“ఎంత బాగుంటాడో తెలుసా... మహేష్ బాబు లాగా.... నో.నో.. ప్రభాస్ లాగా... నో నో... మధు, మధులాగే ఉంటాడు... హ్యాండ్ సమ్... స్టైల్ సూపర్... వాయిస్ ఇంకా సూపర్.. అతన్ని చూసిన అమ్మాయి ఎవరూ లవ్ చేయకుండా ఉండదు... నేను లవ్ చేసాను.. నా లవ్ ఎక్స్ ప్రెస్ చేయడం తప్పా! తనకి ఇష్టం లేకపోతె ఇష్టం లేదు అని చెప్పాలి... కానీ నన్ను ఉద్యోగం లో నుంచి తీసేసే తప్పు నేనేం చేసాను? అంతగా ఇన్సల్ట్ చేయడం బాగుందా!” కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగి చెక్కిళ్ళ మీద జారుతుంటే రోషంగా అంటున్న ఆర్తిని చూస్తుంటే జాలేసింది స్మరణకి.
తల పంకిస్తూ అంది “నిజమే నిన్ను అవమానించే హక్కు అతనికి లేదు.. నీకు ఆర్డర్స్ ఇష్యూ చేసారా..” కళ్ళు తుడుచుకుంటూ తల ఊపింది ఇచ్చారు అన్నట్టు.
స్మరణకి బాధగా అనిపించింది. పాపం జాబు ఎంత అవసరమో ఈమెకి.. ఈమె ఆవేదనతో వెళ్ళిపోతూ తనకి చార్జ్ ఇవ్వడం అనేది నిజంగా నరకం అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అది తనకి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వదు .. ఎలా ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? రేపు అతనితో మీటింగ్ జరిగినప్పుడు బెంగుళూరులో ఉండడం తనకి వీలుకాదు అని చెబితే.. వింటాడా..
స్మరణ ఆలోచనలు తెలియని ఆర్తి మళ్ళీ అంది. “స్మరణా! నీకు తెలియదు నాకు జాబ్ ఎంత అవసరమో.. నా పెళ్లి నేను చేసుకోవాలి.. నౌ ఐ హావ్ క్రాస్డ ట్వంటీ ఫైవ్ ఇయర్స్... నాకు నచ్చిన మొదటి వ్యక్తి మధు.. ఇతను కాదు అన్న తరవాత నాకసలు బతకాలనే లేదు..”
“నాన్సెన్స్...“ చిరాగ్గా అంది స్మరణ..” అలా ఎప్పుడూ ఆలోచించకు.. ప్రేమించడం తప్పు కాదు.. ప్రేమ ఫలించాలని కోరుకోడం తప్పుకాదు.. కానీ ప్రేమే జీవితం అని, అది ఫెయిల్ అయితే చావే శరణ్యం అని అనుకోడం ఫూలిష్ నెస్. అమ్మాయిల్లో ఉన్న ఈ భావోద్వేగంనే మగవాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు.. జీవితంలో ప్రేమ, పెళ్లి అనేవి మలుపులే కాని గమ్యం కాదు.. అయినా దేశం గొడ్డు పోయిందా.. నీకు తప్పకుండా మంచి జాబ్ వస్తుంది.. కానీ నువ్విలా బాధ పడుతూ వెళ్ళడం నాకు ఇష్టం లేదు.. అందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. సరే... డోంట్ వర్రీ.... నువ్వేం మనసులో పెట్టుకోకు... రేపు మామూలుగా వచ్చేసేయ్ ఆఫీస్ కి... ఇంతకీ మహానుభావుడు రేపన్నా మాకు అపాయింట్మెంట్ ఇస్తాడా!”
“మీరు సెకండ్స్ తో సహా టైం మైంటైన్ చేయాలి..” అంది ఆర్తి.
“హూ ఊఉ“ దీర్ఘం తీసింది స్మరణ.
మరి కొంతసేపు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నాక స్మరణ అకామడేషన్ కి ఆర్తి ఇల్లు చాలా దూరం అని తెలుసుకుని క్యాబ్ బుక్ చేసుకుంది స్మరణ.
