తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు
తెలుగు భాష పుట్టుక:-
తెలుగు భాష అజంత భాష అనగా పదాలు అచ్చుల ఉచ్ఛారణతో ముగుస్తాయి. ఇటువంటి లక్షణమే ఇండో-యూరోపియన్ భాషైన ‘ఇటాలియన్’కు ఉండటం వల్ల తెలుగును ‘Italian of the East’ అని పిలుస్తారు. తెలుగు భాష మీద సంస్కృత ప్రభావం అధికంగా ఉండటం మూలంగా చాలా రోజుల వరకు తెలుగు భాష సంస్కృత జన్యమనే అభిప్రాయం ఉండింది. ఎల్లిస్, బిషప్ కాల్డ్వెల్ అనే పాశ్చాత్యులు ద్రావిడ భాషలను అధ్యయనం చేసి తెలుగును ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషగా ధృవీకరించారు.
క్రీ.పూ నాలుగు, ఐదు వేల ఏండ్లకు పూర్వం ద్రావిడ భాషలన్నీ మూల ద్రావిడ భాష అనే ఒకే భాషగా ఉండేవని, అది కాలక్రమేణా ఇప్పటి ద్రావిడ భాషలుగా విడిపోయిందని భాషా శాస్త్రజ్ఞులు తులనాత్మక (Comparative) పద్ధతి ద్వారా నిర్ణయించారు. అంటే క్రీ.పూ 5600-5500 సంవత్సరాలకు చెందిన రామాయణ కాలానికి, క్రీ.పూ 3200-3100 సంవత్సరాలకు చెందిన మహాభారత కాలానికి ద్రావిడ భాషలన్నీ ఒకే భాషగా ఉండేవన్న మాట.
మూల ద్రావిడ భాష నుండి దక్షిణ మధ్య ద్రావిడ భాషా శాఖ సుమారు క్రీ.పూ 1100వ సంవత్సర కాలంలో విడిపోయిందని శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి గారు నిర్ధారించారు. వారి పరిశోధన గ్రంథం ప్రకారం మొత్తం ద్రావిడ భాషలు ఇరవై ఆరు, భాషా శాఖలు నాలుగు.
దక్షిణ మధ్య ద్రావిడ భాషా శాఖలో ప్రధానమైనది ‘తెలుగు’.
మిగతా భాషలు: కువి, గోండి, కొండ, కుయి, మండ, పెంగో.
దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంలో తమిళం, కన్నడ, మలయాళం, తుళు, ఇరుళ్, కొడగు, కురుంబ, కోట, తొడ, బడగ, కొరగ వంటి పదకొండు భాషలు ఉన్నాయి.
మధ్య ద్రావిడ భాషా కుటుంబంలో కొలమి, నైక్రి/నైకి(చంద), పర్జి, ఒల్లరి, గడబ వంటి ఐదు భాషలు ఉన్నాయి.
ఉత్తర ద్రావిడ భాషలో కూడుఖ్, మాల్తో, బ్రాహుయీ వంటి మూడు భాషలు ఉన్నాయి.
తెలుగు భాషకు ఆంధ్రం, తెనుగు అనేవి పర్యాయ పదాలు. తమిళ సంగం సాహిత్యంలో తెలుగు వారికి ‘వడుగర్’ అనే పదం వాడబడింది. పోర్చుగీసు వారు తెలుగును జెంతు(Gentoo) భాష అని అన్నారు.
తెలుగు లిపి ఆవిర్భావం:-
భాష పుట్టుకను మొదట సూచించేవి ‘శబ్దాలు’, తర్వాత కొన్ని శబ్దాలు కలసి వాక్యాలుగా రూపొందుతాయి. ఆ విధంగా భాష రూపుదిద్దుకున్నాక లిపి అవసరమవుతుంది. మౌఖికంగా ఉన్న భాషను రాత రూపంలో పెట్టడానికి లిపియే సాధనం.
తమిళం, తెలుగు అత్యంత ప్రాచీన ద్రావిడ భాషలు. ప్రాచీన తమిళాన్ని గ్రంథి లిపి లోనూ, వటిలెట్టు లిపిలోను రాయగా, ప్రాచీన తెలుగును బ్రహ్మీ లిపిలో రాశారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో సంస్కృత భాషాచార్యుడు, భాషా శాస్త్రవేత్త కూడా అయిన టి.బర్రో ప్రాచీన తెలుగు ఆధునిక రూపం తొడిగి శరవేగంతో ముందుకు దూసుకుపోవడం క్రీ.శ 600-1000 సంవత్సరాల మధ్య ప్రారంభమైందన్నాడు. అంటే క్రీ.శ 5వ శతాబ్దానికి ముందరది తెలుగుకు ప్రాచీన దశ.
క్రీ.పూ 3వ శతాబ్దానికి చెందిన ఓ రాతిమూత మీద బ్రహ్మీ లిపిలో తెలుగు అక్షరాలు రాయబడి ఉన్నాయి. ఆ రాతి మూత గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు బౌద్ధ స్థూపం వద్ద దొరికింది. ఆ రాతి మూత మీద ‘నాగబు’ అనే తత్సమ తెలుగు పదం ఉంది. తెలుగు భాషకు సంబంధించి ఇప్పటి వరకు దొరికిన ఆధారాలలో ఇదే ప్రాచీనమైనది.
క్రీ.శ 88-116 మధ్య పరిపాలించిన శాతవాహన రాజు వాశిష్టి పుత్ర పులమావి నాణాలలో బొమ్మ వైపు ‘సిరిపుదుమావిస’ అని ప్రాకృత భాషలో, బ్రహ్మీ లిపిలో ఉంది. బొరుసు వైపు ‘తిరుపుదుమావిస’ అని ప్రాచీన తెలుగులో, బ్రహ్మీ లిపిలో ఉంది.
క్రీ.శ 194-200 మధ్య పరిపాలించిన శాతవాహన రాజు వాశిష్టి పుత్ర విజయ శాతకర్ణి నాణాలలో కూడా బొమ్మ వైపు ప్రాకృత భాష, బొరుసు వైపు తెలుగు భాష ఉన్నాయి. రెండిటి లిపి మాత్రం బ్రహ్మీయే.
బ్రహ్మీ నుండి క్రీ.పూ 3వ శతాబ్దం మొదలుకుని వందల సంవత్సరాలుగా ప్రస్తుత తెలుగు అక్షరాలు ఆవిర్భవించిన తీరును డా.దామె రాజారెడ్డి, డా.గోపరాజు నారాయణరావు అనే భాషా శాస్త్రవేత్తలు ‘తెలుగింటి పురాతన నాణాలు’ అనే గ్రంథంలో 92వ పుటలో ఓ పట్టిక ద్వారా తెలియజేశారు.
గమనించదగ్గ విషయాలు ఏమిటంటే శాతవాహనుల కాలంలో రాజభాష మహారాష్ట్రీ ప్రాకృతం కాగా, జనసామాన్యం మాట్లాడే భాష తెలుగు. అందుకే వారి నాణాలలో రెండు భాషలను ఉపయోగించారు. మరో విషయం, తెలుగు లిపితో పాటు, ప్రస్తుతం భారత ప్రభుత్వం గుర్తించిన షెడ్యూల్డ్ భాషలలో మరో పదమూడు భాషల లిపులు కూడా బ్రహ్మీనుండే ఆవిర్భవించాయి.