వీక్షణం-129 వ సాహితీ సమావేశం మే14, 2023 న ఆన్ లైనులో జూమ్ సమావేశంగా ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఇందులో భారతదేశం నుంచి విశేష సంఖ్యలో అతిథులు పాల్గొన్నారు. ముందుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి సభలోని వారందరికీ స్వాగతం పలికారు. తరువాత సభాధ్యక్షులు శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల ఈ నాటి సభకు ముఖ్య అతిథి, అనువాదంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి గౌరీ కృపానందన్ గారిని సభకు పరిచయం చేసారు.
గౌరీ కృపానందన్,తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లభాషల్లో నిష్ణాతులు. సాహిత్యం పట్ల మక్కువ కారణంగా తన నలభయ్యవ ఏట అనువాద రంగంలోకి అడుగుపెట్టారు. ఇరవై ఐదేళ్లకి పైగా తమిళం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి తమిళంలోకి అనువాదాలు చేస్తున్నారు. తెలుగు నించి తమిళంలోకి యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, డి. కామేశ్వరి, ఓల్గా తదితరుల 80కి పైగా నవలలు, చా.సో, శ్రీవల్లీ రాధిక, విహారి, సింహప్రసాద్, కవనశర్మ, వారణాసి నాగలక్ష్మి, పి.యస్ నారాయణ తదితరుల కథలు యాభైకి పైగా అనువాదం చేశారు. తమిళంలోకి అనువదించిన ముఖ్యమైన రచన కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ ‘నిర్జనవారధి’ తమిళం నుంచి తెలుగులోకి పెరుమాళ్ మురుగన్ నవల అనువాదం ‘పూనాచ్చి ఒక మేకపిల్ల కథ’, సుందరరామసామి నవల ‘చింతచెట్టు కథ’, అళగిరిసామి ‘బహుమతి’, ప్రపంచన్ నవల ‘ఆకాశం నా వశం’ మొ.న అరవైకి పైగా కథలు అనువదించారు. ఓల్గా గారి ‘విముక్త’ కు వచ్చిన అదే సంవత్సరం దాని తమిళ అనువాదం 'Meetchi' కి తమిళ అనువాద పురస్కారం లభించింది. ఇంకా అనేక అవార్డులు పొందారు.
పరిచయానంతరం గౌరీ కృపానందన్ తమ తమిళ/ తెలుగు అనువాద ప్రక్రియ అనుభవాల్ని సభకు ఆసక్తికరంగా వివరించారు.
"నా మాతృభాష తమిళం అయినా నాన్నగారి ఉద్యోగ రీత్యా తెలంగాణాలో ఉన్నందు వలన నా విద్యాభ్యాసం అంతా తెలుగు మాధ్యమంలో సాగింది. ఇంట్లో తమిళం, బయట తెలుగు అన్నట్లుగా ఇరవై ఏళ్లదాకా పెరిగాను. అంతవరకు తెలుగు కథలు, నవలలు మాత్రమే చదివేదాన్ని. బాల్యంలో చందమామ చదవడం ఒక ఆటవిడుపులాగా వుండేది.
1976లో వివాహం అయిన తరువాత మద్రాసుకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ తెలుగు మాటలు వినబడక కొంచం ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఇప్పటిలా టి.వి. చానల్స్, ఇంటర్ నెట్ ఉండేది కాదు. చదవకుండా ఉండలేను కాబట్టి, తమిళం కూడబలుక్కుని చదవడం, వ్రాయడం నేర్చుకున్నాను. అంతవరకు తమిళం మాట్లాడడం మాత్రమే వచ్చు. ఇంటి బాధ్యతలు నెరవేర్చడంతో పాటు, సాహిత్య పఠనం అన్నది నాకు బాగా అలవాటు అయ్యింది. అప్పట్లో తమిళంలో tit bits వ్రాసి పత్రికలకు పంపించేదాన్ని.
కానీ ఇలా నేను అనువాదరంగంలో అడుగు పెడతానని కలలో కూడా అనుకోలేదు. తెలుగు నించి తమిళంలోకి అనువాదం అయిన పుస్తకాలు చదివాను. ఆ నవలల్ని నేను ముందే తెలుగులో చదివి ఉన్నందు వలన ఆ అనువాదం చదివినప్పుడు ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపించేది. ఈ పదానికి బదులు వేరే పదం వాడి వుండాల్సింది అని అనిపించేది.
యండమూరి వీరేంద్రనాథ్ గారి “The Bet” అన్న కథను చదివినప్పుడు ఈ కథను ఎందుకు మనం తమిళంలో అనువాదం చేయకూడదు అని అనిపించింది. వారి అనుమతి తీసుకుని అనువాదం చేసాను. ఆ కథ ప్రచురితం అయినప్పుడు ఆత్మవిశ్వాసం కలిగింది, మనం కూడా అనువాదం చెయ్యగలం అని." అంటూ అనువాదం చెయ్యడానికి గల నేపథ్యాన్ని వివరిస్తూ
"ఆ తరువాత ‘అంతర్ముఖం” అన్న నవలను తమిళంలో అనువాదం చేసాను. “The Alliance Company” ప్రచురించింది. యండమూరి గారి నవలలు యాబైకి పైగా తమిళంలో ప్రచురితం అయ్యాయి. ‘తులసీదళం, ‘తులసి’ తమిళ అనువాద నవలలు ఇప్పటికీ పాఠకుల విశేష ఆదరణ పొందుతూ ఉన్నాయి.
యద్దనపూడి సులోచనారాణి గారు నా అభిమాన రచయిత్రి. ‘జీవన తరంగాలు’ నాకు ఎంతగానో నచ్చిన నవల. ఆ నవలను అనువాదం చేయడానికి అనుమతి కోసం ఆమెకు ఉత్తరం వ్రాసినప్పుడు, “ఇది పెద్ద నవల. మొదటిసారిగా మీరు ప్రయత్నం చేస్తున్నపుడు చిన్న నవలగా తీసుకోండి” అని అన్నారు.
“అలా కాదు ఈ నవల నా జీవిత లక్ష్యం” అని పట్టుబట్టి మరీ ‘జీవనతరంగాలు’ అనువాదం చేశాను.
డి. కామేశ్వరి గారి కథలు నాకు ఎంతో ఇష్టం. ఆమె కథల్లో ఒక చురక వుంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎలా వుండాలి? విచ్చలవిడితనం అస్సలు కూడదు. సర్దుబాటు ధోరణి వుండాలి అన్న సందేశం ఉంటుంది. ఆమె అనుమతి తీసుకుని కొన్ని కథలు అనువాదం చేశాను.
ఓల్గాగారి ‘తోడు’ కథ చదివిన తరువాత ఫిదా అయిపోయాను. ఆ భావజాలం నా మనసులో ఎక్కడో ముందే ఉంది. నేను చెప్పలేక పోయిన నా భావాలను ఆమె చెబుతున్నట్లుగా అనిపించింది. ఆమె అనుమతి తీసుకుని తమిళంలో అనువాదం చేశాను.
ఓల్గాగారి ‘విముక్త’తమిళంలో “Meetchi” అన్న పేరుతో అనువాదం చేశాను. ‘విముక్త’ కోసం కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ఓల్గా గారు పొందిన అదే సంవత్సరం దాని తమిళ అనువాదం ‘Meetchi’ కి అనువాద పురస్కారం లభించింది. ఇలా మూలానికీ, దాని అనువాదానికీ ఒకే ఏడాది పురస్కారాలు లభించడం సాహిత్య అకాడమి చరిత్రలోనే ఇది తొలిసారి.
ఈ అనువాద అవార్దు ఫంక్షన్ 2016లో ఇంపాల్, మణిపూరులో జరిగింది. ఆ ఫంక్షన్ కి అమెరికా నుంచి మా అబ్బాయి వివేకానంద్ వచ్చాడు. నేను స్టేజ్ మీద వున్నాను. క్రింద సభలో వున్న మా అబ్బాయిని ఎవరో అడిగారు, “ఆప్ కి మమ్మీ కహాన్ పడాతీ హై? (మీ అమ్మగారు ఎక్కడ లెక్చరర్ గా వున్నారు?) మా అబ్బాయి చెప్పాడు. “మా అమ్మగారు ఎక్కడా ఉద్యోగం చేయడం లేదు. హౌస్ వైఫ్” అని. వాళ్ళు ఆశ్చర్య పోయారు. ఎందుకంటే అక్కడ నలుగురైదుగురు మహిళలు వేరు వేరు భాషల్లో అనువాద అవార్డు తీసుకుంటున్నారు. వాళ్ళంతా ప్రొఫెసర్లుగా విద్యారంగంలో వున్నారు. సాధారణంగా విద్యారంగంలో వున్నవాళ్లకి సాహిత్యం పట్ల అభిరుచి వుంటుంది. అనువాద రంగంలోనూ రాణిస్తారు. నేను అంత పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. సాదాసీదా గృహిణి అయిన నన్ను ఆ స్టేజి మీద నిలబెట్టింది సాహిత్య అభిలాష, పఠనాసక్తి అని అనుకుంటున్నాను.
చాలా మంది స్త్రీలు పెళ్లి అవగానే తమ అభిరుచులను అటక మీద పెట్టేస్తారు. ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూ మన అభిరుచులకు తగిన సమయం కేటాయించడం కష్టం కాదు. కొంత ప్రణాళిక అవసరం. ఈ విషయంలో ఏనాడూ నాకు ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు." అన్నారు.
ద్విభాషా అనువాదం గురించి మరిన్ని వివరాలు ప్రస్తావిస్తూ "అనువాదం విషయానికి వస్తే, నేను తెలుగు తమిళం రెండు భాషలలోనూ అటూ ఇటూ అనువాదం చేస్తున్నాను. భాషలో పట్టు ఉండటం అంటే నుడికారం తెలిసి వుండటం. రెండు భాషల ప్రజల సంస్కృతి తెలిసి ఉండటం ముఖ్యం. ఒక్కో రచయితకి ఒక్కో tone వుంటుంది. దానిని అనువాదకుడు పట్టుకోగలగాలి. తెలుగులో చదివేటప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో తమిళ అనువాదం చదివేటప్పుడు పాఠకులు ఆ అనుభూతిని చెందాలి. between the lines అని వుంటుంది. అనువాదంలోనూ ఆ ఎఫ్ఫెక్టును తేగలిగితే అది సక్సెస్ అవుతుంది. అనువాద ప్రక్రియ ఆషామాషీ వ్యవహారం కాదు. నిజాయితీ, నిబద్దత రెండూ వుండాలి.
కొండపల్లి కోటేశ్వరమ్మగారు వ్రాసిన ‘నిర్జనవారధి’ తమిళ అనువాదం ‘Alatrapalam’ కి మంచి స్పందన వచ్చింది. తమిళనాడులో ఉన్న కమ్యూనిస్టులకు ఉద్యమకారుడిగా కొండపల్లి సీతారామయ్య గారి గురించి తెలుసు. ఆయన భార్య కోటేశ్వరమ్మ గురించి అంతగా తెలియదు.
తెలుగులో వెలువడిన నా మొదటి అనువాద నవల పెరుమాళ్ మురుగన్ గారి ‘పూనాచ్చి ఒక మేకపిల్ల కథ’. కు. అళగిరిసామి గారి, ‘బహుమతి’. సుందర రామసామి గారి క్లాసిక్ నవల ‘ఒక చింతచెట్టు కథ’. అన్వీక్షికి ప్రచురణ సంస్థ ‘తమిళ అనువాద కథలు’. పి.సత్యవతి గారి కథలు నాకు ఎంతో ఇష్టం. ఆమె కథలు కొన్ని తమిళంలో ఒక సంకలనంగా త్వరలో రాబోతుంది. తమిళ రచయిత ప్రపంచన్ గారి, ‘ఆకాశం నా వశం’ సాహిత్య అకాడమి ద్వారా త్వరలో రానున్నది." అంటూ ఎన్నో విషయాలు వివరంగా పంచుకుని ముగించారు.
తరువాత డా.కె.గీతామాధవి వీక్షణం ఫేస్ బుక్ నెలవారీ కవిత్వ పోటీల్లో భాగంగా ఏప్రిల్ నెలలో గెలుపొందిన కవి కెవియస్ గౌరీపతిశాస్త్రి గారిని అభినందించి, అవార్డుని అందజేశారు. ఆ తరువాత గీత గారి అధ్యక్షతలో జరిగిన చర్చ, కవిసమ్మేళనంలో వసీరా, సుభాష్ , ఉదయలక్ష్మి ముప్పలనేని, అపర్ణ గునుపూడి, మీరా సుబ్రహ్మణ్యం, శ్రీధర్ రెడ్డి బిల్లా, దాలిరాజు వైశ్యరాజు, లలితావర్మ, ప్రసాదరావు రామాయణం, కె.వి.యస్ గౌరీపతి శాస్త్రి, డా. అరుణ కోదాటి, రాజేంద్ర ప్రసాద్ గుండ్లపల్లి, కుడికాల వంశీధర్, కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, టి. వి. యెల్. గాయత్రి, అమృతవల్లి అవధానం, అన్నపూర్ణ దుద్దుపూడి, బులుసు సరోజినీదేవి, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.ఆర్.సంధ్యారాణి, జె వి కుమార్ చేపూరి, దేవి గాయత్రి, ఆర్.ప్రవీణ్, అయ్యల సోమయాజుల ప్రసాద్, సింహాచలం లక్ష్మణ స్వామి, కొఠారి వెంకట రత్నం, సత్యవాణి మొండ్రేటి , శ్రీ సుధ కొలచన, పిళ్ళా మూర్తి, ప్రవీణ రాపాక, గడ్డం శాంతకుమారి, జగ్గయ్య, మోటూరి నారాయణరావు మొ.న వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.