స్పందన
1960, 1970లలో నేను భారతదేశంలో నివసించేటప్పుడు, రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్లు కొనుక్కుని ఎన్నికయాక, ఎవరికీ పూర్తి మెజారిటీ రానప్పుడు, రాష్ట్ర కేంద్ర రాజధానుల్లో ఏ పార్టీ ఎంఎల్లేలను, ఎంపీలను కొనుక్కుంటున్నదో చూసి, వారి గుడారంలో దూరి మళ్ళీ పదవుల్లోకి రావటం చూస్తుండే వాళ్ళం. మరి పార్టీపరంగా ఓట్లు వేసినవారి పరిస్థితి ఏమిటి? అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు చూశాక కొంచెం వ్యంగ్యంగా వాటి మీద ఒక కథ వ్రాయాలని అనుకుని ఆనాడే ఈ కథ వ్రాశాను. అప్పట్లో నా కథలు ఎక్కువగా జ్యోతి మాసపత్రిక, యువ మాసపత్రిక, ఆంధ్రసచిత్ర వారపత్రిక, ఆంధ్రప్రభ వారపత్రికల్లో ఎక్కువగా వస్తుండేవి. ఈ కథని పంపిన వెంటనే జ్యోతి మాసపత్రిక వారు ప్రచురించారు. ఈ కథలో సైకిల్ పార్టీ అని సరదాగా వ్రాశానుగానీ, అప్పుడు సైకిల్ పార్టీ అనేదే లేదు. దరిమిలా నేను అమెరికాకి వచ్చేసిన చాల సంవత్సరాలకి, అలాటి బొమ్మతో ఒక పార్టీయే రావటం కేవలం యాదృచ్ఛికం. నేనీకథలో వ్రాసిన సంఘటనలే దరిమిలా ఎన్నోరకాలుగా జరగటం నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈనాడు కూడా అవి జరగటమే కాక, ఇంకా ఎక్కువయాయి కూడాను. అది ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం. భారతదేశం మీద ప్రేమా, భక్తీ ఉన్నవాళ్ళు అందరూ ముందుకు వచ్చి, ఎక్కడినించో దిగిరాని హీరోల కోసం ఎదురుచూడకుండా, ఈ దౌర్భాగ్యాన్ని మార్చటానికి రాజ్యాంగంలో తగిన మార్పులు చేయించటం అవసరం.
(ఈ కథ ‘జ్యోతి’ మాసపత్రిక మే, 1979 సంచికలో ప్రచురింపబడింది.)
వినాయకం ఆరోజు నిద్ర పోకుండా చాలా ఆలోచించాడు. తను నమ్ముకున్న సైకిల్ పార్టీ రెండు చీలికలయింది. ఏ పార్టీలో చేరాలా అన్నదే అతని ఆలోచన. ఎన్నేళ్ళనించో అతను సైకిల్ పార్టీ టిక్కెట్టు మీద ఎన్నికవుతూ ప్రజాసేవ చేస్తున్నాడు. అలా ప్రజాసేవ చేస్తూనే, నాలుగున్నర చేతులా యథాశక్తి సంపాదించి, రైస్ మిల్లులూ, పుగాకు కంపెనీలు, నిమ్మతోటలూ, ఇక్కడా అక్కడా ఎన్నో కబ్జా భూములూ స్వంతం చేసుకున్నాడు. ఇంత ప్రజాసేవ చేసినా, తను ప్రజలకింకా చేయవలసివున్నదనీ, వాళ్ళ ఆరోగ్యమే తనకు మహాభాగ్యమనీ అతని నమ్మకం. ఆ నమ్మకంతోనే శాయశక్తులా ప్రజాసేవ చేస్తున్నాడు.
మరిప్పుడు తననింతవాడిని చేసిన సైకిల్ పార్టీ రెండుగా చీలిపోయింది. కేంద్రస్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ రెండు పార్టీలవారూ, దేశంలో నా బలగం ఎక్కువంటే నా బలగం ఎక్కువంటున్నారు. కానీ నిజంగా ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో, ఏ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుందో వినాయకానికి అంతుబట్టలేదు.
