స్పందన
అందమనేది శాశ్వతమా, అనుబంధమనేది శాశ్వతమా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు అల్లిన కథే ఈ “సజీవ శిల్పం”. ఈ కథ చదివితే అందంగా వచ్చిన ఈ కథకీ, నాకూ వున్న అనుబంధం మీకు ఇట్టే అర్ధమైపోతుంది.
ఆ రోజుల్లో ఎన్నో కొత్త కొత్త వారపత్రికలూ, మాస పత్రికలూ వస్తుండేవి. కొన్ని ఎన్నాళ్ళ తరబడిగానో నిలిచి కాలగమనంలో అంతర్ధానమయాయి. కొన్ని ముందు బాగానే నిలద్రొక్కుకున్నా ఎక్కువ సంవత్సరాలు వుండలేక పోయాయి. కొన్ని ఒకటి రెండు సంవత్సరాల్లోనే మూతపడ్డాయి. ఆనాటి రచయితలకు ఎంతో స్పందనా, పాఠకులకు మంచి కథలూ అందించిన చిన్న సైజు పత్రికల్లో కొన్ని ప్ర్రముఖమైన పత్రికలుః ప్రజామత, జయశ్రీ, ప్రభవ, పొలికేక, విశ్వరచన, నిర్మల, విజయ, పద్మప్రియ, ప్రగతి, జనసుధ, నీలిమ, అపరాధ పరిశోధన మొదలైనవి. సాహిత్య రంగంలో అప్పుడు ఎన్నో పత్రికలతో సాహితీ ప్రియులను అలరించిన రోజులవి. ఇక చదవండి నాకు నచ్చిన ఆనాటి నా కథల్లో నాకు ఇష్టమైన ఒక మంచి కథ “సజీవశిల్పం”.
(ఈ కథ పొలికేక వారపత్రిక జులై 8, 1970 సంచికలో ప్రచురింపబడింది)
నాకు అసలామె కథలో ఉత్సాహం కలిగించినవాడు గుర్నాధం.
ఆరోజు ప్రొద్దున్నే వరండాలో కూర్చుని గడ్డం గీసుకుంటున్నాను. అప్పుడే ఏదో కొంప ముంచుకుపోయినట్టు వచ్చాడు గుర్నాధం, “నమస్కారం, గురువుగారూ!” అంటూ.
పలకరింపుగా చిన్నగా నవ్వాను. ఆ కాస్త నవ్వుకే గడ్డం తెగి రక్తమొచ్చింది. గుర్నాధం చూడకుండా టవలుతో అద్దాను రక్తాన్ని.
నాకెదురుగా కుర్చీ లాక్కుని కూర్చుని, “మీతో ఒక విషయం చెప్పాలి గురువుగారు!” అన్నాడు.
అతన్ని చూస్తే ఆరోజెందుకో మంచి ఉత్సాహంగా వున్నాడనిపించింది.
అసలు నాకతనితో పరిచయమయి సరిగ్గా రెండు నెలలే అయింది. కానీ బాగా సన్నిహితుడయాడు. అతను కూడా నేను పనిచేస్తున్న స్కూల్లోనే కొత్తగా చేరాడు. తేడా మాత్రం నేను తెలుగు మాష్టరుని, అతను డ్రిల్లు మాష్టరు. అతనికి ఇరవై నాలుగేళ్ళ వయసుంటుందేమో! అవివాహితుడు. ఇంత ప్రొద్దున్నే గుర్నాధం రావడంలో ఏదో పెద్ద విశేషమే వుందనిపించింది.
“నేను అద్దెకున్న ఇంట్లోనే క్రింది పోర్షన్ ఖాళీగా వుందని తెలుసుగా మీకు. ఆ పోర్షన్లో నిన్న మధ్యాహ్నమే ఎవరో దిగారు” అన్నాడు గుర్నాధం.
దాంట్లో నాకు విశేషమేమీ కనపడలేదు. ఇళ్ళు ఖాళీ అవటం, వెంటనే ఎవరో వచ్చి ఆక్రమించటం, గుంటూరు లాంటి పెద్ద పట్టణాల్లో సాధారణంగా జరిగేదే.
