Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 20
సత్యం మందపాటి

స్పందన

గుంటూరులో నేను హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో దగ్గరలోనే వున్న కూరగాయల బజారుకి వెడుతుండే వాడిని. ప్రతిరోజూ పోలీసులు అక్కడ పెద్ద కొట్ల దగ్గరకు రాగానే, కొన్ని కూరలతోపాటు మడిచిన కొన్ని రూపాయ నోట్లు కూడా ఆ పోలీసులకి ఇస్తుండేవాళ్ళు షాపులు వాళ్ళు. ఎక్కడో పల్లెటూళ్లలో కొన్ని కూరలు కొనుక్కుని కాస్తో కూస్తో లాభం కోసం ఎన్నో మైళ్ళు నడుచుకుంటూ వచ్చి, నేల మీద ఒక గోనె సంచి మీద ఆ కూరలుంచి అమ్ముకునే చిన్నపాటి వ్యాపారులకు అమ్మకాలూ తక్కువే, లాభాలూ తక్కువే. అప్పనంగా డబ్బులివ్వకపోతే, పోలీసులు వాళ్ళని వెళ్ళిపొమ్మని అరుస్తూ, ఆ కూరలు కుమ్మరించి నేలపాలు చేసేవాళ్ళు. అలాగే సైకిల్ రిక్షా వారి కష్టార్జితం మీద కూడా జులుం చేసి ఎంత వస్తే అంత గుంజేవారు. అది చూసి నాకా వయసులోనే కోపం వచ్చేది. బాధ వేసేది. ఒకవేళ ‘మీకు ప్రభుత్వం జీతాలిస్తున్నది కదా, ఇంకా ఎందుకీ కాపీనం’ అని అడిగితే ‘నీకెందుకు, స్కూలుకి పో’ అని అరిచేవారు. అలా అది మనసులో నిలచిపోయి, కొంచెం పెద్దయి కథలు వ్తాస్తున్నప్పుడిలా బయటికి వచ్చింది. ‘ప్రజల క్షేమం కోరాల్సిన రక్షకభటులే భక్షకులైతే ఎలా’ అనే భావనతో ఈ కథ వ్రాసి జ్యోతి మాసపత్రికకు పంపిస్తే వెంటనే ప్రచురించారు. 1996 లో శ్రీ కాళీపట్నం రామారావుగారికి “జనపీఠ” పురస్కారం వచ్చిన సందర్భంలో ఆయనకి నేను వ్రాసిన రెండు కథల పుస్తకాలతో ‘కథాభిషేకం’ చేశారు. ఒకటి “తెలుగువాడు పైకొస్తున్నాడు త్రొక్కేయండి!”, రెండవది ఈ కథ పేరుతో వేసిన కథల పుస్తకం “చెట్టు క్రింద చినుకులు”. ఈ పుస్తకాలు రెండిటికీ మిత్రుడు చంద్ర అట్ట మీద బొమ్మ వేసి అలంకరించారు. నా కథ ఏదైనా మిత్రుడు చంద్ర వేసిన బొమ్మ పూర్తిగా ఆ కథని చెప్పేస్తుంది. That is Chandra! ఆ బొమ్మ కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఇంకొక విషయం, నేను ఏ కథలోనూ వర్ణనలు ఎక్కువగా చేయను. అలంకారాలు వాడను. కానీ ఎవరో అభిమాని నా కథల్లో వర్ణనలు వుండవు అంటే, సరే అదీ చూపిద్దామని ఈ కథలో అవి కొంచెం ఎక్కువగా వ్రాశానంతే! ఈ కథ చదివి ఎలా ఉందో చెబుతారు కదూ!

‘చెట్టు క్రింద చినుకులు’

(ఈ కథ ‘జ్యోతి మాసపత్రిక’ జనవరి, 1973 సంచికలో ప్రచురింపబడింది.)

Chettu Krinda Chinukulu story image
Chettu Krinda Chinukulu story image

సంధ్యా సమయంలోని ఆకాశం క్రొత్త పెళ్ళి కూతురు ఎత్తైన నున్నటి బుగ్గల మీద నునుసిగ్గులా అరుణారిమలు సంతరించుకుంటున్నది.

