ఇల్లంతా ప్రశాంతంగా వుంది. పిల్లలందరూ మొబైల్, ట్యాబ్లు, కంప్యూటర్ ల్లో ఆటలు ఆడటమో లేదా టీవీ చూడటంలోనో మునిగిపోయారు. పెద్దవాళ్ళందరూ ఇంటి నుంచి పని అవ్వటంవల్ల తలా ఒక రూమ్ లో కూర్చుని ఆఫీస్ పని లోనో, మీటింగ్స్ లోనో వున్నారు. నా భార్యామణి కిచెన్ లో వంట చేయటం లో నిమగ్నమైనట్లుంది. అప్పుడప్పుడు కుక్కర్ విజిల్, గిన్నెలు శబ్దాలు వినపడుతున్నాయి.
మా ఇద్దరు అబ్బాయిలు మరియు అమ్మాయి అమెరికా లో స్థిరపడటం వలన, నేను నా భార్య ప్రతి సంవత్సరం ఇక్కడికి రావటం ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కో నెల ఉండటం, ఆ తర్వాత అందరం కలిసి ఒక చోట కలవటం పరిపాటి. ఈ సంవత్సరం అందరం శాన్ ఫ్రాన్సిస్కొ నా పెద్దకొడుకు ఇంట్లో కలిసాం.
ఒక వారం రోజులు పిల్లలందరూ సెలవలు పెట్టుకోవడం వల్ల, అందరం గోల్డెన్ గేట్ బ్రిడ్జి, లాంబార్డ్ స్ట్రీట్, పియర్ 39 లాంటివి చూసాము. మళ్ళీ వారాంతంలో ఎక్కడికో వెళ్ళటానికి ప్లాన్ వేసినట్లున్నారు. ఈ రోజు వారం రోజు కావటం వల్ల ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి వున్నారు పిల్లలతో సహా.
ఇంతలో ఏదో చిన్న కలకలం. పిల్లలందరూ బిలబిలమంటూ హాల్ లోకి వస్తున్నారు.
గ్రాండ్పా, మై గేమ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఒక మనవడి ఫిర్యాదు.
తాతయ్య, TV రావడంలేదు. వచ్చీరాని తెలుగులో ఒక మనవరాలు.
ఓహ్ మై గాడ్! ఇంటర్నెట్ ఈస్ నాట్ వర్కింగ్ డాడ్. అని అరుస్తున్నాడు అందరికంటే పెద్దవాడైన మనవడు.
అప్పుడు అర్ధం అయింది అంతర్జాలం పనిచెయ్యటంలేదని.
ఏం పిల్లలో ఒక్క నిమిషం ఇంటర్నెట్ లేకపోతే ఉండలేరు. ఈ ఇంటర్నెట్ లేని కాలంలో మేము అన్ని పనులు చేసుకున్నాం. చదువుకున్నాం, ఆడుకున్నాం, పని చేసుకున్నాము. మరి ఇప్పుడెందుకు వీళ్ళందరూ ఇంతగా బానిసవుతున్నారో తెలియడంలేదు.
ఇంతలో పెద్దవాళ్లు కూడా వాళ్ళ వాళ్ళ లాప్టాప్లు పట్టుకొని హాల్ లోకి వచ్చారు.
అన్నయ్య, ఇంటర్నెట్ పోయినట్లుంది. కెన్ యు ప్లీజ్ రీబూట్ ది రౌటర్. చిన్న అమ్మాయి వాళ్ళ అన్నయ్యని అడుగుతుంది.
ఉండవే, చూస్తాను. ఇది మనకొక్కళ్ళకే కానట్టుంది. ఇదిగో ఈ వాట్సాప్ గ్రూప్ లో అప్పుడే అందరు మొదలెట్టారు ఇంటర్నెట్ డౌన్ అని.