“మొగుడూ, పెళ్ళాం. చిన్నవాళ్ళే. ఆవిడని చూడటానికి రెండు కళ్ళూ చాలవు గురువుగారు. ఎంత అందంగా వుందనుకున్నారు. తెలుగువారిలో అరుదుగా… “
ఇటువంటి కబుర్లు నా భార్య చెవిన పడటం మంచిది కాదు. చంటాడిని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని, దొడ్లో నీళ్ళు పోయటం, ఇక్కడ నించీ స్పష్టంగా కనపడుతూనే వుంది.
“…. తెలుగువారిలో అరుదుగావుండే రోజా రంగు శరీరం ఆమెది. సన్నజాజి తీగెలా వుందంటే నమ్మండి. ఆ అందమే కాదు, ఆ ఘుమాయింపు కూడా వుంది. ఆవిడ అందం వర్ణించటం నా తరం కాదు. నేనే కాదు, అల్లసాని పెద్దనని తీసుకువచ్చినా ఖచ్చితంగా దెబ్బతింటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆవిడ అప్సరసలలో అప్సరస. ఏ ప్రపంచ సుందరి ఆమె కాలిగోటికి సరిపోతుందండీ..” ఆమె రూపాన్ని మళ్ళీ తన మనసులోకి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబోలు, గుర్నాధం ఏదో లోకంలో తేలిపోతున్నట్టుగా కనిపించాడు.
గుర్నాధానికి కావలసినివి నా చెవులు. నా నోరు కాదు. అందుకే నేనేమీ మాట్లాడకుండా, షేవింగ్ సామాను సర్దుతూ కూర్చున్నాను.
“పెళ్ళయిన ఒక స్త్రీని నేనిలా వర్ణిస్తున్నానని నన్ను అపార్ధం చేసుకోవద్దు గురువుగారు. ఆమె అందం అటువంటిది. ఆమెను చూడగానే మీతో చెప్పాలనిపించింది. చెబుతున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆమె సజీవ శిల్పంలా వుందనుకోండి!” అని, అతని ఉత్సాహాన్ని పైకి చెప్పటం కోసం టేబుల్ మీద చేతివేళ్ళతో టకటకలాడించాడు.
“సజీవ శిల్పం అంటే అర్ధం తెలుసునా నీకు?” అడిగాను నవ్వుతూ.
అతనూ నవ్వాడు.
“నేను తెలుగు మాష్టరుని కాకపోయినా, ఆ మాత్రం తెలుసు సార్. ప్రాణమున్న ఒక అందమైన శిల్పం లాటిదనే కదా అర్ధం” అన్నాడు.
“అంతేనా.. లేక జీవకళ వుట్టిపడేటట్లు చెక్కిన పాలరాతి శిల్పమనా?”
అతనికి ఒక్క క్షణం అర్ధం కాలేదు.
“ప్రాణముండీ శిల్పంలాగా అందంగా వుందనా?.. శిల్పమయివుండీ జీవకళ వుట్టిపడుతూ వుందనా.. ఏమో గురువుగారూ, నాకు తెలిసిన కొంచెం తెలుగునీ గందరగోళం చేస్తున్నారు!” జుట్టు పీక్కున్నాడు గుర్నాధం.
చిన్నగా నవ్వి, “ఊఁ, సరేలే కానీ. ఇంతకీ ఆమె సజీవశిల్పంలా వుందంటావు” అన్నాను. అతని మాటని ఖండిస్తే అసలు విషయం బయటికి రాదు మరి.
“ఆమె పేరు మాధురి”
మధురంగా వుంది. ఒప్పుకోవాలి.
