Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

చూడయ్యా శంకరా...!
నిన్నే చూడడం నా అలవాటు
మామూలు అలవాటు కాదు
మరచిపోలేని అలవాటు...
ఇలాగే కొనసాగని
ఇది కూడా నీ ఆటతో పాటు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

చూడయ్యా శేఖరా...!
నీతో మాట్లాడడం నాకు ఇష్టం
మామూలు ఇష్టం కాదు
మరచిపోలేని ఇష్టం
ఇలాగే కొనసాగని
ఇది కూడా నీ ఆటతో పాటు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

చూడయ్యా శశిధరా...!
నిన్నే తలుచుకోవడం నాకు సంతోషం
మామూలు సంతోషం కాదు
మరచిపోలేని మహా సంతోషం
ఇలాగే కొనసాగని
ఇది కూడా నీ ఆటతో పాటు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

చూడయ్యా ఈశ్వరా...!
నిన్నే పూజించడం నాకు ఆనందం
మాములు ఆనందం కాదు
మరచిపోలేని మహదానందం
ఇలాగే కొనసాగని
ఇది కూడా నీ ఆటతో పాటు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

చూడయ్యా పరమేశ్వరా...!
నిన్నే కథగా, కవితగా, పాటగా రాస్తూ
సాగడం నాకు తృప్తి...
మామూలు తృప్తికాదు
మహాద్భుత మనసు మైమరచే ఆత్మసంతృప్తి...
ఇలాగే కొనసాగని
ఇది కూడా నీ ఆటతో పాటు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఈ చీకటి నలుపు
ఆ వెలుతురు తెలుపు
ఏదో అలజడి పిలుపు
ఎన్నో నిరాశల పులుపు
అన్నీ ఆట వస్తువులేగా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

కన్నీరొచ్చినా
పన్నీరొచ్చినా
కలతొచ్చినా
కనకపు రాశొచ్చినా
నీ ఆట ప్రతిఫలమేగా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నాకు నువ్వేగా గంగ
నాకు నువ్వు కనబడకపోతేనే బెంగ
నాకు నువ్వేగా అభయము
నాకు నువ్వు గుర్తుకురాకపోతేనే భయము
నీకు నాకు గమ్మత్తుగా ఉంది కేళీ విలాసము
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

సమస్య వచ్చినా
సంబురం వచ్చినా
సంతోషం వచ్చినా
సంతృప్తి వచ్చినా
నీ స్నేహపు సందడేగా సఖుడా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఇది కావాలని ఎవరిని అడగను
ఇది వద్దు అని ఎవరికి చెప్పను
నాకు ఏది కావాలో ఏది వద్దో
నీ ఆటకు తెలుసు
అందుకే నీ ఆటను ఇష్టపడుతుంది నా మనసు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

... సశేషం ....

Posted in April 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!