Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

పద్మనాయక – రెడ్డిరాజుల యుగం

ఎఱ్ఱాప్రగ్గడ

ఇంతటి చక్కటి భావాలు గల ఎర్రన రచనలలో అక్కడక్కడా న్యూనోపమానాలు కనిపిస్తాయి.

“పొగడ మ్రాకు ....గడగి వనలక్ష్మి
యు మిసిన కళ్ళ యనగ” మొదలైనవి. శంభుదాసుడు అనే బిరుదు యున్నప్పటికీ విష్ణువు వర్ణనలో మైమరచి పోతాడు ఎర్రన. అకారంతో మొదలయ్యే పదాలతో విష్ణు వర్ణన చేసినప్పుడు ఇక ఆ అకారాన్ని విడిచిపెట్టక అభయ, అప్రమేయ – అలా కొనసాగిస్తాడు. ఇది భారత శేష పూరణతో మొదలైంది. హరివంశంలో కొన్ని వందలసార్లు కనపడుతుంది. తదనంతర కవులు ఎర్రన ను బాగా అనుసరించారీ విషయంలో. ఎర్రన గారు “హరియను రెంక్షరములు ....” అని రాస్తే కృష్ణ శతకకారుడు “హరియను రెండక్షరములు హరియించును..” అంటూ ఎర్రనను అనుసరించాడు. వ్రాసేది పురాణమైనా ఎర్రన సమకాలీన విషయాలను గూడా వర్ణించారు. వైకుంఠంలో విషయాన్ని వర్ణించేటప్పుడు ఎర్రన తన కాలం నాటి ఫణిహారులను మనసులో పెట్టుకొని వర్ణించాడు.

ఎర్రన పలుమార్లు తన నివాసాన్ని మార్చడం జరిగింది. ఎర్రన గుడ్లూరు వదిలి చదలవాడ చేరాడు. మల్లారెడ్డి, ప్రోలయ వేమారెడ్డికి తమ్ముడు. ఇతని వద్దకు చేరిన ఎర్రన, రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు. మల్లారెడ్డి రామ భక్తుడు. చదలవాడలో రామాలయం కట్టించాడు. క్రీ.శ. 1325 లో ప్రోలయ వేమారెడ్డి చదలవాడకు వచ్చి తన తమ్ముడు కట్టించిన దేవాలయంలోని దేవునికి ఒక అగ్రహారం ఇచ్చినట్లు ఒక శాసనం చెప్తున్నది. ఒక చంద్రగ్రహణం రోజు గుండ్లకమ్మ నది వద్ద కూర్చుని ప్రోలయ ఈ దానాన్ని ఇచ్చినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. (స.ఆం.సా. పేజీలు 560-62).

దేవునికి అర్పించిన ఈ అగ్రహారం పేరు మల్లారెడ్డి పేరుమీద మల్లవరం అని ప్రోలయ నామకరణం చేశాడు. ఇది చదలవాడకు అరక్రోసు దూరంలో ఉంది. ఈ సందర్భంగా ప్రోలయ వేమారెడ్డి కోర్కెపై ఎర్రన రామాయణ రచన చేపట్టారు అని వేటూరి శివరామ శాస్త్రి గారు ఊహించారు. దానికి తగ్గట్టుగానే ఎర్రన రామాయణాన్ని సంపూర్ణంగా రచించినట్లు హరివంశం లోని ఒక పద్యం చెబుతున్నది. ఆ పద్యం –

“నా తమ్ముడు ఘనుండు మల్లరథనీనాధుండునిన్నాతత శ్రీ తోడన్ సము పేతుజేసి ...రామకథమున్ జెప్పించి...”(హరి.పూ 1-39).

అయితే ఎర్రన రామాయణం దురదృష్టవశాత్తూ నష్టమై పోయింది. వివిధ ఆకరలానుండి సేకరించిన వేటూరి వారు, వేటూరి శివరామ శాస్త్రి గారు ప్రకటించిన పద్యాలు 45 మాత్రమే. ఎర్రన మూడుచోట్ల రామాయణ కథ వ్రాశారు.

  1. భారత అరణ్య పర్వంలో షష్ఠాశ్వాసం 267 నుండి 409 = 143 పద్యాలు. అలాగే సప్తమాశ్వాసంలో 1 నుండి 168 = 168 పద్యాలు మొత్తం గద్యపద్యాలు 311.
  2. వేమారెడ్డి చెప్పించినవి
  3. హరివంశం పూర్వభాగంలో అలాగే నృసింహావతారాన్ని గూర్చి కూడా మూడు రచించాడు.

సమకాలీనత

ఎర్రన పురాణాది విషయాలపై గ్రంథాలు వ్రాసినా, సమకాలీన విషయాలను మరచిపోడు. అరణ్యపర్వం లోని రామాయణంలో ఇంద్రజిత్తు నోట పలికించిన ఒక పద్యంలో ఉపయోగించిన ‘వీర నృత్యము’ అనే మాటను బట్టి పద్మనాయక యుగంలో ప్రబలిన రణము ను సూచిస్తున్నదేమో అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.

రామరాజ్యం ఎలా ఉంటుందో ఎర్రన పద్యం చదివితే అర్థం అవుతుంది.

“మునులను సురలును వేడుక...గుడువుడు, గట్టుడు, గొనుడను మాటలు వినగవచ్చు నఖిల క్షోణిన్”

ఇతర రామాయణాలలో కంటే ఇందులో (ఎర్రన రచనలో) రాముని పాత్ర విలక్షణమైనది. లంకలో ఉన్న సీతను, ఇతర రామాయణాలలో రాముడు కఠినంగా నిందిస్తాడు. కాని ఎర్రన తానేమీ మాట్లాడక అగ్నిహోత్రుని చేత రాముడు చెప్పించినట్లు రచించి రాముని పాత్రకు ఔచిత్యాన్ని కల్పించాడు.

ఎర్రన ఛందస్సు వాడడంలో కూడా నేర్పు చూపించాడు. మహాస్రగ్ధర వీర రసానికే వాడుతారు. కాని ఎర్రన స్త్రీ వర్ణనకు వాడుకొన్నారు. అదీ శూర్పణఖ నోట సీత అందాన్ని పలికించారు. ఈ పద్యాన్ని మరో రెండు పద్యాలను నేలటూరు వెంకట రమణయ్య గారు గుర్తించారు.

హరివంశం

ఇంతటి రామాయణ కర్తను, (ఎర్రన, స.ఆం.సా. పేజీ 565) ప్రోలయ వేమారెడ్డి నిండు సభలో పూజించి “...హరివంశం భారత పరాంశమని యింపారగా పెద్దలు చెప్తారు. ఆ రమ్య కథను మాకు తెలుగులో నిర్వహించి మాకు తెలుపు...” అని ప్రార్థించగా ఎర్రన సంతోషించి “నన్నయ భట్టు, తిక్క కవినాథులు చూపిన త్రోవ...” నడుస్తానని పలికి హరివంశ రచనకు ఉపక్రమించాడు. హరివంశ విశిష్టతను గూర్చి చెప్తూ ఆరుద్ర “నిజానికి హరివంశం రచించకపోతే భారత రచన పూర్తి కాదు. హరివంశం భారతానికి ఖిలము అనగా పారిశిష్టము. ఆది పర్వము మొదలుకొని స్వర్గారోహణ పర్వము వరకు గల గ్రంథము భారతమనియు హరివంశముతో గలిపిన గ్రంథమును మహాభారతమనియు నందురు” అని వేటూరి శివరామశాస్త్రి గారు వివరించారు అని తెల్పారు.

పద్దెనిమిది పర్వాల భారతం కన్నా ప్రశస్తి గల ఈ హరివంశం గ్రంథం, పవిత్రమైనది కాబోలు ఇప్పటికీ నేపాల దేశంలో న్యాయస్థానాలలో సాక్షులు హరివంశాన్ని తమ తలమీద పెట్టుకొని ప్రమాణం చేస్తారట. ఇలాంటి విషయ సేకరణలే ఆరుద్ర గారి ప్రత్యేకతలు.

హరివంశం రచనా విధానం

ఇందులో పర్వ విభాగం లేదు. రెండు భాగాలున్నాయి. పూర్వ భాగంలో 9 ఆశ్వాసాలు, ఉత్తర భాగంలో 10 ఆశ్వాసాలు ఉన్నాయి. మొత్తం 4,304 గద్య పద్యాలున్నాయి.

ఎర్రన గారి హరివంశం ‘సమస్త విస్తర ప్రశస్తం’. పూర్వ భాగంలో ఉన్న కొన్ని కథలు తిరిగి ఉత్తర భాగంలో వస్తాయి. విష్ణుమూర్తి అవతార వర్ణన మొదలైనవి.

రచనలలో మధ్య వచనాలు వ్రాయడం కవులకు అలవాటే. తిక్కన, నాచన సోముడు మొదలైన వారు వ్రాశారు. ఒక్కోసారి ఈ వచనాలు తలనొప్పిగా ఉంటాయని శివరామ శాస్త్రి గారి మాట. కాని ఎర్రన వచనాలు తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఉంటాయి. వాన వచ్చినప్పుడు గోవుల వర్ణన “...గొమ్ములొడ్డి, కన్నులు మోడ్చి, కనురెప్పల నీళ్ళుగారం దలలు డిగ్గవైచి నెమరులుడిగి...” ఎంత సహజ వర్ణన!(హరి పూర్వ 1-171)

శ్రీ రంగం శ్రీనివాస రావు గారు ఒక అనువాదంలో ఇలా వ్రాశారు.

“అంతేలే పేదల కన్నులు అశ్రువులు నిండిన కుండలు
తుఫానులో తడిసిన జడిసిన
గోమాతల కన్నుల తమ్ములు (మహా ప్రస్థానం)"

వర్ణనలు

ఎర్రన వర్ణనలలో సూక్ష్మాంశాలు ఉంటాయి. కాళీయుని మడుగులో దూకే కృష్ణుని చిత్రం – ఒడి సిక్కు గొన జెక్కి మడిసంది నునిచిన తలుగులు ద్రాళులు దొలగవైచి ...చెప్పులూడ్చి కదంబకస్పీత తరువు బ్రాకి... పద్యం నిండా తెలుగుదనమే. మడిసంది నునిచిన = చంకలో పెట్టుకొన్న, తలుగులు = పశువులను కట్టేసే పలుపు, ‘పింఛపు దండ, పెడబొబ్బ’ భాష, భావాలు, చేష్టలు ఒకదాని కొకటి వన్నె తెస్తున్నాయి.

ఎర్రన తన హరివంశం లో కృష్ణుని తెలుగిళ్ళలో పసిబిడ్డగా మార్చాడు. యశోదమ్మ “ముదముతో గడ్పునకు బెట్టి మూతి జిడ్డు మోమునకు మేన జిమిరి....యశోదమ్మ నుండి తల్లులు-తెలుగు తల్లులు ఇలాంటివన్నీ నేర్చుకొన్నారేమో!” ఈ ఘట్టం అంతా చదివి ఆనందించాలే గాని ఒకటి రెండు ఉదాహరణలతో తృప్తి ఉండదు!” అన్న ఆరుద్ర మాటలు అక్షర సత్యాలు.

ప్రోలయ వేమారెడ్డి పెద్దకుమారుడు అనపోతా రెడ్డి కాలంలో (క్రీ.శ. 1353-1364) కూడా ఎర్రన జీవించి ఉండవచ్చని ఆరుద్ర అభిప్రాయం. అనపోతా రెడ్డి యొక్క కొల్లూరు శాసనంలో ‘యర్రయ ప్రగడ’ అనే పేరున్నది. అందువల్ల ఎర్రన సుమారుగా 14 వ శతాబ్దం మొదటి 75 సంవత్సరములలో జీవించి ఉండవచ్చునని నోరి నరసింహ శాస్త్రి గారి మాట.

ఎర్రన గారి కవితా గుణాలలో శబ్ద వైచిత్రి ప్రముఖమైనదని జక్కన విక్రమార్క చరిత్రలో “ఈ త్రయిదా ప్రబంధ పరమేశ్వరుడై విరచించె శబ్ద వైచిత్రి నరణ్య పర్వమున....అనే పద్యం ద్వారా తెలుస్తున్నది. (స.ఆం.సా. పేజీ 577).

**** సశేషం ****

Posted in December 2022, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!