గత సంచికకు పొడిగింపుగా, నన్నయ గారికి, తిమ్మక్క కు మధ్య గల భేదాలు, మార్పులను ఆరుద్ర పరిశీలనాత్మకంగా వివరించి మనకు అందించిన మరికొన్ని ఘట్టాలను ఈ సంచికలో వివరిస్తాను.
నన్నయ గారు తన పద్యంలో కృష్ణుడు అర్జునునితో సంభాషించుచూ పల్కిన ఒక పదం ‘మందహాసమున్’ అనే దాన్ని తిమ్మక్క తీసుకోలేదని ఆరుద్ర వివరించారు.
నన్నయ పద్యం – దాని సుభద్రగా నెఱింగి...మందహాసగర్భావనుడై రథాంగధరుడాతని కిట్లనియెం బ్రియంబునన్.... (ఆది 1-8-179).
ఇందులోని మందహాసమున్ అనే పదం తీసుకోకుండా తిమ్మక్క రాసిన ఈ ఘట్టంలోని విషయం క్లుప్తంగా తెలుపుతున్నాను.
నన్నయ రాసిన ఘట్టానికి తిమ్మక్క రచన ఈ విధంగా ఉంది.
కవ్వడి గనుగొని కమలాక్షు డనియె – కనుచూపినంతలో కాంక్షింపతగున
మొదల సుభద్రపై మోహంబు నీకు – వదలక యుండుట వడి యెరుంగుదుము
తలపు నీ కీడేరు తలకకు మనుచు – జలజాక్షు డావేళ చెలిని రప్పించి
వందనము జేయించె వరమునీంద్రునకు (సుభద్ర పుట 16)
కపట సన్యాసికి కన్నెపిల్ల సకల సపర్యలు చేస్తున్నది. అంతేగాక సుభద్ర చేత తిమ్మక్క బొమ్మల పెండ్లి చేయించింది. దీనికి ఆరుద్ర ఇలా అన్నారు. ‘తిమ్మక్క ఈడుకు తగ్గ ఆటలాడించింది.’ అంటే సుభద్రకు ఎంత వయస్సు? సామాన్యంగా 10 సంవత్సరాల లోపు పిల్లలే కదా బొమ్మలతో ఆటలాడుకుంటారు. కన్నెవయసు సుభద్ర బొమ్మలాట ఆడడం అంటే ఆ కాలంలో అది జరిగేదేమో! పెండ్లీడు వచ్చిన కన్నెపిల్లలు కూడా బొమ్మల పెండ్లిళ్ళు చేసి ఆనందించే వారేమో!.
బొమ్మల పెళ్లి చేయించే సుభద్రను పలకరించడానికి అర్జునుడు అక్కడికి వచ్చి ఆమెతో ఇలా అన్నాడు.
“ఇందు పురోహితుండెవ్వరె నీకు – అందమైనట్టి ఘడియారమ్మునేదె
అన్నియు నేల నీ యాశ్రితుడ నేనె – యున్నాను నీ పెండ్లి నొనరజేయించ...” అంటూ తిమ్మక్క ఈ సందర్భంలో ఒక సుదీర్ఘ రచన చేసింది.
సుభద్రా పరిణయములో తిమ్మక్క తెలుగింటి వివాహ సంప్రదాయాన్ని, వంటలను రుచి చూపించింది. అర్జునుడు సుభద్ర చేసే బొమ్మల పెండ్లి చూచి ఆమెతో పెండ్లిగూర్చి చర్చించేటప్పుడు తిమ్మక్క పెండ్లి విందు వర్ణించిన తీరు అద్భుతం.
“పప్పు బూరెలు మంచి పాయసాన్నములు - వొప్పైన భిక్ష మా కొనరగా ...” అంటూ అర్జునుడు మరింత చేరువై నీ శుభ లక్షణములు జెప్పెదనని సుభద్ర కరంబు బట్టి..
“అక్షీణ జృంభణం బది యొంట గద్దు – ఆక్షణ సౌభాగ్య మది ఇంట గద్దు
పద్మరేఖలు నీకు భాసిల్లు ననుచు – పద్మాక్షి పాదముల్ భావించి చూచె
వియ్యమ్ము లందగా వెలదిరో గురుతు – ముడివడె హారముల్ ముద్దుల గుమ్మ
చిక్కు విడిపింతునే చేడె సుభద్ర – మక్కువ నా మీద మరవకు మనెను
వేదోక్తయుక్తిని వింత పెండిండ్లు – కావించవలె నండ్రు ఘనశాసనమున
నాల్గవ దినమున నాయుపతికిని – శోభనంబగుగదే సుదతి యిద్దరకు
పానుపుటింటికి పరగ బొమ్మలను – కడువేగ నంపుదమ కమలాయతాక్షి”
ఈ విధంగా సుభద్ర చేయి చూచి అర్జునుడు చెప్పిన లక్షణాలను తిమ్మక్క రాసిందంటే తిమ్మక్క కు హస్తసాముద్రికం తెలిసినట్లు భావించాలి.
అంతటితో ఆగక అర్జునుడు తొలిరాత్రి ప్రసంగం కూడా తీసుకొని రావడం వల్ల సుభద్ర ఎన్నోరీతుల వెరనంది ఆలోచించి వెంటనే వెళ్లి అన్నకు విన్నవించింది.
“ఎక్కడి యతివరుండితడు వోయన్న, చూడ సంయమిగాడు చూరకాడితడు” అంటూ చెప్పగా కృష్ణుడు నచ్చజెప్పి మరికొన్నాళ్ళు సేవ చేయమన్నాడు. అతనిని చూడ సురపతి సుతుడు మనసులో నీ కనుమానమ్ము వద్దు అనే చెప్పగా సుభద్ర స్థిమితపడింది. అని చెప్పి ఆరుద్ర ఈ పై ఘట్టం అంటే సుభద్ర, కృష్ణుల సంభాషణ తిమ్మక్క కల్పించిందని చెప్పి దీని తర్వాత తిమ్మక్క నన్నయ ను కొద్దిగా అనుసరించి రాసిందని తెల్పారు.
“ఈ చూపు లీతమక మీవిలాసములు – యేతాపనులయందు నెరుగ మెన్నడును
విజయుని రూపవివేకసంపదలు – గజరాజ వరదుచే గరిమ నే విందు
తెగవాలుకన్నులు దీర్ఘబాహువులు – పడగంపు వన్నెగల పాదపద్మములు
చూడగా నీతండు క్రీడియేగాని – వాలాయముగ యతీశ్వరుడు గాబోడు
కపటసన్యాసిగా కల్పించి యిచట – వుపమను శ్రీకృష్ణు డునిచినాడేమో
అని మనముజాల హర్షమ్ము నొంది” (సుభద్ర పుట 26)
ఈ ఘట్టంలో నన్నయ చాలా క్లుప్తంగా రచించాడని, తిమ్మక్క చాలా విపులంగా పూర్వరంగం సిద్ధం చేసిందని ఆరుద్ర తెల్పారు.
అలాగే తిమ్మక్క అలంకారాలను వర్ణించే ఘట్టంలో కూడా దీర్ఘ వర్ణనలు సాగించిందని ఆరుద్ర ఆ వర్ణనలు తెల్పారు.