రొటీన్.... జీవితం రొటీన్ గా ఏ మార్పు లేకుండా గడిచిపోతే అందులో విశేషం ఏమి ఉండదు... రోజూ ఉదయం ఆనందంగానే లేచి కాఫీ తాగి వాక్ చేసి, స్నానం, పూజ, ఆఫీస్ పని, వండుకోడం తినడం, సాయంత్రం టివి చూడడం... ఇవన్నీ మామూలుగా జరిగిపోతూ ఉంటె జీవితం ఇంత బాగుంటుందా అనిపించడం సహజం. కానీ ఎప్పుడూ అలా ఉంటుందా! ఉండదు అని చెప్పడానికి ఆంజనేయులు గారి జీవితంలో ఇటీవల వచ్చిన అనూహ్యమైన మార్పే నిదర్శనం.
చిరునవ్వు చెదరకుండా సదా కోడలితో కష్ట సుఖాలు మాట్లాడుతూ తోచిన సలహాలు ఇస్తూ కొడుకుతో రాజకీయాలు, కరెంట్ అఫైర్స్ చర్చిస్తూ, మనవరాలి ప్రేమ కథ వింటూ, ఆమె దగ్గర టెక్నాలజీ ఆధునిక జీవన విధానంలో తీసుకువచ్చిన అద్భుతమైన మార్పులు, సౌకర్యాలు తెలుసుకుంటూ, అప్పడప్పుడూ తన గతాన్ని సింహావలోకనం చేసుకుంటూ అందులోని మంచి అనుభూతుల తీపిని ఆస్వాదిస్తూ, చెడుని తిరస్కరిస్తూ, నిర్వికారంగా గడుపుతున్న ఆయన జీవనం విచిత్రంగా మారిపోయింది.
ఆయన మొహంలో నవ్వు మాయమైంది. మేఘావృతం అయిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది. మనసంతా ఇది అని చెప్పలేని ఆందోళనతో నిండిపోవడం కాక ఒక విషాదాన్ని గుండె నిండా నింపి జీవితం మీద మమకారాన్ని చంపేసింది. కీకారణ్యంలో దారి తప్పి తిరుగుతున్న బాటసారిలా, చీకట్లో తడుముకుంటూ అగమ్యంగా తిరుగుతున్నట్టు అనిపిస్తోంది.. మనసు పరి,పరి విధాలుగా పరిగెడుతూ అస్థిమితంగా ఉన్నాడు. స్మరణ ఎందుకు నర్సాపురం వెళ్ళింది? అక్కడ ఏం జరిగింది? రాగానే ఎందుకు ఎమోషన్ అయింది.. మాలతి కనిపించే అవకాశం లేదు.. ఆమె అతి సాధారణ మహిళ.. పరిమితమైన కుటుంబసభ్యులు తప్ప మరొకరు ఎవరూ ఆమెని గుర్తుపెట్టుకోవాల్సినంత గొప్ప వ్యక్తీ కాదు.. సో కాల్డ్ సెలెబ్రిటి కాదు.. ఈ సత్యం తనకీ తెలుసు.. స్మరణకీ తెలుసు.. తెలిసి నర్సాపురం వెళ్లిందంటే అందుకు దోహదం చేసిన బలీయమైన కారణం ఏమై ఉంటుంది! ఆ రోజు తన కంట్లో కదిలిన కన్నీరు ఆమెకి ఏమి చెప్పి ఉంటుంది! ఆంజనేయులు మెదడు సమాధానం లేని అనేక ప్రశ్నలతో గందరగోళంగా ఉంది. ఆయనకీ తెలియని విషయం గూగుల్ లో తను సెర్చ్ చేసిన మాలతి అనే పేరు ఆమెకి ఎవరూ చెప్పకుండానే అనేక విషయాలు చెబుతుంది అని..
అందుకే నోరు విప్పి మాట్లాడడానికి భయపడుతున్నాడు.. మనసులోకి గతం నీడ కూడా రానీయకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఏదన్నా విషయం ఆలోచించాలన్నా తన ఆలోచన ఎవరన్నా పసికడుతున్నారేమో అని ఉలికి, ఉలికి పడుతున్నాడు. రామా, కృష్ణా అనుకోవాల్సిన వయసులో పదే పదే మాలతిని తలుచుకోడం ఆమె కోసం అలమటించడం, పైగా శూన్యంలో గాలం వేయడం ఎంత మూర్ఖత్వం.. తన తపన, ఆరాటం మనవరాలు కనిపెట్టింది అన్న ఆలోచనే ఆయన్ని అతలాకుతలం చేస్తోంది.. అదొక తీరని అవమానంలా హృదయం దహించుకుపోతోంది. ఏ మనవరాలి చుట్టూ శేష జీవితం అల్లుకున్నాడో, ఆ మనవరాలు ఇప్పుడు పరాయిగా అనిపిస్తోంది. ఆమె పరాయిగా మారాక అకస్మాత్తుగా ఒంటరితనం ఆయన్ని ఆవహించి రాబోయే కాలం అంతా అంధకారబంధురంగా, ఆశాదీపాలన్నీ నిరాశ అనే పొగ చూరి, కొడిగట్టి పోతున్నట్టు వర్తమానం, భవిషత్తు మసకగా కనిపిస్తున్నాయి. ఎవరో అదృశ్యంగా ఉన్న శత్రువులెవరో తనని ఓ పెద్ద అగాధం లోకి తోసేస్తూ వికటాట్టహాసం చేస్తున్నట్టు అనిపిస్తోంది. తప్పు చేసాను..తప్పు చేసాను అని పదే, పదే అనుకుంటున్నాడే గాని ఆ తప్పుకి పరిహారం ఆయన దగ్గర లేదు. కేవలం అంతర్మధనమే మిగిలింది.
అదే అంతర్మధనం క్షణ,క్షణానికీ తీవ్రమై గుండెని పిండేస్తూ నిద్రకు దూరం చేసిన ఆ రాత్రి..
అప్పడు సమయం పన్నెండున్నర దాటింది.. కొడుకు, కోడలు మంచి నిద్రలో ఉన్నవేళ.. కిటికీ లో నుంచి చీకటి పొరలు, పొరలుగా మారి తన మీదకి దాడి చేస్తున్నట్టు ఒక్కసారిగా భయం ఆవహించింది.. చెమటతో ఒళ్ళంతా తడిసిపోతోంది...అకస్మాత్తుగా వీపునుంచి గుండెలోకి ఎవరో పదునైన కత్తితో గుచ్చి మెలితిప్పుతున్నట్టు బాధ.. గొంతు ఆర్చుకుపోతోంది. ఎంత ప్రయత్నించినా శబ్దం బయటకు రావడం లేదు. దాహం... దాహం... నెప్పి.... అ....మ్ ...మ్మా ..... ఆంజనేయులు లేవడానికి ప్రయత్నించాడు.. ఆయన వల్ల కావడం లేదు.. అరవాలని ప్రయత్నించాడు.. చిన్న గురకలాంటి శబ్దం మాత్రం వచ్చింది.. కుడిచేత్తో గుండె పట్టుకుని, ఎడమ చేయి మంచానికి బలంగా ఆన్చి లేవడానికి ప్రయత్నిస్తుండగా ఆయన వణుకుతున్న చేయి గబుక్కున పక్కన ఉన్న స్టూల్ మీద పెట్టిన వాటర్ జగ్ మీద పడి అది భళ్ళున శబ్దం చేసింది.. ఆయన తిరిగి వెనక్కి వాలిపోయాడు..
ఆ శబ్దానికి భర్త గుండెల మీద చేయి వేసుకుని నిశ్చింతగా నిద్రపోతున్న సంధ్య అదిరిపడి లేచింది.. ఆ కదలికకి దీపక్ కూడా కదిలి దూరం జరగబోతున్న ఆమెని దగ్గరగా లాక్కున్నాడు..
"వదలండి ఏదో కిందపడిన శబ్దం అయింది” అంది నిద్రమత్తుతో.
“పడితే పడిందిలే పొద్దున్నే తీయచ్చు పడుకో...” కళ్ళు తెరవకుండా సుఖనిద్ర లోకి వెళుతూ అస్పష్టంగా అన్నాడు దీపక్..
సంధ్యకి ఎందుకో కలవరంగా అనిపించింది.. “ కాదు... వెళ్తాను... మావయ్యగారి రూమ్ లోంచి వచ్చింది శబ్దం..”. అంటూ అతని చేయి విడిపించుకుని మంచం దిగింది.
అప్పటికే మత్తు వదలని దీపక్ కళ్ళు తెరవలేదు.. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఉన్న తేడా అదే.. మగవాళ్ళు ఉన్నంత నిశ్చింతగా ఆడవాళ్ళు ఉండరు.. బాధ్యతలు అనేవి నిత్యం వాళ్ళని అప్రమత్తంగానే ఉంచుతాయి. అందుకే చీమ చిటుక్కుమన్నా కదులుతారు.. భయపడతారు.. ప్రతి దానికీ నా భార్య భయపడుతుంది అని అనుకుంటాడే కానీ మగవాడు... నా భార్య చాలా అప్రమత్తంగా ఉంటుంది అనుకోడు. ఇప్పుడు సంధ్య విషయంలో అదే జరిగింది.
సంధ్య తలుపు తీసుకుని బయటకి వచ్చి మావగారి గదివైపు వెళ్లి ఓరగా వేసి ఉన్న తలుపు తెరిచి, లైటు వేసింది. పడిపోయిన జగ్ లో నుంచి నీళ్ళు కారిపోయి ఇల్లంతా చిందాయి.. మంచం మీద ఆంజనేయులు ఓ పక్కకి ఒరిగి ఉన్నాడు.. కుడిచేయి కిందకు వేళ్ళాడుతోంది. సంధ్య ఆయన మంచం దగ్గరగా నడవబోయి తడి తగిలి జారిపడబోయి నిలదొక్కుకుని మెల్లగా వెళ్లి ఆయన చేతి మీద చేయి వేసి ఆందోళనగా పిలిచింది “మావయ్యగారూ!” ఆయన పలకలేదు..
“మావయ్యగారూ!” గట్టిగా ఆయన చేయి పట్టుకుంది ... చల్లగా తగిలింది... “ఏవండీ” సంధ్య కెవ్వుమంది. గాఢనిద్రలో ఉన్న దీపక్ కి ఆమె కేక వినిపించలేదు.. సంధ్య ఆంజనేయులుని గట్టిగా ఊపేస్తూ మావయ్యగారూ... మావయ్యగారూ! అని అరుస్తోంది.. మెల్లగా అతి మెల్లగా ఎక్కడో లోతుల్లోంచి చిన్న మూలుగు వినిపించింది.. ఆమె చేతులు టక్కున ఊపడం ఆపాయి.. కళ్ళు విశాలం చేసి ఆయన మొహంలోకి చూసింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తి దీపక్ ని కుదిపి లేపి, “కారు తీయండి త్వరగా...” అంది.
“ఇప్పుడా... ఇప్పుడు కారెందుకు?” అయోమయంగా అడిగాడు.
“మీ నాన్నగారు.. మీ నాన్నగారు..పలకడం లేదు..హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి.”
దీపక్ నిద్రమత్తు ఎగిరిపోయింది. ఒక్క అంగలో మంచం దిగి తండ్రి గదిలోకి పరిగెత్తాడు.
