Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

చాణక్య (క్రీ.పూ. 350-275)

మౌర్య సామ్రాజ్య స్థాపనలో చంద్రగుప్త సాధించిన విజయానికి ముఖ్య కారకుడు చాణక్య. ఈయన చూపించిన అసామాన్య చతురత వల్లనే చంద్రగుప్త విజయం సులువయింది. ఈ రాజ్యాంగవేత్త, తత్త్వవేత్త, చంద్రగుప్తకు ముఖ్య సలహాదారు, ప్రధాన మంత్రిగా ఉండటం జరిగింది. చాణక్యను ‘కౌటిల్య’, ‘విష్ణుగుప్త’ అని కూడా అంటారు. ఈయన పుట్టు పూర్వోత్తరాలు ఇదమిద్దంగా ఎవరికీ తెలి యవు.

పుట్టు పూర్వోత్తరాలు

బౌద్ధ గ్రంధాలు, జైన గ్రంధాలు ఈయనను గురించి వేరువేరుగా వివరించాయి. ఈయన తండ్రి ‘చణక’, తల్లి ‘చానేశ్వరి’. వీరు దక్షిణాపథం నుంచి వచ్చిన ‘దామిల’ (ద్రావిడ) బ్రాహ్మణులు. వీరికి చాణక్య పాటలీపుత్ర లో శృంగ సామ్రాజ్య స్థాపకుడు నంద వంశపు రాజు ‘మహాపద్మ నంద’ (క్రీ.పూ. 400-329) పాలనాకాలంలో జన్మించాడు. వృత్తిరీత్యా ఆచార్యుడయిన చణక ఆ సమయంలో నందరాజు సంస్థానంలో ఉన్నత ఉద్యోగిగా ఉన్నాడు.

చాణక్య కు శునక దంతాలకు పోలిన దంతలున్నాయని, ఇవి ఉండటం రాచరికపు చిహ్నమని నమ్మి ఆయన తల్లి తన పుత్రుడు రాజు అయిన తరువాత తనను విస్మరిస్తాడని భావించింది. ఆమెను శాంతింప చేయటానికి చాణక్య తన పళ్ళను విరగకొట్టాడు. ఈ విరిగిన పళ్ళు, వంకర పాదాలతో చాణక్య చూడటానికి కురూపిగా కనపడేవాడు. ఈయన ధనిక బ్రాహ్మణ స్త్రీని వివాహమాడినప్పుడు బంధువులు ఆమెను ఒక దరిద్రుడు, అంగ వైకల్యుడిని భర్తగా చేసుకున్నావని ఎగతాళి చేసారు.

చాణక్య వేదాలు, రాజకీయంలో ప్రవీణుడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించిన తరువాత అక్కడే రాజనీతి శాస్త్రం, ఆర్ధిక శాస్త్రంలో ఆయన ఆచార్యుడుగా స్థిరపడ్డాడు.

చాణక్య-ధనా నంద ల వివాదం

ఆ సమయంలో పశ్చిమ భారతావని మీద గ్రీకు-మాసిడోనియల దండయాత్రలు రాజకీయ సంక్షోభానికి తెర తీశాయి. ఫలితంగా చాణక్య తక్షశిలను వదలి పాటలీపుత్ర వెళ్ళిపోయాడు. అదే సమయంలో శృంగ వంశజుడైన ధనా నంద (Dhana Nanda; పాలన క్రీ.పూ. 329-321) నంద రాజ్యాన్ని పాలిస్తున్నాడు.

ఒక రోజు క్రూరుడైన ధనా నంద పురుషపుర (పెషావర్) లో బ్రాహ్మణులకు దానాలు ఇచ్చే వేడుక ఏర్పాటు చేసాడు. ఈ వేడుకకు చాణక్య వెళ్ళటం జరిగింది. వికార రూపంతో ఉన్న చాణక్యుని చూసి రాజు అసహ్యించుకుని ఈయనను సభ నుంచి తరిమివెయ్యమని భటులను ఆజ్ఞాపించాడు. అప్పుడు చాణక్య కోపంతో తన జంధ్యాన్ని తెంచి, శిఖను ఊడదీసి జాడించి రాజును శపించాడు. వెంటనే రాజు చాణక్యుని బంధించమని సైనికులను ఆజ్ఞాపించాడు. చాణక్య అతి వేగంతో తప్పించుకుని ధనా నంద పుత్రుడి సహాయం పొంది అతను ఇచ్చిన రాజముద్రను చూపించి రహస్య మార్గం ద్వారా రాజభవనం నుంచి పారిపోయాడు.

తరువాత ఆయన బౌద్ధ ‘ఆజీవక’ గా వేషం మార్చి, కొన్నాళ్ళకు ధనా నంద పుత్రుడితో స్నేహం చేసి తన తండ్రిని పదవీచ్యుతుడిని చేసి తాను సింహాసనాన్ని అధిష్టించమని పురికొల్పాడు. ధనా నంద పుత్రుడికి ధైర్యం లేక అంత సాహసం చేయలేకపోయాడు. అప్పుడు చాణక్య ధనా నందను పదవీచ్యుతుడిని చేసి శృంగ సామ్రాజ్యాన్ని కూలదోస్తానని ప్రతిజ్ఞ చేసాడు.

వెంటనే ఆయన వింధ్యాచల అడవికి పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు. కొన్నాళ్ళు ఆయనకు తెలిసిన రస ధాతు (alchemy) విద్యను ఉపయోగించి కోట్లాది బంగారు నాణెములను తయారు చేసాడు. ఈధనాన్ని దాచి, ధనా నంద స్థానాన్ని భర్తీ చేయడానికి తగిన వ్యక్తి కొరకు అన్వేషించసాగాడు.

జనకంటకుడైన రాజుకు ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఉపయోగించి ధనా నందను పదవీచ్యుతుడ్ని చేసే ప్రయత్నం విఫలమవటంతో మరొకమార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఒక రోజు అడవిలో తిరిగేటప్పుడు ఒక బాలుడు తాను తినే చపాతీని మొదట అంచు చుట్టూ ఉన్న భాగాన్ని కొరకటం చూడటం జరిగింది. చాణక్య దీనిని గమనించి నంద సామ్రాజ్య సరిహద్దుల నుండి మొదలుపెట్టి క్రమక్రమంగా సామ్రాజ్యం లోపల భాగానికి వచ్చి ధనా నంద ను పడగొట్టాలని నిర్ణయించాడు.

ఈ మార్గం సఫలం కావాలంటే ముందు సామ్రాజ్య సరిహద్దులలో ఉన్న ప్రజలు, అధికారులలో రాజు పట్ల ఉన్న వ్యతిరేకత, అసహనం, తిరుగుబాటుతనాన్ని ఉపయోగించుకుని ధనా నంద మూలల మీద దెబ్బ తీయాలని నిర్ణయించుకున్నాడు.

చాణక్య శిష్యుడుగా చంద్రగుప్త

ఒక రోజు చాణక్య అడవిలో అనేక మంది బాలురు ఆడుకోవటం చూసాడు. వీరిలో ఇద్దరు బాలురు (చంద్రగుప్త, ప్రభాత) ఆయన దృష్టిలో పడ్డారు. వీరిద్దరు రాజు పాత్రలో నటిస్తుంటే ఇతర బాలురు సామంతులు, పాలెగాళ్ళు, మంత్రులు, దొంగలు, తదితర పాత్రలలో నటిస్తున్నారు. రాజు పాత్రలోఉన్న చంద్రగుప్త దొంగలకు చేతులు, కాళ్ళు నరకమని ఆజ్ఞాపించి, అమలుచేయించిన తరువాత వెంటనే వీటిని ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తుల శరీరాలకు అతికించేసాడు. ప్రభాత కూడా ఇంచుమించు ఇటువంటి పనే చేశాడు.

ఆ తరువాత చాణక్య వీరిద్దరిని దగ్గరకు తీసుకుని వీరికి ఒక పరీక్ష పెట్టాడు. చెరి ఒక తాయెత్తు ఇచ్చి వాటిని ఒక ఊలు తాడుతో మెడకు కట్టుకోమని ఆదేశించాడు. కొన్నాళ్ల తరువాత చంద్రగుప్త నిద్ర పోతున్నప్పుడు ఈతని కంఠానికి ఉన్న తాయెత్తును నిద్రాభంగం కలుగకుండా తీయమని ప్రభాతను ఆదేశించాడు. ప్రభాత ఈ పని చేయలేకపోయాడు. కొంతసేపు తరువాత ప్రభాత నిద్రపోయినప్పుడు చాణక్య చంద్రగుప్తను ఈ కార్యం చేయమని ఆజ్ఞాపించాడు. చంద్రగుప్త వెంటనే ప్రభాత శిరస్సు నరికి ఊలు దారానికి వేలాడుతున్న తాయెత్తును తీసి చాణక్యకు అందించాడు.

దీనికి చాణక్య సంతసించి ధనా నందను మట్టుబెట్టటానికి చంద్రగుప్త తగిన వ్యక్తి అని నిర్ణ యించి అతనిని శిష్యుడిగా స్వీకరించటానికి సంసిద్ధుడయ్యాడు. చంద్రగుప్త పెంపుడు తండ్రికి వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి ఈ బాలుడిని తన సంరక్షణలో ఉంచుకున్నాడు.

ఏడు (7) సంవత్సరాలు రాజధర్మం, విధులు, కర్తవ్యాలు, యుద్ధ నీతి, పరిపాలన పద్ధతులు, మొదలగు విషయాలలో చంద్రగుప్త కు శిక్షణ ఇచ్చాడు. చంద్రగుప్తకు యుక్త వయస్సు వచ్చినప్పుడు చాణక్య తాను దాచిపెట్టిన బంగారు నాణాల నిధిని ఉపయోగించి భారీ సైన్యాన్ని సమీకరించాడు. వెంటనే ఈ సైన్యంతో ధనా నంద రాజధాని పాటలీపుత్ర మీద దండెత్తారు. కాని భారీ ఓటమి పాలయ్యారు.

ఒక రోజు ఒక ఊరులో వీరిద్దరు సంచరిస్తున్నప్పుడు ఒక తల్లి ఆమె పుత్రుడు మధ్య జరిగిన సంభాషణ విన్నారు. ఆ పుత్రుడు ఒక రొట్టె మధ్యభాగాన్ని తిని మిగతా అంచుల భాగాన్ని పారవేసాడు. ఇది చూసి తల్లి ఈ విధంగా అంది: “నీవు చంద్రగుప్త లా తింటున్నావు. ఆయన మొదట రాజ్య సరిహద్దులలో ఉన్న గ్రామాలమీద దండెత్తి జయించకుండా బలంగా ఉన్న రాజ్య మధ్య భాగం మీద దండెత్తి ఓటమిని చవిచూశాడు. నీవు రొట్టెను అలా తినకూడదు”. ఇది గమనించిన చాణక్య, చంద్రగుప్త తాము చేసిన తప్పు బోధపడింది.

చాణక్య వ్యూహం

వెంటనే చాణక్య క్రొత్త వ్యూహం రచించాడు. వాయువ్య దిశలో ఉన్న పర్వత శ్రేణులలో ‘హిమ వత్కుట’ అనే సామ్రాజ్యాన్ని పరిపాలించే నంద సామంత రాజు ‘పర్వతక’ తో స్నేహం చేసి ఒక ఒడంబడిక చేసు కున్నాడు. అది నంద రాజ్యాన్ని గెలిచిన తరువాత అర్ధ భాగాన్ని పర్వతకకు ఇవ్వటం.

పర్వతక సహాయంతో చాణక్య-చంద్రగుప్త లు నంద రాజ్యంలోని కొన్ని పట్టణాలను ముట్టడించి స్వాధీనపరచుకున్నారు. వీటిల్లో ఒక పట్టణం గట్టిగా ఎదిరించారు. అప్పుడు చాణక్య ఆ పట్టణంలో శివ భిక్షకుడు వేషంలో ప్రవేశించి అక్కడి ప్రజలతో వారు ‘సప్త మాతృకల’ (బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండ/చాముండేశ్వరి) విగహాలను అచ్చటి దేవాలయం నుంచి తొల గిస్తే ముట్టడి ఆగిపోతుందని ప్రకటించాడు. మూఢ విశ్వాసం గల పౌరులు, రక్షకులు ఆమూర్తులను దేవాలయం నుంచి తొలగించే సమయంలో చాణక్య తన సైన్యాన్ని ఆ పౌరులమీద జరిపే ముట్టడిని నిలుపుజేయమని ఆదేశించాడు. తాము జేసిన పని వల్ల యుద్ధం ఆగిపోయిందని ఆ పట్టణ ప్రజలు, రక్షకులు తమ విజయోత్సవ సంబరంలో మునిగియున్నప్పుడు వారిమీద చాణక్య సైన్యం ఆకస్మిక దాడి చేసి ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుంది.