అప్పుడే ఉదయిస్తున్న బాలభానుడి మెత్తటి కిరణాలు శోభనం నాటి కొత్త పెళ్ళికూతురు కళ్ళల్లోని మన్మథ బాణాల్లా వున్నాయి.

ముఫ్ఫైమంది మనుష్యులతో గుంటూరునించీ చీరాలకు వెడుతున్న ఆర్.టీ.సీ. బస్సు మొదటి కాన్పుకి పుట్టింటికి వచ్చిన గర్భిణీ స్త్రీలా నిండుగా వుంది.

ముగ్గురు పిల్లల్ని కనగానే ఇక వద్దని అడ్డుపడే ఫామిలీ ప్లానింగ్ వారిలా, బస్సుకి అడ్డంగా నిలబడి ఆపమని చేయి పైకెత్తాడు పోలీస్ కానిస్టేబుల్ ఆశీర్వాదం.

అప్పుడే పుట్టిన పసిపిల్లలా కీచుమని శబ్దం చేస్తూ ఆగింది బస్సు.

పోలీస్ కాన్‍స్టేబుల్ ఆశీర్వాదం చేతికి బేడీలు వేసివున్నాయి.

పోలీస్ చేతికి బేడీలేమిటని ఆశ్చర్యపోనఖ్కర్లేదు. ఆశీర్వాదం బేడీలు ఒక పక్క తన కుడి చేతికి తగిలించుకుని, రెండో పక్క కేడీ నరిసిగాడి ఎడమ చేతికి తగిలించాడు.

“వారంటిదిగో” అన్నాడు ఆశీర్వాదం కండక్టరుతో.

“చిల్లర లేదు” అలవాటుగా అనబోయిన కండక్టర్, పోలీసుని చూసి నాలిక కొరుక్కున్నాడు ప్రొద్దున్నే.

“రైట్ రైట్” అంటూనే టింగ్, టింగ్ మంటూ గంట మ్రోగించాడు.

“ఛ్మి, ఛ్మి” అని రెండుసార్లు తుమ్మి బయల్దేరింది ఆర్.టీ.సి. బస్సు.

గేరు గరగరమంటుంటే, క్లచ్ కరకరమంది.

ముగ్గురు కూర్చునే సీట్లో కూర్చున్నారు పోలీసూ, దొంగా పక్కపక్కనే. సోషలిజంకి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదు.

పక్క సీట్లో కునికిపాట్లు పడుతున్న నల్లతను బేడీలు వేసిన దొంగను చూసి, చటుక్కున లేచి వెళ్ళి వెనక సీట్లో కూర్చున్నాడు. కునికిపాట్లు పడటం కొనసాగిస్తూ, బస్సు ఏమీ కుదుపుల్లేకుండా వెళ్ళటం గమనించి, ‘మునిసిపల్ లిమిట్స్’ దాటినట్టున్నాం అనుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.

వెనక సీట్లో కూర్చున్న తిరుపతి వెంకటేశ్వర్లు, ఒకసారి గుండు సర్దుకుని ఈ పోలీసూ ఆ పోలీసూ ఒకడే అనుకున్నాడు. ఆరోజు రాత్రి తను భార్యకి కొంచెం నలతగా ఉంటే సైకిల్ మీద హడావిడిగా ఇంటికి వెడుతున్నప్పుడు, కానిస్టేబుల్ ఆశీర్వాదం చటుక్కున తనని పట్టుకోగానే చెమట పట్టింది.

“లైటేది?” అడిగాడు.

“ఉండాలే… లేదా?” ఆశ్చర్యపోయాడు.

తల పంకించాడు ఆశీర్వాదం, మీలాటి వాళ్ళని చాలమందిని చూశానన్నట్టుగా.

“స్టేషనుకి రండి” అన్నాడు సైకిల్ తీసుకువెడుతూ.

“లైటు వెలిగించే వుంచాను. కానీ సైకిలుకి తగిలించటం మరచిపోయాను. తెస్తాను, నా సైకిలివ్వండి” అన్నాడు.

ఆశీర్వాదం నవ్వాడు, “రేపు కోర్టులో చెప్పుకోండి అవన్నీ. ఇంట్లో లైట్ మరచిపోయానంటే ఫైన్ తగ్గిస్తారు”

తిరుపతి వెంకటేశ్వర్లు బుర్ర త్వరగా పనిచేసింది.