“ఆమె భర్త పేరు జయరాం. అతను అరండేల్ పేటలో ఏదో బ్యాంకులో పనిచేస్తున్నాడుట. అతనికసలు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదుట. ఏడు తరాలవాళ్ళు తెగతిన్నా తరగని ఆస్తి వుందట. ఏదో సరదా కొద్దీ పురుషుడు అయినందుకు ఆ లక్షణం చూపిద్దామని ఉద్యోగం చేస్తున్నాడుట. అసలు నాకు వాళ్ళతో పరిచయమే వింతగా జరిగింది సార్! నిన్నస్కూలు వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళాను. గేటు తీసి లోపలికి వెళ్ళగానే ఆగిపోయాను. మీకు తెలుసుగదా, నేను మేడ మీద గదిలో వుంటున్నానని. పైకి వెళ్ళే మెట్ల దగ్గరే సన్నజాజి తీగె ఒకటి పందిరికి అల్లుకుని వుంది. అక్కడే వున్నది మాధురి. ఒక చిన్న స్టూలు వేసుకుని సన్నజాజులు కోస్తున్నది. పమిటె చెంగుని చుట్టు తిప్పి, నడుము దగ్గర ఆ తెల్లటి చీరలో దోపింది. చల్లగాలికి చెదురుతున్న ముంగురులు ఆమె పాలరాతి నుదిటి మీద నాట్యం చేస్తున్నాయి. ఆమె విశాలమైన కళ్ళల్లో వున్న అందం.. వెలుగు.. అబ్బ, వర్ణించటానికి నా తరం కాదు మాష్టారూ! ఆమె చేతిలో ఒక గిన్నె. గిన్నెలో నీళ్ళు. ఆ నీళ్ళలో కోసిన సన్నజాజులు పడేస్తున్నది. ఏమీ గమనించకుండా ఏకాగ్రతతో పూలు కోస్తున్నదామె. అంత అందాన్నీ ఒక్కసారిగా చూసేసరికీ, నాకు ఏదో మైకం కమ్మినట్టయింది. ఇంతలో కిటికీలోనించీ నన్నే చూస్తున్న జయరాం కనపడ్డాడు. నేను సర్దుకుని మెట్ల వేపు నడిచాను. అంతే! ఆమె నుంచున్న స్టూలు పక్కనే నేల మీద పడగవిప్పి ఆడుతోంది ఆరడుగుల నల్లటి త్రాచుపాము. అసలు మాకు పరిచయం అవటానికి కారణం అదే సార్! అంతకుముందు రెండు మూడుసార్లు నాకు కనపడింది కానీ, చంపబోతే దొరకలేదు. అంత మంచి అదను మళ్ళీ రాదు. అందుకే నిశ్శబ్దంగా, పక్కనే వున్న కర్ర తీసుకుని, రెండే రెండు దబ్బలు వేశాను. ఆమె ఒక్కసారిగా వులిక్కిపడి క్రిందకు దూకింది. చచ్చిన పాముని చూసి కెవ్వుమని కేక వేసింది. ఆ సందడికి జయరాం కూడా బయటికి వచ్చాడు. పాముని చూసి జరిగింది గ్రహించాడు. దంపతులిద్దరి కళ్ళల్లోనూ కృతజ్ఞత కనపడింది”
నా భార్య కాఫీ తేవటం చూసి ఆగాడు గుర్నాధం.
కాఫీ కప్పు అందుకుంటూ, “నమస్కారం అక్కయ్యగారూ” అన్నాడు.
“ఏం తమ్ముడూ, ఈమధ్య అసలు కనపడటం లేదు” అన్నది నాభార్య పార్వతి.
“మావూరి నించి మొన్ననే తిరిగి వచ్చానండీ!” అన్నాడు గుర్నాధం.
పార్వతి కవ్వింపుగా నవ్వింది, “ఈసారయినా నచ్చినట్టేనా?” అంటూ.
అతనికి ముందు అర్ధం కాలేదు. కాస్సేపటికి గ్రహించి సిగ్గుపడిపోయాడు.
“ఏమిటోనండీ.. బజార్లో ఇంతమంది చక్కటి ఆడపిల్లలు కనబడతారా, పెళ్ళి చూపులకు వెడితే అంతా.. ఎందుకులెండి, కాలం ఖర్మం కలసిరావాలి!” అన్నాడు.
పార్వతి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది.
“నన్ను ఆ రాత్రి వాళ్ళింటికి భోజనానికి పిలిచాడు సార్, జయరాం. నా ఋణం తీర్చుకోలేనన్నాడు. నేను ఆ క్షణంలో రాకపోతే తన భార్య పాముకాటుకి చనిపోయేదన్నాడు. ఇంకా చాల అన్నాడులెండి”
నిజంగా ఆ సంఘటన జరిగిందో, లేదోగానీ గుర్నాధం బాగానే వర్ణించాడనిపించింది.
“మీకిది తెలుసా సార్! జయరాం గొప్ప కవి. ఎన్నో కవితలు, పుస్తకాలు భార్య పేరుతో ప్రచురించాడుట. అంతేకాక అతను బొమ్మలు కూడా ఎంతో బాగా గీస్తాడు. చాల చిత్రాలకి బహుమతులు కూడా అందుకున్నాడు. అతను నిజంగా అదృష్టవంతుడు. గొప్ప కళాకారుడవటమే కాకుండా, అపూర్వమైన కళ వుట్టిపడే భార్య వుంది. పైగా భార్యను విపరీతంగా ప్రేమిస్తున్నాడు”
నేను ఏమీ మాట్లాడలేదు.