ప్లస్ పాయంట్లూ, మైనస్ పాయంట్లూ కాగితం మీద వ్రాసి, కూడికలూ తీసివేతలూ చేస్తే (వినాయకం అలా కూడికలూ, తీసివాతలూ చేయటం ఏమిటి రైటరూ అని ఆశ్చర్యపోకండి. ఆయన ఎంత వేలిముద్రగాడయినా అతని దర్బారులో లెఖ్కలు తెలిసిన చెమ్చా ఒకడున్నాడు), చివరికి మూడు పార్టీలకీ సమాన బలగం ఉన్నట్టు తెలిసింది. అందుకే సైకిల్ ముందు చక్రం పార్టీలో చేరాలా, వెనుక చక్రం పార్టీలో చేరాలా అని ఇంతగా ఆలోచిస్తున్నాడు. బట్టతల మీద ఉన్న ఐదున్నర వెంట్రుకలూ పీక్కున్నా, వెంట్రుకలు తెగాయేగానీ, ఆలోచనలు మాత్రం తెగలేదు.
మర్నాడు తన మేడ మీద బాల్కనీలో కూర్చుని, తక్షణ కర్తవ్యం ఏమిటో తెలియక, రోడ్డు మీద వచ్చేపోయే జనాన్ని చూస్తూ కూర్చున్నాడు.
ఇంతలో రోడ్డు మీద జరిగిన ఒక సంఘటన అతన్ని ఆకర్షించింది. రోజూ స్నేహంగా తిరుగుతూ, ఒకదాని శరీరాన్ని ఇంకొకటి నాక్కునే ఆ రోడ్డు తాలూకు రెండు కుక్కలూ, కాట్ల కుక్కల్లా అదే రోడ్డు మీద పెద్దగా అరుస్తూ కొట్టుకుంటున్నాయి. అది చూడగానే ఆయనకు సైకిల్ పార్టీ గుర్తుకొచ్చింది.
ఈలోగా ఆ అరుపులు విని పక్కరోడ్డులోని ఇంకొక బలమైన కుక్క పెద్దగా అరుచుకుంటూ వచ్చింది. వచ్చిన వెంటనే ఈ రెండు కుక్కల మీదా విరుచుకుపడింది. ఈ రెండు కుక్కలూ కలిసి అరుపులు మాని, అరిచే కుక్కలకి కరవటంం రాదు కనుక, తోకలు ముడిచి పరుగెత్తాయి. పక్క వీధి కుక్క వాటిని రోడ్డు చివరిదాకా తరిమికొట్టి విజయోత్సాహంతో ఠీవీగా ఇదే నా సామ్రాజ్యం అన్నట్టుగా అక్కడే తిరుగుతున్నది.
అది చూసి తల ఎత్తిన వినాయకానికి, గోడ మీద అర్జనుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణుడి తైలవర్ణ చిత్రం కనపడింది. బట్టతల పంకించి లేచి, ధోవతి సర్దుకుని క్రిందకి వచ్చాడు.
మర్నాడు పేపర్లన్నిటిలోనూ వచ్చింది, వినాయకం సైకిల్ పార్టీలో రాజీనామా చేసి ఏనుగు పార్టీలో చేరాడని. సైకిల్ పార్టీ విడిపోవటం తనకేకాక, దేశానికే మంచిది కాదన్నాడు. “కలసివుంటే కలదు సుఖం” అన్నాడు. “దేశమంటే సైకిళ్ళు కాదు, మనుష్యులోయ్” అన్నాడు. ఇంకా తనకు తెలిసిన నాలుగైదు సినిమా పేర్లు కలిపి కొన్ని డైలాగులు చెప్పాడు. లక్ష్యం, చిత్తశుధ్ధి వున్న పార్టీ ఏనుగుపార్టీ ఒక్కటే అన్నాడు. తాడిత పీడిత ప్రజానీకానికి రక్షణనిచ్చేది ఒక్క ఏనుగే, ఏనుగు అన్నాడు, జీవితాంతం ప్రజాసేవకే తన జీవితం అంకితమనీ, మానవ సేవే మాధవ సేవనీ అన్నాడు, దండ వేస్తున్న ఫొటో కూడా పేపర్లో వేయించుకున్నాడు.