హ, సరే ఇక స్టార్ బక్స్ కెళ్ళి కూర్చోవాలి ఇవాళ. చచ్చాంరా బాబు. రెండో అబ్బాయి
ఏమండి, ముందు వాడికి ఫోన్ చెయ్యండి, ఎంతసేపు పడుతుందో, నాకు 30 మినిట్స్ లో మీటింగ్ వుంది. హుకుం జారీ చేసింది పెద్ద కోడలు.
ఇంటి యజమాని అయిన పెద్దకొడుకు కాసేపు ఫోన్ లో హడావుడి చేస్తున్నాడు. పిల్లలందరూ ఇంటర్నెట్ పోయిందని గగ్గోలు పెడుతున్నారు.
మొబైల్ హాట్ స్పాట్ కూడా ఎక్కువసేపు వర్కవ్వదు. ఏం చెయ్యాలి? అల్లుడు అటు ఇటూ తిరుగుతూ గొణుక్కుంటున్నాడు.
ఒక 10-15 నిముషాల తర్వాత, పెద్దబ్బాయి చెబుతున్నాడు అందరితో, ఎక్కడో కన్స్ట్రక్షన్ ఏరియా లో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయినాయట. మన కమ్యూనిటీ తో పాటు, పక్క కమ్యూనిటీ లో కూడా ఔటేజ్ వుంది. ఇప్పట్లో వచ్చేలా లేదు. ఒక 10-15 గంటలు పడుతుందట.
నాకర్ధమైపోయింది పరిస్థితి. వెంటనే పెద్దవాళ్లందరిని ఒకపక్కకి పిలిచాను.
ఒరేయ్ అబ్బాయిలు, అమ్మాయిలు - ఇవాల్టికి మీ ఆఫీస్ కి ఫోన్ చేసి ఇంటర్నెట్ ఔటేజ్ అని చెప్పి లీవ్ పెట్టేయండి. అలా కాదని, మీరెక్కడికన్నా వెళ్లి పనిచేసుకుంటామంటే, ఈ పిల్ల రాక్షసుల సంగతేంటి. మీరు లీవ్ పెడితే, మనందరం కలిసి ఏదో ఒకరకంగా వీళ్ళని ఎంగేజ్ చెయ్యొచ్చు.
అదికాదు నాన్న, మేము లీవ్ పెట్టినా ఇప్పటికిప్పుడు ప్లాన్ చేయకుండా మన బయటకి ఎక్కడికీ తిరగటానికి వెళ్లలేము.
మనం ఎక్కడికీ వెళ్ళటం లేదు. ముందు మీరు ఫోన్ చేసి ఆఫీస్ లో చెప్పండి, నేను చూసుకుంటా అని చెప్పి, నా భార్య ని పక్కకి పిలిచి హడావుడి గా మాట్లాడాను. అప్పటికే వంట కార్యక్రమం అంతా పూర్తిఅయినట్లుంది. నేను చెప్పింది శ్రద్దగా విన్నది.
కాసేపట్లో అందరం బ్యాక్ యార్డ్ లో సమావేశమయ్యాం. వేసవి అయినా రెండు చెట్లు ఉండటంవల్ల కొంచెం ఫరవాలేదనిపించింది. పిల్లలందరిని ముందు వరుసలోకి రమ్మని, పిల్లల్లారా! ఈరోజు మీకు, చిన్నప్పుడు మేము, మీ అమ్మ నాన్న ఏమి ఆటలు ఆడామో ఆ ఆటలు ఆడిస్తున్నాము. ఇలాంటి ఆటలు మీకు ఇంటర్నెట్లో దొరకవు. అందుకని శ్రద్ధగా విని చక్కగా ఆడండి. అప్పటికి గాని కొడుకులకి, కూతురు, కోడళ్ళకు, అల్లుడికి అర్ధం అయింది నేనెందుకు వాళ్ళని ఈ రోజు కి ఆఫీస్ కి సెలవు తీసుకోమన్నానో.