చటుక్కున జేబులోనించీ కొంత చిల్లర తీసి, “మాంఛి కాఫీ త్రాగండి సార్” అన్నాడు.

ఆశీర్వాదం వెంకటేశ్వర్లని అదోలా చూశాడు.

“లంచమిస్తావా? నేనలాటివాడిని కాదు!” అని భావమేమో అనుకున్నాడు వెంకటేశ్వర్లు.

“రేపు కోర్టులో భారీగా ఫైనేస్తే తెలుస్తుంది, చిల్లర పైసలు ఇస్తున్నాడు పెద్దమనిషి!” గాలితో మాట్లాడుతున్నాడు ఆశీర్వదం. వెంకటేశ్వర్లకి గాలీ, ధూళీ మీద నమ్మకముంది. ఆ ధూళి ఏం చెప్పిందోగానీ వెంటనే “ఇది ఉంచండి సార్” అన్నాడు వెంకటేశ్వర్లు, ఆశీర్వాదం చేతిలో కొన్ని నోట్లు వుంచి.

పరుల సొమ్ము పాము వంటిదనే నమ్మకంగల ఆశీర్వాదం, వెంటనే వెంకటేశ్వర్లు సైకిల్నివదిలేశాడు. ఆ నోట్లని కాకీ నిక్కరులోకి తోసేస్తూ, “ఇంకెప్పుడూ లైటు లేకుండా వెళ్ళొద్దు” అని ఉపదేశం చేశాడు.

వెంకటేశ్వర్లు వెళ్ళటానికి సిద్ధపడి సైకిలెక్కబోయి, జేబులో డబ్బులిక లేవుగనుక, కనుచూపు మేర దాకా సైకిల్ని నడిపించుకుంటూ వెళ్ళాడు.

ఇంకోసారి గుండు సర్దుకుని, “ఈ పోలీసూ, ఆ పోలీసు ఒకడే” అనుకున్నాడు మళ్ళీ.

ఏపుగా పెరిగిన పచ్చటి పొలాలు పైరగాలికి నృత్యం చేస్తున్నాయి.

ప్రక్కనే వున్న పంట కాలువ లేత పెదవుల అందమైన చిన్నదాని నవ్వులా గలగలా పారుతున్నది.

“ఈ చచ్చినాడు ఇంకా బ్రతికే వున్నాడా!” ఆడవాళ్ళకి ప్రత్యేకించిన ముందు సీటు మగాళ్ళకి వదిలేసి, వెనక మగాళ్ళ సీటులో కూర్చున్న రత్తమ్మ అనుకుంటున్నది.

“ఒక వీశెడు వంకాయలివ్వవే!” అనేవాడు ప్రతిరోజూ ఆశీర్వాదం.

“లేవు” అన్నది మొదటి రోజు రత్తమ్మ.

“స్టేషనుకి నడు. రోడ్డు మీద అడ్డంగా కూర్చుని కూరలమ్ముతున్నావ్, నీ బాబు సొమ్ము లాగా”

రోషం వచ్చింది రత్తమ్మకు. “పద. ఇది నీ బాబు సొమ్మూ కాదు. నడు” అంది లేస్తూ.

“వెర్రి మొఖమా! బుర్ర లేని నాయాల! నీకేం తెలవదే” అన్నాడు రంగయ్య రత్తమ్మతో.

“కొత్తగిత్త గదరా, ఎగిరెగిరి పడుతున్నది” అన్నాడు ఆశీర్వాదం రంగయ్యతో.

రంగయ్య రత్తమ్మ చెవిలో జ్ఞానోపదేశం చేశాడు. రంగయ్యకు శ్రీకృష్ణుడు కులదైవం మరి.

రత్తమ్మ నోరెత్తకుండా వీశెడు వంకాయలు భక్తిపూర్వకంగా సమర్పించుకున్నది, మనసులో ఆశీర్వాదాన్ని మనసారా తిట్టుకుంటూ.

ఆశీర్వాదం ఆశీర్వాద ఫలితంగా, రత్తమ్మ ప్రతిరోజూ ఆశీర్వాదానికో, అనుమానంకో దక్షిణ ఇవ్వటం అలవాటు చేసుకున్నది.

“పాపిష్టి సొమ్మొతో ఎట్లా వుంటున్నాడో!” అనుకున్నది రత్తమ్మ.