వెంటనే ఏనుగు పార్టీ టిక్కెట్టు కొనుక్కున్నాడు. తన ఊరునించే ఏనుగు పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పడేశాడు.
ఆ ఊరినించీ మొత్తం నలుగురు అభ్యర్థులు నుంచున్నారు. వినాయకం ఏనుగు ఎక్కితే, ఇంకొక ఇద్దరు సైకిల్ ముందు చక్రం, వెనక చక్రాల మీద నుంచున్నారు. ఎన్నడూ గెలుపెరగని ఒక అనామకుడు స్వతంత్ర అభ్యర్థిగా గుర్రం ఎక్కాడు. అంటే గుర్రం పార్టీ అన్నమాట.
అందరూ ముమ్మరంగా ప్రచారం సాగించారు. ప్రచారానికి డబ్బుల్లేని గుర్రంగారు తప్ప. గుర్రంగారు గుర్రమెక్కి పేకాడుతూ కూర్చున్నాడు. మిగతా ముగ్గురూ నోట్లు చల్లి, ఓట్ల పండించుకుందామని ఊళ్ళ మీద పడ్డారు.
వినాయకం పుగాకు, బియ్యం మొదలైనవి పండించటంలోనేకాక, ఓట్లను పండించటంలో కూడా పండితుడు. అందుకని అతని పంట మూడు పువ్వులూ, ఆరు కాయలుగా పండింది. అసలు ఎనిమిది కాయలుగా వచ్చేదేగానీ, వినాయకం ముందే రెండు కాయలు గుర్రగారింటికి పంపించాడు. వాటితోపాటు కొన్ని ‘విత్తనాలు’ కూడా పంపించాడు.
దాంతో గుర్రంగారు పంచకల్యాణి గుర్రమెక్కి, వినాయకంగారికి సపోర్టుగా విరమించుకుంటున్నానని, ఖాళీ సీసాలు బ్రద్దలుగొట్టి మరీ ప్రకటించాడు. తర్వాత కథ తెలుగు సినిమాలోలాగా సుఖాంతం అవటంతో, వినాయకం పదివేల ఓట్ల మెజరిటీతో మళ్ళీ ఎన్నికయాడు. ఏనుగు పార్టీ ఎం.ఏల్.ఏగా తన ప్రజాసేవలో ఏమీ లోపం ఉండదన్నాడు.
ఇక్కడిదాకా కథ బాగానే ఉన్నా, ఇక్కడే కొంచెం అడ్డం తిరిగే సూచనలు కనపడ్డాయి. మొత్తం ఆ రాష్ట్రానికి ఉన్న సీట్లు తొంభై. గమ్మత్తేమిటంటే, ఏనుగు పార్టీకి ముఫ్ఫై, సైకిల్ వెనుక చక్రం పార్టీకి ముఫ్ఫై, సైకిల్ ముందు చక్రం పార్టీకి ముఫ్ఫై సీట్లు వచ్చాయి. అంటే ఎవరికీ నిర్ధారణ మెజారిటీ రాలేదన్నమాట. ఏ పార్టీలోనించయినా పదిహేనుమంది ఎమ్మెల్లేలు ఇంకో పార్టీలో చేరితే, ఆ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టగలదు. ఈ నిజాన్ని గుర్తించిన వాడై వినాయకం వెన్వెంటనే, తన చెమ్చాతో సహా రాకెట్ వేగంతో రాష్ట్ర రాజధాని చేరుకున్నాడు.
సరాసరి ఏనుగు పార్టీ ఆఫీసుకి వెళ్ళాడు. వెళ్ళి, ‘హలో’ అందామనుకునే లోపలే ఏదో అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని, చెమ్చాని అక్కడున్న ఎమ్మెల్లేలని లెఖ్కపెట్టమన్నాడు. ముఫ్ఫై మందీ అక్కడికి వచ్చారుట, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కుక్కల్లా అరుచుకుంటూ బయటికి పరుగెత్తి వెళ్ళిపోయారట. అక్కడ పదిమందే మిగిలారుట. అంటే మిగతా ఇరవైమందీ ఎక్కడికి వెళ్ళినట్టు? వేరే పార్టీలో చేరిపోలేదుగదా? మరి ఏ పార్టీలో…?
వినాయకం గుండెలు జారిపోయాయి.
“మనమూ ఇంకో పార్టీలో చేరిపోదాం గురూ” అన్నాడు చెమ్చా.
కానీ ఎక్కడికి వెళ్ళటం? ఆ ఇరవై మందీ ముందు చక్రం ఆఫీసుకి వెడితేనో? తను అక్కడికి వెళ్ళేలోగా వెనుక చక్రం పార్టీ మంత్రి వర్గం ప్రకటిస్తే? తనూ, తన భవిష్యత్తూ ఏమౌతాయి! ఇక ప్రజాసేవ ఎలా చేసుకునేటట్టు?
ఏమైనా కానీ, ఆలోచనకు సమయం లేదు. అంతేకాదు, ఇది ఎవరినయినా సలహా అడిగే వ్యవహారం కూడా కాదు. ఏదయినా మాట్లడినా, తనకుమాలిన ధర్మం లేదు కదా, ఎవరు ఏ పార్టీలో చేరతారో? ఎవర్నీ నమ్మలేం.
‘జై! ఫటాఫట్ బాబా, నువ్వే రక్షించాలి’ అనుకుని, వినాయకం కారెక్కి, ఎంత తొందరగా పోగలిగితే అంత తొందరగా ముందుగా ముందు చక్రం ఆఫీసుకి పొమ్మన్నాడు.
కారు ఆగగానే బయటికి గెంతి, లోపలికి పరుగెత్తాడు. పరుగెత్తుతున్నప్పుడే చెమ్చా అన్నాడు, “గురూ! దారిలో నాకో వాన్ కనపడింది. దాన్లో ముందు చక్రం పార్టీ వాళ్ళు పదిమందున్నారు. వాళ్ళు ఏనుగు పార్టీ ఆఫీసుకి వెడుతున్నారులావుంది”. ఠక్కున ఆగిపోయాడు వినాయకం.
“సరే, అక్కడ పదిమందే ఉన్నారు, ఈ పదీ వాళ్ళతో కలిస్తే మొత్తం ఎంతమంది అవుతారు?” అని అడిగాడు.
చెమ్చా వేళ్ళు జాగ్రత్తగా లెఖ్కవేసి, “ఇరవై... అంటే వాళ్ళు మంత్రివర్గ నిర్మాణం చేయలేరు గురూ! అదీకాక, ఆ పదిలో మీరు ఇక్కడికి వచ్చేశారు కదా, అక్కడ మీరు లేకుండా…” అంటూ పదివేళ్ళల్లో ఒక వేలు మడిచి మిగతావి లెఖ్క పెడుతున్నాడు, ‘ఒకటీ... రెండూ...’ అంటూ తొమ్మిది దాకా.
వినాయకం మళ్ళీ “జై! ఫటాఫట్ బాబా!” అనుకుని గబగబా లోపలికి వచ్చాడు.
వినాయకం చెప్పేలోగానే చెమ్చా గబగబా అక్కడున్న వాళ్ళని లెఖ్కపెట్టి “ఇక్కడ ముగ్గురే ఉన్నారు గురూజీ” అన్నాడు.
“అంటే ఇక్కడినించీ ఇంకా కొందరు అమ్ముడు పోయారన్నమాట” వినాయకం పెద్దగా అరిచాడు.
“ఇక్కడా లాభం లేదు గురూజీ. వెనక చక్రం ఆఫీసుకి పోదాం... పదండి ముందుకు” అన్నాడు చెమ్చా.
వినాయకానికి చిన్నప్పుడు గేదెల మీదనించీ కాలవల్లోకి దూకే అలవాటుంది. అది గుర్తుంచుకుని ఒకే ఒక గెంతుతో గేటు దూకి కారెక్కాడు.
కారు వాయువేగ మనోవేగాలతో వెనక చక్రం ఆఫీసుకి వెడుతున్నది. ఎదురుగా అంతే వేగంతో వస్తున్న ఒక వాన్‍ని చూసి పెద్దగా అరిచాడు వినాయకం.
ఉలిక్కిపడ్డ చెమ్చా ఈసారి తన కుసింత బుర్రని ఉపయోగించాడు. అది పదహేను మంది పట్టే వాన్. ఫుల్‍గా వుంది.