స్మరణ ఎదురుచూసిన సమయం వచ్చింది... మరునాడు సరిగ్గా పది గంటల పన్నెండు నిమిషాలకి మీటింగ్ కి రమ్మని సి,ఇ వో నుంచి పిలుపు వచ్చింది... పన్నెండు నిమిషాలు ఏమిటో బాటా చెప్పుల ఖరీదులా అనుకుంది స్మరణ. కేవలం మీనన్, స్మరణ మాత్రమె కాదు, డైరెక్టర్ ప్రాజెక్ట్స్, జనరల్ మేనేజర్, మేనేజర్ , మీనన్, స్మరణ. అందరూ ఐదు నిమిషాల ముందే కాన్ఫెరెన్స్ హాల్లో సమావేశం అయారు.. ఏ న్యూయార్క్ లోనో, కాలిఫోర్నియా లోనో ఉన్నట్టు అనిపించింది స్మరణకి ఆ హాలు చూస్తుంటే. పొడుగాటి టేబుల్... అటు, ఇటూ ఐదేసి కుర్చీలు.. ప్రతి కుర్చీకి మైక్ లు, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసి ఉన్నాయి. గోడలు మెరిసిపోతున్నాయి, ఫ్లోర్ కార్పెట్ మెత్తగా తగులుతోంది పాదాలకు. ఫాల్స్ సీలింగ్.. అద్భుతమైన లైటింగ్ ఎరెంజ్మేంట్.. ఒక్కసారిగా ఏదో అద్భుతమైన లోకంలోకి వచ్చి పడినట్టు అనిపించింది స్మరణకి. అందరి వైపు చూసింది.. పరస్పరం పరిచయాలు అయాక గ్లాస్ డోర్ తెరుచుకుంది.
స్మరణ వాచీ చూసుకుంది. పది గంటల పదకొండు నిమిషాల ఇరవై సెకన్లు.. అబ్బో పంక్చువల్ అనుకుంటూ తలెత్తింది... ఆరడుగుల విగ్రహం... గ్రే కలర్ ఫుల్ సూట్ లో చక,చక మెరుపువేగంతో ఆరు మెట్లు ఎక్కి వేదిక మీదకు వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు. ఫోకస్ లైట్ ల వెలుగులో గ్రీకు శిల్పంలా ఉన్న ఆ వ్యక్తి వైపు అవాక్కై చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళు ఆరు రేకులతో విచ్చుకున్న పద్మాల్లా విచ్చుకున్నాయి.
ఇతను... ఇతను....
పద్దెనిమిదేళ్ళ మధు... సన్నగా ములక్కాడలా లా ఉండే మధు.. యవ్వనం ఆశ్రయం కోసం వెతుక్కుంటూ వస్తుంటే నూనూగు మీసాలతో స్వాగతం చెప్పిన మధు..ఇలా ఎలా?
ఈ మాధవన్ మధు అయే ఆస్కారం ఉందా! ఉంది... కచ్చితంగా ఉంది.. ఎంత పెద్దవాడు అయినా, ఎన్ని ఏళ్ళు గడిచినా మర్చిపోలేని మొహం తీరు అది. పెద్ద కళ్ళు.. పెద్ద చెవులు.. చాలా తక్కువ మందికి ఉంటాయి అలాంటి చెవులు.. ఆ చెవులే అతని మేధాశక్తికి నిదర్శనం అనేది అమ్మ. విశ్వనాథ్ స్వరం వినిపిస్తోంది.. “మీ అందరికీ మన సి ఐ వో గారిని పరిచయం చేస్తున్నా.. హి ఈజ్ మిస్టర్ మాధవన్...”
“హలో ఎవ్విరిబడి...” అతని స్వరం మృదు గంభీరంగా వినిపించింది మైక్ లో.
చప్పట్లు మ్రోగాయి లయబద్ధంగా... స్మరణ చెవులకి ఏమి వినిపించడం లేదు.. కళ్ళకి ఏమి కనిపించడం లేదు... ఒకే రూపం... ఆ రూపాన్ని రెప్పవేయకుండా చూస్తోంది.. పదేళ్ళ క్రితం ఎంతో చనువుగా సన్నిహితంగా మసలిన యువకుడు..ఇప్పుడు అందనంత ఎత్తులో నిలబడి తన వైపు కూడా చూడడం లేదు. ఇది కల కాదుకదా!
మధు అనబడే ఒక పేద యువకుడు, నిరాడంబరంగా, ఒదిగి, ఒదిగి ఉంటూ నిశ్శబ్ద సైనికుడిలా జీవన సమరంలో గెలిచి విజయ దరహాసం చేస్తూ నిలబడి ఉన్నాడు.
“మనం ఇవాళ కాసేపు షటిల్ ఆడదామా!” ఉత్సాహంగా అడుగుతున్న పదిహేనేళ్ళ అమ్మాయిని
“ఇప్పడు ఆటలేంటి.. పరీక్షలు వస్తోంటే” అని పెద్దవాడిలా మందలించిన కుర్రాడు... ఈ gentleman.
ఇతనే మధు... మధు మధుగానే తెలుసు... అతని పేరు మాధవన్ అని తెలియదు.. ఆ మధు ఇంత పెద్ద కంపెనీ సి.ఇ.వో.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ... ఇంత చిన్న వయసులో అంత పెద్ద హోదా... ఎలా సాధ్యం?
గుండెల్లో అలజడి... ఆపాదమస్తకం కంపించిపోతోంది.. తను సైకిల్ తొక్కుతుంటే పడిపోకుండా అతి జాగ్రత్తగా పట్టుకుని సాయం చేసిన మధు....” నాన్ వెజ్ తినద్దులే.. ఎగ్ తిను స్మరణా! మరీ పుల్లలా ఉన్నావు” అని దర్పంతో ఆదేశించిన మధు.. హిమాలయ శిఖరాల మీద నిలబడి ఉన్నాడు.. ఎలా అందుకోడం!
చెవిలో మీనన్ స్వరం వినిపించి ఉలిక్కిపడి అతని వైపు వెర్రిగా చూసింది.
“అందరూ సెల్ఫ్ ఇంట్రడ్యుస్ చేసుకుంటున్నారు.. ఏం ఆలోచిస్తున్నావు.. హి ఈజ్ లుకింగ్ ఎట్ యు “
అయోమయంగా చూసింది... మీనన్ కళ్ళతో సైగ చేసాడు.. ఆమె డయాస్ వైపు చూసింది. మాధవన్, అతని పక్కన డైరెక్టర్, జనరల్ మేనేజర్ అందరూ ఆమెనే చూస్తున్నారు.
ఆమెకి కళ్ళు తిరుగుతున్నట్టు, ఒళ్ళు తూలుతున్నట్టు అనిపిస్తోంది.. అంతా చీకటి కమ్ముకుంటోంది.
“మిస్ స్మరణా! ఆర్ యూ ఓ.కే ..” విశ్వనాథ్ దగ్గరగా వచ్చి అడిగాడు.
వణుకుతున్న పెదాలు విప్పింది... అస్పష్టంగా “ఎస్... అయాం” అంది.
“మిమ్మల్ని ఇంట్రడ్యుస్ చేసుకుని మీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. “
తనని తాను కంట్రోల్ చేసుకుని గొంతు సర్దుకుని “ అయాం స్మ ...” చెప్పబోయి దుఃఖం అడ్డుపడడంతో ఆగిపోయింది.
ఊహించని విధంగా అతను అక్కడ కనిపించడం, గుర్తు పట్టకపోవడం, కనీసం తను అయినా దగ్గరగా వెళ్ళడానికి అడ్డు పడుతున్న హోదా, అంతస్తు, దూరం చేస్తుంటే చెప్పలేని భావోద్వేగంతో వణికిపోతోంది.
అప్పడు వినిపించింది అతని స్వరం ... “మిస్ స్మరణా! మీ ఆరోగ్యం బాగా లేనట్టుంది... పక్క రెస్ట్ రూమ్ ఉంది కొంచెం సేపు రిలాక్స్ అవండి.”
అతని వైపు చూసింది. అతను కూడా ఆమెనే సూటిగా చూస్తున్నాడు.. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.. అదురుతున్న పెదవులతో ఏదో అనబోతున్న ఆమెకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అన్నాడు.. “ప్లీజ్ మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి.. మిస్టర్ విశ్వనాథ్ ఆవిడని తీసుకు వెళ్ళండి”
విశ్వనాథ్ ఆమె దగ్గరగా వచ్చి “రండి” అన్నాడు.