“మీరు స్నానం చేయలి కాబోలు మాష్టారూ. నే వెడతాను. మళ్ళీ కలుస్తాలెండి!” వెళ్ళిపోయాడు గుర్నాధం.
తరువాత నేను ఆ విషయం దాదపుగా మరచిపోయాను. నాలుగు రోజుల తర్వాత స్టాఫ్ రూములో కూర్చుని వుండగా వచ్చాడు గుర్నాధం నమస్కారం పెడుతూ.
“మీకు ఆరోజు చెప్పాను గుర్తుందా గురువుగారూ. మాధురిని పువ్వుల్లో పెట్టి పూజ చేస్తున్నాడు జయరాం. వాళ్ళింట్లో పనిచేసే అమ్మాయే నా రూమ్ కూడా వూడుస్తుంది. ఆ అమ్మాయే చెప్పింది. నడిస్తే పెళ్ళాం కాళ్ళు కందిపోతాయని బాధపడతాట్ట జయరాం. ఏ పనీ ఆవిడ చేయటానికి వీలులేదట. వంటకి కూడా వేరే ఆడమనిషిని వుంచాడుట. అతనికి కావలసినదల్లా ఆమె ఎప్పుడూ తన ముందు కూర్చుని నవ్వుతూ వుండటమేనట. ఆఫీసు లేని వేళల్లో మాధురి కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంటాడుట. అతని చిత్రాలకు భావావేశం యిచ్చేది మాధురి. అతని కవితలకు కవితావేశం యిచ్చేది మాధురి. ఆమె వల్లనే తన కవితా కన్య గానానికి అడ్డులేదంటాడుట. గానమంటే గుర్తుకు వచ్చింది. మాధురి చాల బాగా పాడుతుందిట. జయరాం ఆమె గానం వింటూ ఏవో లోకాలలో తేలిపోతుంటాడుట. నిజంగా ఇంత కళామయ జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులు ధన్యులు. ఏమంటారు?” అన్నాడు గుర్నాధం.
ఏమంటాను? కానీ ఏదీ అనకపోతే గుర్నాధం ఏమయినా అనుకుంటాడు. అందుకని, “కాదూ మరి” అన్నాను.
నాకూ విచిత్రంగానే వుంది. ఇంతటి కళారాధకులు ఈ కాలంలో కూడా వున్నారా అని.
ఇంతలో బెల్ కొట్టడంతో నేను క్లాసుకి వెళ్ళవలసి వచ్చింది. గుర్నాధంతో క్లాసుందని చెప్పి వెళ్ళిపోయాను.
పది పదిహేను రోజుల తర్వాత, ఆరోజు తీరిగ్గా కూర్చుని కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుతున్నాను. పార్వతి వంట ప్రయత్నంలో వుంది. చంటివాడు మంచం మీద ఆదమరచి నిద్రపోతున్నాడు.
గేటు చప్పుడయితే అటు చూశాను. నీరసంగా వస్తున్నాడు గుర్నాధం. గడ్డం పెరిగింది. కళ్ళల్లో వుత్సాహం లేదు. వచ్చి మాట్లాడకుండా కూర్చున్నాడు.
“అలా వున్నావేం, గుర్నాధం?” అడిగాను కొంచెం ఆశ్చర్యపడుతూ.
నవ్వుతూ పేలుతూ వుండే గుర్నాధాన్ని ఆ రకంగా చూడటం అదే మొదటిసారి.
“ఏంలేదు గురువుగారూ. ఈమధ్య బాగా జ్వరం వచ్చింది. ఇవాళే భోజనం చేశాను” అన్నాడు మెల్లగా.
విస్తుపోయాను. “అదేమిటి గుర్నాధం, మా ఇంటికి రాకపోయావా? ఒంటరివాడివి, నీకక్కడ చేసేదెవరు? అసలు మందులేవైనా వేసుకున్నావా? నీ సంగతి అక్కడ చూసిందెవరు ఇంతకీ..” ఈ విషయం పార్వతికి తెలిస్తే నన్ను చివాట్లు పెడుతుంది. అతన్ని అంత జ్వరంలో దూరంగా వుంచినందుకు నామీద విరుచుకుపడుతంది.