ఆశీర్వాదం ఆలోచిస్తున్నాడు. పెద్దపిల్లాడికి ఉద్యోగం ఇప్పించమంటే అయిదొందలు లంచమడిగాడు ఆఫీసర్.   కూతురు పెళ్ళికి సిధ్ధంగా ఉంది. కట్నం ఇస్తేగానీ పెళ్ళవదు. చాలీచాలని తన జీతంతో ఎన్నని చూసుకుంటాడు. ముందా అయిదు వందలూ ఎలాగ సంపాదించటం అని ఆలోచిస్తున్నాడు.

చాల రోజుల తర్వాత పుట్టింటికి వచ్చిన ఆడపడుచులా పొన్నూరు బస్ డిపోలో ఆగింది ఆర్.టీ.సీ. బస్సు. ఎందుకో అక్కడ ఆగిన బస్సులు తొందరగా కదలవు మరి.

“పదిహేను నిమిషాలు ఆగుతుంది సార్. కాఫీకీ టిఫిన్‍కి సమయముంది సార్. దిగండి సార్” అరుస్తున్నాడు అక్కడి కాంటీన్‍కి సంబంధించిన ఒక ముసలతను.

డ్రైవరూ, కండక్టరూ అప్పటికే ఇడ్లీ, సాంబారులో పడి తేలుతున్నారు.

పండుగకి అత్తగారింటికి వెడుతున్న కళ్ళజోడు చిన్నవాడు కొత్త పెళ్ళాం కళ్ళ(జోడు) ముందు కదలాడింది కాబోలు, ‘బయల్దేరి గంట కూడా కాలేదు అప్పుడే కాఫీనా? గంటకు వంద మైళ్ళు పోయే బస్సులొస్తేగానీ భారతదేశం బాగుపడదు’ అనుకున్నాడు.

టెర్లిన్ పాంటు కుర్రాడు ఆంధ్రపత్రిక కొనుక్కొచ్చి అందులో ‘ఫలానా డబ్బుగలాయన ఇంటి మీద ఇన్‍కంటాక్స్ అధికారుల దాడి!’ అనే వార్త పెద్దగా చదివి, ‘ఇక కొన్నాళ్ళలో అమెరికాలోలాగా మన దేశంలో కూడా బీదవాళ్ళుండరు” అన్నాడు.

ఇన్‍కంటాక్స్ టాక్స్ అధికారుల దాడి అనే మాట వినగానే వులిక్కిపడ్డ ఖద్దరు లాల్చీ, ఆ మాటలు మరచిపోవటానికి ప్రయత్నం చేస్తూ, “మా బామ్మరిది అమెరికాలోనేగా వున్నాడు. అక్కడ బీదవాళ్ళే కాదు, ముష్టివాళ్ళు కూడా వున్నారుట” అన్నాడు అపోజిషన్ లీడర్లా ముఖం పెట్టి.

డిపో ముందరి తారు రోడ్డు, సవరం పెట్టుకునే అవసరం లేని పడుచుపిల్ల పొడుగాటి జడలా నల్లగా నిగనిగలాడుతున్నది.

కండక్టరూ, డ్రైవరూ బస్సు ఎక్కటం చూసి ‘ఐయామ్ కమింగ్ స్వీటీ’ తన్మయత్వంతో అనుకున్నాడు అత్తారింటికి వెడుతున్న కళ్ళజోడు చిన్నవాడు.

కేడీ నరిసిగాడు ఆలోచిస్తున్నాడు. తను జైలుకి వెడితే తన పెళ్ళాం, ఆరుగురు పిల్లలూ ఆ నాలుగు నెలలూ ఎలా బ్రతుకుతారా అని. వాళ్ళ ఆకలి చూడలేకా, ఎండకీ వానకీ ఏమీ అభ్యంతరం చెప్పని ఆ గుడిసెలో వుండలేకా, ఫాషన్ల పేరుతో డబ్బున్నవాళ్ళు కప్పుకోకుండా వదిలేసే శరీర భాగాలని కప్పుకోవటానికి గుడ్డల్లేక సిగ్గుపడే తన భార్య ముఖంలోకి చూడలేకా తనకి చేతనైన దొంగతనం చేస్తున్నాడు. కొన్నిసార్లు పోలీసులకి దొరికిపోవటం మామూలైంది. ఒకసారి జైలుకి వెళ్ళినవాడు మంచిమనిషిగా మారినా, దొంగ వెధవ క్రిందే లెఖ్క. అందుకే తను సైకిల్ షాపులో గాలి కొట్టటానికి కూడా పనికిరావటం లేదు. అందుకే జేబులు కొడుతున్నాడు. ఎప్పటికి మారుతుందీ జీవన సరళి!

