ఆ రోజు మంగళవారం. సాయంసమయం. హనుమజ్జయంతికూడా.
చిన్నరాయడుపురంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులకు స్వామి దర్శనమిస్తున్నాడు. పిన్నా పెద్దలతో దేవాలయం కళకళలాడుతోంది. ఆ కోలాహలానికి దూరంగా ఒక స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు, ఒక వ్యక్తి. దయానిధి నామధేయుడు. కళ్ళుమూసుకొని మనసులో ఏదో నెమరు వేసుకొంటున్నాడు. వయసు ఏడు పదులు దాటింది. ఏదో చెప్పుకోలేని బాధ పడుతున్నాడు.
దయానిధి ఎవరు? అతని చెప్పుకోలేని బాధ ఏమిటి. ఆ వివరాలు తెలియాలంటే అతని గతంలోకి వెళ్ళాలి. కాలచక్రాన్ని ఆరు దశాబ్దాలు వెనక్కి త్రిప్పితే, చిన్నరాయడుపురంలో కౌమారంలో హుషారుగా ఉన్న దయానిధి కనిపిస్తాడు. దయానిధి తండ్రి బాలాజీ ఊళ్ళో పెద్ద బజారులో చిన్న బట్టల దుకాణం నడుపుతున్నాడు. నాణ్యమైన బట్టలమ్ముతాడని పేరుండడం మూలాన్న ఊళ్ళో వాళ్ళే కాక ఇరుగు పొరుగు గ్రామాల వాళ్ళు కూడా ఆ ఊరు వచ్చినప్పుడు బాలాజీ దుకాణానికి వెళ్లి బట్టలు కొంటూ ఉంటారు. దసరా, పెద్దపండుగలు వంటి సమయాలలో బట్టల దుకాణానికి గ్రాహకులు లెక్కకు మించి వస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో ముత్యాలమ్మ, దయానిధి అమ్మ కూడా వీలు చేసుకొని దుకాణానికి వచ్చి, భర్తకు చేతనయిన సాయం చేస్తూ ఉంటుంది. దయానిధికి ఒక తమ్ముడు కేశవుడు. చెల్లెలు సావిత్రి ఆఖరిది.
దయానిధికి ఒక ప్రాణమిత్రుడున్నాడు. పేరు గణపతి. అతని వివరాలు కూడా తెలుసుకోవడం అవసరం. గణపతి, బసవయ్య అన్నపూర్ణమ్మల ఏకైక సంతానం. బసవయ్య పేరున్న వ్యవసాయదారుడు. ఊరుకు దగ్గరలోనే నలభై ఎకరాల సాగుభూమి ఉంది. అందులో పది ఎకరాలలో మామిడి తోట పెంచుతున్నాడు. అవికాక జామి, నిమ్మ చెట్లు కూడా కొద్దిగా ఉన్నాయి. కూరగాయలు కూడా కొంత మేర పండిస్తూ ఉంటాడు. కాని అవి అమ్మకానికి కాదు. స్వంతానికి కాగా అధిక శాతం ఊళ్లోని అనాధ శరణాలయానికి రోజూ చేరుకొంటాయి. బసవయ్యకు వ్యవసాయం మూలంగా ఆదాయం గణనీయంగానే ఉంటుంది. తోటలో కొన్ని పాడి పశువులు ఉన్నాయి. అవి స్వంతానికి. అన్నపూర్ణమ్మ అప్పుడప్పుడు ఇరుగు పొరుగు వారికి పెరుగు పంపుతూ ఉంటుంది. దానధర్మాలకు ఆవిడ బాగా పేరు పడ్డది. నిగర్వి.
బసవయ్య తరచూ సాయంసమయాలలో బాలాజీ దుకాణానికి వెళుతూ ఉంటాడు. ఇద్దరూ లోకాభిరామాయణం చర్చించుకొంటూ ఉంటారు. అప్పుడప్పుడు మాజీ ఎం.ఎల్.ఏ. సత్యారావు వాళ్ళను అక్కడ కలుస్తూ ఉంటాడు. రాజకీయాలలో ఇమడలేక సత్యారావు రాజకీయ సన్యాసం తీసుకొన్నాడు. ఊళ్ళో అనాధ శరణాలయం స్థాపించడంలో ఆ ముగ్గురూ ప్రధాన పాత్ర పోషించేరు. గతంలో సత్యారావు చొరవతోనే ఆ ఊళ్ళో పిల్లలకు కాలేజీ చదువు ఇంటర్మీడియెట్ వరకు చదువుకోడానికి అవకాశం కలిగింది. ఆ రోజుల్లో స్కూలు ఫైనలు తరువాత రెండేళ్ల ఇంటర్మీడియట్ ప్రోగ్రాం ఉండేది. ఆ తరువాత డిగ్రీ రెండేళ్లు.