ఇంటర్ కం లో ఎవరితోటో ఏదో చెప్పాడు మాధవన్.. ఆమె కంపించి పోతూ లేచి నిలబడింది.. తెల్లటి యూనిఫారం, మేడలో వేళ్ళాడుతున్న ఐడెంటిటీ కార్డు.. ఒకతను వచ్చి ఆమెకి దారి చూపిస్తూ కాన్ఫరెన్స్ హల్లో నుంచి బయటకు తీసుకుని వెళ్ళాడు. సడన్ గా ఏం జరుగుతోందో తెలియని మీనన్ తెల్లబోయి చూసాడు మాధవన్ వైపు. అతను ఆమె వెళ్ళిన వైపు చూస్తున్నాడు.
తెల్లటి గోడలు...తెల్లని మెత్తని సోఫాలు, గ్లాస్ టీపాయ్, కార్నర్ టేబుల్ మీద ఫోన్, రెండు మూలలా రెండు ఇండోర్ ప్లాంట్స్... చల్లగా, మొగలి పూల పరిమళం వెదజల్లుతూ నిశ్శబ్దంగా ఉన్న ఎ.సి. ఆమెని గదిలోకి తీసుకువచ్చిన యువకుడు మంచినీళ్ళ బాటిల్ ఆమెకిచ్చి “మేడం జ్యూస్ తాగుతారా” అంటూ మర్యాదగా అడిగాడు.
“నో” అంది స్మరణ ముభావంగా.
“హాట్ కాఫీ?”
“అవసరం లేదు “
“ఓ కే రెస్ట్ తీసుకోండి.. ఏదన్నా అవసరం అయితే కాల్ చేయండి అది ఇంటర్ కాం”
అతను వెళ్ళిపోయాడు. స్మరణ రెండు చేతులతో తల పట్టుకుని సోఫాలో ముందుకు వాలి కూర్చుంది.
ఏం జరుగుతోంది? ఇది కలా! నిజమా! ఉద్యోగంలో చేరి ఆరు నెలలు కూడా కాకుండా ఈ బదిలీ ఏమిటి? హైదరాబాద్ నుంచి బెంగుళూరు రావడం ఏమిటి? ఇక్కడ తన ఉన్నతాధికారి హోదాలో ఇతను కనిపించడం ఏంటి? అతను మధేనా! ఇక్కడికి ఎలా వచ్చాడు? తను అతని కంపెనీలో పని చేస్తోందని తెలిసి, కావాలని పిలిపించాడా! ఎలా తెలుస్తుంది... నాలుగు వేల మంది ఉన్న కంపనీలో తనని మాత్రం చూసాడా.. లేదు... అలా జరిగే అవకాశం లేదు.. మరి ప్రత్యేకంగా ఎందుకు పిలిపించాడు.. అసలు పిలిపించింది అతనేనా.. ఏంటి ఈ అనూహ్యమైన సంఘటన...
మరి అలా స్ట్రేంజర్ లా ఎందుకు బిహేవ్ చేసాడు... ఒక ఉద్యోగితో ఒక అధికారి ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు... కానీ, కానీ, కనీసం చిన్ననాటి స్నేహితురాలిగా కూడా గుర్తించి పలకరించలేదు..
అతను మధు కాకపోవచ్చేమో మధులాగే ఉన్న మాధవన్ ఏమో! ఎందుకు కాకూడదు? మాధవన్ మధు కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఇంత ఉన్నత స్థానంలో ఉండడానికి చిన్నప్పటి నుంచీ అతనికి చదువుపట్ల ఉన్న ఏకాగ్రత, ఆసక్తి, శ్రద్ధ, వాళ్ళమ్మ పట్ల ఉండే భక్తీ, గౌరవాలు, ఆవిడ పెంపకంలో నేర్చుకున్న క్రమశిక్షణ కారణాలు అయితే, హుందాతనం, గాంభీర్యం ప్రొఫెషన్ ద్వారా ఏర్పడి ఉండచ్చు.. ఇంటర్ మీడియట్ చదివినప్పటి మధుకి, ఒక సి.ఇ.వో మధుకి తేడా ఉండదా!