నన్నయ ఒకనాడు భోజనానంతరం సుభద్ర చేత వంటలు మొదలు పెట్టించాడని కానీ తిమ్మక్క ఈ సందర్భంలో చాలా పూర్వరంగం రచించిందని ఆరుద్ర వివరించారు. ఇక్కడ ఎంతో అలంకారాన్ని వర్ణించింది అన్న ఆరుద్ర తిమ్మక్క చేసిన ఆనాటి అద్భుతమైన వర్ణనను మనముందు ఉంచారు. ఆ వర్ణన:
‘జాతిగొజ్జగి నీట జలకాలాడి, ఉమ్మెత్త పూవులాగా ఉతికిన మడత కొనగోళ్ళతో కొని తీసుకుని వచ్చి ఒక కోమలాంగి ఇస్తే పుచ్చుకొని చెంగావిపావడ రంగుమీరగా చుంగువిడిచి కట్టి పాలిండ్లవలను కనబడగా ఒక వింతలీల పయ్యెదకొంగు వేజారవిడిచి, కొప్పు ఇంచుక జార ముడిచి, విటుల మన్మథుడేయు విరిమొగ్గతూపులా ఉండే గుమ్మడిగింజనామం తీర్చి మూడువేలు చేసే ముక్కర పెట్టి, రామచిలుకను భుజాన ఎక్కించుకొని తోటలోకి వెళ్ళిందట సుభద్ర. తిమ్మక్క స్త్రీ సహజమైన ఉత్సుకతతో వ్రాసిన ఈ వర్ణన స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది.
తొలిసారిగా గానీ మలిసారి గానీ మనసిచ్చిన మగవానిని కలుసుకునే మగువ అలంకరణకు శుభ్రతకు ప్రాముఖ్యత నివ్వాలి. శరీరాల ద్వారానే భార్యాభర్తల మనసులు కలుసుకొంటాయన్నది కూడా తిమ్మక్క ఈ సందర్భంగా సుభద్ర ద్వారా తెలిపింది.
అటుపై, మనిషి తీరేగాక మాట తీరు కూడా తియ్యగా, హాయిగా ఉండాలని గుర్తు చేస్తూ సుభద్ర చేత మధురంగా మాట్లాడించింది తిమ్మక్క. చూడండి తిమ్మక్క ఎలా ప్రారంభించిందో!!
తోటలోకి వెళ్ళింది ఉత్సాహంగా. మేను ఉబ్బి పొంగగా పలుకు పలుకునా తేనె ఒలుకుతూ ఉండగా ఇలా అడిగింది అర్జునుని;
అయ్య మేరేదేశమరసి చూచితిరొ యెయ్యది మీనామ మెచటనుండుదురొ
పరగ నింద్రప్రస్థ పట్టణంబునను – బహుళ సంపదలతో బరుగుచున్నారు
ధీరమానసులు కుంతీసుతుల్ వారు – అరయ గడు సుఖులై యున్నవార
కోరిమామేనత్త కొడుకు లైదుగురు – వారికి కుశలమా వరమునిచంద్ర
ఆరాజవరులలో నర్జునుం డెలమి – ధారుణీ తీర్తముల్ దరిసింప నేగె
తీర్థముల్ క్షేత్రముల్ తిరుగుచో మీరు – ఇంద్రనందను నెందునే జూడలేదా
జగతినంతట మీరు చరియింతు రనగ – అరసి మిమ్మిప్పుడు అడుగంగవలసె (సుభద్ర పుటలు 29-30)
సుభద్ర మాటలతో అర్జునుడు ఆశ్చర్యంతో మాట్లాడిన తర్వాత సుభద్ర చిరునవ్వు నవ్వింది. అది ఎలా ఉందని తిమ్మక్క చెప్పిందంటే, కామతంత్ర రహస్యాలు పుష్పించాయట. ఆ మన్మధుని బాణానికి (నవ్వుకు) అర్జునుడు మూర్చపోయాడు. తొలి కలయికలో నవ్వు పువ్వులా ఒకరి మనసులో మరొకరి నవ్వు పుష్పించాలి. కావ్యాలలో వర్ణనలు కేవలం చదివి ఆనందించడానికే కాదు. నిజ జీవితంలో వాటిని అనుసరించగలిగితే చాలా సమస్యలు తలెత్తవు.
ఇక తిమ్మక్క సృష్టించిన చులుక తిమ్మక్క రచనలో ప్రత్యేకత అని చెప్పవచ్చు. సుభద్ర భుజాసనంపై కూర్చుని ఉన్న చిలుక సుభద్రార్జునులకు ఒక ప్రత్యేక రాయబారిగా వ్యవహరించింది. సుభద్ర నోరారా అనని మాట ‘బావా!’. అది చిలుక అంది. బావా లేలేమ్మంది. మోవిగంటిని చేసి ముద్దులు పెట్టింది. అక్కడే ఉన్న సుభద్రార్జునులకు రాయబారం నడిపింది.
అర్జునునితో ఇలా అంది. సుభద్రను దుర్యోధనునికియ్యాలనుకొన్నారు. మీ ఇద్దరి మనసులు ఒక్కటే కాబట్టి మా సుభద్ర మాటలు మన్నించి ఆమెను తీసుకొని ఇంద్రప్రస్థ పురానికి వెళ్ళు... అంటూ చిలుక చిలుక పలుకులతో రాయబారం జరిపింది. తిమ్మక్క చేత ఈ చిలుకకు ఉన్న ప్రాముఖ్యత కనిపెట్టి తర్వాత చేమకూర వేంకటకవి తన విజయవిలాసం లో వాడుకోన్నాడని ఆరుద్ర తెల్పి ఆ ఘట్టాన్ని చూపెట్టారు.
అర్జునుడు యతి వేషంలో ఉంది సుభద్రను మీ బావ ఎలా ఉంటాడు అని అడిగినప్పుడు తిమ్మక్క చేసిన వర్ణన;
ఎగుభుజమ్ముల వాడు, మృగరాజు నడుము – నడచిపుచ్చుకొను నెన్నడుము గలవాడు
గరగరనివాడు చక్కని వాడు నతడు – గొప్ప కన్నులవాడు కోదండగుణకి
ణాంకంబులౌ బాహు లమరినవాడు – వెన్నున మచ్చగల విభవంబువాడు
బవిరిగడ్డము వాడు పన్నిదంబిడిన – వెన్నుపగడసాల వెస నాదవచ్చు
చిగురొత్తు చెంద్రిక చెలగు పాదములు (సుభద్ర పుట 34)
పైన తిమ్మక్క వ్రాసిన ఈ వాక్యాలే చేమకూర వేంకటకవి విజయవిలాసంలో కూడా ఉన్నాయి.
ఎగు భుజమ్ముల వాడు, మృగరాజు మధ్యంబు పుణికి పుచ్చుకొను నెన్నడుము వాడు....(విజయవిలాసం 2-164)
కథ ములుపు తిరిగింది. సుభద్ర మాటలు విన్న అర్జునుడు చేయి చాపాడు దగ్గరకు రమ్మని. కానీ ఆనాటి స్త్రీ సమాధానం ఈ నాటి యువతులకు ఎంతో లాభకరం. అడిగిన వాడి చెయ్యి వెంటనే పట్టేసుకొని ఆపై వచ్చే కష్ట నష్టాలతో తల బట్టుకొనడం మంచిది కాదని సుభద్ర పాత్ర ద్వారా తిమ్మక్క గుర్తుచేసింది.
తల్లియు దండ్రియు తగిన బాంధవులు – బల్లిదు లన్నలు పాయకున్నారు
వారి యనుజ్ఞచే వర్తించు మిచట – నీలాగు పనులైన యిందరు నగర
హరి నీకు నిచ్చునట అనుమానమేల – తెరలి యేనుగునెక్కి దిడ్లు దూరెదరె
అని చెప్పి తానగరి కతివ పోయినను. (సుభద్ర పుట 36)
పై విధంగా ఖచ్చితమైన సమాధానం చెప్పింది తిమ్మక్క గారి సుభద్ర.
దీనినే చేమకూర వేంకటకవి గూడా అనుసరించినట్లు ఆరుద్ర తెల్పారు. నన్నయ రచన చాలా క్లుప్తంగా ఉన్నట్లు తెల్పిన ఆరుద్రవి, తిమ్మక్క మాత్రం సంఘాచారాలను, కన్నెపిల్ల ప్రవర్తనను తెల్పుతూ తన రచనను విస్తరింపజేసి సంఘ ప్రయోజనం కల్గించిందని చెప్పవచ్చు అన్న భావం స్ఫురిస్తుందని ఆరుద్ర తెల్పారు.