బసవయ్య, బాలాజీ కుటుంబాలు అరమరికలు లేక సాన్నిహిత్యంతో కలసి మెలసి ఉంటాయి. సావిత్రిని గణపతి, 'చెల్లెమ్మా' అని పిలుస్తాడు. సావిత్రి కూడా గణపతిని, 'అన్నయ్యా' అని సంభోదిస్తుంది. కార్తీక మాసాలలో రెండు కుటుంబాలు కలివిడిగా బసవయ్య మామిడితోటలో వనభోజనాలు చేస్తూ ఉంటారు. దయానిధి ప్రతి రాత్రి గణపతి ఇంట్లోనే చదువు, పడక. ఆ ఇద్దరూ తెలివితేటలలో బాగా చురుకైన వారు.
ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవుల్లో రెండు కుటుంబాలు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఒక సంవత్సరం బాలాజీ, బసవయ్య కుటుంబాలు తీర్థయాత్రకు తిరుపతి వెళ్ళేరు. తిరుమలకు బస్సులో వెళ్ళడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దయానిధి, గణపతి కాలి నడకన ఏడుకొండలు ఎక్కి తిరుమల బస్సు స్టాండు వద్ద కలుస్తామన్నారు. మిగిలిన ఆరుగురు బస్సులో తిరుమల చేరేరు. అనుకొన్నట్టే అందరు బస్సు స్టాండు దగ్గర కలిసేరు. ఏడు గంటలు క్యూలో తాబేలు నడక నడిచి, ఏడుకొండల వాడి దర్శనం చేసుకొన్నారు. వాళ్ళ రెండు కుటుంబాలు ఎప్పుడూ కలసి మెలసి ఉండాలని, వారి చివరి క్షణాల వరకు వారి స్నేహానికి ఏ అంతరాయము కలగకూడదని, దయానిధి, గణపతి వేంకటేశ్వరుని వేడుకొన్నారు. తిరుపతి లోని గోవిందరాజస్వామి, తిరుచానూరులోని పద్మావతి అమ్మవార్ల దర్శనం చేసుకొని రెండు కుటుంబాలు తిరుగు ముఖం పట్టేయి.
ఇద్దరు స్నేహితులూ ఇంటర్మీడియట్ సైన్సెస్ లో జాయినయ్యేరు. సర్వదా సఖ్యతతో కలసి మెలసి ఉండడం, క్లాసులో ఎప్పుడూ ఒకరి ప్రక్కన ఒకరు కూర్చోవడం గమనించిన వాళ్ళ సహాధ్యాయులు, ఉపాధ్యాయులు వాళ్ళిద్దరికి రామలక్ష్మణులు అని బిరుదు ఇచ్చేరు.
ఇద్దరూ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉన్నారు. కాలేజీ వార్షికోత్సవాలు వచ్చేయి. ఆటలు, పాటలు, డిబేట్ల పోటీలు జరిగేయి. ఇద్దరు స్నేహితులూ చురుగ్గా పాల్గొన్నారు. చెరో ప్రయిజు గెలుచుకున్నారు. ముగింపు కార్యక్రమానికి కలక్టరు గారు ముఖ్య అతిథి. అతని చేతుల మీదుగా విజేతలు ప్రయిజులు అందుకొన్నారు. బెస్ట్ స్టూడెంట్ ప్రకటన కోసం సభ ఎదురు చూస్తోంది. ప్రిన్సిపాల్ గారు చిరు నవ్వుతో ఈ సంవత్సరం కూడా మన రామ లక్ష్మణులు; దయానిధి గణపతి జాయింటుగా బెస్ట్ స్టూడెంట్ ఎవార్డు కి ఎంపికయ్యారని ప్రకటించడంతో సభ చప్పట్ల వర్షంతో హర్షాన్ని ప్రకటించింది.