మామయ్య గారు, మీరసలే రిటైర్డ్ స్పోర్ట్స్ మాస్టర్. ఇంక పిల్లలకి మంచి కాలక్షేపమే ఈరోజు. పనిలో పని మమ్మల్ని కూడా ఆడించండి. చిన్న కోడలు ఛలోక్తి గా అన్నది.
చిన్నగా నవ్వి, అందర్నీ ముందుకు పిలిచి మొదలెట్టాను.
ముందుగా మనం ఆడే ఆట పేరు "నాలుగు స్తంభాలాట". ఈ ఆట ఒక చతురస్రాకార ప్రదేశంలో ఆడబడుతుంది, ప్రతి మూలలో ఒక స్తంభం ఉంటుంది. మనకిక్కడ స్తంబాలు లేవు కాబట్టి, మనం ఒక పెద్ద స్క్వేర్ ని నాలుగు సమాన స్క్వేర్ లుగా చేసి అక్కడ నాలుగు ప్లేయర్స్ వుంటారు. ఈ నలుగురు ఒక స్క్వేర్ లోకి రావాలి. ఈ నలుగురు ఒక చోటికి రాకుండా అయిదవ ప్లేయర్ చూడాలి. వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.
అయిదుగురు పిల్లల చేత పంటలు వేయించి, వాళ్ళ చేత ఆడించాము. ఐదుగురు పిల్లలు చేతులు పట్టుకుని పంటలు వేయటం వాళ్లకి సరదాగా అనిపించింది.
మొదట్లో కొంచెం కష్టపడ్డా, పిల్లలు బాగానే ఆడారు. పెద్దవాళ్ళందరం వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఆడించాము.
మామయ్య గారు, మొత్తానికి మీరు భలే ప్లాన్ వేశారు. మా అందరికి మేము హైస్కూల్ లో ఆటలు ఆడిన జ్ఞాపకాలు వస్తున్నాయి. అల్లుడు గారి కాంప్లిమెంట్.
అవును అల్లుడు, ఇదిగో ఇప్పుడు ఆడబోయే ఆటలో మీ ఆవిడ టీం హైస్కూల్ ఛాంపియన్స్.
అవునా! ఏమి ఆట అది, ఈసారి మేము కూడా జాయిన్ అవుతాము. అల్లుడు గారు రెడీ అవుతున్నాడు.
ఈ ఆట పేరు ఖో ఖో. మీ అందరు చిన్నప్పుడు ఆడే వుంటారు. మీ మీ పిల్లలకి వివరించి చెప్పండి ఎలా ఆడాలో. అందరు తల్లి తండ్రులు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఆట ఎలా ఆడాలో చెప్పి అందరు రెడీ అయిపోయారు.
ఈ ఆట ఇచ్చిన సమయంలో ఒక టీం వాళ్ళు రెండవ టీం వాళ్ళని పట్టుకోవాలి కాబట్టి, దాదాపు ఒక గంట సేపు పిల్లలు, పెద్దలు అందరు కలిసి రెండు టీమ్స్ గా ఏర్పడి ఆడారు.
అందరి మొహాల్లో సంతృప్తి. పిల్లలకయితే ఇదంతా కొత్తగా వుంది.
గ్రాండ్పా, దీస్ అర్ వెరీ ఇంట్రెస్టింగ్. కెన్ వుయ్ ప్లే వన్ మోర్ న్యూ గేమ్?. పిల్లలందరూ నా చుట్టూరా చేరారు.
అవునర్రా, ఇవన్నీ మన సాంప్రదాయిక ఆటలు, మీరందరు ఈ ఇంటర్నెట్ మోజులో పడి ఈ ఆటల సంగతే తెలీకుండా పెరుగుతున్నారు.
