గమ్యమెరుగని కాలం
రోజులు, పక్షాలు, మాసాలు
ఋతువులు, సంవత్సరాలు దాటుకుంటూ
పరుగులు తీస్తూనే ఉంది.
శుభకృత్ నామ సంవత్సరానికి
గౌరవంగా వీడ్కోలిచ్చి
శోభకృతు నామ సంవత్సరంతో
కొత్త క్యాలెండర్ అందంగా ముస్తాబైంది.
శోభాయమానంగా కోటి కాంతులతో
వచ్చింది చైత్రమాసం
వేద పండితులు పంచాంగాలకు
కొత్త రూపమిచ్చారు.
మామిడి మురిపంగా పిందెలేసింది
వేప పూత వేకువ వెలుగులా నవ్వింది
కోయిలమ్మలు సరికొత్త రాగాలు ఆలపిస్తూ
గాన కచ్చేరీలు మొదలు పెట్టాయి.
గుమ్మాలకు తోరణాలు హుందాగా
రాజసం చూపిస్తున్నాయి
వాకిట్లో రంగవల్లులు, హరివిల్లులతో పోటీ పడుతూ
ముతైదువల నగుమోమును తలపిస్తున్నాయి.
శుభకృత్ నామ సంవత్సరం
అందరికి శుభాలనిస్తుందని
మురిసిపోయాం
కానీ,
సినీజగత్తులో విషాదాన్ని నింపింది.
ఎందరెందరో తారలు భువిని విడిచి
దివిని చేరారు
ప్రమాదాలతో రహదారులు రక్తపు
మడుగులయ్యాయి
రంగుల రాజకీయ చదరంగంలో
అమాయకపు ప్రజలు పావులుగా
మలచ బడ్డారు
అతివృష్టి, అనావృష్టితో అల్లడిల్లి పోయింది భూజాత.
ఈ శోభకృతు నామ సంవత్సరం
అసమానతలన్ని తొలిగించుకొని
శుభసందేశాలతో ప్రతీక్షణం
మధురానుభూతులను
పంచాలని చిరునవ్వులతో స్వాగతిద్దాం!!!!