ఇంటర్మీడియట్ పరీక్షలయ్యేయి. ఫలితాలు వచ్చేయి. ఇద్దరు మిత్రులూ నూటికి తొంభయి కన్నా ఎక్కువ శాతంతో పాస్ అయ్యేరు. చిన్నరాయుడుపురంలో డిగ్రీ చదువు లేదు. అక్కడకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నవరంగపట్నంలో డిగ్రీ కాలేజీ ఉంది. ఇద్దరూ దగ్గరలోని నవరంగపట్నంలో డిగ్రీ కాలేజీలో B.Sc. లో ప్రవేశించేరు. కాలేజీకి రోజూ వెళ్లి రాడానికి గణపతికి తండ్రి బసవయ్య ఒక మోటారు సైకిలు కొని ఇచ్చేడు. గణపతితో బాటు దయానిధికి కూడా సదుపాయమయింది.
డిగ్రీ కాలేజీలో కూడా దయానిధి గణపతి మంచి పేరు తెచ్చుకొన్నారు. చెప్పుకోదగ్గ మార్కులతో ఇద్దరూ డిగ్రీ పాసయ్యేరు. తరువాత ఆంధ్రా యూనివర్సిటీలో ఇద్దరూ M.Sc. Mathematics లో జాయినయ్యేరు. కొన్ని మాసాలు గడిచేయి.
ఒకరోజు ఇద్దరు మిత్రులు మోటారు సైకిలు మీద గృహోన్ముఖులు అవుతున్న సమయంలో,
"దయా, ఇవాళ లైబ్రరీలో రాఘవరావు చెప్పింది విన్నావు కదా. మన సీనియర్స్ కొందరు I.A.S. కు ప్రిపేరవుతున్నారట."
"అవును గణపతి. వాళ్ళు ఏదో పోస్టల్ కోచింగు కూడా తీసుకొంటున్నారన్నాడు."
"దయా, మనం కూడా I.A.S. కి ప్రిపేర్ అవుదామా."
"పోస్టల్ కోచింగులు ఎంత యూజ్ఫుల్ గా ఉంటాయో మనకి తెలీదు." దయానిధి సంకోచం.
"పోస్టల్ కోచింగు కాకుండా, పి జి అవగానే ఢిల్లీ వెళ్లి రెగ్యులర్ కోచింగు క్లాసుల్లో జాయిన్ అవుదాం. అక్కడ పేరున్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి." గణపతి ఆలోచన.
"అవును పేపరులో ఎడ్వార్టైజుమెంట్సు చూస్తున్నాం."
"దయా, I.A.S. తో బాటు బ్యాంకు ఆఫీసర్ల పరీక్షలు కూడా రాస్తే మంచిదనుకొంటాను."
"You are right. I.A.S. తరువాత బ్యాంకు ఆఫీసర్లకే విలువ ఎక్కువ. రెండు పరీక్షలూ రాద్దాం.” మిత్రుని ఆలోచనతో దయానిధి ఏకీభవించేడు. మిత్రులిద్దరూ తమ భావి ప్రణాళికలు వేసుకొంటూ ఉంటే మోటారు సైకిలు చిన్నరాయడుపురం చేరుకొంది.
కాలచక్రం సుమారు రెండు సంవత్సరాలు ముందుకు తిరిగింది. దయానిధి పి.జి. రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్న తుది రోజుల్లో, తండ్రి బాలాజీ పక్షవాతానికి గురి అయ్యేడు. కుడి చెయ్యి, కుడి కాలు కొద్దిగా స్వాధీనం తప్పేయి. బట్టల దుకాణం నడిపించలేని పరిస్థితి ఏర్పడింది. ముత్యాలమ్మకు ఇంటి బాధ్యతతో బాటు భర్త సేవ కూడా మీద పడింది. బజారులోని బట్టల దుకాణం యాజమాన్యానికి కొరత ఏర్పడింది. అదే జీవనాధారం కావడం మూలాన్న సమస్య జఠిలమయింది. బసవయ్య చేతనయిన సాయం చేస్తున్నాడు. కాని బట్టల దుకాణం సక్రమంగా నడపడానికి; ఒక మనిషి దానికి పూర్తిగా అంకితమైపోవాలి. దయానిధి పరిస్థితులను అన్ని కోణాలనుండి ఆలోచించేడు. ఒకరోజు తల్లితో తన ఆలోచనలను పంచుకున్నాడు.
వంటింట్లో కూరలు తరుగుతున్న తల్లి దరి చేరి ఆసీనుడయ్యేడు.
"నాయనా దయా, ఏదయినా ఇబ్బంది వచ్చిందా." అని తనయుని మనసు తెలియగోరింది ముత్యాలమ్మ.
"సమస్య- అంటూ ఏదీ లేదమ్మా." అని తల్లికి ధైర్యం చెప్పేడు తనయుడు.
"మరి ఏదయినా చెప్పాలా నాయనా."
