Menu Close
పెళ్ళిసందడి (నాటిక)
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

ప్రసాద్- (చిన్న మందహాసంతో) “సిద్ధాంతిగారూ అడక్కండి; రాత్రిపూట అయితే రంగు రంగు దీపాలు.. డెకొరేషన్లు; వచ్చినవాళ్లకు బాగా ఇంపుగా కనిపిస్తాయట. ఫోటోల్లో కూడా బాగా పడతాయట. అందుకు ఆ అమ్మాయి రాత్రిపూట ముహూర్తాలు చూడమన్నాదిట. ఏమిటి చెప్పను సిద్ధాంతి గారూ; ఇవాళా, రేపూ పెళ్లిళ్ల  పద్ధతులు మారిపోతున్నాయి. ఇదివరకు పెళ్లి శాస్త్రోక్తంగా చేయించడానికి ఇంపార్టెన్సు ఇచ్చేవారు. ఇప్పుడు డెకొరేషన్లు  ఫోటోలు వీడియోలు వాటికే ఇంపార్టెన్సు. వాటికి ఎంత ఖర్చయినా పెడుతున్నారు."

సిద్ధాంతి - "నిజమే సార్. భోజనాల్లో కూడా చూడండి. ఇదివరకు ముద్దపప్పు ముక్కలపులుసు పులిహోర బూర్లు వంటివి లక్షణంగా అరిటాకుల్లో వడ్డించేవారు. అతిథులందరికి వంటకాలు అందుతున్నాయో లేదో పెళ్లిపెద్దలు స్వయంగా చూస్తూ ఉండేవారు. ఇప్పుడు టమాటా  పప్పు, సాంబారు, పులావ్, గులాబ్ జామ్, పకోడీలు పెడుతున్నారు. అదీనూ సార్ ఇప్పుడు దొరల పద్ధతో ఏమిటో నాకు తెలీదు. ఎవరి ప్లేట్లు వాళ్లు పట్టుకొని వడ్డించేవాడివద్దకు పోయి కావలిసినవి అడిగి తెచ్చుకోవాలి. మా వంటి వాళ్లకు అది మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఏంచేస్తాం నలుగిరితోబాటు నారాయణా అన్నారు."

ప్రసాద్- "మంత్రిగారు కోరినట్టూ చెయ్యాలికదా. అంచేత- సిద్ధాంతిగారూ రాత్రి ముహూర్తమే చూడండి. తొమ్మిది లోపలే ముహూర్తం చూస్తే ముహూర్తం అయిపోగానే భోజనాలు పెట్టేయవచ్చు. పనులు వేగరం తెమిలిపోతాయి."

సిద్ధాంతి- " సార్ కొసకి తేలింది ఏమిటి.. అంటే.. ముహూర్తం అమ్మాయిగారి జాతకం లేకుండా పెట్టాలి. అదీ రాత్రిపూట... తొమ్మిది  లోపల; అంతేకదూ సార్."

ప్రసాద్- “మరి..అలాగే అనుకోవాలి సిద్ధాంతిగారు.”

సిద్ధాంతి- “అంటే ఖరగపూర్ ముహూర్తం పెట్టాలన్నమాట- సార్.”

ప్రసాద్- “అదేమిటండోయ్…  కొత్తగా వింటున్నాను.”

సిద్ధాంతి  - “సార్ గతంలో ఖరగపూర్లో మనవాళ్ళు- కొందరి ఇళ్లలో పెళ్లి ముహుర్తాలు మద్రాస్ మెయిల్  టైమింగ్స్ ని బట్టి పెట్టేవారు. అదీ..ఆదివారాలనాడే.”

ప్రసాద్ - (మందహాసంతో) “ఎంచేతనండి.”

సిద్ధాంతి - “వాళ్ళకి చాలామంది బంధుమిత్రులు ఆంధ్రానుండి ప్రొద్దున్నే చెన్నై- కోల్కతా మెయిల్లో వచ్చి, సాయంత్రం కోల్కతా - చెన్నై మెయిల్లో వెళ్లి పోయేవారు సార్. అంచేత ముహుర్తాలు చెన్నై- కోల్కతా మెయిల్ వచ్చిన 2 గంటల తరువాత..పెట్టేవారు.”

