Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు కేదారి -
ఈశావ్యాస్యోపనిషత్తు

గత సంచిక తరువాయి... »

పదవ మంత్రం

అన్యదేవాహుర్విద్యయాన్యదాహురవిద్యయా
ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్ విచచక్షిరే

భావం: విద్యాసాధన వలన ఒక రకమైన ఫలితం, అవిద్యాసాధన వలన మరొకరకమైన ఫలితం పొందబడుతుందని మహాత్ములు వివరించారు.

భాష్యం: మానవుడు తాను నేర్చుకునే విద్య వలన అతని జీవితం ఆధారపడి ఉంటుంది. అతను సవిద్యను పొందినట్లయితే మంచి ఫలితాలను పొందుతాడు. కువిద్యను పొందినట్లయితే చెడు ఫలితాలను పొందుతాడు.
అంటే నేడు విద్యాలయాలలో కేవలం భౌతిక పరమైన విషయాలను మాత్రమే వివరిస్తున్నారు. అభౌతికమైన ఆధ్యాత్మిక విషయాలను బోధించడం లేదు. అందువలన మనుషులలో శాంతి, సహనం, మమత, మానవతా కరువైపోయాయి. కనుక మనిషి యొక్క జీవితము అతను ఆర్జించే జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని పండితులైన మహానుభావులు తెలియజేశారు.

పదకొండవ మంత్రం

విద్యాం చావిద్యాం చ యస్తద్ వేదోభయగ్ం సహ
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే

భావం: జ్ఞానము, కర్మలు రెండింటినీ కలిపి ఏకకాలంలో తెలుసుకునేవాడు, కర్మల ద్వారా మరణాన్ని అధిగమించి, జ్ఞానం ద్వారా అమరత్వాన్ని పొందుతాడు.

భాష్యం: అంటే నిత్యజీవితంలో తమ తమ విద్యుక్త కర్మలు ఆచరిస్తూ కూడా జ్ఞానార్జన చేయవచ్చునన్న ఎరుకగల మానవులు కర్మ వలన ప్రాప్తమయ్యే చావును జయించి, నిత్యజీవితంలో ఉపాసించి సాధించిన జ్ఞానం కారణంగా వారు దేవతా స్వరూపులవుతారు.

భగవత్ సంబంధించిన కార్యాలు మాత్రమే విద్య అని మన శాస్త్రాలు వచిస్తాయి. తక్కినవన్నీ అది విజ్ఞానమైనా సరే, కళలైనా సరే, అంతెందుకు వేదాధ్యయనం అయినా సరే అవిద్య గానే పేర్కొనబడుతుంది. జపము లాంటి సాధనలు కూడా భగవంతుని ఉద్దేశించి చేయకుంటే అవి అవిద్యలో భాగంగానే పరిగణించుతారు. ఈ సాధనలో కేవలం క్రియ అనే స్థాయిలో ఆగిపోకుండా, ఉన్నత లక్ష్యంతో అంటే విద్యతో జోడించి కార్యాలు నిర్వహించబడాలి అని ఈ మంత్రాలు చెబుతున్నాయి. అవిద్యమార్గం లేక ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించే భౌతిక జ్ఞానం జనన మరణ చక్రంలో పడవేసే మార్గం. అయితే విద్య ఆధ్యాత్మికంగా ఉండి జీవాత్మకు పరమాత్మకు అనుసంధానంగా ఉన్నట్లయితే అటువంటి జ్ఞానులు అమరత్వాన్ని పొందుతారని ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది.

**** సశేషం ****

Posted in April 2024, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!