కుడి భుజం మీద దురద పుట్టి ఎడమ చేత్తో గోక్కుంటున్నాడు కేడీ నరిసిగాడు. అతని ఎడమ చేతికీ, తన కుడి చేతికీ కలిపి బేడీలు వుండటంవల్ల సణుక్కుంటూ తన కుడి చేతిని పైకెత్తి అతను గోక్కోటానికి వీలుగా వుంచాడు ఆశీర్వాదం.

నరిసిగాడు నవ్వాడు. “మనిద్దరికీ బేడీలున్నాయిసార్. కాకపోతే నన్ను దొంగంటారు. మిమ్మల్ని పోలీసంటారు” అన్నాడు గొప్ప వేదాంతిలా.

“నోర్ముయ్” అన్నాడు ఆశీర్వాదం.

ముందు సీట్లో కూర్చున్న హిమాంబీ చటుక్కున వెనక్కి తిరిగి చూసింది.

‘మళ్ళీ జైలుకెడుతున్నావా నర్సీ’ అనబోయి, వాడింకా ఏదో అని తన పరువు తీస్తాడేమోనని వూరుకుంది.

గార పళ్ళు బయట పెట్టి, “ఏం బావా, బాగున్నావా? ఈమధ్య దరిసెనాలేం లేవు” అంది ఆశీర్వాదంతో.

ఆశీర్వాదం మాట్లాడలేదు. ఇటూ అటూ చూసి “నోర్ముయ్యవే!” అన్నాడు నెమ్మదిగా.

మూతి ముడుచుకుని ముందుకు తిరిగింది హిమాంబీ.

ఎన్నిసార్లు తన ఒళ్ళూ, సొమ్మూ తిన్నాడో ఈ ఆశీర్వాదం. రోగాలూ, రొష్టూ, కష్టాలూ, నష్టాలూ అన్నీ భరించి, అందర్నీ భరించి, అంతా అర్పించి రెండు పూటలా తిండి కోసం తనేదో సంపాదించుకుంటుంటే, ఆ సంపాదన పోలీసులకీ, డాక్టర్లకే చాలటం లేదు. ఇక తనేం తింటుంది. అసలీ ఎదవలకోసమేనా తన సంపాదన అనిపిస్తుంటుంది.

ఆరోజు రాత్రి బాగా గుర్తుంది. పక్క ఊరి ప్రెసిడెంటుగారు తనతో వున్నారు. అప్పుడే తలుపులు దబదబా బాదాడు ఆశీర్వాదం.

పదవికి ప్రెసిడెంటు కనుక, ఆయన పరువు గజగజా వణికింది. ఆయనకిలాంటివి అలవాటు లేదుట. ఇలాంటివి అంటే అసలు అని కాదు, దొంగచాటుగా అని.

హిమాంబీకిది మామూలే! భయపడాల్సిన విషయమేం కాదు. కాకపోతే ఇంకొంత ఖర్చు.

తలుపు సగం తెరిచి తల బయటకు పెట్టింది.

“అడ్డు లేవ్వే. లోపల ఎవరూ...” అన్నాడు ఆశీర్వాదం ఠీవిగా కర్ర తిప్పి.

“నీ మామూలు నీకిస్తానుగా. లోపల ఎవడుంటే నీకేం” అన్నది బింకంగా.

నవ్వాడు ఆశీర్వాదం. “అదికాదే వెర్రి ముఖమా, ఎవరైనా దొరబాబయితే… అక్కడ కూడా కాస్త…”

“నాకిష్టం లేదు” అన్నది బింకంగా.

“అయితే నడు స్టేషనుకి” తలుపు త్రోసుకుని లోపలకు రాబోయాడు.

అంతా వినపడిందేమో ప్రెసిడెంటుగారు హిమాంబీని కేకేశాడు. అతన్నక్కడే వుండమని చెప్పి లోపలకు వెళ్ళింది. వెంటనే బయటకు వచ్చి రెండు పదులు అతని చేతిలో పెట్టి, “ఆయన ఇమ్మన్నారు” అన్నది.

ఆశీర్వాదం నోట్లు అందుకున్నాడు. “మరీ నీ వాటా...” అన్నాడు.

ఇంకో ఐదు రూపాయలు చేతిలో పెట్టింది.

“ఇంకా ఎంతసేపు వుంటాడు?” అడిగాడు.

అదోలా చూసింది హిమాంబీ. “ఇంకా ఏం వుంటాడు? హడలగొట్టావుగా, బయల్దేరటానికి సిద్ధంగా వున్నాడు”

“సరే, నువ్వు సిద్ధంగా వుండు. పావుగంటలో వస్తాను”

ఆశీర్వదం నాలుగిళ్ళవతలున్న మాణిక్యం ఇంటి వేపు వెడుతుంటే అతని ఆలోచనలు కూడా అతనితోనే వస్తున్నాయి. కూతురికి ఘనంగా పెళ్ళి చేయాలి. అందరి ఆడపిల్లలలాటిది కాదు తన కూతురు. ఈగ వాలనీయకుండా అపురూపంగా పెంచాడు. కానీ కట్నం కనీసం రెండు వేలైనా ఇవ్వాలి. ఎలా? తనదా పెద్ద సంసారం. తన జీతం ఏ మూలకి వస్తుంది? పై సంపాదన వున్నా ఏమీ చాలటం లేదు. మరి పెళ్ళి ఎలా చేస్తాడు?

“సోడా, గోళీ సోడా, నిమ్మకాయ సోడా”

“వేయించిన పప్పు, వేరు శెనగపప్పు”

“దవనం ఘుమా, మరువం ఘుమ ఘుమా”

“బాపట్ల. దిగండి సార్, దిగండి. అరె, ఏమిటది? ముందు దిగేవాళ్ళని దిగనీయండి. అలా తోసుకుంటే ఎలా? ఏమిటమ్మా ఆడకూతురివి, నువ్వు కూడా అలా… ఇక్కడ చాలసేపు ఆగుతుందయ్యా, ఎందుకంత తొందర? చీరాలకు టిక్కెట్టా? చిల్లర తెచ్చుకో. అవును, చిల్లర లేదు. మేం మాత్రం ఎంతమందికని ఇస్తాం? దేశంలో చిల్లర కొఱత వుందని తెలీదూ… మీకు పదిహేను పైసలు ఇవ్వాలా? దిగండి ఇస్తాను. పది పైసలుంటే ఇవ్వండి పావలా ఇస్తాను. లేదా, అయితే నన్నేం చేయమంటారు?” బస్సు తలుపు దగ్గర అష్టావధానం చేస్తున్నాడు కండక్టర్.

“దిగవయ్యా… పదిహేను పైసల కోసం పాతికమందిని ఆపావు”

“మీకేమండీ, పదిహేను పైసలు నాకు కదా రావలసింది. తనది కాకపోతే వెనకటికొకడు… ఏమండీ, కానిస్టేబుల్‍గారూ మీరు చెప్పండి”

“ఉండవయ్యా, ఈ దొంగ వెధవ ఎక్కడ పారిపోతాడో అని నేను చస్తుంటే” జనాన్ని త్రోసుకుంటూ బస్సు దిగుతున్న ఆశీర్వాదం విసుక్కున్నాడు.

“చీరాలకు ఒకటి” జేబులో చేయి పెట్టి, “పర్సు… నా పర్సు ఎవడో దొంగ వెధవ కొట్టేశాడు. పట్టుకోండి. వంద రూపాయల నోట్లున్నాయి దాంట్లో” అరిచాడు సిల్కు చొక్కా ఆయన.

“జాగ్రత్తగా ఉండవద్దుటండీ!” అని ఆయన్ని హెచ్చరిస్తూ, తన మెడ నొప్పి పెడుతుంటే తడుముకుని, “అయ్యో నా మెడలో గొలుసు. బంగారం గొలుసు. దాన్లో డైమండ్స్ కూడా వేయించి తయారు చేయించాడు మా ఆయన” పెద్దగా అరుస్తున్నది బస్సులో ఎక్కబోతున్న బాలమ్మ.

