Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

నిస్వార్ధ రాజకీయ నాయకుడు డా. ఏ.బి.నాగేశ్వర రావు

ABNageswaraRao

ఇప్పటి రాజకీయ నాయకులకు Dr ఏ బి నాగేశ్వర రావు గారికి చాలా తేడా ఉంది. మూడు సార్లు రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ గా, ఒక టర్మ్ (5ఏళ్ళు) సంజీవ రెడ్డి గారి మంత్రివర్గంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ సొంత ఇల్లు కూడా లేకుండా చివరి వరకు తన వైద్య వృత్తితో కుటుంబాన్ని పోషించుకున్న నిస్వార్ధ రాజకీయ వేత్త Dr ఏ.బి నాగేశ్వర రావు గారు. అంత నిస్వార్థ ప్రజా సేవకుడిని ప్రజలు ఏనాడో మరచి పోయారు. నిజాయితీగా నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడం అనేది నేటి రాజకీయ నాయకులకు అసలు తెలియదు. పైగా రుచించదు కూడా. నేటి రాజకీయాలు, రాజకీయ వేత్తలు అంటే ధనార్జన పరులు మాత్రమే. మహాత్మా గాంధీ, టంగుటూరి ప్రకాశం వంటి త్యాగధనుల అడుగు జాడలలో నడచిన నిస్వార్థ ప్రజా సేవకుడు ఏ బి నాగేశ్వర రావు గారు.

నాగేశ్వర రావు గారు నవంబర్ 1,1901 న సుబ్బారాయుడు, నాంచారమ్మ దంపతులకు రెండవ కొడుకుగా కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపాన గల కొచ్చర్ల పేట అనే గ్రామంలో జన్మించారు. ఆయన తన ఇంటర్ మీడియేట్ చదువును మచిలీపట్నం లో పూర్తి చేసి విశాఖపట్నంలో వైద్య విద్యను పూర్తి చేసి లైసెన్సుడ్, మెడికల్ ప్రాక్టీషనర్ (LIM) గా వృత్తి మొదలు పెట్టారు. స్వంత ఊరు అవనిగడ్డ అయినప్పటికీ వారి శ్రీమతి కామేశ్వరమ్మ గారితో రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. ఆయనకు 5 కొడుకులు 4 గురు కూతుళ్లు ఉన్నారు. కానీ ఆయన రాజకీయాలు, దేశ సేవ స్వతంత్ర సమరంలో పడి పిల్లల చదువులు పెద్దగా పట్టించుకోలేదు. అందువల్ల పెద్ద కొడుకు తప్ప మిగతా వారు ఎవరూ బాగా సెటిల్ కాలేదు. ఆయన కూడా తన పదవిని తన సంతానం బాగు కోసం వాడుకోలేదు.

ఆ రోజుల్లో విద్యార్థి దశలోనే నాగేశ్వర రావు గారు గాంధీ గారి ఉపన్యాసాలకు ప్రభావితుడై సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ వాటిని తగలబెట్టారు. ఆ చర్యల ఫలితంగా ఆయనతో పాటు ఆ ఉద్యమంలో పాల్గొన్న 141 మంది విద్యార్థులను కాలేజి నుండి బ్రిటిష్ ప్రభుత్వము డిస్మిస్ చేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెపితే వారి మీద చర్యలు రద్దు చేస్తామని ఒక ప్రతిపాదన చేసింది కానీ నాగేశ్వర రావు గారు, దీక్షితులు గారు మరియు 39 మంది విద్యార్థులు క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందుకు అక్టోబర్ 23, 1921 న వారిని కాలేజీ నుండి శాశ్వతంగా బహిష్కరించారు. కాలేజీ నుండి బహిష్కారింపబడ్డ వీరు ఖద్దరు అమ్ముతూ దేశభక్తి గీతాలు పాడుతూ దేశభక్తి నాటకాలు ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్య వంతులుగా చేసేవారు. ఈ క్రమంలో నాగేశ్వర రావు గారికి జలియన్ వాలా మారణకాండను నిరసిస్తూ ఉద్యమము చేసినందుకు, రౌలత్ యాక్ట్ లోని 144 వ సెక్షన్ ధిక్కరించినందుకు, పంజాబ్ దురంతాలు అనే నాటకాన్ని ప్రదర్శించినందుకు, బ్రిటిష్ ప్రభుత్వం ఈయనకు జైలు శిక్ష విధించి రాజమండ్రి జైలుకు పంపారు. 1926 నాటికి నాగేశ్వర రావు గారు విశాఖపట్టణములో వైద్య విద్యను పూర్తి చేసుకొని మచిలీపట్నం వద్దగల నరసాయపాలెం లో వైద్య వృత్తిని మొదలుపెట్టారు.

తన సహచరుడు స్నేహితుడు అయినా డాక్టర్ దీక్షితులు గారి అభ్యర్ధన మేరకు నాగేశ్వర రావు గారు నరసాయపాలెం నుండి తన ప్రాక్టీస్ ను మే 23, 1929 న రాజమండ్రికి మార్చారు. 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఆనాటి స్వతంత్ర సమరంలో ప్రముఖుడైన క్రొవ్విడి లింగరాజు గారిని అరెస్టు చేస్తే నాగేశ్వర రావు గారు రాజమండ్రి కాంగ్రెస్ కార్యకలాపాల బాధ్యత తీసుకున్నారు. మద్రాసు లోని చైనా బజార్ లో పికెటింగ్ తన సహచరులతో జరిపినందుకు ఆయనకు 12 నెలలు జైలు శిక్ష విధించారు. 1937 లో రాజమండ్రి మునిసిపాలిటీల్లో కౌన్సిలర్ గా ఎన్నిక అయినారు. 1942 లో జైలు నుండి విడుదల అయ్యాక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రాజమండ్రి మున్సిపల్ ఆఫీసు వద్ద 144 సెక్షన్ కు వ్యతిరేకముగా పాల్గొనడం వల్ల మళ్ళీ అరెస్ట్ చేసి బళ్లారిలో అల్లీపూర్ క్యాంప్ కు పంపారు. ఆ జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్న తోటి స్వాతంత్ర సమర యోధులకు వైద్య సహాయం అందించేవారు. ఆ తరువాత స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత రెండు సార్లు (1947,1852) రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక అయినారు.1953 రాజమండ్రిలో గోదావరి వరదలు సంభవించినప్పుడు వరద బాధితులకు విశేషముగా తన స్వంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా విస్తృతంగా వైద్య సహాయం అందించారు.

నాగేశ్వరరావు గారు స్వాతంత్రం వచ్చినాక మారిన రాజకీయ పరిస్థితుల వల్ల రాజకీయనాయకుల స్వార్ధ చింతన వల్ల పార్టీలో ఇమడలేక ప్రకాశం పంతులుగారు, తెన్నేటి విశ్వనాథం గార్లతో ప్రజా పార్టీ  స్థాపించి 1955 లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ప్రజా పార్టీ అభ్యర్థిగా ఎం ఎల్ ఏ గా ఎన్నికై స్థానిక సంస్థల మంత్రి పదవిని చేపట్టి రాజమండ్రి నుంచి తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. భారత ప్రభుత్వం అయన స్వాతంత్రోద్యమంలో చేసిన సేవలకు గుర్తింపుగా తామ్ర పత్రం బహుకరించారు. ఈ సందర్భంగా ఆయనను రాజమండ్రి నగర వాసులు నవంబర్ 1 న ఆయనను ఘనంగా సన్మానించారు కానీ దురదృష్ట వశాత్తు ఈ సన్మానము జరిగిన 5 రోజుల తర్వాత పరమపదించారు. చివరి వరకు వైద్య వృత్తిలో ఉండి ఆసుపత్రిలో ఖద్దరు గావంచా, ఖద్దరు బనీను తో వైద్యం చేసేవారు. కాంపౌండర్  కూడా పూర్తిగా ఖద్దరు వస్త్రధారణలో ఉండేవాడు.

ఆయన నిజాయితీ గురించి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. రాజమండ్రిలో ప్రకాశం పంతులు గారి పేరున ఒక జూనియర్ కాలేజీ పెట్టారు ఆ కాలేజీలో ఉద్యోగానికి ఆయన దగ్గర బంధువుల కుర్రవాడు అప్లై చేసి సిఫార్సు కోసం అయన దగ్గరకు వస్తే ఆయన మెరిట్ బట్టి ఉద్యోగాలు ఇవ్వాలిగాని నా సిఫార్సు తో ఇస్తారా? అని ఆ కుర్రవాడికి కాలేజీ చూపించడానికి అని ఆయన ఇంటికి దగ్గరలోనే ఉన్న అ కాలేజీకి వచ్చి కమిటీ వారితో వచ్చిన వాళ్లలో ఈ అబ్బాయి కన్నా ఎక్కువ మార్కులు రాకపోతే మెరిట్ ప్రకారం ఈ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతే ఆ కమిటీ వారు స్వయానా డాక్టర్ గారు వచ్చారు ఆయన మాట మనం గౌరవించాలి అని అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు. అంతటి నిజాయితీ పరుడు ఆయన, కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే తరువాతి రాజకీయ నాయకులు, కొందరు పుర ప్రముఖులు (నేటి రాజకీయాలు వంట బట్టినవాళ్లు) అయన వద్దంటున్నా ఊళ్ళో ఆయనకు స్వంత ఇల్లు లేదు మనము ఆయనకు ఇల్లు కట్టించాలి అని జనాల దగ్గర చందాలు వసూలు చేసి ఆర్యాపురం లో ఉంటున్న ఆయనకు అప్పట్లో ఊరి చివర ఇల్లు కట్టించి ఇచ్చారు. అప్పట్లో రాజమండ్రి పౌరులు చందాలు వసూలు చేసిన వాళ్ళు బాగుపడ్డారు అని అనుకునేవారు అంటే నిజాయితీపరుడి పేరు చెప్పి అవినీతి పరులు సొమ్మును వెనకేసుకున్నారు. చివరకు ఆయన జ్ఞాపకార్ధము ఆర్యాపురం లోని మొదటి వీధికి ఆయన పేరు పెట్టారు. ఆర్యాపురం పార్క్ లోను, సీతం పేటలోను ఆయన విగ్రహాలు ప్రతిష్టించారు. ఆ పార్క్ కు ఆయన పేరు కూడా పెట్టారు.

********

Posted in March 2024, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!