Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

బ్రతుకును ఎడారిలా చూపిస్తవు
ఆశను ఓయాసిస్సులా చూపిస్తవు
కాల బండ మీద ఆయువును అరగబెడతవు
పాణాన్ని పండబెట్టి
జీవితం అయిపోయిందటవు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివ

నీ టెక్నాలజీ ముందు
మా టెక్నాలజీ ఎందుకు పనికిరాదయ్యా
పైసలెట్టి పెట్రోల్ పోసి బండ్లు నడిపేది మేము...!
ముక్కులో ఉచిత గాలిపోసి బ్రతుకుబండ్లు నడిపేది నువ్వు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివ

చేనులో నందిని చూసాను
చెరువులో గంగను చూశాను
చెట్లలో వాసుకిని చూశాను
చెంతలో నిన్ను చూడలేకపోతున్నా...
ఈ చింత తీర్చ నీ మాయ ముంతను తన్ని కానరావా...?
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివ

ఎంత కసిరినా ఉలకవా పలకవా
బండరాయిలో చేరి బండబారిపోయావేమో...!
ఉలకని నిన్ను మళ్ళా మళ్ళా పిలిచే నేను మొండిని...
పట్టనట్టు నటించే నువ్వు జగమొండివి
నీ ముందు నా పప్పులుడుకునా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా

మాచే అడ్డబొట్టు పెట్టిస్తావు
అడ్డంగా మాతో ఆడుకుంటావు
నీ ఆటకు అడ్డు అదుపులేదా...?
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివ

నువ్వు అంతా ఉంటవు సామీ
అయినా మాకు కనబడవు ఏమి
ఇంతలో మమ్ము తింటది భూమి
నీ ఆటకు నీవెసాటి భళా సామీ...

కొందరు కాట్లో ఉంటవంటరు
కొందరు గుళ్ళో ఉంటవంటరు
కొందరు గుండెల్లో ఉంటవంటరు
నువ్వు యాడుంటెనేమీ యాడతిరిగితేనేమీ
ఇదంతా నీ ఆట స్వామీ
నీ ఆటలో మేమంతా రాలిపోయే క్రిమీ...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

మంచోణ్ణి చెడ్డోణ్ణి చేస్తవు
చెడ్డోణి మంచోణ్ణి చేస్తవు
ఉన్నోణ్ణి లేనోణ్ణి చేస్తవు
లేనోణ్ణి ఉన్నోణ్ణి చేస్తవు
నీ మాయతో మసిపూసి మారెడుకాయ చేస్తవు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నువ్వు మారుతిలా మారావు
కోతి వేశాలు వేశావు
కానీ...! నా మనసు కోతి అల్లరిని గాలికొదిలావు
నీ మూతి చూడకుండా మూతి తిప్పుకుంటున్న ఈ కోతికి
నీ ఖ్యాతిని తెల్పరాదా...?
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...

... సశేషం ....

Posted in August 2022, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *