కొందరికి మోహమిస్తవు
కొందరికి లోభమిస్తవు
కొందరికి జ్ఞానమిస్తవు
అందరికీ జనన మరణమిచ్చి ఆడుకుంటవు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఓ చోట కరువు తాండవిస్తది
ఓ చోట వరద విపరీత లాస్యమాడుతది
ఓ చోట వినయం నిండుగా ప్రదక్షిణ చేస్తది
ఓ చోట ఆత్మీయత అలిగి ఆమడదూరం పోతది
జంగమా నీ కుటుంబమే జగత్తు కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీ నెత్తిన నీరెందుకు
మా దాహం తీరనప్పుడు...
నీ మెడలో పామెందుకు
మా కోరికల బుసలు ఆగనప్పుడు
నీ శ్మశాన నివాసం ఎందుకు
మా బుద్ధి మోక్షమును ముట్టనపుడు
తీరని కోరికల దాహము కూడా నీ దేహ భస్మమా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కాలము ఒకటి
ఉత్తర దక్షిణాయణాలు రెండు
వాటిని చూసే నీ కన్నులు మూడు
నీ కన్నుల కాంతి ధారలు వేదాలు నాలుగు
ఎన్ని ఉన్న ఏమీ మనిషి అజ్ఞానంలో మూలుగు
అజ్ఞానమే నీ ఆటకు పదునైన పలుగు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
లోకం ఏకమవుతుంది
అభివృద్ధి ఏదో రుచి చూడాలని...
పంచభూతాల ప్రకోపం ఏకమవుతున్నది
ప్రకృతిని కాపాడాలని...
వికృతబుద్ధి ఈ మనిషి మనుగడ మట్టికడుపులో ఎముకే కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎవరు అడిగారని ఉద్భవిస్తివి...
ఎవరు అడిగారని అనంతం పెరిగితి...
ఎవరు అడిగారని బ్రహ్మ విష్ణు అహం తీస్తివి
ఎవరు అడిగారని అగ్ని లింగమైతివి...
అంతా నీ ఆటే కదా, విశ్వమంతా నీ ఆటకు బొమ్మల మూటే కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎవరి కొరకు లింగమైతివి
ఎవరి కొరకు బ్రహ్మాండమంత విస్తరిస్తివి
ఎవరి కొరకు అంగాంగంలో ఉంటివి
ఎవరి కొరకు అండ పిండ బ్రహ్మాండాలను కదిలిస్తివి...
అంతా నీ ఆటే కదా, విశ్వమంతా నీ ఆటకు బొమ్మల మూటే కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎందుకని ద్వాదశ లింగాలుగా వెలిగితివి
ఎందుకని అష్టమూర్తి తత్వాలుగా అవతరిస్తివి
ఎందుకని పంచారామాలు పరిమళిస్తివి
ఎందుకని లింగము సృష్టిని మొత్తం చూపిస్తివి
అంతా నీ ఆటే కదా, విశ్వమంతా నీ ఆటకు బొమ్మల మూటే కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎవరు స్వామి నిన్ను కన్నది
ఎవరు స్వామి నిన్ను పెంచినది
ఎవరు స్వామి నిన్ను ఆడుకోమన్నది
ఎవరు స్వామి నిన్ను మన్నులో ప్రాణాలను కలుపమన్నది
అంతా నీ ఆటే కదా, విశ్వమంతా నీ ఆటకు బొమ్మల మూటే కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎలా పుడితివి ఒంటరిగా
ఎలా పెరిగితివి ఒంటరిగా
ఎలా తిరిగితివి స్మశానంలో ఒంటరిగా
ఎలా ప్రాణాలు తీస్తుంటవు తుంటరిగా
ఎలాగైనా చేయడం నీ చేతి కళేగా
అంతా నీ ఆటే కదా, విశ్వమంతా నీ ఆటకు బొమ్మల మూటే కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...