వీక్షణం-96 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆగస్టు 9, 2020 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ కన్నెగంటి చంద్ర గారు "కథ స్వరూపం- నిర్మాణ పద్ధతులు" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.
ఇందులో భాగంగా కథలు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటి లక్షణాలు ఏవిటో విశ్లేషణ చేశారు. ముందుగా కార్యక్రమ నిర్వహకులు డా. కె.గీత గారు చంద్ర గారిని సభకు పరిచయం చేశారు. చంద్ర గారు వరంగల్ REC లో ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఆఫ్ అయోవా లో MS చేసేరు. డాలస్ లో గత పాతికేళ్లుగా నివాసం ఉంటున్నారు. వాన వెలిసిన సాయంత్రం కవితా సంపుటి, మూడో ముద్రణ కథల సంపుటి వచ్చాయి.
తర్వాత చంద్ర గారు ముందుగా కథల్లో మొదలు, మధ్య, చివర ఎలా ఉంటాయో వివరిస్తూ ఉపన్యాసాన్ని ప్రారంభించేరు. కథలు ఎన్ని రకాలుగా ఉంటాయో శాస్త్రీయంగా వివరిస్తూ కొన్ని కథలు సాధారణతకు భిన్నంగా చివరి నించి మొదలయ్యి మొదటికి వస్తాయని, అందుకు ఉదాహరణగా మెమొంటో సినిమాని ఉదహరించారు. కాశీమజిలీల కథల వంటి ఒక కథ నించి మరొక కథలోకి సాగే కథలు, పంచతంత్ర కథల వంటి ఒక కథ పాత్ర నించి పాత్రకి లూప్ లాగా సాగి మళ్లీ మొదటి పాత్రకి రావడం కొన్నయితే, మరికొన్ని ఎపిసోడ్స్ తో కంటిన్యుటీతో సాగేవని అన్నారు. తరవాత 9/11 ప్రధానాంశంగా వచ్చిన రీ స్ట్రక్చర్ కథలు, ఒక కథ చీలి మరొక కథలా రూపొందే బ్రాంచింగ్ కథలు, సమాంతరంగా కథ సాగే పారలెల్ స్ట్రక్చర్ కథలు, పలు పాత్రలు ఒకే కథని చెప్పే కథలు, ఫ్రాగ్మెంటరీ కథలు, రిపీటేషన్ కథలు, సర్కులర్ కథలు, సంభాషణాత్మక కథలు, సంభాషణలే లేని కథలు, స్క్రీన్ ప్లే కథలు, ఉత్తరాల రూపంలో కథలు, డైరీ కథలు... ఇలా ఎన్నో రకాల కథల్ని సోదాహరణంగా వివరించేరు. కథా నిర్మాణాన్ని గురించి, వాక్య నిర్మాణాన్ని గురించి వివరిస్తూ వాక్యాల నిడివి మూడ్ ని క్రియేట్ చేస్తుందని, తెలుగులో ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయాల్సి ఉన్నాయని ముగించేరు.
తర్వాత జరిగిన చర్చా కార్యక్రమం చాలా ఆసక్తిదాయకంగా జరిగింది. రమణారావు గారు, చిట్టెంరాజు గారు, కిరణ్ ప్రభ గారు, సీతారామయ్య గారు, గీతగారు, అపర్ణగారు, ఉదయలక్ష్మి గారు మొ.న వారు ఈ చర్చలో పాల్గొన్నారు.
ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో శ్రీధర్ రెడ్డి గారు, డా. కె.గీత గారు, దాలిరాజు గారు మున్నగు వారు కవితల్ని చదివారు.
ఆ తర్వాత కిరణ్ ప్రభ గారు, శారద గార్ల ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరికీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.
చివరగా సుభద్ర గారు, గీత గారు లలిత గీతాల్ని ఆలపించి సభను అలరించారు.
ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు అనేకులు పాల్గొన్నారు.