“గురూ! మొత్తం పదిహేను”
“డ్రైవరుతో కలిపి కాదుగా…” కంగారుగా అడిగాడు వినాయకం.
“తప్పయింది గురూ! డ్రైవరుని తీసేస్తే ఎంతవుతుంది…” అంటూ మళ్ళీ వేళ్ళు లెఖ్కపెడుతున్నాడు చెమ్చా.
“వాళ్ళు వెనుక చక్రం పార్టీ వాళ్ళు. తమ సీట్లు ముందు చక్రం పార్టీకి అమ్ముకోవటానికి వెడుతున్నారు. వాళ్ళూ వీళ్ళూ కలిస్తే మొత్తం ఎంతమందవుతారు?” అడిగాడు వినాయకం.
చెమ్చా తన చేతి వేళ్ళూ, కాలి వేళ్ళూ, వినాయకం కుడిచేతి వేళ్ళూ అన్నీ లెక్కేసి, “ఇరవై ఐదు అవుతారు గురూ… వాళ్ళకీ లాభం లేదు” అన్నాడు.
“అయితే ఇంక వేగంగా పోనీ” అరిచాడు వినాయకం.
వినాయకం, చెమ్చా ఇద్దరూ కారులోనించే దూకి, ఒక లాంగ్ జంపు చేసి వెనుక చక్రం ఆఫీసులో పడ్డారు.
చెమ్చా గబగబా అక్కడ ఉన్న జనాన్నిలెక్కేసి “పదిమంది గురూ” అన్నాడు.
“ఏమిట్రా నీ లెఖ్కలు తగలడా, ఎక్కడికి పోయినా పదిమందే అంటావు. మిగతా వాళ్ళెక్కడ చచ్చారు?” కోపం వచ్చింది వినాయకానికి.
చెమ్చా తల గోక్కుంటూ ఆలోచించిచాడు, “అర్థమైంది గురూ. అందరూ మనలాగానే పరుగెత్తుతున్నారు అన్నమాట. తొంభైమందికీ ముప్పై మందే ఆఫీసుల్లో ఉన్నారు. అంటే మిగతా అరవైమందీ అమ్ముడుపోవటం కోసం ఇలాగే ఒక పార్టీ ఆఫీసునుంచీ ఇంకొక పార్టీ ఆఫీసుకి తిరుగుతున్నారన్నమాట” అన్నాడు.
“అయితే ఇప్పుడేం చేద్దాం? త్వరగా చెప్పు?” అడిగాడు వినాయకం.
చెమ్చా ఠక్కున “నా మనసు ఏనుగు ఆఫీసుకే వెళ్ళమని చెబుతున్నది గురూజీ. పదండి” అన్నాడు.
వెంటనే అక్కడ కారెక్కి మరుక్షణం ఏనుగు ఆఫీసు ముందర ఆగారు వినాయకం, చెమ్చా.
చటుక్కున కారు దిగి, ఎగిరి గంతేసి లోపలకు రాబోయిన వినాయకానికి మూసివున్న తలుపు ఠపీమని కొట్టుకున్నది.
“ఎక్కడకు పోయారు చెప్మా?” అన్నాడు పెద్దగా వినాయకం.
ప్రక్కనే కూర్చుని తీరిగ్గా అరిటాకులో వేడివేడి ఉప్మా తింటున్న వాచ్‍మెన్ చెప్పాడు, “అయ్యా, ఏనుగు పార్టీలోని ఇరవై మంది ఎమ్మెల్లేలు, ఇందాకే వెళ్ళి ముందు చక్రం పార్టీలో చేరిపోయారు. అందుకని వాళ్ళు ముఫైమందీ, వీళ్ళు ఇరవై మందీ, ఇంకో పదిమంది వెనుక చక్రం పార్టీ వాళ్ళతో కలిసి మొత్తం…”
చెమ్చా వేళ్ళు గబగబా లెక్కేయటం చూసి, ఒకసారి నవ్వుకుని వాచ్‍మన్, “మొత్తం అరవైమందీ వాళ్ళ మంత్రివర్గ నిర్మాణానికి పార్టీ బలం చూపించటానికి గవర్నర్ ఆఫీసుకి వెళ్ళారు. వాళ్ళు చెబుతుంటే, ఇక్కడే కూర్చుని అంతా విన్నాను” అన్నాడు.
చావు కబురు చల్లగా చెప్పాక, ఉప్మాలో జీడిపప్పు ఏరుకుని తింటున్నాడు వాచ్‍మెన్.
అరెరె అని నాలుక కొరుక్కున్న వినాయకం తల తిరిగిపోయింది.
“అవునూ, వీళ్ళందరూ కలిసి గవర్నర్ బంగళాకేసి వెళ్ళటం నేను కళ్ళారా చూశాను. పాపం వినాయకంగారు ఇప్పుడేం చేయాలి? ఆయన ప్రజాసేవ ఇంకెలా చేస్తాడు? ఆయనకి ప్రస్థుతం ఏమిటి శరణం?” అన్నది పక్కనే నుంచుని గడ్డి తింటున్న మేసే గాడిద.
“మరి ఏనుగు పార్టీని గెలిపిద్దామనే ఉద్దేశ్యంతో పార్టీపరంగా ఓట్లేసిన ప్రజలకేమిటి శరణం? వాళ్ళు ఓట్లేసిన నాయకులు గెలిచారుగానీ, వాళ్ళు ఓట్లు వేసిన పార్టీ మట్టికొట్టుకు పోయింది కదా” తింటున్న కాగితాలను కాసేపు నమలటం ఆపి అన్నాడు ప్రక్కనేవున్న ఆ గాడిద కొడుకు.
“ఒరేయ్, అలా కాగితాల్ని తినొద్దన్నానా! కాగితాలు తింటే చదువు రాదు. చదువుకోకపోతే నువ్వూ రాజకీయాల్లోకి పోవాల్సివస్తుంది. జాగ్రత్త!” కొడుకుని కసిరింది ఆ మేసే గాడిద భార్య.
నేను ఇదే విషయమే గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో ఉండే బంధు మిత్రులని అడుగుతున్నాను. “ప్రజలు ఒక పార్టీ వాడనుకొని ఓటు వేసి గెలిపించిన తరవాత పార్టీ మారిస్తే మళ్ళీ ఎలక్షన్ లో నిలబడి గెలవాలనే రూలు ఎందుకు లేదు?” అని. సమాధానం: కాన్స్టిట్యూషన్ మార్చాలి అంటారు. ఎందుకు మార్చరూ అంటే పాలిటీషియన్స్ వాళ్ళ పార్టీలు మార్చే స్వేచ్ఛకి వాళ్ళే ఎందుకు పోగొట్టుకుంటారు? అని సమాధానం వస్తుంది.
అంటే, ఈ కాన్స్టిట్యూషన్ మార్పుకోసం ప్రజలు డిమాండు చెయ్యాలి. ఇది చెయ్యాలంటే కొద్దోగొప్పో చదువుకొన్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ప్రస్తుతం కుంభకర్ణ యోగంలో ఉన్నారు. వారు లేచినప్పుడు పని అవుతుంది.
మీరు చెప్పింది అక్షరాల నిజం, హరిగారు. ఈరోజుల్లో రాజకీయాలు, ప్రభుత్వం అనేవి కోటానుకోట్ల రూపాయల వ్యాపారాలు. వాటిని పోషిస్తున్నదీ, సమర్థిస్తున్నదీ ప్రజలే. అది వారి స్వలాభాపేక్ష కోసం కావచ్చు, బద్ధకం వల్ల కావచ్చు, దేశభక్తి లేకపోవటం వల్ల కావచ్చు, వారి కులాల, మతాల ‘గజ్జి’ వల్ల కావచ్చు. మొత్తానికి కారణాలు ఏమైనా అవి ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరమైనవి. మీరు చెప్పినట్టు భారతంలో ప్రజాస్వామ్యం కోతికి కొబ్బరికాయ ఇచ్చి భద్రం అని చెప్పినట్టే!
Nice story Satyam garu. This situation is applicable all the time in our politics.
ధన్యవాదాలండి. అవును, ఇప్పుడు ఇంకా ఎక్కువయింది కూడాను. రోజువారీ కండువా మార్పులు చూస్తున్నాం కదా!