ఉదయం అయింది.
జంబేష్ కళ్లు తెరిచాడు. పక్కన ప్రణవి లేదు. బయట వంటింట్లో పిల్లలకు టిఫిన్ పెడుతూ కనిపించింది.
జంబేష్ ఏమీ అనలేదు. మొహం కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. ప్రణవి ప్లేట్‌లో ఇడ్లీ పెట్టి అతని ముందు పెట్టింది. జంబేష్ తినకుండా ప్లేట్ పక్కకు తోసాడు.
"నాకు వద్దు."
ప్రణవి ఏమీ అనలేదు. పిల్లలకు తినిపించడం కొనసాగించింది.
రాజన్ ఇదంతా చూస్తూ, మనసులో నవ్వుకుంటున్నాడు.
కాసేపు పోయాక రాణి, టిఫిన్ పట్టుకొచ్చి రాజన్ కి జంబేష్ కి పెట్టింది. ఇరువురు టిఫిన్ తినేశారు.
టిఫిన్ అయ్యాక జంబేష్ బయట కుర్చీలో కూర్చున్నాడు.
ప్రణవి అతని దగ్గరికి వెళ్లి మెల్లగా
"మందులు వేసుకోండి." అంటూ అతను వేసుకోవాల్సిన మందులు ఇవ్వబోయింది.
జంబేష్ ఆమె వైపు చూడకుండానే,
"నాకు నువ్వు ఇచ్చే మందులు వద్దు. వేసుకోను," అన్నాడు కోపంగా.
ప్రణవి చేతిలో మందులు అలాగే ఉండిపోయాయి. ఏం మాట్లాడలేదు.
ఎందుకంటే అతని మొండితనం ఆమెకు తెలుసు. ఏదైనా నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తే...
పిచ్చిపిచ్చిగా అరుస్తాడు. అందరి ఎదుట అవమాన పరుస్తాడు. కావాలని ఏడిపించేవారికి, టార్గెట్ గా ఉన్న వ్యక్తి కోయిలలా మాట్లాడిన కాకి గోల లా ఫీల్ అవుతారు. అందుకే ప్రణవి మౌనంగా ఉండిపోయింది.
రాజన్ వెంటనే రంగంలోకి దిగాడు.
"ఏం ప్రణవి! మొగుడు మందులు వేసుకోమంటే వేసుకోడు. నువ్వు బతిమాలాలి. నచ్చచెప్పి, వాడిచేత మందులు మింగించాలి. భార్యగా నీ బాధ్యత ఇదే." అంటూ రాజన్ మాట్లాడాడు.
ఏం మాట్లాడినా! కోడిగుడ్డుకు ఈకలు పీకే రకాలు. ప్రణవి మౌనంగా మందులు తీసుకుని జంబేష్ చేతిలో పెట్టింది. నీళ్లు అందించింది.
రాజన్ జంబేష్ వంక చూస్తూ వేసుకో అన్నట్లుగా కళ్ళతో సైగ చేసాడు.
జంబేష్ మందులు వేసుకున్నాడు, కానీ ఆమె వైపు చూడలేదు.
రాజన్ రాణి దగ్గరికి వెళ్లి మెల్లగా,
"చూసావా! రగిలించిన చిచ్చు, ఎలా పురుడు పోసుకుందో. ఇంకా రెండు రోజులు ఇలాగే ఉంటే చాలు, వీళ్లిద్దరి మధ్య గోడ పూర్తిగా ఎత్తుగా అవుతుంది." అన్నాడు.
రాణి నవ్వింది.
"నువ్వు ఉన్నావు కదా బావా. నీకు ఈ విద్య బాగా వచ్చు. తెంపడం, ముడెయడం" అంది నవ్వుతూ.
"ముడ్డి గిల్లాలి, జో కొట్టాలి. అప్పుడే మన లోపలి అసలు రంగు బయటికి రాదు. వాళ్ళే స్థితిలో ఉన్న మన చెయ్యి వదలరు," అన్నాడు రాజన్.
***
మధ్యాహ్నం అయింది.
ప్రణవి జంబేష్‌కి భోజనం పెట్టింది.
జంబేష్ తిన్నాడు. కానీ ప్రణవి వండిన పప్పు తినకుండా వదిలేసాడు.
"ఈ పప్పు బాగాలేదు."
ప్రణవి ఒక్క మాట కూడా అనలేదు. ఆ పప్పును తీసుకుని తానే తినేసింది.
రాజన్ ఇది చూసి మరింత రెచ్చిపోయాడు.
సాయంత్రం జంబేష్ బయట కూర్చుని ఉన్నాడు.
ప్రణవి అతని దగ్గరికి వెళ్లి, పగిలిన ఫోన్‌ని అతని ముందు పెట్టింది.
"ఈ ఫోన్ రిపేర్ చేయించాలి. మూర్తి నంబర్ అందులో ఉంది. మీరు మాట్లాడాలంటే నేను మూర్తికి చెప్పి ఫోన్ చేయిస్తాను."
జంబేష్ ఆ ఫోన్ వైపు చూడకుండానే అన్నాడు,
"నాకు మూర్తితో మాట్లాడాల్సిన అవసరం లేదు."
ప్రణవి నొచ్చుకుంది.
"అయినా... మీరు కోలుకునే వరకు మూర్తి ఇక్కడ ఉండి మీకు సహాయం చేస్తానన్నాడు."
జంబేష్ ఒక్కసారిగా గర్జించాడు.
"నాకు నీ తమ్ముడి సహాయం అక్కర్లేదు! నా భార్య తమ్ముడి దగ్గర సహాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు!"
ప్రణవి కళ్లలో నీళ్లు బొట్లు బొట్లుగా రాలాయి.
"మీరు ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు."
జంబేష్ కఠినంగా అన్నాడు,
"నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఇదే నా మాట."
ప్రణవి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
రాజన్ జంబేష్ భుజం తట్టాడు.
"శభాష్ జంబేష్! ఇలాగే ఉండాలి," అన్నాడు.
'ఇలా ఉంటేనే వాళ్లిద్దరి మధ్య దూరం పెరుగుతుంది' అని మనసులో అనుకున్నాడు.
జంబేష్ మౌనంగా ఉండిపోయాడు.
రాత్రి భోజనం సమయం.
ప్రణవి జంబేష్‌కి భోజనం పెట్టింది.
జంబేష్ తిన్నాడు.
అందరి భోజనాలు అయ్యాక ప్రణవి వంటిల్లు శుభ్రం చేస్తోంది.
జంబేష్ బయట కూర్చుని ఉన్నాడు.
రాజన్ అతని దగ్గరికి వెళ్లి మెల్లగా అన్నాడు.
"జంబేష్... నీకు ఒక విషయం చెప్పాలి."
"ఏంటి అన్నయ్యా?"
"ప్రణవి నీకు అన్నం పెడుతోంది కదా... ఆ అన్నంలో ఏమైనా కలిపిందేమో!"
జంబేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
"ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా?"
"ఏమో జంబేష్... ఈ రోజుల్లో ఆడవాళ్లు కోపం వస్తే ఏదైనా చేస్తారు. జాగ్రత్తగా ఉండు."
జంబేష్ ముఖంలో భయం కనిపించింది.
రాజన్ తన పని అయిపోయిందని లోపలికి వెళ్లిపోయాడు.
ప్రణవికి ఈ మాటలు వినిపించాయి.
ఆమె గుండె తరుక్కుపోయింది.
నా భర్తకు నేను అన్నంలో విషం కలుపుతానని అనుమానం.
ఆమె కళ్లలో నీళ్లు ఆగలేదు.
ఆ రాత్రి ప్రణవి జంబేష్‌కి దూరంగా పడుకుంది.
జంబేష్ కూడా ఆమె వైపు తిరిగి పడుకోలేదు.
ఇద్దరి మధ్య మౌనం అనే గోడ ఎత్తుగా పెరిగిపోయింది.
**
ఉదయం పొద్దు పొడవకముందే ప్రణవి సంచి సర్దింది.
జంబేష్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. రాజన్ బయట వాకిట్లో కూర్చుని, పేపర్ చదువుతున్నాడు . ఆమె పిల్లలిద్దరినీ నిద్ర లేపి, బట్టలు వేసి, రెండు జతల బట్టలు, పిల్లల పుస్తకాలు ఒక సంచిలో కుక్కింది. పగిలిన ఫోన్‌ని చీర కొంగులోనే దాచుకుంది.
"మేము వెళ్తున్నాం బావగారు" అని చెప్పడానికి వెళ్తే, రాజన్ కళ్లలో తృప్తి మెరిసింది.
"మంచిది. వెళ్లిపో. ఇక్కడ ఉండి మమ్మల్ని నాశనం చేయకు. నువ్వు వెళ్లిపోతేనే జంబేష్ బాగుపడతాడు" అన్నాడు, గొంతులో వ్యంగ్యం ధ్వనిస్తుంటే.
ప్రణవి ఏమీ అనలేదు. ఒక్క చూపు చూసి, పిల్లల చేతులు పట్టుకుని గేటు దాటే ప్రయత్నం చేసింది.
ఇంతలో జంబేష్ లోపలి నుంచి వచ్చాడు.
"ఎక్కడికి వెళ్తున్నావ్?" అంటూ గట్టిగా అరిచాడు.
"ఎక్కడో దగ్గరికి" అంది.
"ఏం మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయవా? నువ్వు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే, పోలీసులు వచ్చి మమ్మల్ని తన్నుకొని తీసుకెళ్తారు." అన్నాడు కోపంగా.
"నా మీద అపనమ్మకంతో ఉన్న మిమ్మల్ని నేను ఎప్పటికీ మెప్పించలేను. ఇంట్లో ఉన్నంతకాలం మనమధ్య దూరం పెరుగుతుంది కానీ తరగదు," అంది ప్రణవి.
"నువ్వు పొరబడుతున్నావు. వీళ్ళందరూ నీ మంచి కోరే వాళ్ళే. పిచ్చి ఆలోచనలు చేయక వచ్చి ఇంట్లో పనులు చూసుకో," అన్నాడు.
రాజన్ కి పరిస్థితి అర్థం అయింది. పోలీస్ కస్టడీతో వచ్చిన ప్రణవిని ఒంటరిగా వదలకూడదు అని,
"ఇదిగో అమ్మాయి...మళ్లీ ఏదో మమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎక్కించాలి అనే ఆలోచనలో ఉన్నట్టున్నావ్! మాకెందుకు గాని ఈ కర్మ! నువ్వు నీ మొగుడు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఉండు వాడు కూడా నీతో వస్తాడు," అని చెప్పి, జంబేష్ వంక తిరిగి,
ఒరేయ్ నువ్వు ఆమెతో కూడా వెళ్ళి పో" అని ఆదేశించాడు.
జంబేష్ తన బట్టల బ్యాగు తీసుకుని బయటికి వచ్చాడు.
నలుగురు రాజన్ గడప దాటారు.
★★★ సశేషం ★★★
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.