Menu Close
Kadambam Page Title
"గర్భస్థ శిశువు ఆవేదన"
రాయవరపు సరస్వతి

అమ్మా.....
నీ గర్భంలో నున్న నన్ను తొమ్మిది నెలలూ మోసి
బండెడు నొప్పులు పడి నాకు జన్మనిస్తావు,
నీ ప్రేమామృతాలను పాలగా మార్చి నా ఆకలిని తీరుస్తావు,
పాల బువ్వతో గోరుముద్దలు తినిపించి మురిసిపోతావు,
నా చిరునగవులను చూసి పొంగిపోతావు,
నా బుడి బుడి నడకలను చూసి తన్మయం చెందుతావు,
అమ్మా అన్న నా పిలుపుతో నీ హృదయం ఉప్పొంగి పోతుంది,
నా ఆట పాటలను చూసి గర్వపడతావు,
రోజుకు రోజూ ఎదుగుతున్న నన్ను చూసి తెగ ముచ్చటపడతావు.

కానీ..అమ్మా
ఈ లోకం గుడ్డిది,
పాలుగారే ఆడ కూనలను సైతం ఆరగించే
మగ మృగాలకు కూడా నిలయం ఈ లోకమని నీకు తెలియనిదా?
వావి వరసులు చూడని మృగాలు...
ఇది పాలుగారే నెలల పసికూనా, బాలికా..ఒకింటి ఇల్లాలా లేక ముదిసలా?
ఏదీ చూడని కామ మృగాలు చేస్తున్న అత్యాచారకృత్యాలతో
ప్రపంచం అట్టుడికిపోతోంది,
ఈ పైశాచికానందం పొందుతున్న
కామపిశాచులను అంతమొందించే దారే లేదామ్మా?
ఇలాంటి లోకంలోకా నువ్వు
నన్ను తీసుకు రావాలని చూస్తూన్నది?

'స్త్రీ' సృష్టికి మూలమనీ,
ఆడదే అవనికి ఆధారమనీ
వాళ్ళను కన్నదీ ఒక ఆడదేననీ
తెలుసుకోలేని మూర్ఖులకు
నిలయం ఈలోకం?
ఆడవాళ్ళ మాన ప్రాణాలతో
చెలగాటమాడుతూ ఎటు పోతోందీ లోకం?
ఈ లోకంలో స్త్రీలకు రక్షణ ఎక్కడిదమ్మా?

అక్షర సత్యాలను వల్లెవేసేందుకు
బుడి బుడి అడుగులు వేస్తూ విద్యాలయానికి వెళ్లిన
పాలు గారే బాలికలను
ఆ జీవిత సత్యాలను నేర్పించి
నీతికథలను బోధించి బంగారుబాటలో
నడిపించాల్సిన గురువులే కాముకులై
తమ కబంద హస్తాలతో కబళిస్తున్న రోజులివి.

ప్రగతి మార్గంలో నడిచేందుకు
కోటి ఆశలతో బంగారు కలలు కంటూ
కాలేజీ చదువుల కెళ్లిన అమ్మాయిల కోసం మాటు వేసి
మాన ప్రాణాలను బలిగొంటున్న విషయం నీకు తెలియనిదా?
మూడుముళ్ళ బంధంతో భర్తతో కలిసి వెళ్తున్న కొత్త
జంటపై దాడి చేసి పతిని మట్టుబెట్టి ఆమె మానప్రాణాలతో
చెలగాటమాడిన విషయం నీవెరగనిదా?
ఇటీవల తల్లి తన ఆరునెలల బిడ్డను పొరుగింటిలో వదిలి
తను బయటకు వెళ్లిన పని చూసుకు వచ్చేసరికి
ఆ ఇంటి కాముకుడి చేతిలో తన బిడ్డ మాన ప్రాణాలను
పోగొట్టుకున్న సంగతి నీకు విదితమే కదా?

ఇన్ని ఎరిగిన నువ్వు ...
చిట్టడవిలాంటి కౄర మృగాలున్న ఈ ప్రపంచంలోకి
నన్ను తీసుకురావాలనుకోవడం
నీ వెర్రితనమే అవుతుంది?

అంతకంటే....
నేను ఆడపిల్లనని తెలుసుకొని ముఖం చిట్లించే నాన్నకు
నన్ను భ్రూణహత్యతో తొలగించేందుకు
ఆయుత్తమవుతున్న నాయనమ్మకూ
నువ్వూ సహకరించి పుణ్యం కట్టుకో.

ఆడది లేని ఈ లోకం ఎలా ఉంటుందన్నది
ఈ ప్రపంచానికి ప్రతి తల్లీ తెలియజేయాలి.
స్త్రీ జాతి అంతరించిపోతే
ఆది..అంతం..స్త్రీల తోటిదేననీ
మగజాతికి తెలిసిరావాలి!!!

Posted in January 2024, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *