Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

పద్మనాయక – రెడ్డిరాజుల యుగం

నాచన సోముడు

నాచన సోముని రచనా విధానాన్ని గూర్చి చెప్తూ ఆరుద్ర ఇలా అన్నారు “నన్నయ గారు అంకితమిచ్చిన రాజరాజుకే తానూ అంకితమిచ్చి అన్ని ఆశ్వాలలో అదే గద్య ఉంచి ‘తద్రచనయకా’ అరణ్యపర్వ శేషాన్ని ఎర్రన గారు పూరించారు. అలాగే మిగతా పదిహేను పర్వాల భారతాన్ని రచించిన తిక్కన గారి పేరున కూడా తన గద్యలో వాడి వారు రచించకుండా విడిచిపెట్టిన భారత శేషం హరివంశాన్ని పూరిస్తున్నట్లు తోపిస్తూ రచించిన కవి నాచన సోముడు. ఈయన తిక్కన గారు అంకింతమిచ్చిన హరిహరనాథునకే తన రచన అంకితమిచ్చాడు.

మొదట నాచన సోముని గొప్పకవి అని చెప్పుకోవడమే గాని పూర్తి వివరాలేవీ తెలియవు. ఆంధ్రుల చరిత్ర వ్రాసిన చిలకూరి వీరభద్రరావు గారు 1910 సంవత్సరం లో ఆంధ్రపత్రిక లో ఒక శాసనాన్ని ప్రకటించారు!

దానివల్ల నాచన సోముని జీవిత విశేషాలు కొన్ని తెలిసాయి. ఆ శాసనం లోని విషయాలు.

సంగమ వంశపు రాజు మొదటి బుక్కరాయలు (క్రీ.శ. 1356-1377). ఇతడు తన అన్న మొదటి హరిహరరాయలు రాజ్యం చేస్తున్నప్పడు యువరాజుగా ఉండి అగ్రహారాలు దానం చెయ్యడం చేసేవాడు. క్రీ.శ. 1344 లో బుక్కరాయలు నాచన సోమునికి ఒక అగ్రహారం దానం చేశాడు. ఆ దాన శాసనం బట్టి నాచన సోముని కాలం, జీవించిన ప్రదేశం, ఆశ్రయించిన రాజులు మొదలైనవి తెలుస్తున్నాయి. ఈ శాసనం లోని విషయాన్ని వేటూరి శివరామ శాస్త్రి గారు అనువదించారు. ఆ విషయాలు క్లుప్తంగా;

ఆపస్తంబసూత్రుడును, భారద్వాజగోత్రుడును, ....నాచన వంశాంభుధి చంద్రుడును సకలాగమవేదియును...అష్టభాషా కవిత్వ శ్రీయుతుడును .... అను సోమయాఖ్యునకు సంగమ భూపాల తృతీయ పుత్రుడును .... బుక్కరాయలు పంపాతీరము నందలి భాస్కర క్షేత్రమునందుండిన శ్రీ విరూపాక్ష స్వామి సన్నిధిని శాలివాహన శకము 1266 న .....పినాకినీ తీరమున మన్న బుక్కరాయ పురమున కల పందాకల దిన్నె యను గ్రామము నగ్రహారముగా దానము చేసి.....”

పండితులు అనేక రకాలుగా చదివి (వ్రాత స్పష్టంగా లేనందున) చివరకు వేటూరి శివరామ శాస్త్రి తీర్పు నంగీకరించారు.

నాచన సోముని వివరాలు తెలుసుకోవడానికి పై శాసనంతో పాటు సోముడు చెప్పిన గద్య కూడా ఉపయోగపడింది. ఆ గద్య –

“ఇది శ్రీమదుభయ కవిమిత్ర... తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరంబున శ్రీమత్సకల భాషాభూషణ, సాహిత్య రసపోషణ, సంవిధాన చక్రవర్తి, సంపూర్ణ కీర్తి, నవీన గుణ సనాధ, నాచన సోమనాథ ప్రణీతంబైన ఉత్తర హరివంశంబు” ఈ రెండు ఆకారాల నుంచే నాచన సోముని గురించి తెలిపే సాహిత్య విషయాలను తెలుసుకోవడం జరిగింది.

సకల గుణవేది, అష్టాదశ పురాణాల అభిజ్ఞార్థవేది, అష్ట భాషా కవిత్వశ్రీ, శ్రీవాణీ విజిత సంపన్నుడు, సంవిధాన చక్రవర్తి, సంపూర్ణ కీర్తి, నవీన గుణ సనాథుడు ..ఇవన్నీ సోముని గూర్చి చెప్పే విషయాలు. సోమన గొప్ప పండితుడు.

ఎఱ్ఱన హరివంశం ముందా లేక నాచన సోముని హరివంశం ముందా అన్న ప్రశ్నకు “ఎర్రన ననుసరించే సోమన వ్రాసెననడంలో సందేహం లేదు” అని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు అభిప్రాయపడ్డారు.

సోముని హరివంశ రచనలోని విషయాలు:

నరకాసుర వధ పూర్తిగా (ప్ర||ఆ||), విప్రకుమార రక్షణ, రుక్మిణీ పుత్రదానం, కృష్ణుని తపోయాత్ర, ఘంటా కర్ణుని కథ, శివకేశవుల సమాగమం (ద్వి-ఆ), పౌండ్రక వాసుదేవుడుతో యుద్ధం, హంసడిభకోపాఖ్యానం మొదలైనవి.

సంస్కృత హరివంశం లోని చాలా విషయాలను సోముడు వదిలేశాడు. సంస్కృతంలో లేని వెత్తాలాటను గూర్చి చెప్పాడు. సోమన చేత జరాసంధుని కథ, రుక్మిణీ పరిణయం, పారిజాత వృత్తాంతం అనువదింప బడలేదు. “పురాణమంతా అనువదించకుండా కొద్దిపాటి కథలు మాత్రమె తీసుకొని ప్రబంధాలు రచించడం నాచన సోమునితోనే మొదలైంది.” అని ఆరుద్ర ఈ సందర్భంగా తెలిపారు (స.ఆం.సా. పేజీ 583).

**** సశేషం ****

Posted in January 2023, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!