అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
సుగంధి నీ విమానదర్శనాలు నిత్యపుణ్యసాధకా లీవి(1), మానవాళివృద్ధికే కరావలంబముల్ దేవిమానగాశ్రయేశ(2)దృగ్వరప్రసాదముల్ భావిమాననీయలక్షణప్రచోదయంబులౌ(3) 111 (1) దానము (2) లక్ష్మీదేవికి కొండలకు ఆధారమైన భూదేవికి, నాథుడైన వేంకటేశ్వరుని (3) ముందుకాలంలో గౌరవింపదగిన లక్షణాలను ప్రేరేపించేవి ఉ. స్వర్ణమయంబెగా కలశపాత్రశఠారులుఁ బళ్ళెరంబులున్ స్వర్ణమయంబెగా సకలవాహనభూషణతోరణంబులున్ స్వర్ణమయంబెగా రథము సద్గతిహేతులసద్విమానమున్(1) స్వర్ణమయంబు గానిదనఁ జక్షురగోచర మిందిరావిభో!(2) 112 (1) మంచి గతులు ప్రాప్తించుటకు కారణమై [భూమి నుండి (మానవులకు) లేదా ఆకాశము నుండి (దేవతలకు) దర్శనము చేతనే] ప్రకాశించెడి ఆనందనిలయ గోపురము (2) పరమైశ్వర్యస్వరూపిణియైన లక్ష్మీదేవికి విభుడా/ ఇందు+ఇరావిభో=ఇచ్చట (ఈ కొండపై) భూదేవికి విభుడా పం. నిరంతరాంతరంగరంగనిశ్చలార్చితా!(1) స్వరా ట్పరాంతకా!(2) యనంత! రంగ! పద్మజామనోఽ౦బుభృ న్నిరంతరంగభంగసంగ!(3) దివ్యతుంగమందిరా! (4) నిరంతరాయవృద్ధి నిచ్చి నీవ కావ రావయా! 113 (1) ఎల్లప్పుడు అంతరంగమనే నాట్యస్థానమున మాఱక అర్చింపబడువాడా (2) దేవేంద్రుని శత్రువులైనవారిని అంతము చేసినవాడా (3) లక్ష్మీదేవిమనస్సు అనే సముద్రములోని అంతులేని ఆనందపుటలలు కూడినవాడా (4) దేవలోకములో పుట్టిన / శ్రేష్ఠమైన కొండ నివాసముగా కలవాడా చం. తిరుమలవేంకటేశపదదివ్యమయూఖము నా శిరంబుపై స్థిరముగ నున్నఁ జాలుఁ గద తృప్తిగ వాలి నమస్కరించెదన్ కరములు ధన్యమౌ గతిని; కల్మషకిల్బిషవృత్రహారి శ్రీ కరసరసీరుహోద్భవ మఖండకృపాకర మా కరంబె(1) యౌ 114 (1) కిరణమే ఉ. “మూర్తి సువర్ణపద్యములు ముచ్చట గొల్పెడు భావవీచి పై పూర్తిగ ధ్యాస నిల్పి పదముల్ ధ్వను లెంచి రచించు భక్తి; నీ స్ఫూర్తికి మూలకారణము మువ్వురమే కద, పూర్వవాసనల్ గుర్తుకుఁ దెచ్చు కైత లివి కొం” డని కొండలసామి వల్కఁడే? 115