Menu Close
Kadambam Page Title
అక్షర గవాక్షం
-- డి.నాగజ్యోతిశేఖర్

ఆ కిటికీ ప్రక్కన కూర్చోగానే....
ఆలోచనలు సీతాచిలుకలై నా ఒడిలో వాలుతాయి!
పూల తీగలు పాటలై నన్నల్లుకుంటాయి!

ఆ కిటికీ రెక్కల సందుల్లోంచి నా దుఃఖాలను
పావురాల్లా ఎగరేస్తాను!
అవి వెన్నెల గేయాలై నా వద్దకు తిరిగొస్తాయి!

ఆ అంచుల్లో దిగులు మంచును కరిగించి
వెలుగు కంచు కాగడాలు ముట్టించుకుంటాను!
నా చీకటి తోవను గుప్పున మండించుకుంటాను!

నేను పారేసుకున్న స్మృతులు
కవితానదులై నన్ను ముంచెత్తేది ....
ఆరేసుకున్న కలలు
పచ్చటిపదాలై నర్తించేది
ఆ గవాక్షపు గట్టుపైనే!

నలిగిన నెత్తుటి వాక్యాలనూ...
విరిగిన ఆత్మ కథల్నీ
నే దత్తత తీసుకునేది
ఆ వేకువ ద్వారం గుండానే!
నా కన్ను నన్ను చైతన్యం వెంట నడిపేది
ఆ మండేఅక్షర కమ్మీలు పట్టుకునే!
ఆ కాంతివనం తలుపు తెరవగానే...
నేనో జ్వలితనక్షత్రమై....
దౌర్జన్యరాత్రిళ్లను వేటాడేందుకు దూసుకుపోతాను!
అన్యాయపు నిశినీడల్ని కలం అంచున నుసిచేస్తూ
తూర్పు వాకిలిలో భగ భగ మండే
కవితా సూర్యుడై ఉదయిస్తాను!

Posted in September 2020, కవితలు

7 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!