Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

శ్రీనాథుడు -జీవితం -కావ్య విశేషాలు

కాకతీయ సామ్రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటున్నప్పుడు సామ్రాజ్యాధిపతి చేత మన్ననలు పొందిన ఒక సరస సామ్రాజ్య చక్రవర్తి తీరాంధ్రం లో ఉండేవాడు. అతని పేరు కమలనాభామాత్యుడు. ఇతడు తూర్పు తీరాన ఉన్న కాల్పట్టణం అనే ఒక కర పట్టణానికి అధికారి. ఇది కాళీ పట్టణం లేక కరపటం అనే ఊరు, లేక నేటి ఒంగోలు వద్దనున్న కాల్-స్థాన కోట ఏదో ఒకటి కావచ్చు అని ఆరుద్ర మాట.

శ్రీనాథుడు, కమనాభామాత్యునకు, భీమాంబిక కు జన్మించిన కుమారరత్నం. చిన్న శ్రీనాథుడు అధర్వు వేదా శాఖాధీతినిష్ణాతు డయ్యాడు. సంస్కృత పంచకావ్యాలు చదివాడు. తిక్కనాదుల రచనలను పరిశీలించాడు. చిన్ననాటనే “చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించితి మరుత్తరాట్చరిత్ర” అని చెప్పుకొన్నాడు. తర్వాత తన రచనలను గూర్చి చెప్తూ.

మరుత్తరాట్చరిత్ర రాస్తున్న కాలంలోనే కొండవీటి రాజ్యాన్ని అనవేమారెడ్డి పాలిస్తుండేవాడు. ఆయన వసంతోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ, చూడవచ్చిన వారిపై చందనం, కస్తూరి, పన్నీరు, కర్పూర ఖండాలు కూడా వెదజల్లేవాడు. అందుకే ఆయనకు కర్పూర వసంతరాయలు అని బిరుదు ఉండేది.

ఈ సుగంధ ద్రవ్యాలను రాజుగారికి తెచ్చి ఇచ్చేవారు నెల్లూరు (సింహపురి) లోని పావాణి శెట్టి కుటుంబం. రెడ్డిరాజ్య స్థాపకుడు- ప్రోలయ వేమారెడ్డి నౌకా వ్యాపారభివృద్ధికి తన తమ్ముడు మల్లారెడ్డి ని నియోగించాడు.

అనవేమారెడ్డికి సుగంధ ద్రవ్యాలు సమకూర్చే వాడు అవచి తిప్పయ్య శెట్టి. శ్రీనాథుడు తిప్పయ్య శెట్టి కి స్నేహితుడై అతనితో గూడా ఓడరేవు పట్టణమైన మోటుపల్లికి అలాగే కొండవీటికి వసంతోత్సవాలకు వెళ్ళేవాడు.

అనవేమారెడ్డి వద్ద మామిడి పెద్దన మహా ప్రధానిగా ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమారులు. వారు వేమనామాత్యుడు, ప్రెగడ్డన్న, సింగన్న. శ్రీనాథుడు కొండవీడు వెళ్ళినపుడు, ఈ ముగ్గురితో స్నేహం ఏర్పడింది. శ్రీనాథుని మరుత్తరాట్చరిత్ర బహుశా ఈ వేమనామాత్యునికే అంకితమిచ్చి ఉండవచ్చని ఆరుద్ర అభిప్రాయం. (స.ఆం.సా. పేజీ 684). నైషధం లోని ఒక పద్యం అందుకు ఆధారంగా చూపాడు ఆరుద్ర.  (నైషధం 1-35)

మామిడి సింగన ఈ అన్నదమ్ములలో చివరివాడు. ఇతడు చెప్పినట్లు ఒక పద్యం –“జగము నుతింపగ జెప్పితి ప్రెగ్గడయ్యకు నా యనుంగు బెద్దనకు కృతుల్” (నైషధం 1-14). ప్రెగ్గడయ్యకు పండితారాధ్య చరిత్ర అంకితమిచ్చాడు బాల శ్రీనాథుడు అన్నారు ఆరుద్ర.

ఆనాడు అష్టభాషా ప్రావీణ్యం పండితులకు అవసరం. శ్రీనాథుడు నూనూగు మీసాల నూత్న యవ్వనమందు, ప్రాకృత భాషలో రచింపబడ్డ హాలుని గాధాసప్తశతిని తెనుగు లోకి అనువదించినాడు. ఏడు వందల కథలు అనువదించాడు. కానీ ఈ అనువాదం నష్టమై పోయింది. మూడు పద్యాలు మాత్రమె లభ్యమయ్యాయి అని అన్నారు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 685). ఆ పద్యాలను ప్రాకృతం లోని వాటితో ఆరుద్ర పోల్చి తెల్పారు. అనంతకృష్ణ శర్మ గారు చెప్పిన విషయాలు తెల్పారు.

ప్రోలయ వేమారెడ్డి గారి అన్నగారి మనుమడు పెదకోమటి వేమారెడ్డి. చందవోలు లో వీరి రాజ్యం ఉండేది. ఇతనికి మంత్రిగా (ఇంతకుముందు మనం చెప్పుకున్న) మామిడి సింగన ఉండేవాడు. ఇట్టి పరిస్థుతులలో పెదకోమటి వేమారెడ్డి, శ్రీనాథుడు, మామిడి సింగన మంత్రి కలిసి సాహిత్య వ్యాసంగం చేస్తుండడం జరిగి ఉండవచ్చని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. అప్పుడు గాధాసప్తశతి అనువదిస్తే పెదకోమటి వేమారెడ్డి అందులో ఒక నూరు గాధలకు టీక వ్రాయడం జరిగి ఉండవచ్చు అన్నారు ఆరుద్ర. (గాధాసప్తశతి పాదం పీఠిక పుట -23 (క్రింద ఇవ్వబడినది) పేజీ.687)

నైషధం-విద్ధౌషధం

మామిడి సింగన సంస్కృతంలో, జ్యోతిష్యాత్రంలో దిట్ట. జ్యోతిష్యంలో సోమ సిద్ధాంతానికి వ్యాఖ్యానం వ్రాశాడు. సింగనకు శ్రీహర్షుని నైషదీయం అంటే ప్రాణం. ఆ విషయం శ్రీనాథుడు ఇలా చెప్పాడు.