“ఇప్పుడే కదండీ ఒక పోలీసతను దొంగను తీసుకువెడుతున్నాడు. ఆ దొంగే…”

“ఛ, అలా అయివుండదులెండి. చేతికి బేడీలు వుండగా మళ్ళీ దొంగతనం చేస్తాడా? అందులోనూ పక్కనే పోలీసూ వున్నాడు”

“ఏమో… ఏం చెబుతాం ఈరోజుల్లో. వాళ్ళిద్దరికీ వాటాలున్నా వుండవచ్చు”

“నో నో... అలా అయివుండదు లెండి. ఇక్కడే ఇంకెవరో…”

“తన్నండయ్యా ఎవడు తీశాడో కనుక్కుని”

అంతా గోలగా వుంది.

అత్తారింటికి పోయే కళ్ళజోడు చిన్నవాడు ఊరు చేరిన హుషారులో ఈల వేశాడు. పెళ్ళాన్ని చేరబోయే ఉత్సాహంతో ముందుకు అడుగు వేశాడు.

ఆ కొత్త జంటను ఆశీర్వదించటానికా అన్నట్టు హఠాత్తుగా పెద్ద వాన మొదలయింది. గబగబా పరుగెత్తి ప్రక్కనే వున్న చెట్టు క్రింద తలదాచుకున్నాడు కళ్ళజోడు చిన్నవాడు.

బస్సు దగ్గర దొంగతనం చేశాడన్న నెపంతో ఎవరో ముష్టివాడిని పట్టుకుని సినిమా హీరోల్లా తంతున్నారు కొందరు. ఆ ముష్టివాడు ముఖం మీద రక్తం కారుతుంటే పెద్దగా ఏడుస్తున్నాడు. కానీ అతని దగ్గర ఏమీ దొరకలేదు.

చెట్టు క్రింద బేడీలు వేసుకున్న దొంగా, పోలీసు కూడా తల దాచుకుంటున్నారు.

ఏదో సాధించినట్టు, అతి నెమ్మదిగా చెప్పుకుంటూ పెద్దగా నవ్వుకుంటున్నారు.

వాన తగ్గుముఖం పడుతున్నది.

తమ మీద వాన పడకుండా ఏదో రక్షణ ఇస్తుందని ఆ చెట్టు క్రిందకి చేరితే, వాన తగ్గాక కూడా ఆ చెట్టు గాలికి ఇటూ అటూ ఊగటం వల్ల బయటపడే చినుకుల కన్నా ఎక్కువే పడుతున్నాయి, ఆ చెట్టు క్రింద చినుకులు.

**********

Posted in April 2024, కథలు

4 Comments

  1. సత్యం

    ధన్యవాదాలు భాస్కర్ గారు. మీ సందేశాలు నాకెప్పుడూ అమూల్యమే. మీలాటి సాటిరచయితల స్పందనే నన్ను ముందుకు నడిపిస్తున్నది.

    • Satyam

      సుధాశ్రీగారు, మీ స్పందనకి ధన్యవాదాలు. కథల్లో చాలవరకూ పాఠకులని ముగింపుదాకా తీసుకువెళ్ళి, వారిని ఆలోచింపజేస్తేనే ఆ కథకి మంచి స్పందన వస్తుంది అని నా భావన. నా పాఠకులు నాకన్నా ఎంతో తెలివిగల వాళ్ళే మరి! అలా వ్రాసిన నా కథలు ఎన్నో ఇప్పటిదాకా ఎక్కడో ఒకచోట సందంర్భానుగుణంగా ప్రస్తావిస్తూనే వున్నారంటే, వారికీ ఇలా వ్రాసినవి చదవటం నచ్చినట్టే వుంది.

  2. Bhaskar Pulikal

    కథ కొత్తగా, బాగుంది సత్యం గారు. కథా శిల్పం, మీరన్నట్లు వర్ణనలు కూడా మీ ఇతర కథల కంటే భిన్నంగా ఉన్నాయి. నాకు గతంలో The Illustrated Weekly లో బొమ్మలు వేసే మారియో గుర్తుకు వచ్చారు. అనేక వర్ణనలు, అనేక పాత్రలు వెరసి గొప్ప సందేశం. అభినందనలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!