ఆ తర్వాత భోజనానికి ఒక గంట విరామం ఇచ్చాం. భోజనం చేస్తూ కూడా పిల్లలు, పెద్దలు అందరు ఇంటర్నెట్ గురించి మర్చిపోయి, వాళ్ళు ఆడిన ఆటల గురించి మాటలాడుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. కనీసం ఒక రోజన్నా వాళ్లకి ఈ విధంగా ఆటవిడుపు కావటం మా ఇద్దరికి చాలా సంతృప్తినిచ్చింది.
ఆ తర్వాత పిల్లలందరూ కాళ్ళ గజ్జ కంకాళమ్మ, వీరి వీరి గుమ్మడిపండు ఆటలు ఆడారు.
పిల్లలందరికీ ఈ ఆటలు విచిత్రంగా, తమాషాగా వున్నాయి. మారుతున్న కాలంతో టెక్నాలజీ తో మనం ఎంత బిజీ గా వున్నా, కొన్ని కొన్ని మన సంప్రదాయాలని, వాటితో పాటు పుట్టిన ఆటలను మనం మర్చిపోగూడదని అందరికి అర్ధమైనట్లుంది. ఆడవాళ్ళందరూ కాసేపు తొక్కుడుబిళ్ల ఆడుతుంటే, మగవాళ్ళు మరొకపక్కన గోళీలాట ఆడుతున్నారు. పిల్లలు వాళ్ళ తల్లి దండ్రులు ఆటలాడుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు.
మామయ్య గారు, కబడ్డీ నాకిష్టమైన ఆట. పిల్లలు, పెద్దలు అందరం కలిసి ఆడడం బాగుంటుంది. మీరు రిఫరీ గా వుండండి. అల్లుడుగారి కోరిక బలంగానే వుంది, వదలటం లేదు.
నేను మౌనంగా వున్నాను.
అల్లుడు గారు, కబడ్డీ వద్దులెండి. ఏమండి, వేరే ఏదన్నా ఆట ఆడించండి. మా ఆవిడ నచ్చచెబుతున్నట్లు మాట్లాడింది.
అల్లుడు గారికి అర్ధం కాలేదు. కబడ్డీ ఎందుకు వద్దంటున్నది.
ఒక 5 నిమిషాలు నేను ఏమీ మాట్లాడలేదు. నా భార్య నేను తప్ప మిగిలిన వాళ్ళు మొహామొహాలు చూసుకొని, ఏమిటన్నట్లు చూస్తున్నారు. పిల్లలు ఇంతకుముందు వాళ్ళని ఆడించిన ఆటలు, మా ప్రమేయం లేకుండా మళ్ళీ మొదలెట్టారు.
నేనేదో మాట్లాడబోతే, నా శ్రీమతి వారిస్తున్నట్లు చేయి చూపించి, మీరుండన్నట్లు సైగ చేసింది.
మీకు తెలిసిన మీ మామయ్య గారు ఒక రిటైర్డ్ స్పోర్ట్స్ మాస్టర్ గానే మీకు తెలుసు. ఆయనకి మొదటినుంచి ఆటలంటే మహా ఇష్టం. ఆ ఇష్టం తో చదువులో ఎక్క లేకపోయినా, ఆటల్లో మాత్రం పైకొచ్చారు. వాళ్ళింట్లో కూడా ఆయన ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆయన్ని ఆటల్లోనే ప్రోత్సహించారు.
ఆయనకి మొదటినుంచి కూడా కబడ్డీ ఆట అంటే మహా ఇష్టం. నేను, ఆయన దగ్గరి బంధువులు కావటం, అందరం ఒకే దగ్గర ఉండటం వాళ్ళ ఆయన్ని దగ్గరినుంచి చూసే అవకాశం నాకు కలిగింది. ఒకరకంగా, ఆయనంటే ఇష్టం కలగటానికి కారణం కూడా కబడ్డీ నే. ఆయన ఆడే ప్రతి ఆటకి నేను వెళ్లే దాన్ని. ఆయన కూత పెట్టి కబడ్డీ ఆడుతుంటే ప్రత్యర్థి జట్టు హడలి పోవాల్సిందే.
ఒకసారి కూతపెట్టి వెళ్లి అందరిని అవుట్ చేసి వచ్చిన సందర్భాలు నేను కళ్లారా చూసాను. అలానే ఈయన జట్టులో అందరూ అవుట్ అయినా, ఈయన ఒక్కడే అవతలి జట్టు వాళ్ళని ఒడిసి పట్టుకుని గీత తాకనిచ్చేవాడు కాదు. ఎక్కడ కబడ్డీ పోటీలు జరిగినా ఒంటి చేత్తో గెలిపించి కప్పు తీసుకొచ్చేవారు.
ఆవిధంగా ఆయన పేరు ఆ చుట్టుపక్కల మారుమ్రోగిపోయింది. ఆతర్వాత స్పోర్ట్స్ కోటాలో ఆయనకి స్పోర్ట్స్ టీచర్ గా ఉద్యోగం రావటం, మా పెళ్లి కావటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆతర్వాత కూడా కొన్ని సంవత్సరాలవరకు ఈయన స్కూల్ కాకుండా, ఆ చుట్టుపక్కల ఏ స్కూల్ లో కబడ్డీ మ్యాచ్ లు జరిగినా ఈయనే రిఫరీ గా వుండేవాళ్ళు. ఈయన రిఫరీ గా ఉంటే ఈయన మాటే వేదవాక్కు, అంత ఖచ్చితంగా ఉండేవి ఆయన చెప్పే నిర్ణయాలు. తర్వాతర్వాత స్టేట్ లెవెల్ కబడ్డీ గేమ్స్ కి రిఫరీ గా సెలెక్ట్ అయ్యి బాగా బిజీ అయిపోయారు.
అందరూ ఆసక్తిగా చుట్టూరా కూర్చుని చెంపల కింద చేతులు పెట్టుకుని వింటున్నారు.
నా శ్రీమతి ఒక్క నిట్టూర్పు విడిచి, అసలు జరిగిందంతా ఆ తర్వాతే అన్నట్లు నా వైపు చూసింది చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ.
అవును బాబు, ఆ తర్వాత ఎవరో నా పేరును స్టేట్ కబడ్డీ అసోసియేషన్ కి సిఫార్సు చేశారు. మంచి అవకాశం, అందులో కబడ్డీ మీద వున్నమక్కువతో ఒప్పుకున్నాను. నా పేరు దాదాపు ఖరారు అయిపోయింది. చాలా సంతోషం వేసింది. ఇన్నాళ్లు ఏ ఆటను నేను ప్రాణంగా ప్రేమించి నా జీవితం ధారపోసానో, కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా ఆ ఆటకు ఇంకా సేవ చేసే భాగ్యం దొరకడం నా అదృష్టం అనుకున్నాను. అయితే ఈ పదవికి నాతో పోటీ పడినవాళ్లు నన్ను ఎక్కువగా వ్యతిరేకించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించినా, మంచిదేకదా అనిపించింది. ఆ రోజు హైదరాబాద్ వెళ్లి అక్కడ అసోసియేషన్ సభ్యులందరిని కలిసి మీటింగ్ అటెండ్ అయ్యి వస్తున్నాను.
సరిగా నా ప్రయాణం సగం దూరంలో వున్నప్పుడు నా కారు మీద ఎవరో దాడి చేశారు. అది అస్సలు ఊహించలేదు. నన్ను కాదనుకున్నవాళ్లు కనీసం నన్ను బెదిరించినా ఆ పదవి దరి దాపులకి కూడా నేనసలు పోయేవాణ్ణే కాదు. ఎందుకంటే దానికోసం నేను ప్రాకులాడలేదు, కనీసం ప్రయత్నించనూ లేదు. వాళ్ళు ఎంతగా నా మీద దాడి చేసారంటే, నేను కనీసం మూడు నెలలు హాస్పిటల్ లో బెడ్ మీద ఉండాల్సి వచ్చింది.
ఆ దెబ్బతో కబడ్డీ అన్న మాట వింటేనే వణికిపోయేవాళ్ళం. కనీసం టీవీ లో కబడ్డీ మ్యాచ్ లను కూడా చూడనిచ్చేది కాదు ఈవిడ. మగపిల్లలిద్దరిని నాలాగా మంచి కబడ్డీ ఆటగాళ్ళని చేయాలన్న ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకున్నాం.
నేను చెప్పటం ఆపటంతో, అందరూ నా వైపు చూసారు.
మామయ్య గారు, మీ వెనకాల ఇంత కథ ఉందని అస్సలు అనుకోలేదు.
అవును బావ, మేము ముగ్గురం చిన్న పిల్లలం. నాకు నాన్న హాస్పిటల్లో ఉన్నట్లు కొంచెం గుర్తు వుంది కానీ అసలు విషయాలేవీ తెలియదు. ఆక్సిడెంట్ అని చెప్పారు అప్పుడు.
అయితే ఈ రోజు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాను.
అందరూ నా వైపు కంగారుగా చూసారు.
కంగారు పడకండర్రా, మరేమీలేదు.. ఈరోజు మాత్రం మా అల్లుడుగారి కోసం కబడ్డీ ఆట ఆడుతున్నాం, అందుకు నేనే రిఫరీ గా ఉంటున్నాను, అంటూ నవ్వాను.
ఒరేయ్ పిల్లల్లారా రండి రండి అంటూ ఉత్సహంగా కబడ్డీ గురించి చెప్పటం మొదలెట్టాను.
చాలారోజుల తర్వాత కబడ్డీ గురించి అంత ఉత్సాహంగా మాట్లాడుతుంటే, నా వైపు చూసే 'బానే వుంది సంబడం' అంటూ మూతి తిప్పేసుకుంది నా శ్రీమతి.
అంతర్జాతీయ కబడ్డీ ఆటలో రెండు టీములు 13 మీటర్లు: 10 మీటర్లు కోర్టులో ఆడుతారు. ఒక్కొక్క టీములో 7 గురు ఆటగాళ్ళు ఉంటారు. 5 గురు రిజర్వ్ లో ఉంటారు. ఆట సమయం 40 నిమిషాలు; మధ్యలో 5 నిమిషాల విరామం ఉంటుంది. ఒక టీము నుండి ఒక ఆటగాడు రెండవవైపు కబడ్డీ, కబడ్డీ, అంటూ గుక్కతిప్పుకోకుండా వెళ్ళి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమందిని ముట్టుకొని తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుంటే అందరూ ఔట్ అయిపోయినట్లు. వారిని బయటికి పంపిస్తారు. రెండవ టీముకు అన్ని మార్కులు వస్తాయి. ఒకవేళ కూత ఆపితే ఒక మార్కు అవతలి టీముకు వస్తుంది. ఆపిన ఆటగాణ్ణి బయటికి పంపిస్తారు.
తరువాత రెండవ జట్టు నుండి ఒక ఆటగాడు మొదటి జట్టులోని ఇదేవిధంగా వచ్చి కొందర్ని ఔట్ చేసి వెళ్ళిపోతాడు. ఒక ఆటగాడు ఒకసారి ఏడుగురినీ ఔట్ చేస్తే ఏడు మార్కులతో సహా రెండు బోనస్ మార్కులు కూడా వస్తాయి. ప్రత్యర్థి జట్టులోని ఏడుగురు ఒక గొలుసు మాదిరిగా ఏర్పడి కూత పెడుతున్న ఆటగాణ్ణి తిరిగి వెనకకి పోకుండా ఆపాలి.
ఆట పూర్తి అయిన తరువాత ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ జట్టు గెలిచినట్లుగా నిర్ణయిస్తారు.
మొత్తానికి చివరగా అందరు కొంచెం చీకటి పడేంతవరకు కబడ్డీ ఆట ఆడటంతో శుభం పలికాము.
మామయ్య గారు మొత్తానికి ఈ రోజు మీ దయ వల్ల మా బాల్యాన్ని గుర్తుచేసుకున్నాం. చాలా సరదాగా గడిచింది. ఇద్దరు కోడళ్ళు, అల్లుడి ప్రశంస.
అవున్నార్రా, ఇవ్వేకాదు.. మీరు మీ పిల్లలు ఇంట్లోనే కూర్చుని అష్ట చెమ్మ, పులి మేక, వైకుంఠపాళి లాంటి బోర్డు గేమ్స్ కూడ ఆడుకోవచ్చు. అవన్నీ మెదడుకు మేత ఆటలు.
అవున్నాన్న, అస్తమానం మొబైల్, లాప్టాప్, టీవీ తో ఆటలు కాకుండా ఇవన్నీ అలవాటు చెయ్యాలి వీళ్ళకి.
అవును, మీరు కూడా ఇవన్నీ మర్చిపోకుండా ఆడుతూ, పిల్లలకి నేర్పించాలి మరి కనీసం వారంలో ఒక రోజు కొన్ని గంటలన్నా.
ఆవిధంగా అంతర్జాలం అంతరాయం పిల్లలకి, పెద్దలకి ఆటవిడుపు అయినందుకు అందరూ సంతోషించారు. ఆతర్వాత ఏ మధ్య రాత్రికో ఇంటర్నెట్ రిస్టోర్ అయినట్లుంది. అయినా మళ్ళీ రేపట్నుంచి మామూలేకదా అనిపించింది.
Very nice story, reminds me of my childhood.
Nice work.
చాలా బాగుంది శ్రీనివాస్ గారు. బాల్యాన్ని పునరుద్ధరించే మాయాజాలాన్ని ఈ కథ ద్వారా అందంగా చిత్రీకరించారు. అంతర్జాలం లేని సమయం లో మన ఆటలలో కనిపించే కాలాతీత ఆనందాన్ని గుర్తుచేసే హృదయపూర్వక కథనాన్ని రూపొందించడంలో మీ పనితనం అద్భుతం.
ధన్యవాదాలు మురళీ కృష్ణ గారు
Wow. Excellent Srinivas garu.
Meeru mee story cheppe vidaanam chaala bagundi. All these games we have played during our school days. We enjoyed a lot as we do not have all these electronic gadget then.
Keep writing such beautiful family experience stories.
Sure andi. Thank you very much Madhu garu.
శ్రీనివాసరావుగారు, మీ కథ చదివాను. మనిషి తను కనిపెట్టిన యంత్రాంగానికి తనే పూర్తిగా బానిస అయిపోయిన రోజులివి. తన జీవితాన్ని తన చేతుల్లోనించీ జార్చుకున్నాడు. తనూ ఒక మరమనిషిలా మారిపోయాడు. ఈ ‘ఆటవిడుపు’ కొద్ది క్షణాలే అయినా, జీవితాన్ని ఎలా జీవించాలో చూపించటం బాగుంది. చాల బాగా వ్రాశారు. అభినందనలు.
ధన్యవాదాలు సత్యం గారు.
Very good narration and got our memories back after long time .
We do all these games at Sakha sessions on every weekend
Thank you
Rams from Tenali
Thank you very much Rams for your comments.
Hi Sreeni garu, Nice story sir. Our childhood games and summers with cousins our kids don’t know.
Thank you very much Usha garu
కథ చాల బాగుంది . ఇప్పటి తరం పిల్లలు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయ్.very nicely written.
Thank you very much Mamatha garu.
Iruvanti vaari kalaaniki kadha.. kadha.. ki padunu ekkutondi.. 🙂
Chaaala baagundandi
Thanks a lot Nagesh garu for your comments.
Thank you Gayatri
Hi Bavagaru,
I wish you happy new year.
Story excellent. And explanation is more clear like how in our family we are doing. While reading it is like that is our story completely we can involve.