పద్మనాయక – రెడ్డిరాజుల యుగం
విన్నకోట పెద్దన
విన్నకోట పెద్దన జన్నమంతి రీతులను గూర్చి విద్యానాథుడు చెప్పిన వైదర్భి, గౌఢి, పాంచాలి అనే మూడు గాక పెద్దన ‘లాటి’ అనేది ఎక్కువగా చెప్పాడు. విద్యానాథునీతోనే గాక ఇతర అలంకారికులతో కూడా పెద్దన భేదిస్తున్నాడు. రాజశేఖరుడు వంద రకాలుగా కవులను విభజిస్తే పెద్దన విభజించే పద్దతిలో కూడా విభేదించి ఏడు రకాల వారిని (కవులను) పేర్కొన్నాడు. వాచికుడు – పదాడంబర కవి, ఆర్థికుడు – పరిమిత పదములను ఉపయోగించువాడు. శిల్పకుడు – బహువిధ అలంకారాలను వాడేవాడు. రౌచికుడు – మంచి మృదు పదములనే వాడువాడు. ----ఇలా విభజన చేశాడు పెద్దన.
అన్ని రకాల కవులను చెప్పి చివర ఇలా చెప్పాడు పెద్దన.
శక్తి వెలియైన కావ్యోక్తి సాధనంబు
లెల్ల జీకటియింటిలో విడిన పరుకు
లెన్ని ఋతువులు గల్గిన నెట్లు పుచ్చు
మహి వసంతాగమనము లేక మావిమోక?
ఎన్ని తెలిసినా, ఛందోలంకారాదులు ఎన్ని పొండుపరిచినా, ఏది లేకపోతే పొసగదో కవితాసుందరి శక్తి, ఆ కందువ తెలిసిన వాడే అసలైన కవి అని తేల్చి చెప్పాడు విన్నకోట. (స.ఆం.సా. పేజీ 670).
లలి నన్యోన్య ముఖావలోకనము వీలంజేయగా లేని యా
విలసత్కావ్య కళా చతుష్టయము లుర్విం బర్వ నేకస్థలిం --- అంటూ చెప్పాడు. వివిధ సంస్కృత గ్రంథాలను గూడా అనుసరించాడు. అయితే విన్నకోట పెద్దన యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకతను ఆరుద్ర ఇలా తెల్పారు. పెద్దన 8 ఉల్లాసాలలో ఒక్కోదానిలో ఒక్కొక్క విషయాన్ని వివరించాడని తెల్పాడు. 9వ ఉల్లాసంలో వ్యాకరణం ఉందని తెల్పి,
“చాళుక్య రాజు మొదలుగా పలువురు దేశి కవిత పుట్టించి ఆంధ్ర విషయంలో నిలిపిన కాలాన తెలుగులో ఛందోగ్రంథం లేని లోటు తీర్చాడు. కేతన వ్యాకరణం లేని లోటు తీర్చాడు. వేదం వెంకటరాయ శర్మ చెప్పినట్లు “ఇట్లు ఛందో వ్యాకరణాదులై – నంతట, రసభావాదులు కావాలిసి వచ్చినవి. అవియును క్రమముగా చూడామణి యందు వెలసినవి.
సంస్కృతమందును అవి వేర్వేరు గ్రంథములుగానే వెలసినవి. అన్నింటినీ కలిపినా కావ్యాలంకార చూడామణి వంటి పాఠ్య గ్రంథము గీర్వాణమున కూడా లేదు.”
సంస్కృతంలో గూడా లేని పుస్తకాన్ని విన్నకోట పెద్దన చేత రచింప జేసిన విశ్వేశ్వర భూపతి ప్రశంసనీయుడు. అతడు స్వతహాగా ఛందశాస్త్ర వక్షుడు. సత్కృతి పరిష్కార క్రియా దక్షుడు (7 ఆశ్వాసాంతం), యుద్ధ విశారదుడు” అని ఆరుద్ర చాళుక్య రాజును కీర్తించాడు.
జన్నమంత్రి, కవి రాక్షసుడు
పద్య రచన అనగానే మన వారు పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా పాత పదాలే వాడుతారు గాని సజీవంగా ఉండే వ్యవహారిక పదాలు వాడరు అని ఆరుద్ర చెప్పి, పద్యంలో కూడా శిష్ట వ్యవహారికం వాడిన దేవకీనందన శతకాన్ని గూర్చి, దాన్ని రాసిన శతక కారుని గూర్చి పరిచయం చేశారు.
దేవకీనందన శతకం తెలుగు దేశంలో ప్రసిద్ధమైనది. దీని మకుటం “కృష్ణా దేవకీనందనా” అని ఉంటుంది. అప్పకవి ఒక పద్యాన్ని ఉదహరించడం వల్ల ఆ పద్యం ఆయన కాలానికే ప్రసిద్ధి చెందిందని తెలుస్తున్నది. అయితే అది ఎవరు రాశారో అప్పకవి చెప్పలేదు. ఆ పద్యం “చతురంభోది పరీత భూవలయ....” అనే ప్రసిద్ధ పద్యం.(అప్పకవి – 3-209)
ఈ పద్యం చివర ...కృష్ణా! దేవకీ నందనా!” అనే మకుటం ఉంది.
ఇక జక్కన అన్న కవి విక్రమార్క చరిత్ర వ్రాశాడు. అందులోని వంశావళి పద్యాల వల్ల దేవకీనందన శతకం ఎవరు వ్రాసింది తెలుసుకోవచ్చు. అని ఆరుద్ర అన్నారు.
విక్రమార్క విజయం వెన్నెలకంటి సిద్ధనమంత్రి కి అంకితమియ్యబడింది. సిద్ధన మంత్రి తండ్రిపేరు జన్నమంత్రి (కృతిపతి తండ్రి). అతని గూర్చి వ్రాస్తూ జక్కన వ్రాసిన పద్యంలో రెండవ పాదంలో
“పరమ హృద్యంబైన పద్య శతకంబున దేవకీ తనయు విధేయు జేసి అని ఉన్నది. అలాగే కృతిపతి తండ్రియైన జన్నమంత్రి, సంగమ వంశ రాజులలో శ్రేష్టుడైన దేవరాయల కృపకు పాత్రుడైనట్లు కూడా చెప్పడం వల్ల మనకు వారి కాలం గూర్చి కూడా తెలుస్తున్నది అన్నారు ఆరుద్ర. (క్రీ.శ.1377-1404). దేవరాయలు రెండవ హరిహరరాయల పుత్రుడు.
వెన్నెలకంటి జన్నమంత్రి దేవకీనందన శతకం వ్రాశాడు. దేవరాయల కృపకు పాత్రుడైనాడు. ఆరుద్ర అంతటితో ముగించలేదు. దీనిని గూర్చి చాలా చర్చించారు.
ఆ చర్చ – ఈ శతకంలో కొన్ని ప్రతులలో చిట్టచివర ఒక పద్యం ఉంది. అది-
సదయా మూర్తి కళన్ ఘటించు...కవి రక్ష శ్రేష్ఠు డా మోది యౌ...
దీన్ని గూర్చి ఆరుద్ర తనదైన శైలిలో వివిధ ప్రతులలో గల విషయాలను చర్చించారు. దానిని గూర్చి చెబుతూ,
మూడు ప్రతులలో కవిరాక్షసుని గూర్చి ఉంది. దీనిని గూర్చి తేలికగా కొట్టి పారేయ్యకూడదని చెప్పి మరికొన్ని పద్యాలను చూపి వాటిలోని కొన్ని మనోహరమైన పదాలు, పదబంధాలు చూపించారు. ఉదా:- బాలకృష్ణుని వర్ణనలో కూడీకూడని చిన్ని కూకటులతో అన్న ప్రయోగం కవియొక్క విలక్షతను చాటుచున్నాది. జన్నమంత్రి వాడిన ఏలింది..ఇబ్బంది, విహరించే కవి (39) మొదలైనవి వీనుల విందుగా ఉన్నాయన్నారు. జన్నమంత్రి రచనలో గల రసికత్వం, హాస్యం గూర్చిన పద్యాలను తెల్పారు ఆరుద్ర.
ఈ శతకాన్ని జన్నమంత్రి జీవితపు చివరి దశలో రచించాడని చెప్తూ
“బాలక్రీడ కొన్ని నాళ్ళు పిదపన్ ...అన్న పద్యంతో నిరూపించారు ఆరుద్ర. భక్తి భావంతో చెప్పిన పద్యం “అరయం జెందన గంధిపై...కుచేలుపై...”చూపిన కరుణ నాపై కూడా కొంత జూపమంటూ రచించాడు.
వెన్నెలకంటి జన్నయ్య తానూ కొండంత కవిని కానని చెప్పుకోవచ్చు. కానీ నిజంగా కొండ అద్దమందు కొంచెమై ఉండదా అనిపించేటంత ఇతడు మొదటి వ్యావహారిక భాషాకవి” అని అన్నారు ఆరుద్ర.