హటాత్తుగా గుప్పెడు పూరేకులు, చేరెడు నక్షత్రాలు చేతులమీద రాలినట్టు అనిపించింది. ఆమె రెండు చేతులు ఎవరో గుప్పిట్లో పట్టుకున్నారు. విస్మయంగా కళ్ళు తెరిచింది స్మరణ..
“అయిందా ఏడవడం?” బాగా దగ్గరగా నిలబడి గుప్పిట్లో ఆమె రెండుచేతులూ బంధించి, కొంచెం ఒంగి చిరునవ్వుతో అడుగుతున్న మాధవన్..
అమాంతం నిండుగా పూసిన పొగడపూల చెట్టు తనని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్టు పులకించిపోయింది. వెంటనే చేతులు ఒక్క విదుపుతో విడిపించుకుని చేతులు ఒళ్లో పెట్టుకుని మొహం పక్కకి తిప్పుకుంది.
“హౌ ఆర్యు మేడం” అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు..
ఆమె మాట్లాడలేదు.. గుండె ఉద్వేగంతో ఎగసి పడుతోంది. ఇంద్ర ధనుస్సు నక్షత్రాలను అలంకరించుకుని వచ్చి మేడలో వాలినట్టు, ఆకాశం మేలిముసుగులా పరిచినట్టు, సప్తసముద్రాలు ముత్యాల సరాలై పాదాల కింద పరిగెడుతున్నట్టు ఒక అపూర్వమైన అనుభూతి ఆమె అణువణువూనూ వీణ తీగై మీటింది.
“హలో! మౌనమా!“ ఆమె చేయి అందుకోబోయాడు. కొంచెం ఎడంగా జరిగింది.
అతను ఎడం కాలు మీద కుడికాలు వేసుకుని రెండు చేతులూ కట్టుకుని విలాసంగా సోఫాలో వెనక్కి వాలి “అన్ టచబులిటినా” అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో కనిపించిన కొంటేదనం చూడగానే ఉక్రోషం ముంచుకుని వచ్చింది.. ఇన్నేళ్ళకు కనిపించి ఇలాగా పలకరించడం.. కొంచెం కూడా రసికత లేదు.. టూ ప్రొఫెషనల్ ...
“నాక్కాదు... మీకు.... మేము మీ కింద ఉద్యోగులం కదా... మమ్మల్ని ముట్టుకుంటే మీ అంతస్తు కిందకి దిగిపోతుంది” అంది కసిగా.
అతను కళ్ళల్లో నవ్వుతో అలాగే చూస్తూ “ఇంకా” అన్నాడు.
“మీ హోదా తగ్గిపోతుంది..” ఇంకా కసిగా అంది. ఆ కోపం, ఉక్రోషం, కళ్ళ చివర కనిపిస్తున్న తడి కొన్ని క్షణాలు అలాగే పరిశీలనగా చూస్తూ చేయి చాచి అన్నాడు “ఇలారా నువ్వు ...”
ఆమె గుండె జల్లుమంది... మనసు మల్లెపందిరి అయింది.
ఐదు అక్షరాలు పంచాక్షరీ మంత్రంలా వినిపించాయి ... ఆ ఐదు అక్షరాల ధ్వనితో ఇన్నేళ్ళ తపన, ఆరాటం, విరహంతో పాటు కొన్ని క్షణాల క్రితం పొందిన భావోద్వేగం కూడా మాటు మాయం అయాయి. ఈ మాటలు అంటున్నది ఎవరు అన్నట్టు రెప్పవేయకుండా సంభ్రమంగా అతని కళ్ళల్లోకి చూసింది. రే బాన్ గ్లాసెస్ చాటున ఉన్న అందమైన ఆ కళ్ళల్లోని ఆకర్షణ ఆమెని గాలం వేసినట్టు లాగేసిందో ఆమే అతనికి దగ్గర అయిందో తెలియని స్థితిలో అసంకల్పితంగా అతని వైపు జరిగింది. కుడిచేయి చాచి గబుక్కున ఆమె భుజం మీద వేసి దగ్గరగా లాక్కున్నాడు.
ఎక్కడికి వెళ్లావు ఇన్నేళ్ళు? చెవిలో శంఖం ఊడినట్టు వినిపించింది అతని స్వరం.
ఆమె చివ్వున వెనక్కి జరిగి “ ఈ ప్రశ్న నువ్వు ... “ ఆవేశంగా అనబోయి ఆగిపోయి తలవంచుకుని నెమ్మదిగా “సారీ” అంది.
“ఎందుకు సారీ?” మధురంగా అడిగాడు.
“మీరు ... మా సి ఇ వో కదా! నేను అతి చనువు తీసుకున్నాను...”
“ఓహో అలాగా! నిజమే కదా మర్చిపోయాను... లే, లే ఇది నా పర్సనల్ రూమ్... నువ్వెందుకు కూర్చున్నావు? గెట్ అప్” అన్నాడు లేచి నిలబడి గదమాయిస్తున్నట్టు.
ఆ స్వరంలో వినిపించిన తీవ్రతకి స్మరణకి ఒళ్ళు మండిపోయింది.. చివాల్న లేచి నిలబడి “నేనేం కావాలని, నా అంతట నేను రాలేదు.. మీ సెక్యురిటీ తీసుకుని వస్తేనే వచ్చాను. థాంక్స్ మీరు చేసిన మర్యాదకి” అంటూ ద్వారం వైపు వెళ్ళబోయింది.
నింపాదిగా ఆమె చేయి పట్టుకుని లాగాడు. ఆ విసురుకి దాదాపు అతని గుండెల దగ్గరకు వచ్చి అతి బలవంతంగా నిగ్రహించుకుంటూ రోషంగా చూసి ఏదో అనబోయింది.
“చాలు, చాలు భామా కలాపం ... చెప్పు ... ఎక్కడ మునిగావు.... ఇక్కడ తేలావు?” అడిగాడు..
అతని నుంచి వస్తున్న మత్తైన బాడీ స్ప్రే పరిమళం, కళ్ళ మీదకు తగులుతున్న వెచ్చని ఊపిరి పరవశం కలగచేస్తోంటే అంది “గోదారిలో మునిగాను... కావేరిలో తేలాను... ఇంతకీ తమరి సంగతేంటి? భూమండలం చుట్టేయడం అయిపోయిందా... చంద్రమండలం మిగిలిందేమో అది కూడా చుట్టేసి వస్తారా..”
“మనిద్దరికీ కలిపి అప్లై చేసాను వీసా ... వెళదామా..” అల్లరిగా నవ్వాడు..
“ఏం అక్కడ కూడా బ్రాంచి ఓపెన్ చేసావా”
“అవును అక్కడ నువ్వే సి ఇ వో..”
“థాంక్స్...”
ఇద్దరూ నవ్వుకున్నారు.. పదేళ్ళ నాటి స్మృతుల సుమమాల తెగిపోయి అనుభూతుల రేకులకు రెక్కలోచ్చినట్టు ఆ గది మొత్తం పరిమళించింది..
“నువ్వు మధువేనా” మరికొంచెం అతనికి దగ్గరగా జరిగి తల ఎత్తి అతని మొహం లోకి చూస్తూ అడిగింది.
“నువ్వు స్మరణవేనా!”
“కాను... స్మృతిని...”
“నేనూ మధుని కాను... మాధవన్ ని....”
“అలా అనకు... నాకు మళ్ళి గోదారిలో దూకాలనిపిస్తుంది” బుంగమూతి పెట్టి అంది.
నవ్వాడు... ఆమెని మరింతగా హృదయానికి హత్తుకుని తన్మయంగా చెప్పసాగాడు “నాకిదంతా కలలా ఉంది స్మరణా! ఎప్పుడూ ఊహించలేదు మళ్ళి కలుస్తామని .. ప్రతి క్షణం నీకు సైకిల్ నేర్పిస్తూ అక్కడక్కడా నిన్ను తగిలిన నా చేతివేళ్ళు చూసుకుంటూ, ఆ స్పర్శలోని అనుభూతిని ఆస్వాదిస్తూ, నీ జ్ఞాపకాలతో జీవిస్తూ అదంతా ఓ భ్రాంతి అనుకుంటూ ఉండేవాడిని..”
“అంటే! నువ్వు కూడా నన్ను మర్చిపోలేదా!”
“యవ్వనపు తొలకరి జల్లులాంటి స్మృతి నువ్వు.. నిన్నెలా మర్చిపోతాను.”
“మరి నా కోసం ఎందుకు వెతకలేదు?”
“ఎక్కడ వెతకాలి?” చిత్రంగా చూసాడు.
“నీకు ఎఫ్ బి ఎకౌంటు లేదా! “
“లేదు..”
“ట్విట్టర్ ?”
“లేదు..”
“ఇంస్టా గ్రామ్”
“లేదు...”
కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా రెట్టిస్తూ అడిగింది “లేదా...”
“ఎందుకంత ఆశ్చర్యం.... లేదు...”
“ఆశ్చర్యం కాదు.. అంతకన్నా పెద్దది... అలా ఎలా...”
“ఎలా ఏంటి? వై షుడ్ ఐ వేస్ట్ మై టైం ఫర్ ఇట్...”
“టైం వెస్టా ...”
“కాదా!”
“మై గాడ్...నువ్వు ఏ కాలంలో పుట్టావు..”
అతనికి నవ్వొచ్చింది... “ఏంటి నీ ప్రాబ్లం ?” అన్నాడు..
“నన్ను మర్చిపోలేదు... గుర్తుచేసుకుంటూనే ఉన్నావు అంటే నేనంటే నీకు ఇష్టం అవునా!”
“అయితే!”
“మరి నా కోసం ఎందుకు వెతకలేదు?”
“ఎక్కడ వెతకాలి? మీరు ఇల్లు ఖాళీ చేసారు అని చెప్పారు ఒకసారి అప్పుడు మనం ఉన్న ఇంటికి వస్తే... మీ స్కూల్ కి వెళ్లాను... టి సి తీసుకుని వెళ్ళిపోయింది.... ఏ కాలేజ్ లో చేరిందో తెలియలేదు అన్నారు.. మిస్సింగ్ అని పేపర్లో ఇచ్చి ఉండాల్సిందా”
“అలాంటివి చేయాలి కదా...”
“ఎందుకు”
“నా కోసం”
“అలా చేస్తే దొరుకుతావా”
“సోషల్ మీడియా లో చూడచ్చుగా.. నేను ఇప్పుడు కనిపించక పోతే ఏం చేసేవాడివి?” విస్మయంగా అడిగింది. ఆమెకి చాలా ఆశ్చర్యంగా ఉంది.. సాఫ్ట్ వేర్ రంగంలో బిల్ గేట్స్ ని ఆదర్శం చేసుకుని ఎన్నో విజయాలు సాధించిన ఈ మనిషి సోషల్ మీడియా లో యాక్టివ్ గా లేకపోవడం నమ్మశక్యం గావడంలేదు ఆమెకి.
అతను ఆమె ఆశ్చర్యం చూసి నవ్వుతూ అన్నాడు..”నాకంత టైం లేదు స్మరణా! నేను నన్ను తప్ప దేన్నీ నమ్మను... నా కృషి, నా సంకల్పం, నా ఆశలు, అవి సాధించాలన్న ఆశయం ఇవే నా విజయానికి కారణాలు... ఆ నమ్మకం తోటే నేను పెళ్లి చేసుకోలేదు.. నాకు ముప్ఫై ఏళ్ళు వచ్చేవరకు ఎదురు చూడాలని నిర్ణయించుకున్నాను.. ఇంకా తొమ్మిది నెలలు ... ఈ తొమ్మిది నెలల్లో నువ్వు కనిపించకపోతే అమ్మ నిర్ణయించిన అమ్మాయి మెడలో తాళి కడతానని చెప్పాను.”
స్మరణకి ఆ మాట గుండెల్లో ముల్లులా గుచ్చుకుంది.. గాయపడిన గుండె కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే అతని వైపు చూస్తూ “ఇంతేనా నువ్వు ప్రేమకి ఇచ్చే విలువ” అంది.
నవ్వాడు మాధవన్.. “నేను చాలా ప్రాక్టికల్ మనిషిని స్మరణా! ప్రేమించిన అమ్మాయి లభించకపోతే గడ్డం పెంచుకుని రోడ్ల మీద తిరిగితే మా అమ్మ ఏమై పోతుంది అన్న స్పృహ అనుక్షణం నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది.. అవన్నీ సినిమాల్లో, కధల్లో బాగుంటాయి.. మనతో కలిసి జీవించే వారు మనకా అవకాశం ఇవ్వరు... ఆలోచనని కూడా రానివ్వరు..”
స్మరణకి తను కూడా ఆంజనేయులుతో ఒక ఏడాది టైం ఇవ్వండి తాతయ్యా... మధు కనిపించకపోతే మీరు చూపించిన అబ్బాయిని చేసుకుంటాను అని చెప్పడం గుర్తొచ్చింది.
“నేను వెంటనే మా తాతయ్యకి ఫోన్ చేసి చెప్పాలి నిన్ను కలిసినట్టు..”
“మీ తాతయ్యకి నేను తెలుసా”
“ఎస్... నేనే చెప్పాను..”
“ఏమని” చిలిపిగా అడిగాడు.
హృదయం ఓ పాలపిట్టలా మారి రివ్వు, రివ్వు మంటూ తన చుట్టూ ఎగురుతున్నట్టు అనిపించింది. సిగ్గు తెర మొహాన్ని కప్పేసింది.. “నీక్కూడా సిగ్గు పడడం వచ్చా”
స్మరణ నెమ్మదిగా చెప్పసాగింది.. నా ప్రేమ కథ తాతయ్యకే చెప్పాను... తరవాత బదరీకి చెప్పాను..”
“ఎవరా బదరే”
“నా బాయ్ ఫ్రెండ్”
“గుడ్ ... మంచి పని చేసావు.. పద సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది వెళదాము” అన్నాడు లేస్తూ..
రసపట్టులో ఉన్న ప్రేమ ఘట్టాన్ని మధ్యలో రసాబాస చేసిన అతని వైపు చిరాగ్గా చూసి “ఇప్పుడు కూడా పంక్చువాలిటీ అవసరమా” అంది.
“ఇవాళ కూడా అన్నం తినడం అవసరమా... ఇప్పుడు కూడా గాలి పీల్చడం అవసరమా ... అవి ఎంత అవసరమో ఇదీ అంతే ... ఆఫీస్... క్రమశిక్షణ.. ఇది ఒక కోర్స్... తరవాత క్లాసులు తీసుకుంటా.. ఇంతకీ మాథ్స్ ఇంప్రూవ్ చేసావా.. అప్పడు మొద్దువి కదా” అన్నాడు లేచి నిలబడి.
“గుర్తుందా” నవ్వి అంది “నీ శిక్షణలో పర్ఫెక్ట్ అయాను...”
“గుడ్” జేబులో చేతులు పెట్టుకుని ద్వారం వైపు హుందాగా నడుస్తున్న అతన్ని చూస్తూ అనుకుంది.. జానపద సినిమాల్లో చిటికెలో తన శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశించే పరకా ప్రవేశం లాంటి చిట్కా ఇతని దగ్గర ఉందా.. ఇంతలో అంత గంభీరంగా మారడం ఎలా సాధ్యం? ఇంకాసేపు కబుర్లు చెప్తాడని, కనీసం ఒక్క తీయని...... ఛ ... రసికత లేకపోవడం అనాలా...బుద్ధావతారం అనాలా.. ఆలోచిస్తూ అతని వెనకే నడిచిన స్మరణ అతను తనని వదిలి వేగంగా వేదిక మీదకు వెళ్ళడం చూసి అవాక్కై నిలబడిపోయింది ఏంటి ఇతని మెంటాలిటీ అని ఆలోచిస్తూ.
అతను పోడియం దగ్గర నిలబడి ఉన్నాడు. వెనకాల ప్రొజెక్టర్ మీద ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు స్క్రీన్ అవుతున్నాయి. ఫోకస్ లైట్ ల వెలుగులో మంద్రమైన స్వరంతో కొత్త ప్రాజెక్ట్ గురించిన వివరాలు అమెరికన్ ఇంగ్లిష్ లో వివరిస్తున్న మధుని రెప్పవేయకుండా ముగ్ధురాలై చూస్తోంది స్మరణ.
ఇతను నా మధేనా! ఇంత పొడుగు ఎప్పుడైనాడు! ఇంత హుందాతనం ఎలా వచ్చింది? ఆ మొహంలో ఆకర్షణ అంతా విజ్ఞానం తో వెలిగే ఆ కళ్ళే.. ఎప్పుడూ ఏదో కొత్త విషయ పరిజ్ఞానానికి ద్వారాలు తెరుస్తున్నట్టు కొట్టుకునే ఆ కనురెప్పలు.. సాధారణంగా అంత పెద్ద కనురెప్పలు అమ్మాయిలకి ఉంటాయి..అవి విశాలమైన కనుదోయిని కాపలాకాస్తున్నట్టు నిలిచి ఉంటాయి. పొడుగ్గా చివర కొనతేలి ఉన్న ముక్కు, సన్నని మీసం ...అతను నవ్వుతుంటే కదిలి వస్తోందో, లేక వెలుగుతున్న లైట్ల తాలూకు వెలుతురో కానీ చెంపల మీద ప్రతిఫలిస్తూ చంద్రకిరణాలు మేఘాలను తాకినట్టు తాకుతుందో కాంతిపుంజం.
మధు.... మధు... అప్రయత్నంగా ఆమె పెదాలు కదిలాయి.. పక్కన కొంచెం ఎడంగా కూర్చున్న మీనన్ ఆమె మొహంలో కదులుతున్న భావాలు ఓరకంటితో గమనిస్తున్నాడు. ఎన్నడూ చూడని కొత్త స్మరణ కనిపిస్తోంది.. ఈ స్మరణ విరగబూసిన పారిజాతం చెట్టులా గుబాళిస్తోంది... కళ్ళల్లో కొన్ని వేల చంద్రకాంతులు పరావర్తనం చెందుతూ ఆమె శరీరంలోని అన్ని భాగాలనూ స్ప్రుశిస్తున్నట్టు మైకంలో ఉంది. ఎప్పుడూ అల్లరిగా, కొంటెగా కనిపించే ఆమె ఇప్పుడు చెక్కిళ్ళలో విచ్చుకోడానికి ప్రయత్నిస్తున్న సిగ్గుల మొగ్గల మధ్య తనని తాను సింగారించుకుంటున్న వసంతకన్యలా ఉంది.
ఎవరీ మాధవన్? ఆమెకి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? సహజమైన కుతూహలం అతని మనసులో గింగిర్లు తిరుగుతోంది.
మాధవన్ స్వరం ఆగిపోయింది.. చివరగా “ఈ మీటింగ్ రేపు ఉదయం పది గంటల నుంచి కొనసాగుతుంది... ఈ రోజు ప్రెజంటేషన్ ఇవ్వలేకపోయిన వాళ్ళు రేపు ఇవ్వాలి.. మరికొద్ది సేపట్లో నా కింకో మీటింగ్ ఉంది. వెళ్ళాలి” అంటూ అందరి దగ్గర మర్యాదగా సెలవు తీసుకుని వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు.
స్మరణ ఉలిక్కిపడింది. ఓ స్వప్నలోకంలో విహరిస్తూ అమాంతం కింద పడినట్టు అనిపించింది. భావోద్వేగంతో చప్పున మొబైల్ ఆన్ చేసి, “ఎక్సలెంట్... వాట్ ఏ వండర్ఫుల్ స్పీచ్” అని మెసేజ్ పెట్టింది మాధవన్ వాట్సప్ కి.
తన మెసేజ్ చూస్తున్నాడా, లేదా అన్నట్టు అతని మొహంలోకి చూడసాగింది. అతను జేబులోంచి మొబైల్ తీయలేదు.. పక్కనే ఉన్న డైరెక్టర్ ప్రాజెక్ట్స్ తో ఏదో మాట్లాడుతున్నాడు.
మొబైల్ ఎక్కడ పారేసుకున్నాడో..బుద్ధావతారం... చిరాకు పడింది.
ఇంతలో మేనేజర్ లేచి మైక్ ముందుకు వచ్చి ఆ రోజు సెషన్స్ పూర్తీ అయినట్టు తిరిగి మరునాడు ఉదయం అందరూ పది గంటలకు అక్కడే సమావేశం అవాలని అనౌన్సు చేసాడు. డైరెక్టర్స్ తో పాటు మాధవన్ కూడా లేచి వేదిక దిగుతుంటే అందరూ లేచి నిలబడ్డారు. స్మరణ బొమ్మలా అలా కూర్చుని కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. మాధవన్ ఒకే ఒక్క క్షణం ఆమె వైపు చూసి కళ్ళతో బై అన్నట్టు రెప్పలు ఆర్పాడు. స్మరణ ఏదో చెప్పడానికి పెదాలు కదిపింది.. శబ్దం వచ్చేలోగా అతను వేగంగా అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయాడు.
స్మరణ గబుక్కున ఒక్క అడుగు ముందుకు వేసి టేబుల్ కాలికి తగలడంతో చిన్నగా అరచి ఆగిపోయింది.
“వాట్ హాపెండ్...” మీనన్ అడిగాడు.
ఆమె సమాధానం చెప్పలేదు..