూప్ 2 పరీక్షలు రాసి గెజిటెడ్ పోస్ట్ సంపాదించింది. ఆ పరంపరలోనే ఆవిడకి గుంటూరులో పోస్టింగ్ రావడంతో మేము అక్కడికి వెళ్ళిపోయాము. అప్పుడు కూడా ఎంతో బాధపడ్డాను నిన్ను ఒక్కసారి చూసి వెళ్లాలని తహ,తహ లాడాను. కానీ ధైర్యం సరిపోలేదు. అమ్మకి కూడా చెప్పలేకపోయాను. ఆరోజు మనం కలిసి ఉన్న ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు దిగులుగా మళ్ళీ  ఎప్పుడొస్తావు మధూ అని అడిగితే సమాధానం కూడా సరిగా చెప్పలేకపోయిన నాకు నిన్ను ప్రేమించే అర్హత ఉందా అని చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నాను.”

“నేనెంత ఏడ్చానో తెలుసా ఆ రోజు... నీకసలు కొంచెం కూడా దిగులు లేదు...” రోషంగా అంది స్మరణ.

నవ్వాడు... ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని చెంపకి రాసుకుంటూ,  “నీకు తెలుసా నాకేం అనిపించలేదని.. నా శరీరంలోంచి ఒక భాగం నీ దగ్గర వదిలి వెళ్తున్నట్టు, నేను హ్యాండి కాప్ అయినట్టు గిల,గిలా తన్నుకున్నాను. కానీ నా బాధ ఎవరికీ చెప్పను? ఏమని చెప్పను? ఎవరు వింటారు.. ఎవరు అర్థం చేసుకుంటారు.. అప్పుడు నా వయసెంత.. ఆ వయసుకి  నిన్ను ప్రేమిస్తున్నానని మా అమ్మకి చెబితే మబ్బులకి ఊయలలు వేసి ఊగుతూ నా భవిష్యత్తు గురించి కలలు కంటున్న మా అమ్మ నిలువునా కూలిపోయేదో, నన్నే గొంతు పిసికి చంపెసేదో.. అయినా నాకే స్పష్టంగా తెలియని ఆ భావాలు ఎవరికి  చెప్పగలను! ఎదుగుతున్నా కొద్ది అర్థం అవసాగింది నా భావాలకి అర్థం ఏంటో,  ఆ రోజు నేను వదిలి వచ్చినది ఏమిటో! నీ దగ్గర వదిలి వెళ్ళిన  నా శరీరభాగం మనసని తెలిసాక నాలో ఏదో గందరగోళం..ఎవరికీ చెప్పుకోలేని అయోమయం.. ఏదో బాధ...మనసు దేనిమీదా నిలకడగా నిలిచేది కాదు.. చదువు మీద ఏకాగ్రత పోయింది.. ఎప్పుడూ దేనికో వెతుక్కుంటూ ఉండేవాడిని.. అమ్మ చాలా తెలివైనది.. నా వాలకం కనిపెట్టింది.. “తప్పు నీదికాదు నాన్నా నీ వయసుది.. నెమ్మదిగా నీ మనసుని నీ చేతుల్లో పెట్టుకోడానికి ప్రయత్నించు..అన్నీ సవ్యంగా జరుగుతాయి” అని నాకు కౌన్సిలింగ్ చేసింది. అలా నన్ను నేను నిగ్రహించుకుంటూ, నాకో లక్ష్యం ఏర్పరచుకుని ఆ లక్ష్యం దిశగా నడుస్తూ వెళ్ళిపోయాను. కానీ నడిచే ప్రతి దారిలో నువ్వు కనిపిస్తూనే ఉండేదానివి.. నీ కోసం అయినా నేనో స్థానానికి చేరాలని అనుకున్నాను.. ఆ ప్రయత్నంలో పూర్తిగా మునిగిపోవడం వల్ల కావచ్చు నేను ఎంత మంది అమ్మాయిలు నాకు దగ్గర అవాలని ప్రయత్నించినా ఏ ఆకర్షణలో పడకుండా నన్ను నేను కాపాడుకున్నాను. హమ్మయ్య నిన్ను పొందాను...” ఆఖరిమాటలు అంటూ ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని “ఇంక నిన్ను వదలను స్మరణా! నువ్వు కూడా నన్ను వదిలి పెట్టవు కదూ!” ఆమె చుబుకం పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆ క్షణం ఆమెకి ఆ కళ్ళల్లో అతని హృదయం కనిపించింది. గబుక్కున ఆ కళ్ళ మీద ముద్దు పెట్టుకుని, అతని మెడచుట్టూ చేతులు పెనవేసి హత్తుకుపోయింది. నెమ్మదిగా గొణిగినట్టు అంది “ఒక్కసారి, ఒక్కసారి కనిపించి నిన్ను ప్రేమిస్తున్నా స్మరణా అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది!”

“వచ్చాను.. ఒకసారి ఎం సెట్ రాయడానికి హైదరాబాద్ వచ్చి మీ ఇంటికి వచ్చాను. అప్పుడు కొంచెం పెద్దవాడిని అయాను... ధైర్యం వచ్చింది.. నాకేం కావాలో స్పష్టత వచ్చింది.. కానీ అప్పటికే మీరు అక్కడినుంచి వెళ్ళిపోయారు.. ఎక్కడికి వెళ్ళారో ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు నేను పడిన బాధ నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు.. ఆ రోజు నా గుండె గుడిలో ప్రతిష్టించుకున్న ఈ దేవి అలా ఒక కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యక్షం అవుతుందని ఊహించానా!”

“నేనూ ఊహించలేదు.. ఊహించి ఉంటే ఫేస్ బుక్ లో వెతికేదాన్ని కాదు..”

