Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

పద్మనాయక – రెడ్డిరాజుల యుగం

నాచన సోముడు – గోన బుద్ధరాజు

నాచన సోముడు తన పద ప్రయోగంలో కొంత నీచ పద ప్రయోగం చేశాడని అనుకోవడం సరికాదని, అది ఆనాటి సంఘంలో వాడేవారని చెప్తూ ఆరుద్ర ‘లంజరికం’ ‘మిండరికం’ అనే పదాలను చూపి పాల్కురికి సోమనాథుని బసవ పురాణంలో కూడా ‘మిండరికం’ అనే మాట పలుసార్లు వాడబడినదని గుర్తు చేశారు. కాని ఎర్రన తన హరివంశం లో ఈ ఘట్టాన్ని రెండు పద్యాలతో సరిపుచ్చారు. ఇటువంటి సంభాషణలకు తిక్కన గారు ఒరవడి పెట్టారని ఆరుద్ర అభిప్రాయం.

తిక్కన తన నిర్వచనోత్తర రామాయణం లో రంభా రావణ సంభాషణ ప్రవేశపెట్టారు. ఒకరిని చూచి మరొకరు ఇలాంటి సన్నివేశ కల్పనలు, సంభాషణలు సాగించడం సర్వసాధారణమే.

హరిహరుల స్మరణ ఎర్రన – నాచన సోముడు

తన హరివంశాన్ని హరిహరనాథునికి అంకితం ఇవ్వకపోయినప్పటికీ ఎర్రన గారు శివకేశవులనిద్దరినీ ప్రక్కప్రక్కనే దర్శించారు. మనకు మనోజ్ఞంగా దర్శింపజేశారు.

హరి జూతురు హరు జూతురు -హరి జూతురు
గ్రమ్మరంగ హరు జూతురు – ని
ర్జరులును మునులను నిమ్మెయి – హరిహర తత్వముగ
విన్మితా లోకనులై

ఎర్రన ప్రబంధ ధోరణిలో వ్రాసిన ఈ ఘట్టం నాచన మొదటి ప్రబంధ ధోరణిలో రచించి అటు తర్వాత పురాణ పద్దతిలో రచించాడని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. పేజి 593)

కరుణ రసం, ఆటలు, నాచన ఇతర రచనలు

నాచన సోముని కరుణ రస పోషణకు ఒక ఉదాహరణ: ఒక బ్రాహ్మణునికి బిడ్డలు పుట్టి చనిపోతుంటే అతను కృష్ణుని చూచి రోదిస్తూ,

తడియొత్తు చీరతో దాడి కౌగిట జేర్చి చూపంగ
కన్నార జూడనైతి
తడవి యాడక మున్న తట్లాడు మని పట్టి
పడకంగ సెజ్జపై వాల్చనైతి .....” పద్యం కరుణ రస భరితం.

కాకతీయుల కాలం నాటినుండి ఉన్న పాచికలాటను పాల్కురికి సోమన వర్ణించినట్లే పద్మనాయక యుగంలో గూడా నాచన సోముడు వల్లించాడు. పాల్కురికి సోమన తన పండితారాధ్య చరిత్రలో పురాతన ప్రకరణంలో నెత్తాల ఆటను వర్ణించాడు. ఈ సందర్భంగా ద్యూత పరిభాష విరివిగా వాడాడు. దుగ, బత్తిగ మొ||నవి. నాచన సోముడు కూడా ద్యూత పరిభాషలో వర్ణించాడు. ఈ ఆటలు- నెత్తాల, సుగటా ఎలా ఆడేవారో సురవరం ప్రతాపరెడ్డి గారు వివరించారు.

నాచన సోముడు ఉత్తర హరివంశమే గాక ‘వసంత విలాసం’ రచించాడు. అయితే నాలుగైదు పద్యాలు మాత్రమే మనకు దొరికాయి. అప్పకవి ఒక పద్యాన్ని ఉదాహరించాడు.

హరవిలాసం

దీనిని గూర్చి ఆరుద్ర చాలానే చర్చించారు. డా. పి. యశోదా రెడ్డి గారు హరివిలాసము అలాగే హరవిలాసము వ్రాశాడని అంటే రెండు వేరు వేరు గ్రంధాలని ఆమె అభిప్రాయపడ్డారు. హరివిలాసం లో శ్రీకృష్ణుని బాల్యం, లీలలు నాచన సోముడు వల్లించాడని యశోదా రెడ్డి గారి అభిప్రాయం.

మొత్తం మీద నాచన సోముడు నాలుగు గ్రంథాలు రచించినట్లు తెలుస్తున్నది. అవి;

  1. ఉత్తర హరివంశము, ఆది పురాణము లేక ఆదిత్య పురాణము, 3. వసంత విలాసము, 4. హరి(ర) విలాసము.

“నాచన సోముడు ఈ హరి(ర) విలాసము పుస్తకం వ్రాయడం వల్లనే మన సాహిత్యం పురాణ ధోరణి నుండి ప్రబంధ పద్ధతికి మారింది. అనంతకృష్ణ శర్మ గారు చెప్పినట్లు వస్తుకళ చాలామటుకు అంతరించి రచనపై దృష్టి ప్రబలింది. శబ్దార్థముల చిత్ర రచనలు పుంఖాను పుంఖములుగా శాఖోపశాఖలుగా అల్లుకొన్నవి. సరసత్వమున కంటే చమత్కారము ఎక్కువ సాహిత్య ధర్మముగా మారినది. దీనికి ఎక్కువ కారణభూతుడు నాచన్ సోముడు. దీని మంచి చెడ్డలు, కీర్తి పూర్తిగా అతనిదే.” అని ఆరుద్ర సెలవిచ్చారు. (స.ఆం.సా. పేజీ 600).

గోన బుద్ధరాజు

చిన్న చిన్న సహాయాలు చేసినప్పుడు, చేస్తున్నప్పుడు, మనం వాడే మాట “ఏదో ఉడుతా భక్తిగా” అన్న వాక్యం. శ్రీరామునికి సేతువు నిర్మాణంలో ఒక ఉడుత తన వంతుగా సహాయం చేసింది. ఆ ఉడుత వాల్మీకి వ్రాసిన సంస్కృత రామాయణంలో లేదు. మొదటిసారిగా తెలుగులో ఈ ఉడుతా భక్తిని గ్రంథస్థం చేసినవాడు గోన బుద్ధరాజు. బుద్ధరాజు రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రచించాడు. దీనికి రంగనాథ రామాయణం అని పేరు. ఈ రంగనాథ రామాయణం అనే పేరు ఎలా వచ్చిందనేది చర్చనీయాంశం.

క్రీ.శ. 1294 ప్రాంతంలో కదన ప్రచండాది బిరుదులు గల్గిన గోన గన్నయ రెడ్డి వర్ధమాన పురంలో రాజ్యం చేస్తుండేవాడు. ఈ రాజ్యానికి రక్షామణి యైన విట్ఠలనాధ భూనాథుడు తుంబుళం మొదలైన దుర్గాలని జయించి రాజ్యం చేస్తూ జయ సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమి నాడు సర్వరాష్ట్ర సమస్త రక్షణార్థ యైన దుర్గం రచించాడని రాయచూరి శాసనం చెప్పుచున్నది. (స.ఆం.సా. పేజీ 601).

విట్ఠల భూపతి ఈ దుర్గంలో సభతీర్చి విబుధులను చూచి రామాయణ రచన చేసెడి వారెవరు అని అడిగినప్పుడు ‘మీ కుమారుని కన్నా రామాయణ మర్మములు తెలిసిన వారు ఇంకెవరున్నారు?’ అని పండితులు చెప్పగా విట్ఠల నాధుడు కుమారుని పిలిచి కవులూ పండితులు మెచ్చుకోనేటట్లు రామాయణం నా పేర తెలుగులో చెప్పమని ఆనతిచ్చాడు.