ప్రసాద్- (చిన్న చిరునవ్వుతో) “సరేలెండి. ఖరగపూరో గోరఖ్పూరో ఏదో ఒక ముహూర్తం తొందరగా పెడితే ఇన్విటేషన్స్ ప్రింట్  చేయించాలి.”

సిద్ధాంతి - “విషయం బోధపడింది సార్. దీనికి పంచాంగం చూడడం అనవసరం సార్. ముహూర్తం నోట్ చేసుకోండి సర్.. వచ్చే బుధవారం..రాత్రి..7 గం- 39 నిమిషాలకి సుముహర్తం సార్. ఆ ముహూర్తానికే మరో పెళ్లికి నేను ముహూర్తం పెట్టేను. అందుచేత మరి చూసుకో అఖర్లేదు.”

ప్రసాద్ - "సిద్ధాంతిగారూ- ఆ పెళ్ళికి మీరు ఒప్పుకొన్నారేమిటి. మినిస్టరుగారి ఇంట్లో పెళ్లి మీరే చేయించాలి."

సిద్ధాంతి - "ఆ పెళ్ళి అమలాపురంలో అవుతుంది. దానికి కేవలం ముహూర్తం పెట్టేను సార్. మినిస్టరు గారి కూతురు పెళ్లి స్వయంగా నేనే చేయిస్తాను సార్. నాతోబాటు మరో ఇద్దరు ఘనాపాఠీలను తెస్తాను. వారు ప్రత్యేకించి ప్రవరలు వల్లిస్తుంటారు. పెళ్లి శాస్త్రోక్తంగా జరిపిస్తాను."

ప్రసాద్- “సిద్ధాంతిగారూ - చాలా థేంక్స్. కానీ.. ముహూర్తం విషయం మీకు.. నాకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు.”

సిద్ధాంతి - “ఎంతమాట సార్. నాకు తెలీదూ, మీరావిషయంలో నిశ్చింతగా ఉండండి.”

ప్రసాద్ - సిద్ధాంతిగారూ పెళ్లి కార్యక్రమం వివరాలు మేడంగారు వచ్చేక మీకు చెప్తాను. ఆవిడతో అవన్నీ మాట్లాడండి. ఈలోగా పెళ్లి కార్యక్రమమానికి కావలిసిన వస్తువుల లిస్టు మీరు ఇస్తే; నేనవన్నీ ఏర్పాటు చేసుకొంటాను. ఆ సమయంలో మీరు మరేవి అడిగినా ఏర్పాటు చెయ్యలేం. అందుచేత ప్రతి..చిన్నదీ మరచిపోకుండా ఆ లిస్టులో రాయండి."

సిద్ధాంతి - (తన సెల్ ఫోనులో లిస్టు ఓపెన్ చేసి ప్రసాద్ కు సెల్ ఫోను అందిస్తూ) ఇదిగో సార్ లిస్టు. మీ ఫోనులోకి ఫర్వార్డు చేసుకోండి."

ప్రసాద్ - "థాంక్స్ అండి."

(ప్రసాద్ ఆ లిస్టు చూస్తూన్న సమయంలో సంతోషి ప్రవేశిస్తుంది)

సంతోషి - "సిద్ధాంతిగారూ, పెళ్లి చేయిస్తున్నప్పుడు; మీకు చిన్నా పెద్దా, చాలా వస్తువులు అవసరం పడతాయ్.”

సిద్ధాంతి - "అవునండి అమ్మగారు."

సంతోషి – “అవన్నీ ఈయన సమకూర్చడం జరిగే పని కాదు. వారం రోజులుబట్టి రోజూ జ్ఞాపకం చేస్తున్నాను. సగ్గుబియ్యం కావాలని; ఇవాళదాకా అవి తేలేదు."

ప్రసాద్ - " సిద్ధాంతిగారూ-  మినిస్టరుగారి పేషీలో ఎంత పని ఉంటుందో మా ఆవిడకు తెలీదండి."

సంతోషి - "నేను చెప్తున్నదీ..అదే..మహానుభావా. ఆ లోకంలో పడిపోతే.. మీకు మరో వైపు ఆలోచన ఉండదు. అందుచేత మీరు ఆ బాధ్యత తీసుకోకండి.”

