Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --

ముందుమాట: సంస్కృతాంధ్ర సాహిత్య పిపాసి, నిత్య సాధనా పారంగతుడు, మాతృభాషాభిమానం మెండుగా కలిగి సాహిత్య సేవకై తపించేవాడు, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఘనుడు, అమ్మవారి అనుగ్రహ పాత్రుడై బహుభాషా కోవిదుడుగా ప్రభవించి నేటికి వేలపద్యాలను చక్కటి వ్యాకరణ శుద్ధితో రచించి ఎంతోమంది తెలుగు భాషాకోవిదుల మన్ననలను పొందిన శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి విరచితమైన పద్యాల గ్రంథాలయం నుండి వారి అనుమతితో కొన్ని ఆణిముత్యాలను సేకరించి మరల మన సిరిమల్లె పాఠకుల కొఱకు ఇక్కడ పొందుపరుస్తున్నందుకు ఎంతో ఆనందముగా ఉన్నది. శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి ప్రతి పద్యమూ ఒక అద్భుతమే. ఆయన దేవీకటాక్ష వరసిద్ధుడు. అందులో నుండి కొన్నింటిని మాత్రమే ఇక్కడ అందిస్తున్నాము. ఈ నవంబర్ నెల సంచిక పద్యాలను చదివి ఆనందించండి.

దుర్గాదేవి

సీ.
చిఱునవ్వు చిందించి చెంతఁ జేరిచి భక్త
.........చింతామణిగ నిల్చి చింతఁ దీర్చి
చెరగని ప్రేమతోఁ దఱఁగని దీవెనల్
.........చిరకాలము నొసంగి కరుణఁ జూచి
ఆనంద ముప్పొంగ హారతిఁ గైకొని
.........యార్తుల విన్నపా లాలకించి
పిల్లపాపల నిచ్చి చల్లగా వీక్షించి
........సౌభాగ్యము నొసంగు సర్వజనని!
తే.గీ.
ఇంద్రకీలాద్రి వసియించి యెల్లజనుల
కాచి చేయూఁత నిచ్చి ప్రఖ్యాతిఁ గాంచి
నిత్యనూతన శోభతోఁ బ్రత్యహంబు
కానుపించెడి కనకదుర్గా! నమోఽస్తు...................................................................31
శ్లో.
తారాచన్ద్రకలాపదివ్యమకుటాం స్వర్ణామ్బుజాతస్థితాం
సర్పాలఙ్కృతప్రావృడమ్బుదతనుం శఙ్ఖారిభాస్వత్కరామ్
వ్యాఘ్రత్వగ్వసనాం తటిత్సమరుచీం విన్ధ్యాద్రిసంవాసినీం
నానాభీతినివారిణీం త్రినయనాం దుర్గాం సదా భావయే II..........................................32
కం.
కామాక్షివొ మీనాక్షివొ
శ్రీమాతవొ కీసరాద్రిశివదుర్గవొ సీ
తామాతవొ భ్రమరాంబవొ
యేమైన నిజాత్మజుండఁ గృపఁ జూడఁగదే................................................................33
ఉ.
చేతులు సాఁచి పిల్వఁగను జెంతకు వచ్చి ముదంబు గల్గఁగా
మా తలవ్రాఁతలన్ దుడిచి మంచిగ వ్రాయవె; మస్తకంబులన్
నీ తలిరాకుచేతులను నిత్యము దీవెన లీయ నిల్పి; మా
చేతలు సత్ఫలం బొసఁగఁ జేయవె మాతవుగాన శాంకరీ!...............................................34
సీ.
నాచేత నా చేతనాచేతనావస్థ
.............వ్రాయింప వ్రాసితిఁ బద్యకవిత
మాతలవ్రాఁతలు మా తలవ్రాఁతలు
.............సరిదిద్ద నా వ్రాఁత(1) సహకరింప
నా కైత నాకై త నాకై తనర్పంగ
.............ఫలము మా తల్లి దీవనయె గాఁగ
ఆలోచనాలోకనాలోక(2) మా రమా
.............లోకనలోలుఁడే మా కొసంగ
తే.గీ.
సర్వదా సర్వథా తత్ప్రసాదిత(3)ప్ర
సాధిత(4)సుదర్శన మొసంగి స్వాంతకుహర
మహరహంబును దేజోమయంబు సేసి
సన్నిధిగ సన్నిధిని నిల్చు శక్తిఁ గొల్తు...........................................................................35
.............(1) రచన (2) ఆలోకము =ప్రకాశము (3) పూజింపఁబడినది
.............(4) అలంకరింపఁబడినది
Posted in February 2023, సాహిత్యం

1 Comment

  1. శ్రీ (కరణం హనుమంత రావు)

    ‘ సిరిమల్లెలోని’ ప్రతి శీర్షిక ఒక
    ఆణిముత్యమే.

    అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారు
    దుర్గాదేవిని స్తుతిస్తూ వ్రాసిన ప్రతి
    పద్య పుష్పం ఒక మందార మకరందము
    అది ఒక ఆధ్యాత్మిక సౌరభము.ఈ శీర్షికను
    నిర్వహిస్తున్న మధు గారికి కృతజ్ఞతలు..

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!