మా కర్మ... కదాచిన -- గంగిశెట్టి ల.నా.
బుద్ధ విపస్సనలో పేగు పేగూ
పోగు పోగూ అగుపడుతుంది కానీ
వాటిని ఒకటిగా కలిపి ఉంచిన ఆత్మ మమకారం అగుపడదు
అద్వైతంలో జీవాత్మ, పరమాత్మల తెర తొలగిపోతూ ఉంది కానీ, తెర కళ్యాణమే ఏమిటో బోధపడదు
'సోహం'ను 'దాసోహం' గా
ఎందుకు మార్చాడో రామానుజయ్య, తెలిసిరాదు
ఆకాశ కాంతిలో ఉన్నాయన తండ్రి
అవని మట్టిదిబ్బల్లోని వాడు తనయుడు
ఈ అంతరాల ద్వైతం ఎప్పటికీ అంతు బట్టదు
ఏకాంతంగా మిగిలిపోతున్న మనిషి నలరించడానికి
ఆయనిక్కడే ఎక్కడో మురళి వాయిస్తున్నాడు,
ఎవరికంటా కనపడకున్నాడు...
యమున మాత్రం నల్లగా పారుతూనే ఉంది
సైకతాల్లో ఎవరి అడుగు జాడల్ని మిగిల్చక సాగిపోతూనే ఉంది
ఔను, ఎంత సూర్యపుత్రి అయితేనేం
ఎంత జీవశక్తై ప్రవహిస్తేనేం
యముని చెల్లెలేగా!
అక్కడ బృందావన ముందన్నా
ఏ బృందానికి ఆవనం?
ఎవరికందేదీ హవన ఫలం?
అందుకే అన్నాడు తెలివైన కన్నయ్య
'కర్మ మాత్రమే నీ వంతు
ఫలంపై చింతొద్దు!'
బోధి వృక్షం -- డా పెరుగు రామకృష్ణ
ఒంటరిగానే ఎదిగింది బోధి వృక్షం
పక్షులు మౌనంగా వుంటాయా ..?
ఉదయ సాయంత్రాలు కచ్చేరి పెట్టాయి
కుహుకుహులు కిచకిచలు సరిగమలై
సృష్టి రహస్యాన్ని అన్వేషించను
ఆకాశాన్ని జల్లెడ పట్టాయి
ఉదయించే సూర్యుడు
నిష్క్రమిస్తున్న చంద్రుడు
అర్ధ రాత్రి చుక్కల మౌన సంగీతం
మేఘాల భయంకర ఘర్జనల మధ్య
నీళ్లోసుకుంటున్న పురాతన వధువు వసుధ
రెక్కలువిప్పి భూమిపైకి తొంగిచూస్తున్న విత్తనం
సృష్టిరహస్యం పంచభూతాల సేద్యం
అమ్మలా తల్లి మూలం
నాన్నలా జీవితం సర్వం
బతుకు ఒక ఆగని పయనం
పునరపి జననం -పునరపి మరణం
జనన మరణాల రెండంచుల నడుమ
గిరగిరా తిరుగుతున్న ప్రపంచం
బోధివృక్షం నేర్పిన పాఠం
గౌతముణ్ణి బుద్దుడిగా మార్చిన పంచశీలం ..!!
(బుద్ధ పూర్ణిమ)
కాలం -- కైలాస్ నాథ్
కాలం యుగాల్లోనూ
సంవత్సరాల్లోనే కాదు
మట్టిలోనూ కనిపిస్తుంది పొరలుగా
రాళ్ళపై కనిపిస్తుంది చారలు గా
మనుషుల్లో కనిపిస్తుంది ముడతలుగా
ఒక్కో రాతి చారికను
చూసినప్పుడల్లా అనిపిస్తుంది
ఇవికూడా మనుషుల్లాగే మనసుల్లో
దాచుకున్న అవ్యక్తవ్యక్తీకరణలేమోనని...
కాలమెంత ప్రాచీనమైనది
అన్నింటిని స్పృశిస్తుంది
అన్నింటిని తనలో కలుపుకుంటుంది
పసిపాపలోని లేతతనపు కాలం
ముద్దాడిస్తుంది
ఆమెలో అందమైన సూర్యకాంతపుష్పాల్లా
విచ్చుకుంటుంది
ముదివగ్గులో శథిలమౌతున్న కాలం
నిట్టూర్పు తెప్పిస్తుంది
కాలమానికలలోనే కాదు
మనచుట్టూ కాలం ప్రవహిస్తూనేవుంది
నీ హృదయ దోశిళ్ళు ఎంత పెద్దవైతే
అంత కాలం నీ దోశిళ్ళలోకి వస్తుంది ...
చిరు కవిత -- డా. రాయసం లక్ష్మి
అనుభవాలు అనుభూతులూ రెండూ
సంగీతాన్ని, నాట్యాన్ని రమ్మని పిలిచి
రెండింటినీ తనలో కలబోసుకుని
సాగిన చిన్నకాలువే చిరుకవిత కదూ
పెద్ద ఏరై ఇరుగుపొరుగు ఉన్న రాళ్లను
నాచు మొక్కలను కలుపుకుని
సాగితే కవితాత్మక కథనే కదూ
నదిని చూద్దామని నడక సాగించి
గులకను, ఇసుకను కలుపుకుంటూ
వంపులు తిరిగి దారిలేక వెనుదిరిగి
కొత్త పాయగా కాలుచాచి గమ్యం వైపు
వేసే అడుగుల అందాలే నవల కదూ
ఇంకా ఏం చెప్పనూ
అనుభవాల అనుభూతుల పసిడిపంట
సాహితీవినీలాకాశంలో
వంపుసొంపులను చేర్చుకుంటూ
పక్రియల పేరుతో
అందాలను చిమ్ముతుంటే
ఎవరైనా ఆగి చూడక
కాలు కదప వీలగునా
చెప్పండి...