"నీతో ఒక విషయం మాట్లాడదామనుకొంటున్నాను."
"ఏమిటి నాయనా అది."
"మన దుకాణం విషయమమ్మా."
"ఏమిటో అది చెప్పు నాయనా."
"ఇదివరలో నాన్నగారు రోజల్లా దుకాణంలో ఉండి బాగా నడిపిస్తూండేవారు."
"అవును బాబూ. ఇప్పుడు ఆయనకు వీలు పడడం లేదు."
"మనం ఆ బట్టల దుకాణం మీదే ఆధారపడి ఉన్నాం."
"అవును నాయనా. ఆ బట్టల దుకాణమే మనకు రెండు పూట్లా తిండి పెడుతోంది."
"అమ్మా మనకి చాలా పెద్ద ఖర్చులు ముందున్నాయి గదా. ఆ విషయమే నీతో ఆలోచిద్దామని వచ్చేను."
"ఏమిటో అది చెప్పు బాబూ."
"కేశవుడుకు కాలేజీ చదువు చెప్పించాలి."
"అవును నాయనా. నీలాగే వాడు పెద్ద చదువు చదువుకొంటే వాడి బ్రతుకు వాడు బ్రతకగలడు." తనయుని అభిప్రాయంతో ముత్యాలమ్మ ఏకీభవించింది.
"అది కాకుండా చెల్లెలి పెళ్లి కూడా చెయ్యాలి కదమ్మా."
"దాన్ని ఓ ఇంటిదాన్ని చేస్తే మనకి ఓ బాధ్యత తీరుతుంది."
"అమ్మా, ఈ ఖర్చులన్నీ పెట్టాలంటే, మన బట్టల దుకాణాన్ని నాన్నగారు నడిపించినట్లు నడిపించడంతో బాటు దాన్ని అభివృద్ధి చెయ్యాలి."
"అవును నాయనా, చిన్నవాడివయినా బాగా ఆలోచించేవు."
"అందుచేత నేనొక నిర్ణయానికి వచ్చేనమ్మా."
"ఏమిటి నాయనా అది."
"నాన్నగారిలాగే నేను రోజూ పొద్దున్న దుకాణం తెరిచి, రోజల్లా అక్కడ ఉండి దుకాణం పని చూసుకొంటాను." అని భావి కలలకు స్వస్తి చెప్పి, కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చేడు.
"నాయనా, నువ్వు ఏదో కలక్టరు పరీక్ష రాద్దామనుకొన్నావు. రోజల్లా దుకాణం మీద ఉంటే, ఆ పరీక్షకు చదువు ఎలా సాగుతుంది."
"అమ్మా, నీకు తెలుసుగా. ప్రస్తుతం మనకు దుకాణం తప్ప , ఆదాయం వచ్చే మరో దారి లేదు."
"అవును నాయనా.(ఒక్క క్షణం ఏదో ఆలోచించి) పోనీ ఓ ప్రక్క దుకాణం పని చూసుకొంటూ, అక్కడే పరీక్షకు చదువుకోవచ్చు గదా."
"అమ్మా, అది అన్ని పరీక్షలు వంటిది కాదమ్మా, రాత్రి పగలు అదే పనిగా చదివిన వాళ్ళే ఫెయిలయిపోతున్నారు. పరీక్ష సంగతి మరచిపో అమ్మా. మన పరిస్థితులలో నేను రోజల్లా దుకాణం పని చూసుకోవడం తప్ప మరో మార్గం లేదమ్మా. "
“ఏమిటో నాయనా, చిన్న వయసులో ఇంటి బాధ్యతలు నీ మీద పడ్డాయి. మీ నాన్నగారు చెప్పినట్లు, ఏదయినా మన మంచికే అనుకొందాం. ఓ మారు మీ నాన్నగారు, బసవయ్యగారితోను ఈ విషయం మాట్లాడి చూడు." అని కుమారుని నిర్ణయానికి ముత్యాలమ్మ మనసును గట్టి చేసుకొని 'సరే' అంది.
దయానిధి తన నిర్ణయాన్ని తండ్రితో సంప్రదించేడు. బాలాజీ అన్ని విధాలా అలోచించి తనయునితో ఏకీభవించేడు. బసవయ్య ఆ పరిస్థితులలో అదే సరైన నిర్ణయమన్నాడు.
దయానిధి కొత్త దైనందిన జీవనానికి అలవాటు పడ్డాడు. ఉదయాన్నే లేస్తాడు. కాలకృత్యాలు తీర్చుకొంటాడు. తరువాత తండ్రికి కావలిసిన సేవ చేసి; అమ్మ చేసిన టిఫిన్ తినిపిస్తాడు. తనూ ఆరగిస్తాడు. సంచిలో మంచి నీళ్లు, మధ్యాహ్న భోజనం అమర్చుకొని పది గంటల ప్రాంతంలో దుకాణం తెరుస్తాడు. తండ్రి పద్దతిలోనే దుకాణంలోని దేముళ్ళ పటాలికి గల్లాపెట్టికి అగరుబత్తి ధూపం వేసి కర్ర కుర్చీలో ఆసీనుడవుతాడు. అనేకమంది కొనుగోలుదారులు తరచూ దయానిధిని 'మీ నాన్న ఎలా ఉన్నారు బాబూ' అని బాలాజీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటుంటారు. త్వరలోనే బాగుపడతారని ధైర్యం చెప్తుంటారు. వినయ విధేయతలతో అతి త్వరలో దయానిధి కొనుగోరుదార్లకు దగ్గరయ్యేడు.
బసవయ్య ఇదివరలో లాగే సాయంసమయాలలో అప్పుడప్పుడు దుకాణానికి వచ్చి దయానిధి దగ్గర ఇంటి విషయాలు తెలుసుకొని కావలిసిన సలహాలు ఇస్తుంటాడు. వీలు చేసుకొని బాలాజీని కలుస్తూ ఉంటాడు. ధైర్యం చెపుతూ ఉంటాడు. మాజీ ఎం.ఎల్.ఏ. సత్యారావు, ఇదివరకంత తరచూ కాకపోయినా అప్పుడప్పుడు దుకాణానికి వచ్చి బాలాజీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని 'నీకు ఏ అవసరమైనా సంకోచించకు. నేను చేయ గలిగినది తప్పక చేస్తాను.' అని దయానిధికి హామీ ఇస్తుంటాడు. ‘పెద్దలు. మీ ఆశీర్వచనాలే నాకు ధైర్యాన్నిచ్చి ఈ దుకాణాన్ని నడిపిస్తున్నాయి' అని వినయంగా సమాధానమిచ్చేవాడు దయానిధి.
రామలక్ష్మణులిద్దరు పి.జి. మంచి మార్కులతో ఫస్టు క్లాసులో పాస్ అయ్యేరు. ఇదివరలో ఇద్దరూ ఢిల్లీలో సివిల్సుకి కోచింగ్ తీసుకోడానికి ప్రణాళికలు వేసేరు. కాని ప్రస్తుత పరిస్థితులలో అది అమలుపరచడం సాధ్యం కాదని తెలుసుకొన్నారు. దయానిధి బట్టల దుకాణానికి అంకితమయిపోయేడు. అటు గణపతికి కూడా అనుకోని సమస్య ఎదురయింది. తల్లి అన్నపూర్ణమ్మ ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతున్న మూలాన్న గణపతికి కూడా తండ్రికి అండగా ఉండి, ఊరు విడవలేని పరిస్థితి ఏర్పడింది.
I.A.S. ఆఫీసరు గాని బ్యాంకు ఆఫీసరు గాని కావాలని కలలు గన్న రామలక్ష్మణులిద్దరూ, పరిస్థితులకు తలవంచి ఆలోచనలో పడ్డారు.
"గణపతీ, దేముడు మనల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు. మన పరిస్థితులు అనుకోకుండా తలక్రిందులయ్యేయి. మన I.A.S. ప్రయత్నాలు జరిగేటట్లు లేదు."
"దయా, నేనూ అదే అనుకొంటున్నాను. పోస్టల్ కోచింగు తెప్పించుకొన్నా మనకి సీరియస్ గా చదవడానికి టైము లేదు. So let us forget about it."
"గణపతీ, నువ్వన్నది నిజమే. మనకు వీలు కాదు. But, మన పిల్లలిని తప్పక I.A.S. చేయిద్దాం."
"I agree. మన పిల్లలిని డెఫినిట్ గా I.A.S. చేయిద్దాం. బాగా plan చేద్దాం."
ఇద్దరు మిత్రులూ నిరాశలో ఒక ఆశను చూసేరు.