(భర్తకు సలహా ఇచ్చి, సంతోషి సిద్ధాంతిగారితో)

సంతోషి - "సిద్ధాంతిగారూ, పెళ్లి సామాన్లు ఈయన సమకూర్చడమంటే పెళ్లి అభాసు అవుతుంది. అందుచేత  పెళ్లి చేయించడానికి కావలిసినవి; అగ్గిపుల్లనుండి సమస్తం మీరే సమకూర్చుకోండి. ప్రతీ దానికి అయిన ఖర్చు మీరు బజారుకు వెళ్ళడానికి అయిన పెట్రోలు ఖర్చు కూడా నిర్మొహమాటంగా పుచ్చుకోండి. అలా చేస్తే మీకూ ఇబ్బంది ఉండదు. మా వారికీ సమస్య ఉండదు.”

ప్రసాద్ - "ఆలోచిస్తే.. మా ఆవిడ చెప్పింది.. నిజమే అనిపిస్తోంది సిద్ధాంతిగారూ. ఈ పెళ్లిపనులలో సతమతమవుతూ ఉంటే, మినిస్టరు గారు మరో  పని వెంటనే చెయ్యాలని చెప్పొచ్చు. అప్పుడు ఈ పనులు, వెనకపెట్టవలసి వస్తుంది. అంచేత ఆవిడ చెప్పినట్లు; కావలిసిన సామాన్లన్నీ మీరే సమకూర్చుకోండి. పెళ్లి సమయంలో మరే గందరగోళం ఉండదు. సామాన్లు కొనడానికి అడ్వాన్సు కావలిస్తే రేపు మా ఆఫీసుకు వచ్చి నా దగ్గర తీసుకోండి."

సిద్ధాంతి - "అడ్వాన్సు అఖర్లేదు సార్. నాకు తెలిసిన దుకాణమే. అక్కడే నేనెప్పుడూ సామాన్లన్నీ కొంటూ ఉంటాను. డబ్బు లెక్కలు తరువాత తాపీగా చూసుకోవచ్చు సార్.”

(సిద్ధాంతిగారి నోట ఆ మాట వినగానే,)

సంతోషి  - “సిద్ధాంతిగారూ, ఆ దుకాణం మీకు బాగా తెలిసిందే అన్నారు. మీరు ఎప్పుడూ అక్కడే కొంటున్నారు అంటే; సామాన్లలో కల్తీలేవీ ఉండవన్నమాట. తూకాలు కొలతలులో కూడా హెచ్చుతక్కువలు ఉండవనుకొంటాను.  మినిస్టరు గారు బాధ్యతలన్నీ ఈయనమీద వేసేరు కదా. అందుకు అడుగుతున్నాను."

సిద్ధాంతి – “అమ్మగారూ ఆ విషయాలలో నిశ్చింతగా ఉండండి. సామాన్ల నాణ్యతలో గాని తూకాలలో గాని హెచ్చుతగ్గులు ఇప్పటిదాకా ఎప్పుడూ రాలేదండి.”

సంతోషి - "సిద్ధాంతిగారూ, గుంటూరులో ఉన్న మా అక్కయ్య కూతురుకు పెళ్లి సంబంధం కుదిరిందండి.”

సిద్ధాంతి - "శుభం."

సంతోషి - "వాళ్ళింట్లో ఇదే మొదటి పెద్ద శుభకార్యమండి. మా బావగారు చాలా అమాయకులు. దుకాణం వాళ్లు ఏ మోసం చేసినా ఆయనకు తెలీదు."

సిద్ధాంతి - "ఈ ఊళ్ళో కూడా అంతేనండి అమ్మగారూ. మనకి తెలియకపోతే దుకాణాలవాళ్లు మోసం చేస్తారండి. మన దుకాణం వాడి విషయంలో ఆ సమస్య లేదు. నా ద్వారా వాడికి చాలా బిజినెస్ వస్తుందండి. అంచేత ధరలు కూడా మనకి తగ్గించి వేస్తాడండి."

సంతోషి - "అయితే సిద్ధాంతిగారూ మాకో సహాయం చేసిపెట్టాలండి."

సిద్ధాంతి - "ఎంతమాట; సహాయమేమిటమ్మా ఏమిటో చెప్పండి: తప్పక చేసిపెడతాను."

సంతోషి - "మా అక్కయ్య కూతురు పెళ్ళికి కావలసిన సామాన్లు ఇక్కడే కొంటే వాళ్లకి శ్రమ తగ్గుతుంది. ఖర్చులు కూడా తక్కువ పడతాయి అని అనుకొంటున్నాను.”

సిద్ధాంతి - "నిజమేనండి అమ్మగారు. ఇంత చవకగా నాణ్యమయిన వస్తువులు గుంటూరులో దొరకవండి. అలాగే చేద్దామండి. ఈ లిస్టు ప్రకారం మీకు సామాన్లు వేరే తీసుకొంటాను.”

సంతోషి – “దానికి ఎంతయిందో చెబితే ఇచ్చేస్తాను."

సిద్ధాంతి - "డబ్బు విషయం సారుతో చూసుకొంటాను అమ్మగారూ. మీకు కావలిసిన సామాన్లన్నీ నేను స్వయంగా మీకు తెచ్చి ఇస్తాను. సరేనా."

సంతోషి - "చాలా థాంక్సండి. వంటింట్లో పని ఉంది. నేను వెళ్తానండి."

(సంతోషి నిష్క్రమించును)

సిద్ధాంతి - (నెమ్మదిగా) "రెండు పెళ్లిళ్ల..పెళ్లి సామాన్లకి ..ఒకే బిల్లు, రాయించవచ్చా.. సార్."

(ప్రసాద్, సంజ్ఞలతో అంగీకారముద్ర వేసేడు)

సిద్ధాంతి - (కొంత నసుగుతూ) " సార్ ..నాదో ..మనవి."

ప్రసాద్- “ఏమిటది .. చెప్పండి.”

సిద్ధాంతి - “మా మూడో అల్లుడు 10 సంవత్సరాలనుండి ఎండోమెంట్ డిపార్టుమెంటులో గుమస్తాగా ఉండిపోయేడు సార్. ఈమధ్యనే ఇన్స్పెక్టర్ పోస్టుకి ఇంటర్వ్యూకి వెళ్ళేడు సార్. ఫలితాలు ఇంకా రాలేదు సార్.  తమరు దయచేసి…”

ప్రసాద్- “సరేలెండి- మీ అల్లుడి వివరాలు నాకివ్వండి. తప్పకుండా ప్రయత్నిస్తాను.”

సిద్ధాంతి- “చాలా థాంక్స్ సర్ - ఇదిగో సార్.” (ఒక కాగితం అందిస్తాడు)

ప్రసాద్- (కాగితం అందుకొని, ఆఫీసు బేగులో పెడతాడు) “రేపొకమారు ఫోన్ చేసి జ్ఞాపకం చెయ్యండి.”

సిద్ధాంతి- “చిత్తం…”

సంతోషి- (తెరవెనకనుండి) “ఏమండీ కందిపప్పు వేచుతున్నాను. అక్కడికి రావడం కుదరదు. మా సీతాలు

పెళ్ళిముహూర్తం గురించి సిద్ధాంతిగారితో మాట్లాడేరా. ఖరగపూర్ ముహూర్తం మాత్రం పెట్టించకండి.”

ప్రసాద్- “మరచిపోయేను  సంతోషీ. సరే జాతకాలు వెంటనే తెప్పించు.

(సిద్ధాంతి గారితో) సిద్ధాంతిగారూ మీకు చెప్పింది కదా; మా ఆవిడ. మా వదినగారి కూతురికి పెళ్లి కుదిరింది వాళ్ళది గుంటూరు. 2, 3రోజుల్లో జాతకాలు పంపిస్తాను. ఒక మంచి ముహూర్తం చూసిపెట్టండి.”

సిద్ధాంతి- “తప్పకుండా  సార్… మరి, శెలవా.”

ప్రసాద్ - " ఫోను చేసిన వెంటనే వచ్చేరు. చాలా థాంక్స్. ఉంటాను."

(సిద్ధాంతి నిష్క్రమించును)

(ప్రసాద్, డైరీలో  ఏదో రాసుకొంటూ ఉంటే, సంతోషి ప్రవేశిస్తుంది.)

ప్రసాద్ - (సంతోషితో) "వంట అయిపోయిందా ఏమిటి; మళ్ళీ ఇలా వచ్చేవ్."

సంతోషి - "ఇంకా ఎక్కడండి; కూర చెయ్యాలి..చారు పెట్టాలి..”

ప్రసాద్ - "అయితే, తమరి  రాకకు కారణం ఏమిటో."

****సశేషం****

Posted in December 2022, నాటికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!