Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం-123 వ సమావేశం
-- శ్రీధర్ రెడ్డి బిల్లా --
vikshanam-123

వీక్షణం-123వ సమావేశం నవంబరు 13, 2022 న కాలిఫోర్నియాలో మిల్పిటాస్ లోని శ్రీ  తాటిపాముల మృత్యుంజయుడు, శ్రీమతి జయ గార్ల ఇంట్లో వారి సాదర ఆహ్వాన వచనాలతో ప్రారంభమైంది. ఈ సమావేశంలో మూడు కథా పఠనాలు జరగటం విశేషం. ప్రముఖ రచయిత శ్రీ శ్రీధర ముఖ్యఅతిథిగా పాల్గొని కథాపఠనం చేసారు. శ్రీధర గారిని సభాధ్యక్షులు శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల సభకు పరిచయం చేసారు. ఆయన పేరొందిన కథా, నవలా రచయిత. చమత్కార భరితంగా రచనలు చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఇటీవల అమెరికా జీవిత నేపథ్యంలో రాసిన "కలలకు రెక్కలొచ్చాయి" నవలని సభకు పరిచయం చేసారు.

మొదటగా శ్రీ శ్రీధర గారు “మాటవరసకెపుడైనా అన్నానా..” అనే వారి స్వీయ అముద్రిత కథను చదివారు. “నీ భర్త వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు..” అనే లేఖ నందుకున్న ఓ భార్య పయనాన్ని, సత్యాన్ని, ఆమె పరిశోధించిన క్రమాన్ని చక్కని ఉపమానాలతో, హాస్య వ్యంగ్య మేళవింపులతో వ్రాసిన నిజ జీవిత ఆధార కథ సభికులను విశేషంగా అలరించింది. తదనంతర కథా చర్చలో సభికులందరూ కథపై వారి వారి అభిప్రాయాలను వెల్లడించి శ్రీ శ్రీధర గారిని కొనియాడారు.

తదనంతరం శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి కథా పఠనం జరిగింది. మాజీ ప్రభుత్వ ఉద్యోగ పింఛను అందుకుంటున్న ఎనభై ఐదేళ్ల వృద్ధుడి జీవన పయనంలో తారస పడిన స్త్రీ గురించి ఆసక్తి దాయకమైన కథను చదివారు. ఈ కథకు పేరు ఏం పెడితే బావుంటుందో అని అక్కిరాజు గారు అడినప్పుడు సభికులు వారి వారి అభిప్రాయాలు తెలియ జేశారు.

తదనంతరం డా కె.గీత గారు తాను వ్రాసి, ప్రతిష్టాత్మక వంగూరి ఫౌండేషన్ పోటీలో గెలుపొంది, విశేష ఆదరణ పొందిన “భూలోక స్వర్గం” అనే కథను చదివారు. హైతీ దేశంలోని ఓ మైనారిటీ వర్గానికి చెందిన కుటుంబం దక్షిణ అమెరికాదేశాలలోని దుర్గమ దారుల గుండా అమెరికాకు వలస వెళ్లాలనే తమ అకుంఠిత దీక్షను, వారి ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక అనుభవాలను, కఠిన పరిస్థితులను ఎంతో ఉత్కంఠగా మలిచారు. వారి కథా పఠన తీరు, పాత్రల స్వభావాలు, కథనం సభికులను మంత్ర ముగ్ధులను చేశాయి. తదనంతర చర్చా కార్యక్రమంలో సభికులు వారి వారి అభిప్రాయాలు వెలిబుచ్చి శ్రీ గీత గారిని అభినందించారు. తర్వాత గీత గారు ఈ కథ వ్రాయడానికి కలిగిన ప్రేరణను, నేపథ్యాన్నీ సభికులకు వివరించారు.

తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో శ్రీ శ్రీధర్ రెడ్డి గారు “మృత్యుదేవి” అనే కవితను, శ్రీ దాలిరాజు గారు “తప్పు-ఒప్పు” అనే కవితను చదివారు. వీక్షణం నిర్వాహకురాలైన గీతగారు గారు వందన సమర్పణ గావించారు. తదనంతరం శ్రీ & శ్రీమతి మృత్యుంజయుడు గారి కమ్మని అల్పాహార విందుతో సమావేశం దిగ్విజయంగా ముగిసింది.

ఈ సమావేశ వీడియోల్ని ఇక్కడ చూడవచ్చు.

భాగం -1; భాగం -2

Posted in December 2022, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!