ఒకవేళ మధు అయితే తనని గుర్తు పట్టకుండా ఉండే అవకాశం ఏ మాత్రం లేదు..తనేమి గుర్తు పట్టలేనంతగా మారలేదు. గుర్తు పట్టినా పట్టనట్టు నటించి ఉండచ్చా.. ఎంతైనా తనిప్పుడు అతనికి సబార్డినేట్.. అసలు అప్పుడే ఎంత అభిమానంగా ఉన్నా ఒక డిస్టెన్స్ మైంటైన్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు గుర్తు పట్టగానే హాయ్ స్మరణా అనేంత చనువు తీసుకుంటాడా..అందులోనూ మీటింగ్ లో.. ఒకవేళ తనే అలా పలకరించి ఉంటే ఆర్తి కి పట్టిన గతే పట్టేదా!
మధు పెళ్ళయిపోయి ఉండచ్చా! ఆ ఆలోచన రాగానే స్మరణ చేతులు అప్రయత్నంగానే జారిపోయాయి. సోఫాలో వెనక్కి వాలిపోయింది. పొరలి, పొరలి దుఃఖం వచ్చింది. అయితే ఇన్నేళ్ళ నిరీక్షణ వృధానా! అయిపొయింది... మధు పరాయివాడు అయాడు.. వివాహితుడు కాబట్టే బహుశా ఆర్తి విషయంలో అంత కఠినంగా వ్యవహరించి ఉంటాడు. లేకపోతే ఎంతటి వాడైనా ఒకమ్మాయి వచ్చి తన పట్ల ప్రేమ వ్యక్తం చేస్తే పొంగిపోని మగాడు ఈ కాలంలో ఎవరుంటారు? లేకపోతే చిన్నప్పటి లాగే సహజమైన ఆకర్షణలని, ఆదర్శం అనే పేరుతోటో డిసిప్లిన్ అనే ఆత్మవంచన తోటో అణచిఉంచుతున్నాడా!
అదే నిజమైతే అంత కన్నా దారుణం, మోసం ఇంకోటి ఉండదు.. అయినా తనలా అతను కూడా నిజాయితీగా, అసలు ప్రేమిస్తున్నాడని ఎలా అనుకోగలదు! ఒకవేళ ప్రేమించినా ప్రేమ విషయంలో అమ్మాయిలు ఉన్నంత నిజాయితీగా అబ్బాయిలు ఉంటారని గ్యారంటీ ఏమిటి? అసలు ఆ జడపదార్దానికి ప్రేమంటే ఏమిటో తెలుసా! వాళ్ళమ్మ చూసి నిర్ణయించిన అమ్మాయి మెడలో గుడ్డిగా తాళి కట్టి ఉంటాడు.. అవును మరి శ్రీరామచంద్రుడి వారసుడు కదా! ఒకే బాణం, ఒకటే మాట... ఒక్క భామకేనేమో ఈయనగారి ప్రేమ.. ఇలాంటి వ్యక్తి కోసమా తను సోషల్ మీడియా మొత్తం జల్లెడ పట్టింది! ఇలాంటి వ్యక్తీ కోసమా పచ్చని చెట్లను, పారే నీటిని ప్రశ్నలతో వేధించింది..స్త్రీ జాతి మొత్తం శకుంతల వారసులే.. ఆధునికత అంతా పాంట్, షర్ట్స్ వేసుకోడం లో జుట్టు విరబోసుకోడంలో చూపిస్తూ మానసికంగా మాత్రం పురాణ పాత్రలకు సంకేతాలుగా మిగిలారు. ఒక షర్టు విప్పి మరో షర్టు తోడుక్కున్నంత ఈజీ మగాడికి తన మనసుని ఒక స్త్రీ నుంచి మరో స్త్రీ మీదకి మరల్చుకోవడం..అదే స్త్రీ అలా ఎందుకు చేయలేకపోతోంది!
స్మరణకి కోపం, రోషం, దుఃఖం పోటీ పడుతూ ఉంటే రెండు చేతుల్లో మొహం దాచుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది.