తిరువళ్ళువర్
భారతదేశపు భాషలలో అతి సాహిత్య సంపన్న ప్రాచీన భాషగా పేరొందిన తమిళ సాహిత్యంలో దాదాపు క్రీ.పూ.276 ఆవిర్భవించిన కవి తిరువళ్ళువర్. ఈయనను దైవ పులవర్ (దైవ కవి) అంటారు. తిరు అంటే శ్రీ లేదా దివ్య అని అర్థాలున్నాయి. ఈయన రచన “తిరుక్కురళ్” ఒక అమర రచన. ఈ రచనలో వళ్ళువర్ సామాజిక, ధార్మిక, నైతిక మానవీయ విలువలను ప్రస్తావించారు.
తిరువళ్ళువర్ ప్రాచీన తమిళ సాహిత్యపు నీతి కావ్య యుగానికి చెందిన శ్రేష్ఠ కవి. ఆయన తన రచన తిరుక్కురళ్ (దివ్యవాణి) ద్వారా ప్రజాకవిగా పేరొందారు. మనుష్యుల విభిన్న స్వభావాలు తెలియజేసే అత్యద్భుత రచన తిరుక్కురళ్. ఈ రచన ద్వారా ఆయన సామాజిక ధార్మిక ఆర్థిక రాజకీయ రంగాలలో పాటించవలసిన ముఖ్య విధులను ప్రతిపాదించారు. రాజు ఎలా పరిపాలించాలి? మంత్రుల కర్తవ్యం ఏమిటి? మనిషికి కావాల్సిన గుణాలు ఏంటి? మానవ గుణాలు అంటే ఏవి? మనుషులు ఒకరితో మరొకరు ఎలా మెలగాలి? దానగుణం మహిమ, పిసినిగొట్టు బుద్ధి, భక్తి అంటే ఏమిటి? మనిషులు ఒకరితో మరొకరు ఎలా మాట్లాడుకోవాలి అన్న పెక్కు అంశాలపై ఆయన తన రచనలో అతి సౌమ్య భాషతో ఒక నిర్దేశిక లాగ చెప్పారు. నాలుగు పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షములలో ఆయన మూడింటిని మాత్రమే చర్చించారు. తిరుక్కురళ్ అనే గ్రంథం 1333 పద్యాలతో కూడినది. ప్రతి కురళ్ లో 1 ¾ పంక్తితో గల పద్యం. అగం అంటే ధర్మం పురం అంటే బాహ్య ప్రపంచం, కామం అనే అంశాలపై అధ్యాయాలను రూపొందించారు. ధర్మార్థ, కామమోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలలో మూడింటిని మాత్రమే విశ్లేషించారు. ఆయన పద్యం కుఱల్ అనబడి 1 ¾ వాక్యంతో కూడినది, మొత్తం వీటి సంఖ్య 1333. ప్రతి అధ్యాయంలో పది కురళ్ళు వుంచి దానికి అధికారం అని చెప్పి వాటి క్రింద శీర్షిక వుంచి విభజించారు.
ఆయన తన రచనలోని పద్యాల్లో ఏ ఒక్క భగవంతుని గూర్చి చెప్పలేదు. ఆయనను జైన కవి అని జైనులు, ద్రవిడ కవి అని తమిళులు, ఆర్య కవి అని ఆర్యులు ఇప్పటివరకు వాదాడుతూనే ఉన్నారు.
తమిళ నీతి గ్రంథాల వరుసలో తిరుక్కురళ్ వస్తుంది. ‘దక్షిణ కన్యాకుమారి వరపుత్రుడు’ అన్న బిరుదాంకితుడు వళ్ళువర్. వళ్ళువర్ అతి ప్రాచీన కాలంలో క్రీ.పూ. 200 దగ్గర ఉద్భవించినప్పటికీ ఆయన ఆత్మలోని భావనలు ఈ రోజుకూ నిత్య నూతనత్వoతో సమకాలీన ప్రస్తుత సమాజానికి కావలసిన నీతి భోధనలతో కూడి వుంటుంది. ఆయన ఆదర్శాలు, లక్ష్యం ఒక్కటే. అదే మానవత్వం. మానవ ప్రేమను సమాజంలో ఎలుగెత్తి చాటిన వారు పవిత్ర ప్రేమతో కూడిన భక్తికి ప్రాధాన్యం ఇచ్చారు. కుళ్ళు వంచనలతో భక్తి పేరిట తిరిగే దొంగ సన్యాసులను, మతం పేరిట, భక్తి పేరిట, ఆచారం పేరుతో తిరిగే బ్రాహ్మణ మతోన్మాదులను శాంతియుతంగా ఎదిరించారు. వళ్ళువర్ సాహిత్యమనేది చదువనేది సమాజానికై నైతిక విలువలను మానవ విలువలను స్థాపించే౦దుకేనని నమ్మారు. పవిత్ర ప్రేమ గొప్పది అని చెబుతూమనస్సు నిర్మలంగా వుంటే భావాలు నిర్మలంగా వుండి మనిషి మంచివాడుగా ఉండడానికి సహకరిస్తాయి అని భావించారు.
ఈయన వేషధారులు అయిన దొంగ సన్యాసులను తూలనాడారు. కాషాయ వస్త్రాలు ధరించి మెడలో జపమాలలు వేసుకొని తిరిగేవాడు సన్యాసి కాదు. మనసు నిర్మలంగా లేని వ్యక్తి సన్యాసి వేషంలో తిరిగినా కూడా ముక్తిని పొందలేడు. దీని గురించి తిరువళ్ళువార్ గారు కూడాఒళుక్కం అనే అధికారంలో విస్తారంగా వర్ణించారు.(అధికారo అనే శబ్దం అధ్యాయానికి వాడబడ్డది).
తలనీలాలను వందసార్లు గుండు గీయుంచుకుంటే మాత్రం సన్యాసి అవుతారా? మనసులోని కల్మషము కపటము లాంటి వాటిని కదా విసర్జించాలి అన్నారు వళ్ళువర్ .
(తులన : మన వేమన
కరక్కాయలు తిని కాషాయ వస్త్రముల్
బోడి నెత్తి కల్గి బొరయు చుండు
తలలు బోడులైన తలపులు బోడులా ?
అని నిలదీసి అడిగారు.)
సన్యాసి వేషధారణలో పలురకాల చెడు ఆలోచనలతో నిండి ఉన్న దొంగ సాధువులను తిరువళ్ళువర్ కూడాఒళుక్కం అన్న అధికారంలో విమర్శించారు. సన్యాసులకు సాధువులకు కావలసినది నిర్మలమైన మనస్సు మాత్రమే కానీ ఎటువంటి ఆడంబరములు వేషధారణలు కాదు అని ఖచ్చితంగా చెబుతున్నారు వళ్ళువర్ . దీనికి ఆయన ఇచ్చిన శీర్షిక నీత్తార్ పెరుమై. సన్యాసి యొక్క గొప్పదనం వారి గుణాలే. ఏ సన్యాసి అయితే నైతిక విలువలతో ప్రేమతో అందరినీ సమంగా చూస్తాడో ఏ విధమైన దురుద్దేశ్యం లేక అందరినీ తన బిడ్డల వలె భావిస్తాడో, అతనే అసలైన సన్యాసి. శారీరపు వస్త్ర ధారణ కన్నా సన్యాసికి మానసిక సన్యాసం అవసరం అని నొక్కి చెప్పారు తిరువళ్ళువర్.
ఒ షు క్కత్తు నీత్తార్ పెరుమై విషు ప్పత్తు
వేండుమ్ పణువల్ తుణి వు కురళ్ 21
అదేలాగా సన్యాసి అనేవారు రాగ ద్వేషాలకు అతీతులై ఇతరుల మంచి గూర్చి మాత్రమే ఆలోచిస్తూ పవిత్రమైన ప్రేమను మాత్రమే సమాజానికి ఇవ్వాలి అంటున్నారు.
ఇరుమై వగై తెరిoదు ఈండు అఱo పూ ణ్ డార్
పెరుమై పిఱన్ గియదు ఉలగు కురళ్ 23