“అబ్బే! అదేమంత పెద్ద జ్వరం కాదు సార్! అదే తగ్గిపోతుందని వూరుకున్నాను. తగ్గకపోగా ఇన్నాళ్ళు లాగిలాగి వదిలింది. ఈమాత్రానికే మిమ్మల్ని శ్రమ పెట్టటమెందుకని వూరుకున్నాను. అయినా మా పనమ్మాయి నన్ను జాగ్రత్తగానే చూసుకుంది లెండి. సమయానికి ఆదుకుంది, ఏనాటి ఋణమో” గుర్నాధం ఈమాట అమాయకంగా అన్నా నాకు మాత్రం నవ్వు వచ్చింది.
మాధురి గురించి అడుగుదామనిపించింది. ఇంతలో అతనే అన్నాడు.
“గురువుగారూ! మాధురి, జయరాం నేననుకున్నంత సుఖంగా జీవించటం లేదు”
నాకీసారి నిజంగానే ఆశ్చర్యం వేసింది. కళాపూరితమైన వారి ఆదర్శ జీవితానికి అడ్డుగోడలా! అదేమిటో తెలుసుకోవాలనిపించింది. నేనతన్ని అదేమిటని అడగనవసరం లేదు. నేను మాట్లాడకుండా వుంటే గుర్నాధమే అంతా చెబుతాడు.
“మాధురికి, తనెంత అందంగా వున్నా మామూలు స్త్రీలాగానే, గృహిణిగానే జీవించాలని వుంటుందిట. ఆమెకి తన ఇంటిని తనే చక్కబెట్టుకుని స్వయంగా వంట చేసి భర్తకు వడ్డించాలని కోరికట. ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని తన చేతులతోనే పెంచి పెద్ద చేయాలని కలలు కంటుందిట. కానీ జయరాం ఆమె సాధారణ స్త్రీ కాదనీ, మామూలుగా జీవించవలసిన ఖర్మ ఆమెకేమీ లేదనీ వాదిస్తాట్ట. అన్నింటికీ పని మనుష్యుల్ని పెట్టాడుట. ఆమె కాలు కదపనవసరం లేకుండా, పనులన్నీ జరిగే ఏర్పాట్లు చేశాడుట. కానీ ఆమెకి ఏమాత్రం తృప్తిగా లేదుట”
ఒక్క క్షణం ఆగి అటూ, ఇటూ చూసి మెల్లగా అన్నాడు.
“ఇంకో విషయం సార్. ఆమె సుకుమార శరీరం ఏ శిల్పికీ అందనంత అద్భుతంగా వుంటుంది. కాన్పులతో ఆమె చితికిపోతుందనే భయం కూడా అతనిలో వుంది. అందుకే ఇద్దరికీ వేరు వేరు మంచాలు వేయించాడుట. అంతేకాదు తన మీద తనకి ఎక్కడ కంట్రోల్ పోతుందో అని వేసక్టమీ ఆపరేషన్ కూడా చేయించుకున్నాట్ట. ఆమెకి పిల్లలంటే అపరిమితమైన ప్రేమ. ఇతను ఆపరేషన్ చేయించుకుంటానంటే, ఆమె ఇతని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడిందిట. పిల్లలు లేనిదే తను బ్రతకలేనని గోల పెట్టిందిట. అయినా జయరాం వినలేదు. పిల్లలు లేకుండా హాయిగా బ్రతుకుదాం అంటాడుట. ముసలివాళ్ళయిన తర్వాత కూడా ఏమీ భయం లేదు, మన డబ్బుతో సుఖంగా గడపవచ్చు అంటాడుట. ఆమెలో మాత్రం ఎంతో అసంతృప్తి. ఈమధ్య ఆమె ఏమాత్రం హుషారుగా వుండటం లేదుట. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, పరధ్యాన్నంగా వుంటుందిట. ఆమె అందమైన పెదవుల మీద చిరునవ్వు అసలేమాత్రం కనపడటం లేదు”
ఎంతో అందంగా మొదలైన ఈ కథ ఏవిధంగా అంతమవుతుందా అనిపించింది నాకు.
“నాకు జ్వరమొచ్చిందని తెలిసి పాలూ, పళ్ళూ పంపించింది ఒకరోజు. బాగుండదని నేనే వద్దన్నాను. ఆమె చిన్నబుచ్చుకున్నదో.. ఏమో! నేనేమయినా తప్పు చేశానా గురువుగారూ?” అడిగాడు గుర్నాధం అమాయకంగా.
