తన స్వానుభవంతో వేమన వ్రాసిన శతకంలోని ప్రతి పద్యం ఒక సందేశాన్ని అందిస్తుంది. ఆ పద్యాలలోని ప్రతి పదాన్ని విశ్లేషిస్తే ఎంతో నిగూఢమైన అర్థం స్ఫురిస్తుంది. ఉదాహరణకు ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల..అని వేమన వ్రాసిన శతకంలోని పద్యం మనందరికీ సుపరిచితమే.
సకల జీవరాశిని కలిగి ఉన్న ఈ చరాచర సృష్టిలో మనుషులమని చెప్పుకుంటూ మనుగడ సాగిస్తున్న మనం, మన ఉనికిని చాటుకోవాలనే తపనతో అనేక విధములైన కార్యాలను నిర్వర్తిస్తుంటాము. మన ఆలోచనలలో జనించిన విధివిధానాలు, అవి జీవితానికి, ఆరోగ్యానికి, ఆహారానికి, ఆహార్యానికి వేటికి సంబంధించినవైననూ చాలా భేషుగ్గా మన జీవనశైలికి సరిపోయి మనకు ఒకవిధమైన తృప్తిని కలిగించవచ్చు. కానీ అవి అందరికీ కూడా చక్కగా సరిపోయి వారికి కూడా మంచి జరుగుతుందని అనుకుంటాము. కనుకనే అందరికీ సలహాలు ఇవ్వడం మొదలుపెడతాము. అంతవరకు బాగుంటుంది కానీ, మన మనసులో అనేకవిధములైన స్వార్థపూరిత ఆలోచనలతో సతమతమౌతూ అందరి దృష్టిలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందాలని మనం చేస్తున్న కార్యాలన్నీ సక్రమమైనవి అనే భావన కలిగించాలనే తపనతో ఏవో ధర్మాలను వల్లిస్తూ మనలను మనం ఒక గొప్ప నీతిమంతుడు, ధర్మబద్దుడుగా చిత్రీకరించుకుంటూ బ్రతకడం అనేది అవసరం లేదు.
నిజమైన సత్ సంకల్పంతో, నిస్వార్థంతో అనుకున్న, మనసులో జనించిన మంచి కార్యాన్ని ఆచరణలో పెట్టడం జరిగితే, అవి అందరికీ ఆమోదయోగ్యమై ఉపయోగపడినప్పుడు, అందరూ మనం చేస్తున్న మంచిపనులను మన ప్రమేయం లేకుండానే గుర్తిస్తారు. అవి తమ జీవితాలకు ఎంతవరకు వర్తిస్తాయో బేరీజు వేసుకుని పాటించడానికి ప్రయత్నిస్తారు.
ఈ విశాల విశ్వంలో, కోటానుకోట్ల జీవరాసుల నడుమ మన ఉనికి దాదాపు మృగ్యమే. అయితే మనిషికి భగవంతుడు ఇచ్చిన ఏకైన వజ్రాయుధం, పదిహేను సెంటీమీటర్ల పొడవుగలిగి 1300 గ్రాముల బరువు కలిగిన ఆ చిన్ని అవయము. దానినే మనం గొప్పగా The Human Brain అని చెప్పుకుంటున్నాము. మనిషి మెదడు, రాతియుగం నుండి నేటి ఆధునిక జీవన పోకడల వరకు జరిగిన నాగరికత అభివృద్ధికి ప్రధాన కారకము. అంత విలువైన, ఎన్నో శాస్త్రీయ ఆవిష్కరణలకు, అంతుచిక్కని విశ్వం యొక్క మూలాలను సాధిస్తూ ఎన్నో జ్ఞాన సంపదలను తనలో ఇముడ్చుకున్న మన మెదడులో మంచి ఆలోచనలకు ఎల్లప్పుడూ స్థానమిచ్చి, సృష్టించి, సమాజ అభ్యున్నతికి మనవంతు బాధ్యతను నిర్వర్తించడమే మనందరి ప్రధాన కర్తవ్యం.
అలాగే, ప్రస్తుతం మనందరం ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవిస్తున్న కరోనా భూతం యొక్క ప్రభావ పరిస్థితి, మనకు ఎన్నో గుణపాఠాలను నేర్పుతున్నది. ముఖ్యంగా శుభ్రత విషయంలో అందరూ ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. అలాగే ఆహార విషయంలో కూడా ఎంతో జాగురూకత తో వ్యవహరిస్తూ నియమాలను పాటిస్తున్నారు. కానీ శరీర శుభ్రత, పరిసరాల శుభ్రత, సమాజ శుభ్రత తో పాటుగా మన మెదడులోని ఆలోచనలను కూడా శుభ్రపరచవలసిన అవసరం నేడు మనకు కనిపిస్తున్నది. Be Positive, Be happy and healthy, a key to our peaceful life.
‘సర్వే జనః సుఖినోభవంతు’