సినీ స్థితప్రజ్ఞుడు "విజయ నాగిరెడ్డి"
తెలుగు సినిమా రంగంలో విజయ నాగిరెడ్డి గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ పేరు ఎందుకు అంటే విజయ సంస్థ నిర్మించిన మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కధ లాంటి, నేటికీ తెలుగు ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్న చిత్ర రాజాలు గుర్తుకు వస్తాయి. చిత్ర నిర్మాణంలో పేరెన్నిక గన్నసంస్థ విజయ సంస్థ. అంతే కాకుండా విజయ స్టూడియో అధినేత నాగిరెడ్డి చక్రపాణి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు అన్నీ కూడా కమర్షియల్ గా వినోదాత్మకంగా రాణించాయి. అలాగే వారి సారధ్యంలో వచ్చిన చందమామ యువ, విజయచిత్ర పత్రికలూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. సినిమా నిర్మాణం కూడా వ్యాపార పరిశ్రమే. పేరుతోపాటు పెన్నిధి సమకూర్చేది సినీ వ్యాపారం అనే సూత్రాన్ని నమ్మి ఆచరించిన వ్యాపార దక్షుడు విజయా సంస్థ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. యాభై సంవత్సరాలు పైగా సినిమా అనే అద్భుత కళకి అంకితమైన స్థితప్రజ్ఞుడు నాగిరెడ్డి. తన సినిమా సూత్రాన్ని ‘పాతాళభైరవి’ చిత్రం ద్వారా ‘జనంకోరేది మనం తీయాలి కానీ మనం తీసేది జనం చూడడం కాదు’ అని చెప్పి మరీ సినిమాలు నిర్మించి సమాధానమిచ్చిన మేధావినాగిరెడ్డి. ‘మాయాబజార్’ సినిమా కూడా కళాఖండమే కానీ అది వ్యాపారాత్మక కళాఖండం. నాగిరెడ్డి కేవలం వాణిజ్యపరంగా మాత్రమే వ్యవహరించేవారు. కథ, కథనం, మాటలు-పాటలు, సంగీతం, దర్శకత్వం ఇత్యాది వ్యవహారాలన్నీ చక్రపాణికి దాఖలు పరచేవారు. అదే విజయా సంస్థ క్రమశిక్షణ. సినిమా వాణిజ్యమే కాదు విద్య, వైద్య రంగాలకు కూడా నాగిరెడ్డి చేసిన సేవలు అద్వితీయం.
బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి దంపతులకు కడప జిల్లా పొట్టిపాడు గ్రామంలో 1912 డిశంబర్ 2 న నాగిరెడ్డి గారు జన్మించారు. ప్రముఖ దర్శక నిర్మాత, వాహిని సంస్థ అధిపతి అయిన బి ఎన్ రెడ్డి గారు ఈయన అన్న. కొండారెడ్డి, రామలింగ రెడ్డి లు తమ్ముళ్లు. కొండారెడ్డి సినిమాటోగ్రాఫర్ గాను, రామలింగారెడ్డి వ్యాపారవేత్తగా సెటిల్ అయ్యారు. నాగిరెడ్డి గారి తండ్రి నరసింహారెడ్డి గారు మద్రాసులో కమిషన్ వ్యాపారం చేస్తుండటం వల్ల నాగిరెడ్డి తాత హనుమన్న, అమ్ముమ్మల దగ్గర పెరిగాడు. తాత గారు రామరాజు అనే ఉపాధ్యాయుని వద్ద రామాయణము, భారతము, భాగవతం వంటి పురాణాలను నాగిరెడ్డికి చెప్పించేవారు. ఆ విధముగా రామరాజు గారి శిష్యరికంలో నాగిరెడ్డి జీవితపునాదులు గట్టిపడ్డాయి. 14 వ ఏట నాగిరెడ్డి మద్రాసు చేరుకొని గోవిందప్పనాయకర్ వీధిలోని పాఠశాలలో అన్న బి ఎన్ రెడ్డి తో కలిసి చదువు కొనసాగించారు. ఎనిమదవ తరగతి పూర్తి చేసి స్వతంత్రోద్యమం బాగా ఊపందుకుంటున్న రోజుల్లో గాంధీజీ పట్ల ఆకర్షితుడై విద్యార్ధిగానే ఉంటూ ఉప్పు సత్యాగ్రహము, విదేశ వస్తు బహిష్కరణ వంటి ఉద్యమాలలో పాల్గొన్నాడు. ప్రకాశం పంతులు గారు నాగిరెడ్డిని దుర్గాబాయ్ దళములో చేర్పించినప్పుడు, ఖద్దరు ప్రచారానికి ఖద్దర్పైజామా, ఖద్దరు జుబ్బా ఖద్దరు టోపీ ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా ప్రచారానికి గ్రామాల వెంట తిరిగాడు. గ్రామాల్లో ప్రజలు ఈయనను తమాషాగాచిన్న గాంధీ అని పిలిచేవారు అన్న బి ఎన్ రెడ్డిగారు మాత్రము ఖద్దరుప్రచారము లో పాల్గొంటున్నప్పటికీ చదువు కొనసాగించాడు.