కాంపోజిషన్ పుస్తకం మీద ఎర్ర ఇంకుతో గీతలు గీస్తున్నాను. “ఆమె నీకు పాలూ, పళ్ళూ పంపించటంలో తప్పు ఏమాత్రం లేదు. ఆమెకు నువ్వు ప్రాణదానం చేశావు. నీకు వంట్లో బాగులేనప్పుడు ఆమె సహాయం చేయటం కనీస మానవ ధర్మం. నువ్వు అవి తిరస్కరించటం మాత్రం తప్పే!” అన్నాను.
గుర్నాధం కాసేపు మాట్లాడలేదు.
ఉన్నట్టుండి “నేను వెడతాను సార్” అన్నాడు లేస్తూ.
“ఉండు గుర్నాధం. నువ్వు పూర్తిగా కోలుకునేదాకా మా ఇంట్లోనే వుండు. లేకపోతే మీ అక్కయ్య నన్ను చివాట్లు పెడుతుంది” అన్నాను.
“వద్దు సార్. అదే పోతుంది. వస్తాను. మళ్ళీ కలుస్తాలెండి” వెళ్ళిపోయాడు గుర్నాధం.
మర్నాడు పార్వతి నాన్నగారికి ఒంట్లో బాగాలేదని టెలిగ్రాం వచ్చింది. సెలవు పెట్టి, నేనూ, పార్వతీ, పిల్లలూ హైదరాబాద్ ప్రయాణం అయాము. ఆయన పరిస్థితి ఏమంత బాగాలేదు. మరో దిక్కు లేనందున, నేనే ఆయనకు పూర్తిగా తగ్గేదాకా, దాదాపు నెల రోజులు అక్కడే వుండవలసి వచ్చింది. ఆయన నెమ్మదిగా కోలుకునేసరికీ హైదరాబాదులోనే మావాళ్ళమ్మాయికి పెళ్ళి నిశ్చయమైంది. మరో పదిహేను రోజులాగి అదీ చూసుకుని గుంటూరు వచ్చాము.
స్కూలుకి శెలవులు ఇవ్వటం వలన గుర్నాధం అసలు గుంటూరులో వున్నాడో లేడో కూడా తెలియటం లేదు.
మనసులో మాధురి, జయరాంల విషయమేమిటో తెలుసుకోవాలని ఆత్రుతగా వుంది.
ఇక వుండబట్టలేక ఒకరోజు ప్రొద్దున్నే గుర్నాధం రూముకి బయల్దేరాను. బ్రాడీపేట నాలుగో లైను చివరలో వుంటున్నాడతను.
తలుపు తీసి లోపలికి అడుగుపెట్టాను. ఒక యువకుడు వరండాలో పడక్కుర్చీలో పడుకుని వున్నాడు. అతనే జయరాం అయివుండాలనుకున్నాను.
మేడ మీద గుర్నాధం గది తలుపు తెరచివుండటం చూసి ఆశ్చర్యపోయాను. అయితే యిన్నాళ్ళూ గుర్నాధం వూళ్ళోనే వున్నాడన్నమాట.
మంచం మీద బోర్లా పడుకుని వున్నాడు.
అతని వీపు మీద చేయి వేస్తూ, “గుర్నాధం” అని నెమ్మదిగా పిలిచాను.
ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు గుర్నాధం. అతని కళ్ళు ఎర్రగా వుబ్బివున్నాయి. తనలో తనే ఏదో గొణుక్కుంటున్నాడు.
“ఏమిటి గుర్నాధం, అలా వున్నావ్” అన్నాను అతని జుట్టు నిమురుతూ.
అమాంతం నన్ను కావలించుకుని, ఒక్కసారిగా బావురుమని ఏడ్చాడు.
నాకేం అర్ధం కాకపోగా, అయోమయంగా వుంది.
“అసలేమయింది, గుర్నాధం” అన్నాను.
“మీరు చెప్పండి సార్, నేనలాటివాడినా?” అన్నాడు గుర్నాధం చిన్నపిల్లాడిలా.
“అసలేం జరిగిందో నాతో చెప్పు” లాలించాను అతన్ని, పార్వతి మా చంటాడిని లాలించినట్టు.
ఒక్క నిమిషం ఆగి అన్నాడు గుర్నాధం, “మాధురి ఇప్పుడు గర్భవతి” అని.
గుండె ఆగినంత పనయింది నాకు, మాధురి గర్భవతా?
“వేరువేరుగా పడుకునే వారన్నావు.. అదీకాక అతను ఆపరేషన్ కూడా…” సణిగాను మెల్లగా.
“అందుకనే నన్ను అనుమానిస్తున్నాడు సార్, జయరాం. మీరు చెప్పండి సార్, నేనలాటి వాడినా?” గుర్నాధానికి ఏడుపు ఆగలేదు. మళ్ళీ భోరుమన్నాడు.
“నీ గురించి నాకు తెలీదూ గుర్నాధం. నీలో నాకాపాటి నమ్మకం వుంది. అయినా అతను నిన్ను అనుమానించటమేమిటి, బుధ్ధి లేకపోతే సరి! భార్యని భార్యగా చూడకుండా, కవితా కన్యనీ, కాకరకాయనీ కాలం గడిపితే ఏ పెళ్ళాం వూరుకుంటుంది? వాడికి తగిన శాస్తి అయిందిలే. వాడినసలు కేర్ చేయకు” అన్నాను కోపంగా.
ఎందుకో జయరాం అంటే ఆ క్షణంలో కొంచెం అసహ్యం వేసింది.
“కానీ ఆమె అటువంటిది కాదు సార్. చాల మంచిది” అన్నాడు గుర్నాధం తేరుకుంటూ.
మరి గుర్నాధం ఇంకా పసివాడు కాదూ! అంత కోపంలోనూ నవ్వు వచ్చింది.
“గుర్నాధం! ఏదయినా జరిగి వుండవచ్చు. ఏ ఆడదీ అలా వూహల్లో బ్రతకలేదు. జీవితాన్ని ఒక సాధారణ స్త్రీలాగా సరైన పంధాలో అనుభవించాలనే కోరిక ఆమె ఓర్పుని మించి వుంటుంది. పరిస్థితులకు లొంగక తప్పదు. ఒకవేళ ఆమె దానికీ అతీతురాలయితే, నువ్వు చెప్పావు కదా అతను ఆపరేషన్ చేయించుకున్నాడని. అలాటి ఆపరేషన్లు కొన్ని ఫెయిలైన కేసులు కూడా వింటూనే వున్నాం. అదే కారణం ఎందుకు కాకూడదు?” అన్నాను.
ఆమాట విన్న గుర్నాధం కళ్ళు మెరిశాయి. “అయితే అదే అయివుండవచ్చు. అటువంటి ఆపరేషన్లు ఫెయిల్ అవుతున్నాయని నేనూ విన్నాను” అన్నాడు గుర్నాధం. అంటుండగా అతని ముఖం వికసించింది కూడాను.
“గుర్నాధం, నువ్వివేవీ పట్టించుకోకు. మా ఇంటి దగ్గర ఒక గది అద్దెకి ఖాళీగా వుందని బోర్డు పెట్టారు. అక్కడికి మారు. మీ వూరుకి వెళ్ళి పెళ్ళి చేసుకో. అన్ని గొడవలూ మర్చిపోతావ్. జయరాం యిక మీద ఏ అభాండాలూ వేయడు. అతనికీ తెలుసు, ఆ అభాండాలే తన సంసారాన్ని విచ్ఛిన్నం చేస్తాయని. ఏదో గుట్టుగా కాపురం చేస్తూ, ఇకనయినా బాగా వుంటాడు” అతన్ని ఓదార్చి బయటకు వచ్చాను.
మెట్లు దిగుతుండగా కనపడిందామె.
నిజంగా అపురూప సౌందర్యవతే! గుర్నాధం చెప్పిన దానికన్నా ఎన్నో రెట్లు అందంగా వుంది.
నన్ను చూసి, తల వంచుకుని చకచకా లోపలికి వెళ్ళిపోయింది.
ఆరోజు గుర్నాధం ఆమెను సజీవ శిల్పం అన్నాడు.
అంటే అర్ధం జీవకళ వుట్టి పడేటట్లు చెక్కిన శిల్పమనా?
లేక ప్రాణం వుండీ అందమైన శిల్పంలా జీవిస్తున్నదనా?
ఏమో! తెలుగు మాష్టరునయినా ఆ క్షణంలో నాకామాటకి అర్ధం తెలియలేదు!