క్రమక్రమంగా చాణక్య, చంద్రగుప్త రాజధాని పాటలీపుత్ర చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. చివరగా పాటలీపుత్ర మీద దాడి జరిపి ధనా నందను ఓడించి శృంగ సామ్రాజ్యాన్ని క్రీ.పూ. 321 లో తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. వెంటనే చాణక్య చంద్రగుప్తను రాజుగా ప్రకటించి సింహాసనమెక్కించాడు.

ధనా నంద మరణం

చరిత్రలో ధనా నంద మరణం గురించి రెండు రకాల వివరాలు ఉన్నాయి.

ఒక విధం: సింహాసనం పోగొట్టున్న ధనా నందను బంధించి తన వద్దకు తీసుకు రమ్మని తన సైనికులను చాణక్య ఆదేశించాడు. బందీగా ఉన్న నంద రాజు ను చూసి ఆయన ముఖం మీద ఉమ్మి తన ఖడ్గంతో అయన తల నరికి తన చిరకాల పగ, ప్రతీకారం తీర్చుకున్నాడు.

తరువాత ధనా నంద కుటుంబాన్ని తమ వస్తువులను ఒక బండిమీద వేసుకుని తమకు తామే రాజ్య బహిష్కరణ చేసుకోమని చాణక్య ఆదేశించాడు. ధనా నంద కుటుంబం బండి మీద పాటలీ పుత్ర నుంచి వెళ్ళుతున్నప్పడు నంద రాజ పుత్రిక నూతన చక్రవర్తి చంద్రగుప్త ను చూసి మోహించి, తరువాత స్వయంవర సంప్రదాయంలో ఆయనను పరిణయమాడింది. ఆమె రధం దిగిన తరువాత రధచక్రానికి ఉన్న ఆకులలో 9 విరిగిపోయాయి. దీనిని చాణక్య చూసి చంద్రగుప్త రాజ వంశం 9 తరాల పాటు విలసిల్లు తుంది అని ప్రకటించాడు.

ఈ సమయంలో ధనా నంద సౌధంలో ఉన్న విష కన్యలలో ఒకామెను పర్వతక ప్రేమించి చాణక్య ప్రేరణతో, అనుమతితో వివాహం ఆమెను చేసుకోటానికి సిద్ధమయ్యాడు. వివాహ సమయంలో ఆమెను తాకినప్పుడు పర్వతక కుప్పకూలిపోయాడు. ఇది చూసిన చంద్రగుప్త వైద్యుడిని రప్పించే ప్రయత్నం చేస్తున్నపుడు, చాణక్య వారించాడు. ఫలితంగా పర్వతక మరణించాడు.

యుద్ధానికి ముందు జరిగిన ఒడంబడిక ప్రకారం గెలిచిన సామ్రాజ్యంలో అర్ధ భాగాన్ని పర్వతక కు ఇవ్వాలి. దీనిని నివారించటానికి ఈ విధంగా పర్వతక అడ్డును చాణక్య తొలగించి నంద సామ్రాజ్యమంతటికి చంద్రగుప్తను రాజుగా ప్రకటించి సింహాసనమెక్కించాడు.

రెండవ విధం: యుద్ధం ముగిసిన తరువాత ధనా నంద సంపద దాచిపెట్టిన చోటును కనిపెట్టమని ఒక మత్స్యకారుడిని చాణక్య ఆదేశించాడు. ఈ మత్స్యకారుడు దీనిని కనిపెట్టి చూపించగా చాణక్య అతనిని సంహరించి సంపదను స్వాధీనం చేసుకున్నాడు. తదుపరి ‘పనియతప్ప’ అనే సైనికాధారికి తిరుగుబాటు దారులు, దొంగలు, విద్రోహులను రాజ్యం నుంచి నిర్ములించమని ఆదేశించాడు.

ఇది జరిగిన తరువాత రాజ సౌధం నేలమీద చీమ సమూహం ధాన్యం గింజలను నోటికి కరిచి నేలమీద ప్రాకుతూ ద్వారం సందులలో (నెఱ్ఱలలో) నుంచి బయటకు రావటం చాణక్య చూడటం జరిగింది. ఆయన ఈ నెఱ్ఱలను పరిశీలించగా నంద అనేక మంది ధనా నంద సైనికులు భూగర్భ గృహంలో దాగి చాణక్య-చంద్రగుప్తల మీద ఆకస్మిక దాడి చేయటానికి సంసిద్ధులయి ఉన్నారు.

చాణక్య ఏమాత్రం తొణకకుండా తన సైనికులను రాజ సౌధంనుంచి బయటకు పంపించి, రాజ గృహానికి తాళంవేసి నిప్పు అంటించి దాన్ని పూర్తిగా కాల్చి బూడిద చేసాడు. దీనితో పాటు నంద సైని కులందరూ మరణించారు.

ధనా నంద పార్థివ శరీరం పట్ల చాణక్య ప్రవర్తించిన తీరు, మౌర్య సామ్రాజ్య విస్తరణ

ధనా నంద మరణించిన తదుపరి చాణక్య ఆయన పార్థివ దేహాన్ని శిరోజాలకు కట్టి వ్రేలాడదీయించాడు. శరీరానికి దహన కాండ చేయకూడదని ఆజ్ఞాపించి దానిని బయట పడవేయాలని ఆజ్ఞాపించాడు. చివరికి నంద దేహం పక్షులు కూడా తినలేని స్థితిలో ఉండి, కుళ్ళి కృశించి, నశించింది!!

ఇటువంటి కిరాతక చర్య భారతీయ సంప్రదాయంలో నిషిద్ధం. మృత-మానవునికి, అందు లోనూ ఒక రాజుకు, జరిగిన ఈ చర్య అత్యంత హేయమైనది. ఇది ఒక మానవుని ఆత్మకు అత్యంత అవమానం. దీనిని బట్టి చాణక్య ధనా నంద యెడల ఎంత కక్ష పెంచుకున్నాడో అర్ధమవుతుంది. ఆ కక్ష ఈ విధంగా తీర్చుకున్నాడు.

నంద సామ్రాజ్యాన్ని కూలద్రోసి, ధనా నందను వధించి చంద్రగుప్తను నంద సింహాసనాధీశుడిని చేసి మౌర్య సామ్రాజ్య స్థాపనలో చాణక్య సాధిచిన విజయాలు అసమానమైనవి. ఆయన వ్యక్తిత్వంలో ముఖ్యమైనవి రాజతంత్ర చతురత, రాజకీయ యుక్తి, సాహసత్వం, అసమానమైన పట్టుదల, నిరంతర కృషి. ఇవే ఆయన విజయానికి సోపానాలయ్యాయి. ధనా నంద ను సంహరించి చంద్రగుప్తను సింహాసనమెక్కించిన తరువాతే చాణక్య అనేక సంవత్సరాలుగా ఊడదీసి ఉన్న తన శిఖను ముడివేసుకున్నాడు!

చంద్రగుప్తకు చాణక్య ప్రధాన మంత్రి గా ఉండి మౌర్య సామ్రాజ్యాన్ని అత్యంత శక్తివంతమైనది గా తీర్చిదిద్దాడు. పాటలీపుత్ర ను రాజధానిగానే ఉంచి ఇతర రాజులను జయించి సామ్రాజ్య పరిధుల ను పశ్చిమ దిశలో సింధు నది వరకు, తూర్పు దిశలో బంగాళా ఖాతం వరకు పెంచాడు. క్రీ.పూ. అలెగ్జాండర్ నియమించిన మాసిడోనియా గవర్నరుల అధీనంలో ఉన్న పంజాబు ప్రాంతాన్ని (ఇప్పటి పశ్చిమ, ఉత్తర పాకిస్తాన్) క్రీ.పూ. 305 లో స్వాధీన పరచుకుని మౌర్య సామ్రాజ్యాన్ని మరింత విస్తరించటానికి సహాయపడ్డాడు.

వచ్చే సంచికలో బిందుసార మౌర్య జననం, చాణక్య నీతి, తదితర విషయాలగురించి తెలుసుకుందాము.

****సశేషం****

Posted in February 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!