తండ్రి మాటలతో బుద్ధభూపతి సర్వలక్షణ సంపన్నంగా వాల్మీకి చెప్పిన పద్ధతిలో (ద్విపద రామాయణం) రచించడానికి ప్రారంభించాడు. ఇందుకు నిదర్శనం రాయచూరి శాసనం, గోన వంశం వారి శాసనాలు కొన్ని తెలంగాణా లో దొరికాయి. కాని, రంగనాథ రామాయణంలో కవి తన వంశాన్ని వర్ణిస్తూ మొట్టమొదటగా గోన కాట భూపతిని పేర్కొన్నాడు. కాట భూపతి పేరు తెలంగాణా శాసనాలలో లేదు. కానీ కాట భూపతి పేరు చెంగల్పట్టు జిల్లా ‘తిరుప్పుక్కు’ శాసనంలో గోన కాటయ పేరు ఉన్నట్లు యం.సోమ శేఖర శర్మ గారు గుర్తించారు. ఈ శాసన కాలం క్రీ.శ.1250. వీటి ఆధారంగా ఆరుద్ర చూపించిన గోన వంశవృక్షం లో అయిదుగురు రాజులు క్రీ.శ.1250 మొదలు క్రీ.శ.1376 వరకు రాజ్యం చేసినట్లు తెలుస్తున్నది.

బుద్ధభూపతి వయసు మళ్ళిన తరువాత రామాయణ రచనకు పూనుకొన్నట్లు ఆధారాలు కనపడుతున్నాయి. ఇతను వయసులో ఉండగా పూర్వ రామాయణం ఆరు కాండలు రచించి అటు తర్వాత వయసు మళ్ళిన తరువాత కుమారులను పిలిచి ఉత్తర రామాయణం రచింపమని వారికి చెప్పాడట. ఉత్తర రామాయణం రచించలేని సమయంలో దేవుడే కనిపించి “నీవింక మముగూడ నే తెమ్ము నీ కామితార్థముల్...నిర్వర్తింపగా నీ కుమారులను వినియోగింపుమని చెప్పాడట. అయితే ఆరుద్ర ఈ విషయాలన్నీ ఊహించి చెప్పినట్లు వ్రాయడం గమనిస్తే నిర్ధారణగా ఈ విషయాలు చెప్పడం జరగలేదు.

రంగనాథ రామాయణం అన్న పేరు – కొన్ని వివరణలు

రంగనాథ రామాయణం ఆంధ్రదేశంలో బహుళ ప్రచారంలో ఉంది. ముగ్గురు ప్రకాశకులు దీనిని ప్రచురించారు.

  1. వావిళ్ళ వారు: పరిష్కర్తలు నాగపూడి కుప్పుస్వామయ్య గారు, వేదం లక్ష్మీ నారాయణ గారు.
  2. ఆంద్ర విశ్వవిద్యాలయం: కట్టమంచి వారి ఆధ్వర్యంలో పింగళి లక్ష్మీ కాంతం గారి పీఠికతో వెలువడింది.
  3. రాయల్ అండ్ కో: మల్లంపల్లి వారు, జి.వి. రంగాచార్యుల వారు పరిష్కర్తలు.

ఈ మూడు ముద్రణల వాళ్ళ అనేక విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలు క్లుప్తంగా: (స.ఆం.సా. పేజీ 603)

  1. ఈ గ్రంథం బుద్ధ భూపాలుడు రచించాడు.
  2. బుద్ధ భూపాలుడు తన తండ్రి పేరా ఈ గ్రంథాన్ని ప్రఖ్యాతము చేశాడు.
  3. తండ్రి పేర ప్రఖ్యాతము చేయుట అనగా అతని పేరున పిలుచుట అని ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారు వ్రాశారు.
  4. బుద్ధరాజు తండ్రిపేరు విట్ఠల నాథుడు. మరి రంగనాథ రామాయణం అనే పేరు ఎలా వచ్చింది? దానికి పింగళి లక్ష్మీ కాంతం గారి వివరణ;

 

**** సశేషం ****

Posted in February 2023, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!