చిన్నరాయడుపురం పెద్ద బజారులో విశాలమైన బట్టల దుకాణం కొత్తగా వెలిసింది. రెడీమేడు బట్టలు కూడా అక్కడ లభ్యము కావడం మూలాన్న దాని ప్రభావం దయానిధి బట్టల దుకాణం మీద పడనారంభమయింది. అమ్మకాలు రోజురోజుకు దిగజారడం మొదలయింది. దానితో ఆందోళన చెందిన ముత్యాలమ్మ, గుడిలో పూజారి గారిని సంప్రతించింది. ఆయన దయానిధి జాతకం చూసి అతనికి ప్రస్తుతము ఏలినాటి శని నడుస్తున్నదని; కొద్దీ రోజులలో శని అతని జన్మ రాశిలో ప్రవేశించబోతున్న కారణాన మిక్కిలి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చేరు. సుమారు ఇరవయి మైళ్ళు దూరాన్న ఉన్న శని దేవాలయంలో రాబోయే శని త్రయోదశినాడు శనికి ప్రత్యేక పూజలు జరిపించమని సలహా ఇచ్చేరు. ముత్యాలమ్మకు కావలసిన సహాయం అందజెయ్యమని ఆ గుడిలోని పూజారి గారికి ప్రార్థిస్తూ ఉత్తరం ఇచ్చేరు.
అటు గణపతికి కూడా కాలం కలసి రావడం లేదు. అన్నపూర్ణమ్మ ఆరోగ్యం చాలా ఆందోళన కలిగించడంతో పట్నం లోని పెద్ద డాక్టరు గారిని సంప్రతించేరు. ఆయన పరీక్షలు నిర్వహించి అన్నపూర్ణమ్మ కేన్సరుతో బాధ పడుతున్నదని ఆ వ్యాధి ఆమె శరీరంలో బాగా వ్యాపించి ముదిరిపోయిందని చెప్పి తశ్శాంతికి కొన్ని మందులు రాసి ఇచ్చేరు. ఆ పిమ్మట కొన్ని రోజులకే అన్నపూర్ణమ్మ అమరపురి చేరడంతో మాతృ వియోగంతో గణపతి; భార్యా వియోగంతో బసవయ్య; ఒక్కమారు దిక్కు తోచనివారయిపోయేరు. దయానిధి, ముత్యాలమ్మ చేయగలిగిన సహాయం అందజేస్తున్నా కొరత తీరడం అసాధ్యమయింది.
ఇటు దయానిధికి పూజారిగారి భవిష్య వాణి నిజమేనా అని తలపిస్తూ ఒక అర్థరాత్రి బజారులోని వారి బట్టల దుకాణం అగ్నిప్రమాదంలో చిక్కుకొంది. పట్నంనుండి అగ్నిమాపక దళాలు చేరే లోపల దయానిధి బట్టల దుకాణంతో బాటు నాలుగయిదు దుకాణాలు అగ్నికి ఆహుతి అయిపోయేయి. ఉన్న ఒక్క జీవనాధారం మట్టిలో కలసిపోవడంతో బాలాజీ కుటుంబం రోడ్డున పడ్డారు. ఇంటి బాధ్యతలు తన భుజాన్న వేసుకొన్న దయానిధి కఠినమయిన సమస్యలలో చిక్కుకున్నాడు. తండ్రి అనారోగ్య కారణంగా మందుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. తమ్ముడు కేశవుడు డిగ్రీ రెండవ సంవత్సరంలో కాలు పెట్టేడు. చెల్లెలు సావిత్రి స్కూలు చదువు ముగిసి కాలేజీలో అడుగు పెట్టవలసి ఉంది. ఇవి కాక రోజూ ఇల్లు నడవాలి. దిక్కు తోచక మాజీ ఎం.ఎల్.ఏ. సత్యారావుతో కుటుంబ పరిస్థితి చర్చించి సహాయం కోరేడు. ఆయన పలుకుబడితో దయానిధి నవరంగ పట్నంలోని ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరరుగా చేరేడు. గణపతి తన మోటారు సైకిలు ఇవ్వడంతో దయానిధికి రోజూ పట్నానికి రాకపోకలు సుళువయ్యేయి. అతి త్వరలో అంకిత భావంతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న అధ్యాపకుడిగా దయానిధి పేరు తెచ్చుకొన్నాడు. దాని ప్రభావాన్న కాలేజీలో ప్రవేశాలు పెరిగాయి. అది గుర్తించిన యాజమాన్యం దయానిధి జీతం కొద్దిగా పెంచేరు. దయానిధి తన గ్రామంలో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించేడు. ఈ పరిణామాలతో కేశవుడి, సావిత్రిల కాలేజీ చదువులు నిరాటంకంగా సాగేయి. దయానిధి ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు.