Menu Close
బులుసు సరోజినిదేవి
గోపురం(ధారావాహిక)
బులుసు సరోజినిదేవి

చివరి భాగం ↓

"నేను ఛస్తే ఒప్పుకోను. డైరీల్లో ఏవో లెక్కలూ, డొక్కలూ చూపించి మొత్తం వ్యాపారంలో పెట్టేసి మొండిచెయ్యి చూపిస్తున్నాడు మీ పెద్దన్న.

పెద్దలందర్నీ కూర్చోబెట్టి ఒక పేరున్న లాయర్ని లాక్కొచ్చి న్యాయా న్యాయలు చెప్పించాలి.

ఫ్రీ గా ఫినాయిల్ ని కూడా కొట్టేద్దామని ప్లాను.

నువ్ 'డూ డూ బసవన్న!' అని తల ఊపేయ్యకు. అడుక్కునే బిచ్చగాడికి పడేసినట్టు అడిగినప్పుడు ఎందుకు వేలు ఇచ్చాడంటే లకరాల్లో మింగేద్దామని కదా ఉదేశ్యం!

అంత ప్రశాంతంగా అనులేఖ కి ఇంకా పుడతాడో, పుట్టడో తెలియని గుడ్డు కోసం సంబరాలు చేస్తున్నాడని చంకలు గుద్దేసుకోకు. ఆ నవ్వులు నాటకాలు. ఇందుకా పుట్టింట్లో నిన్ను ఇంతకాలం ఉంచింది?

అంతులేని సంపద భారీ ఏనుగు మీద మోసుకొస్తానని డంభాలు పలికేవు.

ఉట్టి చేతుల్తో వస్థానంటే విడాకులే గతి నీకు. నోరు మూసుకుని పంపకాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇమ్మను!" అందరికి వినపడేలా గట్టిగా అరుస్తున్నాడు శ్రీధర్ రావు.

ఎంతో దర్పం, అహం, ఏదో గొప్పతనం ఆపాదించుకుని, భర్త ని సహితం తన అధికార స్వరంతో నోరు మూయించిన అనసూయ చేష్టలుడిగి చూస్తోంది.

శ్రావణ్ అవాక్కయ్యాడు.

తండ్రి కోప్పడుతున్నాడని కానీ, భార్యకి వచ్చే డబ్బు కోసం తాపత్రయ పడుతున్నాడని కానీ, అతని ఆశ దురాశ అని కూడా కాదు. ఎదిగిన పిల్లవాడు అక్కడ ఉన్నాడని ఇంగితం లేకుండా, అతని హృదయం గాయపడుతుందని కూడా ఆలోచించకుండా-

ఇప్పుడు ఈ వయసులో తల్లికి విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడే! అనే బాధతో గిల గిల్లాడాడు.

అందరికి వినపడుతోంది ఆ రాద్ధాంతం!!

ఎప్పుడూ ఎందుకూ ఎవరినీ ఏమి అనని సుందరమూర్తి సర్రున అనసూయ గదిలోకి వచ్చాడు.

అన్నగారిని చూసి అనసూయ టక్కున లేచి నిలబడింది.

"అస్సలు నాకేమి అభ్యంతరం లేదు. మీరు నిరభ్యంతరంగా మా చెల్లిని వదిలి వెళ్ళవచ్చును. ఆమె నాకు ఏ నాటికి భారం కాదు.

కానీ, మాట వదిలేముందు దానికి కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయని తెలియదా మీకు?

మీలాంటి మనుషులు సమాజం నిర్దేశించిన ప్రమాణాల పరిధిని దాటి ముందుకి వెళ్తారు. మీ ప్రవర్తన హద్దులు దాటింది. మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించాను. ఈ ఇంట్లో మీకు సముచిత గౌరవ మర్యాదలు అపారంగా అందేటట్లు కనిపెట్టుకుని ఉన్నాను.

ఇంటి అల్లుడని కాదు. మా చెల్లి అనుక్షణం హాయిగా ఉండాలనే తపన.

ఇప్పుడు తండ్రి నైనా, అన్న నైనా నేనే అనే.

ఇంక మీకున్న సందేహాల్ని లాయర్లని లాక్కొచ్చి చెప్పించక్కర్లేదు. ఈ ఆస్తి నా స్వార్జితం.

వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిని ఏనాడో పంపకాలు చేసి రిజిస్టర్ చేసి ఉంచాను.

మీరు ఏ నాడూ నన్ను అడగలేదు. అడిగి ఉన్నా చెప్పేవాడిని కాదు.

ఎందుకంటే అది మాచెల్లెలికి మాత్రమే చెందుతుంది గనుక. మీరు ఎంతో మాములుగా, నెమ్మదిగా ఉంటూ,

మీకేమి చెందదని తెలిసాక మీ అసలు స్వరూపాన్ని బయటికి తీసుకు వచ్చారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడమే కాదు. సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రతి వ్యక్తి సరైన జీవికని ఎంచుకోవాలి.

భార్య మీద వాలి ఆమె తెచ్చే సంపద కోసం గోతి కింద నక్కలా ఎదురు చూస్తూ ఉండడం తెలివి తక్కువతనం. చివరికి మీకు భార్య దగ్గర కూడా విలువ ఉండదు.

మీకో విషయం చెప్తా వినండి. నా సంపాదనలో నేను సంతోషంగా అనసూయ కోసం ఇచ్చిన డబ్బుని కూడా కార్డ్స్ ఆడుకుంటూ దుర్వినియోగం చేశారు. నాకా సంగతి ఆలస్యంగా తెలిసింది. కానీ నేనెప్పుడైన మిమ్మల్ని వివరాలు అడిగానా? బాగా ఆలోచించుకోండి. కలిసి ఉంటే ఉండండి. లేదా మీ దారి మీరు చూసుకోవొచ్చు.

కానీ ఒకే ఒక్కటి చెప్తా. వినండి. సమిష్టి వికాసమే ఏ వ్యక్తి సంకల్పం అయినా అయి ఉండాలి.

సంపాదించవచ్చు. పంచుకోవొచ్చు. అల్లుళ్లు అయినా కరుణాకరం, మనోహర్ కూడా కలిసి వ్యాపారం చేసేందుకు నాతో వస్తున్నారు.

మీరేమనుకుంటారో మీ ఇష్టం!" నిక్కచ్చిగా చెప్పేసి వెళ్తూ అనసూయ వైపు తిరిగి అల్లుడితో అలా మాట్లాడవలసి వచ్చినందుకు చింతిస్తున్నానని, మన్నించమని అడిగి వెళ్ళిపోయాడు.

ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది.

★★★

అసలు 'భావ కాలుష్యం' అంటే ఏమిటో తెలుసా? అన్నాడు వసంత్ ఆ సాయంత్రం.

ఒకటే నవ్వాడు ప్రాంజల్.

"నువ్వు ఒక్క క్షణం ఆగవు. ఎవరికో ఒకరికి ‘జీవితం ఇదీ’ అని చెప్పకపోతే తోచదు.కదా?" అన్నాడు సరదాగా కవ్విస్తూ.

"పొరబడ్డారు. నాకేదో తెలుసని నేను చెప్పను. మీకందరికీ తెలియదనీ చెప్పను.

ఏవో ఆకర్షణల్లో పడి, వాస్తవాన్ని మరిచిపోకూడదని అనిపిస్తుంది. క్షణం పోతే తిరిగి రాదు కదా? అందరూ బాగుండాలనే తపన, ఆరాటం నన్నసలు నిలవనియ్యవు.

ఇంతకీ వినండి.

భావ కాలుష్యం అంటే దుర్మార్గమైన, వికృతమైన ఆలోచనల్ని ప్రవేశపెట్టి కుటుంబ వాతావరణాన్ని కలుషితం చేయడం. ప్రపంచీకరణ వచ్చి మనుషుల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తోంది. ఇది పితృ స్వామ్యం కంటే ప్రమాదకరం. సమయాన్ని జ్ఞానం పెంచుకోవడానికి కాకుండా కాలక్షేపానికి ఉపయోగించుకుంటున్నారు.

చదువుల్లో మానసిక సమతుల్యం లేదు. బయట ఉన్నవన్నీ ప్రలోభ పెట్టేవే.

ఇప్పుడు చిన్నారులు మీద ఎఫెక్ట్. సెల్ ఫోను!!!

ఇక్కడ హై క్లాస్,'లో' క్లాస్ ల్లో కూడా వ్యామోహాలు.

ఇంకేదో చెప్పబోతుంటే-

జాజి అన్నయ్యని కొట్టి పరుగెత్తుకు వచ్చింది. వాడు అన్యాయంగా తొండి ఆట ఆడి బాల్ లాక్కున్నాడని ఫిర్యాదు. బుంగమూతి పెట్టుకుని కూర్చుంది.

ప్రాంజల్ సున్నితంగా సౌమిత్ కి నచ్చజెప్పాడు.

వసంత్ అడిగాడు అందర్నీ.

"పాలల్లో నీళ్ళు కలిపేవాడిని మనం ఏమంటాం?"

"వెధవన్నర వెధవ!" అన్నాడు టక్కున త్రిలోక్.

ఫక్కున నవ్వాడు వసంత్.

"ఆగరా బాబు దుడుకు!" అన్నాడు.

"సారి సారి!” అన్నాడు వాడు.

"రసాయనాలు వేసి కూరగాయలు పండించేవాడు దుర్మార్గుడు. ఎరువుల్లో కల్తీ, మందుల్లో కల్తీ, పంట దిగుబడిలో కల్తీ… నిజాయితీ కరువై పోయి కదా అన్నదాత కి అన్యాయం. కెమికల్స్ వాడితే పొలం నాశనం

ఇలా ఎన్నెన్నో.

గమ్మత్తేమిటంటే భక్తి పేరుతో ఒక క్రేజ్ ఇప్పటి ట్రెండ్.

అవగాహనలేని మనుషులు ఆశ్చర్యకరంగా తాము మాత్రమే బాగుండాలని కోటి రూపాయలు సర్వ సేవల్లో పాల్గొనడానికి కట్టేస్తారు. డబ్బుకు దేవుడు కూడా పలికేసి వరాలు ఇచ్చేస్తాడని.

దీనివల్ల సేవాభావం గట్టిపడిపోలేదూ?

మాగ్నటిక్ కి కూడా డస్ట్ పడుతోంది. చూడండి.

ఇవన్నీఅందరికి తెలిసీ గుడ్డితనం.

నటించేవాడికి చూపెక్కడ తేగలం?

ఇవన్నీ కుటుంబ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.

దీనికి ఒక్కటే తిరుగులేని మందు.

చదువు. ఉన్నత ప్రమాణాలు గల పుస్తకాలు. మూలాల్ని మనం ఒడిసి పట్టుకోవాలి.

అసలు టైం కి ఉండే డైమెన్షన్ తెలుసుకోవాలంటే వేదాలు తప్ప ఇంకేమి లేవు.

ఇక్కడ అంతా ఒక్కటే.

'నీలాగే నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించమన్నాడు' క్రీస్తు.

'ఎదుటి వ్యక్తి పెదాలపై చిరునవ్వు తెప్పించమన్నాడు' మొహమ్మద్.

'అంతా ఒకే కుటుంబం!' అన్నాడు బసవేశ్వరుడు.

ఆగాడు ప్రశాంత్.

“నేను చెప్పే దేమిటంటే- అతడి గొంతు గద్గదికమయింది.

కళ్ళు కన్నీళ్ళతో నిండి టప టపా రాలి పడ్డాయి.

అందరి మనసుల్లో గంభీరత ఆవహించింది.

పరిసరాలు ఉలుకు లేకుండా అయిపోయాయి.

నాకూ, ఈ ఇంటితో సంబంధం ధృతి పిన్ని తోనే.

నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది.

నాన్న వేరే పెళ్ళి చేసుకున్నాడు.

నేను ఒంటరిని అయ్యాను.

ఇదుగో..ఈమె దయ వల్లే నేను అమ్మ లేని వాడిని కాలేదు. నాకూ, పిన్నికి వయసు తేడా ఎక్కువ లేకపోయినా ఆమె నాకు తల్లి అయింది!" అన్నాడు. అతడు తనని తాను ఓదార్చుకుంటున్నాడు. అది వింటున్న-

సింహాద్రి మూగవాడై పోయాడు.

సంపంగి అల్లల్లాడిపోతోంది.

టక్కున వాళ్ళిద్దరూ సుందరమూర్తి వైపు చూసారు.

ఆ మహానుభావుడే లేకపోతే తమ గతి మాత్రం ఏమిటి?

★★★

వసంత్ కాస్త తెరిపిన పడ్డాక అన్నాడు.

“మొట్ట మొదట ఈ ఇంటిలో అడుగుపెడుతూ ఇంటి పేరు చూసాను.

“గోపురం!"

భగవంతుని పాద నూపురం.

నేను ఇంట్లోకి వచ్చి గోపురం అంటే ఏమిటో పుస్తకం తిరగేసాను.

గోపురానికి పైన శంఖు ఆకారం లో ఉన్న లోహం పదునైన ముగింపుతో మెరుపు దాడిని అనుమతించడానికి, దానిని సురక్షితంగా గ్రౌండింగ్ చేయడం ద్వారా దానిని గ్రహించేలా చేస్తుంది.

ప్రజలకి సానుకూల శక్తి ని అందించే కంటిలోని కార్నియా లాంటిదట.

లోపల ఉండేది ఆలయం!!!

నేను ఈ ఇంటిలో అతి భక్తి తో అడుగుపెట్టాను.

అవును. ఏ ఇల్లు అయినా ఆలయమే!!

దేవుని ఇల్లు దేవాలయం.

అంటే ప్రశాంతత ని ఇచ్చేది.

ఆ ఇంటిలో భద్రపరిచే పుస్తకాలు విజ్ఞాన కేంద్రాలు.

అంటే గ్రంధాలయాలు.

విద్యాపరంగా అభివృద్ధి చెందేటటువంటి అమ్మ ఒడి అక్షరాల్ని తీర్చిదిద్దే బడి.

అంటే విద్యాలయం.

ఇల్లు కేంద్రం.

వ్యక్తి అభివృద్ధికి, ఇంటి సభ్యుల్ని, సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఇల్లు ఇలా తయారుచేయబడింది.

మనం ఈ మూలాలను రక్షించుకోవాలి.

సంస్కృతి అయినా, భాష అయినా, సమాజమైనా, కుటుంబమైనా మూలాలనే కాపాడుకోవాల్సింది.

కానీ ఎంత దురదృష్టం?

ముఖ్యమైన విషయాల్ని పక్కకు పెట్టెయ్యడానికి ఎన్నో పనికిమాలిన విషయాలు వస్తున్నాయి.

గొప్ప సంస్కృతిని ట్రాష్ అవుట్ చేయడానికి పూనుకుంటున్నారు.

సింహాద్రి ఎప్పుడు తోటలోకి వెళ్ళాడో హడావిడిగా వచ్చాడు.

సంపంగి మీద కంప్లైట్ ఇచ్చాడు.

“చూడండి బాబూ! సంపంగి మొక్క బాగా ఎదిగిందా? రెండు ఆకులు రాలాయని ఏడిస్తే ఎలాగ?

నాలుగు ఆకులు చిగురించవా?" అన్నాడు.

అందరూ భలే హాయిగా నవ్వారు.

★★★

మర్నాడు ఉదయం తొమ్మిదిన్నర గంటలు.

సుందరమూర్తి బాగ్ పట్టుకుని మార్కెట్ వైపు బయలుదేరాడు.

ఆ బాగ్ ని అందుకున్నాడు శ్రీధర్ రావు.

వెనుక కరుణాకరం, శంకర్రావు ఉన్నారు.

మనోహర్ స్కూటర్ స్టార్ట్ చేస్తూ…

“బాంక్ నుంచి మీరు చెప్పిన చోటుకి వచ్చేస్తాను బావగారూ!" అన్నాడు.

అపర్ణ ధాత్రిని సంతోషంగా చూసింది.

“ఇంకా సమయం మించిపోలేదు అపర్ణ వదినా! నీకో బుజ్జి బంగారం పుట్టేస్తే సురేఖ జాగ్రత్తగా పెంచుతానని అంటోంది మనోహరితో!” అంది సావిత్రి.

ప్రాంజల్ ధాత్రికి వెళ్ళొస్తా అని చెప్తున్నాడు.

అనసూయ తన పొట్టి జుట్టుకి రబ్బర్ బ్యాండ్ కడితే కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తున్న జాజి తో-

"ఇప్పుడిదే ఫ్యాషన్ తెలుసా?" అంది అనసూయ.

జాజి మా గొప్ప గా నవ్వింది.

★★★ సమాప్తం★★★

రచయిత్రి పరిచయం ..

Saroja Bulusuపేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in June 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *