బొమ్మల్లో ఆశలు పెడతవు
ఆ ఆశలను పసుపుతాడుతో ముడివేస్తావు
ఆ ముడిలోనే మరోగుడికి ఒడినిస్తవు
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
కడుపులో ఎలుకల ఉత్పత్తి చూడలేక పోతున్నా
గుండెల్లో రైళ్ళ పరుగుల చప్పుడు వినలేకపోతున్నా
నయన నదుల్లో తడవలేకపోతున్నా
ఈ బ్రతుకు గతుకుల్లో నడవలేకపోతున్నా
దయచూపి దయతో దీనికి తెల్లబట్ట కప్పవా....
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
ఎక్కడో పుట్టిన వైరస్లు
ప్రపంచమంతా పాకి పాడుజేస్తున్నవయ్యా
ఇక్కడే పుట్టిన కుల మత వైరస్లు
ఈ నేలనే పాడుజేస్తున్నవయ్యా
ఎపుడెట్ల ముంచుతవో...
ఎపుడెట్ల తేల్చుతవో... నీకే తెలుసయ్యా....
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
అపుడెప్పుడో....
బ్రహ్మంగారు చెప్పిన మాట వింటిమయ్యా
యంకన్న మల్లన్న అప్పన్న గుడులు మూసిన తీరు ఇపుడు జూస్తిమయ్యా
మనుషులతో ఆటలు చాలక విషగాలితోనా...
(కరోనాతోనా)
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
చీమల ఆకలికి చక్కెరవైతవు
దోమల ఆకలికి నెత్తురువైతవు
మనిషి ఆకలికి అన్నమైతవు
మరి...నీ ఆకలికి నువ్వే ఏం అయితవో...
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
నా పాదాలకింద మట్టినిజూస్తే
కంచి కనిపించెనయ్యా
చెంబులో నీరు త్రాగుతుంటే
త్రయంబకం తలపుకొచ్చెనయ్యా
పొయ్యిలో నిప్పువెలుగుతుంటే
అరుణాచలం ఆగుపించెనయ్యా
కుండలో తొంగిచూస్తే చిదంబరం దర్శనమిచ్చెనయ్యా
గాలి పీల్చుతూ సాగుతుంటే కాళహస్తిని కంటినయ్యా
సర్వము నీవే...నా విశ్వాసమే నీకు నైవేద్యమయ్యా...
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
తెల్లవారితే కడవలు కడవలు నీళ్ళుమోస్తమయ్యా
ఆ తరువాత సద్ది గట్టుకుని చేలోకెళ్తమయ్యా
తలోపని చేసి తరించిపోతమయ్యా
ఎందుకంటావా...?
ప్రతి రూపము నీవే కదా...!
ముట్టుకుని మోక్షము పొందుతము
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా.
రొట్టె చేయు మా అమ్మ ముందున్న పిండిముద్ద లింగాకారమయ్య
ఆ పిండిని తిన్న ఈ మాంసపుముద్ద అంగాకారమయ్యా
అంగలింగాకారము నేనని
గుండెల్లో లింగమై దర్శనమిస్తివా...
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
భస్ముడి భక్తికి పరుగుతీసినవ్
బాణుడి భక్తికి కాపరైనవ్
అంత కంటే నీచ గుణాలున్న నా భక్తికి గుళ్ళో రాయివేనా...!
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
నిన్ను నమ్మని వాణ్ణి నింగిల నిలబెడతవ్
నమ్మిన వాణ్ణి నట్టేటా ముంచుతవ్
వంగి వంగి దండాలు పెట్టువాణ్ణి పండబెడతవ్
నీ ఆటకు నీవే సాటి భళ సదాశివా...