శ్రీహర్ష సుకవి కవితా -వ్యాహార కథా సుధా సాస్వద సుఖ
శ్రీ హర్షోదయ నిత్యస – మహిత మహితాంతరంగా మామిడి సింగా!

మామిడి సింగన సదా శ్రీ హర్షుని కావ్యామృతాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాడని దాని అర్థం. ఇట్టి ఫ్రౌడ కావ్యాన్ని తెనిగించడానికి తగినవాడు శ్రీనాథుడే అని సింగన నిర్ణయించుకోవడానికి కారణం శ్రీనాథుని సాహిత్య సంపదే. సింగన శ్రీనాథుని పిలిపించి ఇలా అన్నాడు.

బ్రాహ్మీదత్త వరప్రసాదుడ పురు ప్రజ్ఞా విశేషోదయా
జిహ్వ స్వాంతుడ నీశ్వరార్చన కళా శీలుండ నభ్యర్ధిత
బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్థ నిర్థారిత
బ్రహ్మజ్ఞాన కళా నిదానమవు నీ భాగ్యంబు  సామాన్యమే.

అని ప్రశంసించి శ్రీ హర్షుని నైషదీయాన్ని సంస్కృతం నుండి తెనిగించమని కవి రాజరాజ శేఖరా...అంటూ ప్రారంభించి

భట్ట హర్షుండు ప్రౌఢ వాక్పటవమున
నెద్ది రచియించి బుధ లోక హితము పొందె
నట్టి నైషథ సత్కావ్య మాంధ్ర భాష
ననఘ యోనరింపు నా పేర నంకితముగ

భాణుని రచన నారికేళ పాకం. ఇది సోమరిపోతులకు అర్థం కాదు అని చెప్తూ దానికి ఉపమానంగా

కొనియాడ నేర రది యట్టిద లేజవరాలు జెక్కు గీతిన పసవల్చు బాలకు డెందమునం గలగంగ నేర్చునే!!

అంటూ నైషధాన్ని శృంగార నైషధంగా అనువాదం చేశాడు శృంగార శ్రీనాధుడు. తన అనువాదం ఎలా ఉందో ఇలా చెప్పాడు శ్రీనాధుడు.
1. శబ్దం బనుసరించి అభిప్రాయంబు గురించియు 3. భావం బుపలక్షించియు 4. రాసంబు పోషించియు 5. అలంకారంబు భూషించియు 6. ఔచిత్యం బాచరించియు 7.అనౌచిత్యంబు పరిహరించియు

మాతృకానుసారముగా చెప్పబడు ఈ భాషా నైషధ కావ్యంబు విలసిల్లు నాచంద్రార్కముగా అని సర్వలక్షణ సమన్వితంగా అనువదించాడు కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి.

ఈ అనువాదం తరువాత ఒక రాచకార్యం మీద కంచి వెళ్ళాడు. అక్కడ శ్రీనాథుని చిన్ననాటి నెచ్చలికాడు అవచి తిప్పయ్య శెట్టిని కలుసుకొన్నాడు. రాచకార్యం మీద వెళ్ళినా దానిని గూర్చి మాట్లాడకుండా తన అనువాద గ్రంథమైన శృంగార నైషధాన్ని తిప్పయ్య శెట్టి కి చదివి వినిపించాడు. శెట్టి గారికి కూడా కోర్కె పొడమరించింది. శ్రీనాథుని చూచి

ఆగమ జ్ఞాన నిధివి తత్వార్థఖనివి –
బహు పురాణజ్ఞుడవు శుభ భవ్యపతివి
బాల సఖుడవు శైవ సంబంధమొకటి
యవధరింపుము నా పేర నంకితముగ – (హర పీఠిక 12)

అలా తిప్పయ్య శెట్టి అడగగానే శ్రీనాథుడు 7 ఆశ్వాసాలు హరవిలాసం అనే ప్రబంధం రాసేశాడు. 1,2 ఆశ్వాసాలలో తిప్పయ్య శెట్టి పూర్వీకుడైన సిరియాళుని కథ వ్రాశాడు. ఈ కథ స్థానికమైనది. మిగతావి వివిధ మూల గ్రంథాల నుండి గ్రహించాడు. 6 వ ఆశ్వాసం లో హాలాహాల భక్షణం శివుడు పార్వతికి చెప్పినట్లుగా శ్రీనాథుడు వ్రాశాడు. అయితే నడుమ ఆ విషయం మరిచిపోయి తానే (శ్రీనాథుడు) చెబుతున్నట్లు వ్రాశాడని తొందరలో వ్రాయడం వల్ల చిన్న పొరపాటు జరిగి ఉండవచ్చని ఆరుద్ర గారు అభిప్రాయ పడ్డారు (స.ఆం.సా. పేజీ 692).

తిప్పయ్య శెట్టి కి కావ్యాంకితం చేసి మెప్పించి రాచకార్యం చక్కబెట్టి వచ్చాడు శ్రీనాథుడు.

**** సశేషం ****

Posted in June 2023, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!