పద్దెనిమిదేళ్ల వయస్సులో తండ్రి ఆజ్ఞానుసారం నాగిరెడ్డి ఉల్లిపాయల వ్యాపారము కోసము ఓడలో రంగూన్ వెళ్లి అక్కడ కుటుంబ స్నేహితుడు ఇస్మాయిల్మహమ్మద్ ఇంట్లో ఉంటూ వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. తీరిక వేళల్లో ఉర్దూ నేర్చుకొనేవాడు. రెండవ ప్రపంచ యుద్ధము కారణముగా మద్రాసు వచ్చాడు. తన ఇరవై ఒకటవ సంవత్సరంలో నెల్లూరు బంధువర్గానికి చెందిన శేషమ్మతో నాగిరెడ్డికి వివాహం జరిగింది.
వాహిని వారు నిర్మించిన ‘స్వర్గసీమ’ (1943) చిత్రానికి చక్రపాణి చేత మాటలు రాయించారు. అలా ఆలూరు వెంకట సుబ్బారావు అనే చక్రపాణి, విజయా సంస్థకుపరిచయమై నాగిరెడ్డికి దగ్గరైనారు. విజయా ప్రొడక్షన్స్ సంస్థ ప్రారంభించి నాగిరెడ్డి-చక్రపాణి తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకి కథ, మాటలు సమకూర్చడమే కాకుండా నిర్మాణ బాధ్యతలను మోసింది చక్రపాణి. ఈ చిత్రం ద్వారా పరిచయమైన జానకి ‘షావుకారు జానకి’ గా గుర్తింపు పొందింది. 1951లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘పాతాళభైరవి’ సినిమా నిర్మించారు. ఈ జానపదచిత్రం సర్వజనుల్నీ విశేషంగా ఆకర్షించింది. సినిమా సూపర్ హిట్టై 185రోజులు ఆడి కనకవర్షం కురిపించింది. దాంతో వాహిని స్టూడియోలో మరొక ఫ్లోర్ నిర్మించి దానికి ‘పాతాళభైరవి’ అని పేరుపెట్టారు. విడుదలైన అన్నికేంద్రాలలో శతదినోత్సవం చేసుకున్న ‘పాతాళభైరవి’ చిత్రానికి పనిచేసిన ముఖ్యకళాకారులందరికీ నాగిరెడ్డి ‘బ్యూక్’ కంపెనీ కార్లను బహుమతిగా అందజేశారు. రామారావు ఆ కారును ‘ఫాదరిచ్చిన కారు’ అని గొప్పగా చెప్పుకునేవారు. రామారావు విజయా సంస్థలో 20 చిత్రాలకు పైగా నటించారు. వాహినీ స్టూడియోని తీసుకొని విజయా-వాహినీ స్టూడియోగా అధునాతన పరికరాలతో అభివృద్ధి చేశారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద స్టూడియోగా ఇది అప్పట్లో పేరు గడించింది. విజయా గార్దన్స్‌లో అవుట్ డోర్ షూటింగులు జరిగేవి. అలాగే రికార్డింగ్ సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తం పన్నెండు ఫ్లోర్లు, రెండు రికార్డింగ్ థియేటర్లు, లేబరేటరీ, ప్రొజెక్షన్ థియేటర్లతో ఆ స్టూడియో అలరారింది. సమయపాలన, క్రమశిణకు వీరిద్దరూమారుపేర్లే. ఇద్దరూ కృష్ణార్జునులు లాగా వ్యవహరిస్తూ విజయా సంస్థను ముందుకు నడిపారు. 1957లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాబజార్’ ద్విభాషాచిత్రం 175 రోజులకు పైగా ఆడి చరిత్ర సృష్టించింది. తెలుగు చలన చిత్రపరిశ్రమలో వున్న హేమాహేమీలందరూ ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇక వరుసగా ‘అప్పుచేసి పప్పుకూడు’ (ఎల్.వి.ప్రసాద్ దర్శకుడు) చిత్రం శతదినోత్సంచేసుకోగా, కె.వి.రెడ్డిదర్శకత్వం వహించిన ‘జగదేకవీరుని కథ’ కూడా 175రోజులు ఆడింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘గుండమ్మ కథ’ సూపర్ హిట్‌గా నిలిచి 175 రోజులకు పైగా ఆడింది. ఆ విధముగా నాగిరెడ్డి గారి సినీ జైత్ర యాత్ర నిరాఘాటంగా కొనసాగింది. నాగిరెడ్డి ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షునిగా నాలుగుసార్లు దక్షతతో కూడిన బాధ్యతలను నిర్వహించారు. ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయి, రాజాజీ, కామరాజ్ నాడార్, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతోసన్నిహిత సంబంధాలను నెరిపారు. తిరుమల-తిరుపతి దేవస్థానం పాలకమండలిఅధ్యక్షునిగా నాగిరెడ్డి వ్యవహరించారు. మెడికల్/ఎడ్యుకేషన్ ట్రస్టును స్థాపించి సేవలందించారు. చలనచిత్ర రంగానికి ఎనలేని కృషి చేసినందుకు భారతప్రభుత్వం 1987లో నాగిరెడ్డిని ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారాన్ని అందజేసింది. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నాగిరెడ్డికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. నాగిరెడ్డి ముగ్గురు కొడుకుల్లో వెంకటరామరెడ్డి, విశ్వనాథరెడ్డి సినిమా నిర్మాణంలో వున్నారు. నాగిరెడ్డి అనారోగ్యంతో తన 92వ ఏట 21 ఫిబ్రవరి 2004న మద్రాసులో మరణించారు.