Menu Close
Page Title

సంగీతం పై సాహిత్య ప్రభావం

సంగీత ప్రాభవం నిలబడాలంటే ఏ భాషకైనా సాహిత్య ఆలంబన లేకపోతే శ్రోతలకు రససిద్ధి సాధించి పెట్టలేదు. సాధకునికైనా, శ్రోతకైనా రసానుభవం తారా స్థాయికి చేరాలంటే పాడుతున్న వారి మనస్సులో ఆ కీర్తనలో గాని, పాటలో గాని గల సహజ భావోద్రేకం శ్రోతకు అందజేయ గలిగినపుడే ఆ కృషి సాఫల్యాన్ని సాధిస్తుంది.

'బ్రహ్మ సత్యం జగన్మిధ్య' అన్నది ఆది శంకరుల ఉపనిషద్వ్యాఖ్యానంలో ‘అద్వైత సిద్ధాంత’ నిరూపణ గా నిలిచింది. అనంతము సత్చిదానందమైన ఆ బ్రహ్మపదార్ధమే చిదాభాసగా మానవునిలోనూ ఉన్నదైనా దాని ఉనికిని కనుక్కుని దానిలో లయమవడం అంత సులభ సాధ్యం కాదు. మానవ ఇంద్రియాల సముదాయం మాయా పూరిత బాహ్యప్రపంచానికి ఆకర్షిత మౌతాయిగాని అంతర్ముఖంగా ఉండే ఆ తేజోమయ సచ్చిదానంద రూపము వైపు దృష్టిని మళ్ళింప నీయవు. రంగు రంగుల బాహ్య ప్రపంచం నుంచి దృష్టి మరుపుకోలేనంత అత్యంత సుందరంగా, మనోహరంగా, ఆకర్షణీయంగా బలీయ అయస్కాంతం వలె పట్టి లాగేస్తుంటే అంతర్ముఖుడవ్వడం మనిషికి కష్ట సాధ్యమే. దానికి తోడు సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం వంటి లలిత కళలు మానవ మేధస్సు పై మరింత మత్తు మందు జల్లి మధురానుభూతిలో ముంచి అతడిని అంతర్ముఖుణ్ణి కాకుండా అడ్డుపడతాయి. అంటే అవి మానవుని దార్శనిక ఔన్నత్యము చేరడానికి అడ్డుపతున్నాయి కనుక అనుసరణీయం కావని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. భక్తి పారవశ్యంలో ముంచి ఆత్మదర్శనానికి తోడ్పడేవి కొన్నితప్ప మిగిలినవి మిధ్యా ప్రభావాన్ని ప్రజ్వలింపచేసి గమ్యంనుంచి దారి మళ్లించే కాగడాల వంటివి. సాహిత్య ప్రకర్ష మొదట్లో భక్తి భావాన్ని ఉద్దేపింపచేసేవిగా ఉండి సాహిత్య విలువలు పెంచేవి అయినా, కొన్ని క్రమంగా ఆత్మానుభవం నుంచి దిశమార్చి ఆకర్షణీయమైన కళాభాసురం వైపు దృష్టిని మళ్ళించడానికి హేతు భూతాలవుతున్నాయి. అందులో కొన్ని అంశాలు అనేక విశేషాల వల్ల ఎక్కువగా ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం ఒక కారణం కావచ్చు. భక్తి భావాన్ని పెంపొందించి తన్మయత్వంతో భక్తుడు ఏదైవాన్నైతే కొలుస్తున్నాడో ఆ పరమాత్మలో మానసికంగా ఐక్యమవడానికి సంగీతం ఎంతగానో తోడ్పడుతుంది. ఆ ప్రయత్నంలో సాహిత్యం ఆర్ద్రతని పెంచి భావాన్ని మనస్సుకు హత్తుకునేటట్లు చేసి రసానుభవం పరాకాష్టకి చేరడానికి కారణం అవుతుంది.

రామభక్తి సాగరంలో తలమునకలవుతూ వాగ్గేయకారుడైన (అనగా భాష ఏదైనా సంగీత సాహిత్యాలలో అసమాన ప్రజ్ఞ ప్రదర్శించిన వారు) త్యాగరాజు, కూతురి వివాహానికి బహుమానంగా నిలువెత్తు రాముని రంగుల చిత్ర పటమును ఆయన శిష్య పరమాణువు వాలాజపట్టి వేంకటరమణ భాగవతార్ బహుమానంగా తెస్తే ఆ రాముడే స్వయంగావచ్చాడని ఆనందపడి కృతజ్ఞతతో మోహన రాగం, ఆది తాళంలో పాడిన పాట..

"ననుపాలింపగా నడచి వచ్చితివో, నాప్రాణనాధ..
వనజ నయన మోమును జూచుట
జీవనమని నెనరున మనసు మర్మముతెలిసి
ననుపాలింపగా నడచి వచ్చితివో, నాప్రాణనాధ.
సురపతి నీలమణి నిభ* తనువుతో *సమానమైన
ఉరమున ముత్యపు సరుల చయముతో
కారమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరార్చిత
ననుపాలింపగా నడచి వచ్చితివో, నాప్రాణనాధ."


మరొక సందర్భంలో "నీవు కోరితే నీవు అనవరతము పూజించే రాముడు వేటిని తీర్చడ"ని శిష్యులు, ఆప్తులు త్యాగయ్యని ప్రశ్నించగా :
(మధ్యమావతి రాగం - రూపక తాళం)

పల్లవి: అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా?
ఆదిమూలమా! రామ! ॥అడిగి॥

అను పల్లవి: సడలని పాప తిమిరకోటిసూర్య!
సార్వభౌమ! సారసాక్ష! సద్గుణ! ని ॥న్నడిగి॥

చరణము(లు): ఆశ్రయించి వరమడిగిన సీతయడవికిఁ బోనాయె;
ఆశరహరణ! రక్కసి యిష్టమడగనపుడె ముక్కువోయె; ఓ రామ! నిన్నడిగి
వాసిగ నారదమౌని వరమడుగ వనిత రూపుఁడాయె,
ఆశించి దూర్వాసులు అన్నమడుగ అపుడె మందమాయె; ఓరామ! ని ॥న్నడిగి॥
సుతుని వేడుక జూడ దేవకియడుగ యశోద జూడ నాయె;
సతులెల్ల రతి భిక్షమడుగ వారివారిపతుల వీడనాయె; ఓరామ! ని ॥న్నడిగి॥
నీకేఁ దయబుట్టి బ్రోతువో! బ్రోవవో!
నీ గుట్టు బయలాయె;సాకేతధామ! శ్రీత్యాగరాజనుత!
స్వామి! యేటి మాయ? ఓరామ! నిన్నడిగి॥


మరొక 'నా కన్యాయము చేయకు, రామా ' అంటూ భావోద్వేగముగా పురాణ కథావస్తువులని తిరగవేస్తూ పాడిన కీర్తన: (కాపి రాగం - ఆది తాళం)

పల్లవి: అన్యాయము సేయకురా రామ!
నన్నన్యునిగ జూడకురా; నాయెడ, రామ! ॥అన్యాయము॥

అను పల్లవి: ఎన్నో తప్పులు గలవారిని, రా
జన్య! నీవు బ్రోచినావు గనుకను ॥అన్యాయము॥

చరణము: జడభరతుఁడు జింక శిశువునెత్తి బడలిక దీర్చగ లేదా?
కడలిని మునిగిన గిరి నొక కూర్మము గాపాడ లేదా?
పుడమిని పాండవ ద్రోహిని ధర్మ పుత్రుఁడు బ్రోవగ లేదా?
నడిమి ప్రాయమున త్యాగరాజనుత!
నా పూర్వజు బాధ దీర్ప లేదా? ॥అన్యాయము॥


మరొక భావోద్వేగ స్థితిలో “ధన్యుడెవరు రా” అంటూ విశదీకరిస్తూ పాడిన కీర్తన (కాపి రాగం - చాపు తాళం)

పల్లవి: అతడే ధన్యుడురా; ఓమనసా! ॥ అతడే ధన్యుడురా; ఓమనసా!

అను పల్లవి: సతతయాన సుత ధృతమైన సీతా
పతి పాదయుగమును సతతము స్మరియించు ॥నతడే అతడే ధన్యుడురా; ఓమనసా!

చరణము(లు): వెనుకఁదీక తనమనసు రంజిల్లగ
ఘనమైన నామ కీర్తన పరుఁడైనట్టి ॥యతడే ధన్యుడురా; ఓమనసా!
తుంబురువలె తన తంబూరబట్టి
దయాంబుధి సన్ని ధానంబున నటియించు ॥నతడే ధన్యుడురా; ఓమనసా!
సాయకు సుజనుల బాయక తాను
నుపాయమునను ప్రొద్దు హాయిగ గడపు ॥నతడే ధన్యుడురా; ఓమనసా!
ఉల్లపు తాపము చల్లజేసి యన్ని
కల్లలను యెంచి సల్లాపమున నుండు ॥నతడే ధన్యుడురా; ఓమనసా!
కరివరదుని తత్వ మెఱుఁగను మఱిగించి
అరిషడ్వర్గములందు బరవలేకఁ దిరుగు ॥నతడే ధన్యుడురా; ఓమనసా!
ఆర్తిని మఱియు బ్రవర్తినిఁ దొలగించి
కీర్తిగల్గిన రామమూర్తిని నెరనమ్ము ॥నతడే ధన్యుడురా; ఓమనసా!
కలగని నిజ విప్రకులమున జన్మించి
నిలువరమగు ముక్తిఫలమును జేకొన్న ॥యతడే ధన్యుడురా; ఓమనసా!
కర్మ నిష్టుఁడైన ధర్మశీలుఁడైన
శర్మ రామనామ మర్మము దెలిసిన ॥యతడే ధన్యుడురా; ఓమనసా!
కాసు వీసములకోసము ఆసతో
వేసము ధరియించి మోసము జెందని ॥యతడే ధన్యుడురా; ఓమనసా!
అందముగా నామ మందరు జేసిన
సుందర రామునియందు లక్ష్యము బెట్టు ॥అతడే ధన్యుడురా; ఓమనసా!
అన్ని పాటుకు సర్వోన్నత సుఖమున్న
యనుభవించుకొన్న వాఁడెవఁడో? ॥అతడే ధన్యుడురా; ఓమనసా!
రాజస జనులతోఁ దా జతగూడక
రాజిల్లు శ్రీత్యాగరాజనుతుని నమ్ము ॥అతడే ధన్యుడురా; ఓమనసా!


ఎంతవేడినా శ్రీరామ దర్శనం లభించని దీనావస్థలో త్యాగబ్రహ్మ యొక్క మరొక భావోన్నత్యాన్ని చాటే కీర్తన:
(పున్నాగవరాళి రాగం - ఆది తాళం)

పల్లవి: ఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా ॥
ఇది నీకు మేరగాదుర శ్రీరామ!

అను పల్లవి: పదిలముగఁ గొల్చిన - భావము వేరై యున్నది ॥ ఇది నీకు మేరగాదుర శ్రీరామ!

చరణము(లు): గతి లేనివారినిఁ గడతేర్చు దైవమని
పతితపావన! నమ్మితి; శ్రీరామ!
న్నతి వేగమున వేడితి; సంతతము స
మ్మతిని నిన్నే కోరితి; శ్రీరామ! ॥ ఇది నీకు మేరగాదుర శ్రీరామ!
పరమ దయాళువని, పాలన సేతువని
సరగున, దేవరాయ! గొల్చిన నాపైఁ
గరుణ లేదని కన్నీరాయె, జూచి నీ మనసు
గరఁగ దెందుకురా? ఓ శ్రీరామ! ॥ ఇది నీకు మేరగాదుర శ్రీరామ!
అన్నిట నిండవే, అద్భుతానందఘన!
మన్నన సేయ రాదా? శ్రీరామ! నీ
కెన్నరాని పుణ్యము రాదా? శ్రీత్యాగరాజ
సన్నుత! నీ వాఁడను గాదా, శ్రీరామ! సీతారామ! ॥ ఇది నీకు మేరగాదుర శ్రీరామ!


ఎన్నడూ రాముని సేవలోనే గడుపలేని తన నిస్సహాయస్థితిని నిందించుకొంటూ
(ముఖారి రాగం - చాపు తాళం)

పల్లవి: ఇందుకా యీ తనువును బెంచిన దిందుకా॥

చరణము(లు): నీ సేవకులేక నీకు చెంతకురాక
ఆశదాసుఁడై అటులిటుదిరుగు టందుకా॥
నిరతము నీ దృష్టి నే యార్జింపక
ఒరుల భామలను ఓర జూపులు జూచు టందుకా॥
సారెకు నామస్మరణము జేయక
యూరిమాట లెల్ల యూరక వదరు టందుకా॥
కరములతో పూజ గావింపక డాచి
ధరలోన లేని దుర్దానములకు చాచు టందుకా॥
వారము నీ క్షేత్రవరముల చుట్టక
భూరికి ముందుగా పారిపారి తిరుగు టందుకా॥
నీవాఁడని పేరు నిందు వహింపక
నావాఁడని యముఁడు నవ్వుచు బాధించు టందుకా॥
రావయ్య శ్రీ త్యాగరాజ వినుత నిన్ను
భావింపక ప్రొద్దు బారగొట్టుకొను టందుకా॥


ఆర్తితో సుసంపన్నమైన మరొక కీర్తన; (అఠాణ రాగం - ఆది తాళం)

పల్లవి: ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు ॥
ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు||

అను పల్లవి: బాల! కనకమయచేల! సుజనపరి
పాల! శ్రీరమాలోల! విధృతశర
జాల! శుభద! కరుణాలవాల! ఘన
నీల! నవ్య వనమాలికాభరణ! ॥

చరణము(లు): రారా దేవాదిదేవ! రారా మహానుభావ!
రారా రాజీవనేత్రా! రఘువరపుత్రా!
సారతర సుధాపూర హృదయ
పరివార జలధిగంభీర దనుజ
సంహార దశరథ కుమార బుధజన
విహార సకలశృతిసార నాదుపై ॥ ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు||

రాజాధిరాజ! మునిపూజితపాద! రవి
రాజలోచన! శరణ్య అతిలావణ్య!
రాజధరనుత! విరాజ తురగ! సుర
రాజవందిత పదాజ! జనక! దిన
రాజకోటి సమతేజ! దనుజగజ
రాజ నిచయ మృగరాజ! జలజముఖ! ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు||

యాగరక్షణ! పరమ భాగవతార్చిత!
యోగీంద్ర సుహృద్భావిత! ఆద్యంతరహిత!
నాగశయన! వరనాగ వరద!
పున్నాగ సుమధుర! సదాఘమోచన!
సదాగతిజ ధృతపదా! గమాంతరచర!
రాగ రహిత! శ్రీత్యాగరాజ నుత ॥ ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు||


ఇక మరొక వాగ్గేయకారుడు భద్రాచల రామదాసుగా ఖ్యాతి గడించిన కంచర్ల గోపన్న రామ సంకీర్తనలు :
(అసావేరి రాగం - త్రిపుట తాళం)

పల్లవి: ఉన్నాడో లేడో భద్రాద్రియందు

చరణము(లు):
ఉన్నాడో లేడో యాపన్న రక్షకుడు
ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు ఉన్నాడో లేడో||

నన్నుగన్న తండ్రి నా పెన్నిధానము
విన్నపము విని తా నెన్నడు రాడాయె ఉన్నాడో లేడో||

ఆకొని నే నిపుడు చేకొని వేడితే
రాకున్నా డయ్యయ్యో కాకుత్స్థ తిలకుడు ఉన్నాడో లేడో||

వాటముగ భద్రాచల రామదాసుతో
మాటలాడుటకు నాటకధరుడు ఉన్నాడో లేడో||


మరొక ఆవేదనాభరిత కీర్తన (ఆనందభైరవి రాగం - తిశ్ర ఏక తాళం)

పల్లవి: ఎందుకు దయరాదు శ్రీరామ
నేనేమి చేసితి శ్రీరామ ఎందుకు దయరాదు||

చరణము(లు): గతినీవే యనుకొంటి శ్రీరామ నా
వెత మాన్పవయ్య శ్రీరామ ఎందుకు దయరాదు||

చేపట్టి రక్షింపవేల శ్రీరామ
నాప్రాపు నీవేనయ్య శ్రీరామ ఎందుకు దయరాదు||

అయ్యయ్యో నానేరమేమి శ్రీరామ నా
కుయ్యాలింపవయ్య శ్రీరామ ఎందుకు దయరాదు||

ఇంక నీదయ రాకుంటె శ్రీరామ నా
సంకట మెటుతీరు శ్రీరామ ఎందుకు దయరాదు||

ఏండ్లు పండ్రెండాయెనే శ్రీరామ నీ
కండ్లకు పండుగె శ్రీరామ ఎందుకు దయరాదు||

వాసియౌ భద్రాద్రివాస శ్రీరామ రామ
దాసుని విడువకు శ్రీరామ ఎందుకు దయరాదు||


అన్నిటి లో ఆరాముని పరంధాముని చూస్తూ రామదాసు పాడుకున్న పాట వరాళిరాగం, ఆదితాళంలో:

పల్లవి: అంతా రామమయంబీ జగమంతా రామమయం
అంతా రామమయంబీ జగమంతా రామమయం

చరణము(లు): అంతరంగమున నాత్మారాముం డ
నంతరూపమున వింతలు సలుపగ
అంతా రామమయంబీ జగమంతా రామమయం
సోమసూర్యులును సురలును తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు
అంతా రామమయంబీ జగమంతా రామమయం
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ
అంతా రామమయంబీ జగమంతా రామమయం
నదులు వనంబులు నానామృగములు
విదితకర్మములు వేదశాస్త్రములు
అంతా రామమయంబీ జగమంతా రామమయం
అష్టదిక్కులును నాదిశేషుడును
అష్టవసువులును నరిషడ్వర్గము
అంతా రామమయంబీ జగమంతా రామమయం
ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారకనామము
అంతా రామమయంబీ జగమంతా రామమయం


మరొక ఆవేదనాభరిత సంకీర్తన, కాంభోజి రాగం - ఆది (త్రిపుట) తాళంలో :

పల్లవి: ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
అక్కట నాకన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా
ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
అక్కట నాకన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా .

చరణము(లు): ప్రకటమాయెను పాపములెటుల బాధకోర్తును శ్రీరామా
సకలలోక రాజ్యపదవికి ఎక్కువైనయట్టి శ్రీరామా||

ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
అక్కట నాకన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా||

పృథివిలోన పూర్వజన్మల పూజలింతేగా శ్రీరామా
విధులు జరుపవలయు విషయ వాంఛలు దలుపక శ్రీరామా
ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
అక్కట నాకన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా||

మూడు నెలలాయె నీ మునుముందర నిల్వక శ్రీరామా
ఎన్నడిట్లుండి రాఘవ నేనెరుగ నను గన్నయ్యా శ్రీరామా
ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
కోరి భద్రాచలమున రాముని కొలుతునంటిని శ్రీరామా
కోర్కెలొసగి రామదాసుని గనుగొని రక్షింపుమంటి శ్రీరామా
ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
అక్కట నాకన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా ||


మరొక గానమైన ఆర్తనాదం:రాగం నాదనామక్రియ - ఆదితాళం లో

పల్లవి: ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా
నాతరమా భవసాగరమీదను నళినదళేక్షణరామా .

చరణము(లు): శ్రీరఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నదికానుపు రామా..
మురిపెముతో నాస్వామివి నీవని ముందుగ దెల్పితి రామా
మరువక యిక నభిమానముంచు నీమరుగు జొచ్చితిని రామా
ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా నాతరమా
క్రూరకర్మములు నేరకచేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముచేయవె దైవశిఖామణి రామా - ఏతీరుగ నను దయజూచెదవో||

గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా- ఏతీరుగ నను దయజూచెదవో||

నిండితి నీవఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీనామము దలచిన నిత్యానందము రామా- ఏతీరుగ నను దయజూచెదవో||

వాసవకమల భవాసురవందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా- ఏతీరుగ నను దయజూచెదవో||

వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథీ రఘురామా
ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా
నాతరమా భవసాగరమీదను నళినదళేక్షణరామా.

-సశేషం-

Posted in January 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!