“ఇరవై నాలుగు గంటల్లో, సోషల్ మీడియాతో ఎంత సేపు స్పెండ్ చేస్తావు” అడిగాడు.

“చెప్పలేను... పని చేస్తూ, చేస్తూ కొంచెం బ్రేక్ వస్తే ఫేస్ బుక్, ట్విట్టర్ చూస్తాను..”

“సో నువ్వు కొన్ని ఏళ్లనుంచి కొన్ని గంటల పాటు సమయాన్ని ఎంత వృధాగా గడిపావో తెలుసా!”

“వాట్ డూ యు మీన్ ...”

“టెక్నాలజీని నాలెడ్జ్ పెంచుకోడానికి ఉపయోగించుకోవాలి కానీ, ఇలా అమూల్యమైన సమయాన్ని అనవసర విషయాల కోసం వెచ్చించడం ఫూలిష్ నెస్ అనేది నా అభిప్రాయం.. నేను వాట్స్ అప్ కూడా రోజులో టూ టు త్రీ టైమ్స్ మాత్రం చూస్తాను..”

“చెప్పక్కర్లేదు అర్థం అయింది..” విసురుగా అంది.

“అదే ఈ కోపమే తగ్గించుకోవాలి... నాకసలు కోపం అనేది రాదు తెలుసా..”

“ఏం నువ్వు మహర్షివా..”

“కాదు.. కోపం తెచ్చుకునే టైం కూడా నేను వృధా చేయను.. అందుకే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. నువ్వు కూడా టైం వేల్యూ తెలుసుకుని ఆ టైం ని ఎలా వాడుకోవాలో అలా వాడుకో... త్వరలో నా ప్లేస్ లో నువ్వుంటావు..”

స్మరణ ఆశ్చర్యంగా అతని మొహంలోకి సూటిగా చూస్తూ అంది “జోక్ చేస్తున్నావా”

“లేదు” నవ్వాడు.

ఆ నవ్వులో, ఆ కళ్ళల్లో నిజాయితీ చూసిన స్మరణ అప్రతిభురాలై చూస్తూ ఉండిపోయింది. ఆమె మొహం మీద చిటేకలు వేస్తూ “హలో! ఎక్కడికి వెళ్లావు” అన్నాడు.

సర్దుకుని నవ్వి తల దించుకుంది.

“సూట్ కేసు తీసుకో వెళ్దాము... నీ కోసం ఈ రోజు పది గంటలకు ఉండాల్సిన మీటింగ్ పదకొండుకి పోస్ట్ పోన్ చేసాను... కమాన్ హరియప్” అన్నాడు.

“సూట్ కేసు ఎందుకు?”

“నేనింకా నీ వార్డ్ రోబ్ రెడీ చేయలేదు.”

“అంటే...”

“నువ్వు మా ఇంట్లో ఉంటావు..”

“కానీ ఎలా? మీ మదర్ ఒప్పుకుంటారా!”

“ఒక వయసు వరకు పేరెంట్స్ మాట పిల్లలు వినాలి... ఆ వయసు దాటాక పిల్లల మాట పేరెంట్స్ వినాలి.. ఇది మన భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాల నియమం. అప్పుడే కుటుంబవ్యవస్థ స్ట్రాంగ్ గా నిలబడుతుంది..”

మరోసారి ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెని భుజాలు పట్టుకుని తోస్తూ “వెళ్ళు తల్లి రెడీ అవు తరవాత ఆశ్చర్య పోదువుగాని” అన్నాడు.

స్మరణ నవ్వుతూ చకచకా బట్టలు సర్డుకోసాగింది. ప్రశాంతమైన మనసుతో కూర్చున్న దగ్గరే వెనక్కి వాలి తలగడ మీద తల పెట్టుకుని, కళ్ళు మూసుకుని  వెల్లకిలా పడుకున్నాడు.

నమ్మకం గెలిచిందా! ప్రయత్నం గెలిచిందా! ఏనాటికైనా కాలమే స్మరణని తన వద్దకు తీసుకువస్తుందన్న నమ్మకం తనది.. ఎలాగైనా కలుసుకోవాలి అనే నిశ్చయంతో చేసిన ప్రయత్నం ఆమెది.. ఏది గెలిచినా విజయం ఇద్దరిది..

“వెళ్దామా” స్మరణ స్వరం విని కళ్ళు తెరిచి చేయి అందించాడు.. ఆ చేయి పట్టుకుని బలంగా లాగబోతున్న ఆమెకి ఎక్కువ కష్టం కలక్కుండా విలాసంగా లేచి నిలబడ్డాడు మాధవన్.

పెద్ద గేటు ముందు కారాగింది. అలర్ట్ గా ఉన్న సెక్యూరిటీ గార్డ్  సగం తెరిచి ఉన్న గేటు పూర్తిగా తెరిచాడు. కారు ఆవరణలోకి దూసుకు వెళ్ళి, ఆగింది. డ్రైవర్ మెరుపులా దిగి వెనకాల డోర్ తెరిచాడు.

మాధవన్ హుందాగా దిగాడు. డ్రైవర్ మరో వైపు అంతే వేగంగా వచ్చి డోర్ తీసే లోపలే స్మరణ దిగింది. ఆమె చేతిలో సూట్ కేస్ పట్టుకుని దిగడం చూసిన డ్రైవర్ గబుక్కున అది లాక్కున్నట్టుగా ఆమె చేతిలోంచి తీసుకున్నాడు. స్మరణ ఇబ్బందిగా కదిలింది.. కార్ ఎక్కే ముందు కూడా డ్రైవర్ రిసెప్షన్ దగ్గరే సూట్ కేసు తీసుకుని కారులో పెట్టాడు.. ప్రోటోకాల్ అనుకుంది.

****సశేషం****

Posted in May 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!